జార్ఖండ్: తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 10 మంది దోషులకు పదేళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, SARTAJ ALAM
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ కోసం, సరైకేలా జార్ఖాండ్
జార్ఖండ్‌లోని ప్రముఖ తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో దోషులు 10 మందికీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
జార్ఖండ్‌లోని సరైకేలా జిల్లా కోర్టు గత వారం ఈ కేసులో పది మందిని దోషులుగా గుర్తించింది. మరో ఇద్దర్ని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసు విచారణ నాలుగేళ్ళు నడిచింది. దొంగతనానికి పాల్పడ్డారనే కారణంతో తబ్రేజ్‌ను కట్టేసి కొట్టడంతో, ఆయన మరణించారు.
సరైకేలా తొలి అదనపు సెషన్స్ జడ్జి అమిత్ శేఖర్ ఈ తీర్పును ప్రకటించారు.
ఐపీసీ సెక్షన్ 304 కింద కోర్టు వీరిని దోషులుగా ప్రకటించింది.
నిందితులుకు విధించిన శిక్షపై తాను సంతోషంగా లేనని తబ్రేజ్ అన్సారీ భార్య శైష్ట పర్వీన్ తెలిపారు. దీనిపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తానని చెప్పారు.
ఇదే సమయంలో, నిందితుల తరఫున వాదించిన డిఫెన్స్ లాయర్ కూడా దీనిపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.
‘‘తీర్పులో 304 తొలి భాగంలో పదేళ్లు, 325లో మూడేళ్లు, 323లో ఎనిమిది నెలలు, 295లో ఏడాది అని ఉంది. నిందితులకు జైలు శిక్షతో పాటు కొంత జరిమానాను కూడా విధించారు. ఈ హత్య చేయాలనే ఉద్దేశాలకు సంబంధించి సాక్ష్యాధారాలు దొరకకపోవడంతో, నాలుగు రోజుల తర్వాతనే ఆయన మరణించారని జడ్జి భావించారు. అంటే, ఉద్దేశం నిరూపణ కాలేదు’’ అని తబ్రేజ్ అన్సారీ తరఫు న్యాయవాది అల్తాఫ్ అన్సారీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, RAVI PRAKASH
నాలుగేళ్ల నాటి కేసు
తబ్రేజ్ మరణంపై ఆయన భార్య శైష్ట పర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిపోర్ట్ ప్రకారం ఇది 2019 జూన్ 17న జరిగిన సంఘటనకు సంబంధించిన కేసు.
24 ఏళ్ల తబ్రేజ్ అన్సారీ అనే వ్యక్తి జంషెడ్‌పూర్ నుంచి తన గ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో, సరైకేలాలోని ధాత్కిడి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దొంగతనం చేశాడన్న కారణంతో ఆయనను పట్టుకున్నారు.
ఆ తర్వాత ఒక కరెంటు స్తంభానికి కట్టేసి ఆయనను తీవ్రంగా కొట్టారు..
ఈ సమయంలో ‘జై శ్రీ రామ్’ అంటూ నినాదాలు చేశారు.
ఆ మరునాడు ఉదయం ఆయనను పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు తబ్రేజ్‌ను దొంగతనం చేశారనే ఆరోపణలతో జైలులో పెట్టారు.
దెబ్బలు బాగా తగలడంతో తబ్రేజ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 22న మరణించారు.
జార్ఖండ్ రాజధాని రాంచీకి సరైకేలా 130 కి.మీల దూరంలో ఉంది.
తబ్రేజ్, శైష్టల వివాహం ఆ ఏడాదే జరిగింది.
జూన్ 18 ఉదయం పూట తనకు ఫోన్ వచ్చిందని శైష్ట బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ఆనంద్ దత్‌కు చెప్పారు.
ఫోన్‌లో మాట్లాడిన తన భర్త తబ్రేజ్ అన్సారీ అలియాస్ సోను, ‘‘ శైష్ట నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. రాత్రంతా కొడుతూనే ఉన్నారు’’ అని బాగా ఏడుస్తూ చెప్పాడని ఆమె గుర్తుకు చేసుకున్నారు.
జిల్లాలోని ధాత్కీడీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తబ్రేజ్‌ది కదందీహా గ్రామం. ఆ ఊరిలో వెయ్యి ఇళ్లు ఉంటాయి. ఈ ఇళ్లలో ఎనిమిది హిందువులకు చెందినవి కాగా, మిగిలినవన్ని ముస్లింలవే. ఈ రెండు గ్రామాల మధ్య దూరం నాలుగు కిలోమీటర్లే.

ఫొటో సోర్స్, ANAND DUTTA
జైలు శిక్ష పడిన వారు
ప్రకాశ్ మండల్ అలియాస్ పప్పు మండల్
భీమ్ సింగ్ ముండా
కమల్ మహతో
మదన్ నాయక్
అతుల్ మహాలీ
సునామో ప్రదాన్
విక్రం మండల్
చాము నాయక్
ప్రేమ్ చంద్ మహాలీ
మహేశ్ మహాలీ

ఫొటో సోర్స్, SARTAJ ALAM
శిక్షపై అసంతృప్తి వ్యక్తం చేసిన తబ్రేజ్ భార్య
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రకాశ్ మండల్ అలియాస్ పప్పు మండల్ ఇప్పటికే జైలులో ఉన్నారు.
ఈ కేసు నిందితుల్లో ఒకరైన కౌశష్ మహాలీ విచారణ జరుగుతున్న సమయంలోనే మరణించారు.
మిగిలిన ఇద్దరిపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.
తన భర్త మరణానికి న్యాయం దక్కినందుకు కాస్త ఉపశమనంగా ఉందని తబ్రేజ్ అన్సారీ భార్య శైష్ట అన్నారు. కానీ, ఈ కేసులో వారికి విధించిన శిక్షా కాలంపై మాత్రం తాను సంతోషంగా లేనని చెప్పారు.
‘‘నేను ఇప్పుడు హైకోర్టుకు వెళ్తాను. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా నేను సిద్ధం. నా భర్త మరణానికి న్యాయం దక్కేలా చేయడమే నా జీవితానికి ఏకైక లక్ష్యం’’ అని ఆమె అన్నారు.
గత నాలుగేళ్లుగా శైష్ట ఈ కేసుపై పోరాడుతున్నారు.
‘‘ఈ నాలుగేళ్లలో, నా భర్తకు న్యాయం దక్కేలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లేదాన్ని. ప్రపంచమంతా నాకు మద్దతుగా నిలిచింది. సమస్యేటంటే నేను దీన్ని ఎదుర్కోవాలి ’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
డిఫెన్స్ న్యాయవాది ఏం చెప్పారు?
‘‘కోర్టు తీర్పు పట్ల నేను సంతృప్తికరంగా లేను. నేను కూడా హైకోర్టుకు వెళ్తాను’’ అని డిఫెన్స్ న్యాయవాది ఎస్‌సీ హజ్రా అన్నారు.
ఈ తీర్పు తర్వాత కేవలం ప్రకాశ్ మండల్ తల్లి మాత్రమే కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నా కొడుకు అమాయకుడు’’ అని ఆమె దుఖంతో చెప్పారు.
మరోవైపు ప్రకాశ్ మండల్ తండ్రి రామచంద్ర మండల్ కోర్టులో చాలా ఆందోళనగా కనిపించారు.

ఫొటో సోర్స్, SARTAJ ALAM
శైష్ట ఎదుర్కొన్న ఇబ్బందులు
తబ్రేజ్ పూర్వీకుల ఇంటికి కిలోమీటరు దూరంలో బెహరసాయి గ్రామంలో శైష్ట పర్వీన్ పుట్టిల్లు ఉంది.
తన భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటున్నారు. తన పుట్టింట్లో తన సోదరుడు, ముగ్గురు చెల్లెల్లు, తల్లిదండ్రులు ఉంటున్నారు.
‘‘ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేవు. అంతకుముందు నాన్న టైలర్‌గా పనిచేసే వారు. కానీ, ఇప్పుడేం చేయడం లేదు. ఈ సమయంలో చాలా మంది మాకు ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు’’ అని శైష్ట చెప్పారు.
తన అత్తామామలతో ఉన్న సంబంధం గురించి అడిగినప్పుడు, తనకు అత్తారింటి నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదన్నారు. నాలుగేళ్లుగా తాను మాత్రమే పోరాడుతున్నట్లు తెలిపారు.
తబ్రేజ్ అన్సారీ మేనమామ సోయబ్ ఖాన్ కోర్టు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ 2021 డిసెంబర్ 21న మూక దాడులు, హింసను నిరోధించేందుకు ఒక బిల్లును ఆమోదించింది.
ఈ బిల్లులో ఆస్తుల అటాచ్‌మెంట్, జరిమానాతో పాటు మూడేళ్ల నుంచి జీవిత ఖైదు జైలు శిక్ష వరకు ఉన్నాయి.
అయితే, ఈ బిల్లులోని కొన్ని పాయింట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీన్ని సవరించాలని కోరుతూ గవర్నర్ తిరిగి జార్ఖండ్ ప్రభుత్వానికి పంపారు. ఈ కారణంతో ఇప్పటి వరకు ఈ బిల్లు ఆమోదం పొందలేదు.
‘‘మూక దాడి కేవలం నా భర్తపై మాత్రమే కాదు. చాలా మంది దీని బారిన పడి బాధితులుగా మారారు. అందుకే మూక దాడులపై తప్పనిసరిగా చట్టాన్ని తీసుకురావాల్సి ఉంది’’ అని శైష్ట అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సినిమాల్లో నటించే జంతువులను ఎలా ఎంపిక చేస్తారు? వీటికి రోజుకు ఎంతిస్తారు?
- కట్నం: పెళ్లిళ్లు జరిగే చోట తనిఖీలు జరపాలని ఈ యువతి ఎందుకు కోరుతున్నారు?
- ఉమ్మడి పౌర స్మృతిని బీజేపీ మిత్రపక్షాలు ఏ రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నాయి?
- మిర్యాలగూడ - దళిత యువకుడి హత్య: 'తక్కువ కులపోడని చంపిండన్నరు' .. రోదిస్తున్న నవీన్ తల్లి - గ్రౌండ్ రిపోర్ట్
- ఇజ్రాయెల్-పాలస్తీనా: జెనిన్ శరణార్థి శిబిరం ఎక్కడుంది? దీనిపై ఇజ్రాయెల్ ఎందుకు దాడికి దిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














