సినిమాల్లో నటించే జంతువులను ఎలా ఎంపిక చేస్తారు? వీటికి రోజుకు ఎంతిస్తారు?

ఎంటర్‌టైన్మెంట్ సినిమాలో బ్రూనోతో అక్షయ్ కుమార్

ఫొటో సోర్స్, TIPS INDUSTRIES

ఫొటో క్యాప్షన్, ఎంటర్‌టైన్మెంట్ సినిమాలో బ్రూనోతో అక్షయ్ కుమార్
    • రచయిత, మధుపాల్
    • హోదా, బీబీసీ కోసం

మీరు ఎప్పుడైనా జంతువులు నటించిన సినిమాలు చూశారా?

సినిమాలో జంతువులు ఎలా నటిస్తున్నాయి? వీటిని ఎలా ఎంపిక చేస్తారు? దీని కోసం ఎవరు సాయం చేస్తుంటారు? ఇలాంటి విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

సినిమాల్లో జంతువులు నటిస్తే చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, దీని కోసం సినిమా యంత్రాంగం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అవి గురుకుల్ నుంచే వచ్చాయి

అమితాబ్ బచ్చన్, హేమా మాలినీల సినిమా ‘బాగ్‌బాన్’లో యజమానిని చంపే కుక్కలు గుర్తున్నాయా?

అక్షయ్ కుమార్ ‘జాన్వర్’ నుంచి ‘ఎంటర్‌టైన్మెంట్’ వరకూ లేదా సల్మాన్ ఖాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’లో కనిపించే ఏనుగులు, లేదా ఆమిర్ ఖాన్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో కనిపించే గాడిద.. ఇవన్నీ ‘గురుకుల్’ నుంచి వచ్చాయి.

ఈ సంస్థను జావెద్ ఖాన్, ఆయన కుటుంబం నడిపిస్తోంది. సినిమాల కోసం శిక్షణ పొందిన జంతువులను ఈ సంస్థ అందిస్తోంది.

ఆ విశేషాల గురించి బీబీసీతో జావెద్ మాట్లాడారు. ‘‘గత 45 ఏళ్లుగా మా కుటుంబం ఇలానే జంతువులకు శిక్షణ ఇస్తోంది. రాజ్‌ కపూర్‌కు చెందిన ఆర్‌కే స్టూడియో ఫిల్స్మ్ కోసం మా నాన్న పనిచేస్తున్నప్పుడు ఇది మొదలైంది’’ అని ఆయన చెప్పారు.

గురుకుల్‌లో 20 జాతుల కుక్కలు ఉన్నాయి. జెర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, బుల్‌డాగ్, పగ్, లాబర్డార్ ఇలా చాలా రకాల కుక్కలు ఇక్కడ కనిపిస్తాయి. పిల్లుల్లోనూ వీరి దగ్గర 8 జాతులు ఉన్నాయి. ఇరానీ క్యాట్, బాంబే క్యాట్, హిమాలయన్ క్యాట్, స్పాటెడ్ క్యాట్ లాంటి చాలా రకాలను ఇక్కడ చూడొచ్చు.

అంతేకాదు, అమెజాన్, మకావ్ చిలుకలతోపాటు చిన్నచిన్న పక్షులు, కుందేళ్లు, ఎలుకలు ఇలా చాలా రకాల జంతువులను వీరు పెంచుతున్నారు.

సినిమాలు, సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు, ప్రకటనల్లో నటింపచేసేందుకు ఈ జంతువులను పంపిస్తుంటారు.

ఒక్కోసారి బొద్దింకలు, చీమలను కూడా అడుగుతుంటారని, వాటిని కూడా పంపిస్తుంటామని జావెద్ చెప్పారు.

‘‘షూటింగ్ పూర్తయిన తర్వాత, ఆ చీమలు, బొద్దింకలను ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మళ్లీ అక్కడే వదిలిపెడతాం.’’ అని ఆయన తెలిపారు.

దిల్ ధడ్కనే దో సినిమాలో కుక్కతో చిత్రబృందం

ఫొటో సోర్స్, EXCEL ENTERTAINMENT

ఫొటో క్యాప్షన్, దిల్ ధడ్కనే దో సినిమాలో కుక్కతో చిత్రబృందం

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

సినిమాల్లో నటించే ఈ జంతువుల గురించి మాట్లాడుతూ- ‘‘షూటింగ్‌లకు తీసుకెళ్లేటప్పుడు ఈ జంతువుల వివరాలను మేం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని జంతువులు నా పేరు మీద, మరికొన్ని మా సోదరుడి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాం’’ అని జావెద్ చెప్పారు.

‘‘చాలా మందికి ఇలా జంతువులను రిజిస్టర్ చేయిస్తామని తెలియదు. కొన్నిసార్లు మేం సినిమాలకు కావాల్సినన్ని జంతువులను ఇవ్వడానికి వీలుపడదు. ఉదాహరణకు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ తీసుకోండి. ఆ సినిమా కోసం ఆరు ఏనుగులు కావాలి. కానీ, అప్పటికి మా దగ్గర రెండే ఉండేవి. దీంతో ఆ రెండింటినే పంపించాం’’ అని ఆయన వివరించారు.

సినిమాల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారో చెబుతూ, ‘‘జంతువులు కావాలని మా దగ్గరకు నిర్మాతలు లేదా దర్శకులు వస్తుంటారు. అప్పుడు ఎలాంటి సీన్ కోసం జంతువులు కావాలో మేం అడుగుతాం. ఒక్కోసారి ఆ సీన్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తుంటాం’’ అని ఆయన తెలిపారు.

‘‘సినిమా షూటింగ్ సమయంలోనూ మేం అక్కడే ఉంటాం. ఎందుకంటే ఆ జంతువులు మేం చెప్పిన మాటే ఎక్కువగా ఉంటాయి. పైగా షూటింగ్ సమయంలో జనం ఎక్కువగా ఉంటే, అవి బెదిరిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మేం అక్కడే ఉంటాం’’ అని ఆయన చెప్పారు.

‘‘ఒకవేళ నటుడి ఒళ్లో ఆ కుక్క కూర్చున్నా లేదా దాన్ని అతడు ఎత్తుకున్నా మేం కెమెరా పక్కనే నిలబడతాం. ఆ కుక్కకు సూచనలు ఇస్తుంటాం. ఒక్కోసారి మేం చెప్పేది జంతువులకు అర్థంకాదు. అప్పుడు వాటికి అర్థమయ్యేలా చెప్పాలి. ఆ సీన్‌ను మళ్లీ రీషూట్ చేయాలి’’ అని జావెద్ వివరించారు.

‘‘జంతువుల భోజనం నుంచి నిద్ర వరకూ అన్నింటికీ మనం ఏర్పాట్లు చేసుకోవాలి. జంతువుల కోసం ప్రత్యేకంగా చోటు కేటాయించాలి. అక్కడ వాటికి ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు. మనకు షూటింగ్ తేదీ తెలిసిన వెంటనే, అనుమతి కోసం అధికారులకు అర్జీ పెట్టుకోవాలి. ఎన్ని రోజులు షూటింగ్ ఉంది? ఎన్ని జంతువులు కావాలి? ఈ వివరాలన్నీ మనం అధికారులకు వెల్లడించాల్సి ఉంటుంది’’ అని ఆయన తెలిపారు.

‘‘ఏనుగులు, గుర్రాలు లాంటి పెద్ద జంతువుల విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్ని డాక్యుమెంట్లు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఈ జంతువులను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించాల్సి ఉంటే దానికి విడిగా అనుమతులు తీసుకోవాలి. వాటికి నెల రోజులకు సరిపడా ఆహారం, వాటి ఆరోగ్యానికి అవసరమైనవన్నీ ఉండేలా చూసుకోవాలి. అన్నీ సిద్ధం కావడానికి ఒక్కోసారి రెండు నెలల సమయం పట్టొచ్చు. ఆ తర్వాత మాత్రమే షూటింగ్ మొదలుపెట్టాలి’’ అని ఆయన అన్నారు.

 ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో గాడిదపై ఆమిర్ ఖాన్

ఫొటో సోర్స్, YASH RAJ PRODUCTIONS

ఫొటో క్యాప్షన్, ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో గాడిదపై ఆమిర్ ఖాన్

షూటింగ్‌ ఎలా?

సినిమాల్లో ఈ జంతువులు ఎలా నటిస్తాయో కూడా జావెద్ బీబీసీకి వివరించారు.

‘‘మేం అక్షయ్ కుమార్‌ ‘వక్త్’ సినిమా కోసం పనిచేశాం. ముంబయిలోని ఫిల్మ్ సిటీలో ఆ షూటింగ్ జరిగింది. ఒక సీన్‌లో అక్షయ్‌ను 15-16 జర్మన్ షెపర్డ్ కుక్కలు వెంబడిస్తాయి. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. షూటింగ్ మధ్య ఖాళీ సమయంలోనూ మా కుక్కలతో కలిసి అక్షయ్ పరిగెత్తేవారు’’ అని ఆయన చెప్పారు.

‘‘అక్షయ్ కుమార్ సినిమా ‘ఎంటర్‌టైన్మెంట్’లోనూ మా కుక్క బ్రూనో నటించింది. సాధారణంగా దీన్ని మేం ఆడిషన్స్‌కు తీసుకెళ్లం. ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ. ఒక్కోసారి షూటింగ్‌ తేదీలు వరుసపెట్టి వచ్చేస్తుంటాయి’’ అని ఆయన వివరించారు.

‘‘ఆ సినిమాలో కొన్ని సీన్లు ముంబయిలో చిత్రీకరించారు. అప్పుడు బ్రూనో పాల్గొంది. సెట్‌లో అందరికీ తను ఫేవరెట్‌గా మారిపోయింది. దీపికా పదుకొణెతో కలిసి కూడా ఒక ప్రకటనలో తను నటించింది. మొదట్లో దాన్ని చూసి దీపిక భయపడ్డారు. కానీ, ఆ తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. ఆ షూటింగ్ చాలా బాగా వచ్చింది’’ అని జావెద్ తెలిపారు.

‘‘బాలీవుడ్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో ఆమిర్ ఖాన్ ఒకచోట గాడిదపై వస్తారు. షూటింగ్ తేదీలకు అనుగుణంగా మేం ఒక గాడిదను నెల రోజులపాటు రాజస్థాన్‌లో షూటింగ్ జరిగే సెట్‌కు పంపించాం. యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు ఆ గాడిద చాలా నచ్చింది’’ అని ఆయన తెలిపారు.

‘‘ఆ గాడిదకు మా నాన్న శిక్షణ ఇచ్చారు. దాని పేరు నవాబ్. ఇంగ్లిష్‌లో చెప్పిన మాటలు కొన్ని అది అర్థం చేసుకుంటుంది. షూటింగ్ సమయంలో మా నన్న అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్‌లో దానికి మా నాన్న సూచనలు ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాన్ని చూసి ఆమిర్ ఖాన్ కూడా మెచ్చుకున్నారు.’’ అని చెప్పారు.

భేడియా సినిమాలో తోడేలు

ఫొటో సోర్స్, MADDOCK FILMS, JIO STUDIOS

ఫొటో క్యాప్షన్, భేడియా సినిమాలో తోడేలు

ఇది ఎలా మొదలైంది?

అసలు జంతువులకు శిక్షణ ఇవ్వడం ఎలా మొదలైందో జావెద్ బీబీసీతో చెప్పారు. ‘‘మా నాన్న ఒక అనాథ. ఆయన ఒక శరణాలయంలో పెరిగారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవారు.’’అని ఆయన వివరించారు.

‘‘ఒక రోజు ఆయన ఒక కుక్కను ఆర్‌కే స్టూడియో సమీపంలో వాకింగ్‌కు తీసుకెళ్లారు. అదే రోజు అక్కడ షూటింగ్‌కు ఒక కుక్క అవసరం ఏర్పడింది. దీంతో మా నాన్నను వారు పిలిచారు. కొన్ని రోజులపాటు కుక్కను షూటింగ్‌కు తీసుకొస్తారా అని అడిగారు. ఆ విషయాన్ని కుక్క యజమానికి మా నాన్న చెప్పారు. ఆ యజమాని ఒప్పుకోవడంతో కుక్కను తీసుకొని మా నాన్న షూటింగ్‌కు వెళ్లారు. ఆ షూటింగ్ బాగా వచ్చింది. డబ్బులు కూడా బానే ఇచ్చారు. అలా జంతువులను షూటింగ్‌కు పంపించాలనే ఆలోచన వచ్చింది’’ అని జావెద్ చెప్పారు.

‘‘ఆ తర్వాత సినిమాల కోసం జంతువులకు శిక్షణ ఇవ్వడాన్ని మా నాన్న మొదలుపెట్టారు. నెమ్మదిగా మాకు వచ్చే పని కూడా పెరిగింది’’ అని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, కన్నడ, హాలీవుడ్‌లలో వెయ్యికిపైగా సినిమాల్లో జావెద్ కుటుంబం శిక్షణ ఇచ్చిన జంతువులు నటించాయి.

వీడియో క్యాప్షన్, కాళి: ఈ వివాదం ఎందుకు?

రోజుకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు

తమ జంతువులకు రోజుకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఇస్తుంటారని జావెద్ చెప్పారు. ఇక్కడ పారితోషికం అనేది జంతువు రకాన్ని బట్టి ఉంటుందని, పెద్ద జంతువులకైతే ఎక్కువ, చిన్న జంతువులకైతే తక్కువ ఇస్తారని వివరించారు.

‘‘ఈ జంతువులను మేం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎప్పటికప్పుడువీటిని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి టెస్టులు చేయిస్తాం. ఒక ఏనుగుకు రోజుకు 185 కేజీల ఆహారం అవసరం అవుతుంది. అందుకే వీటిని తీసుకొచ్చేటప్పుడు సరిపడా ఆహారాన్ని మా దగ్గర ఉండేలా చూసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.

అయితే, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు లాంటి వాటిని తమ దగ్గర ఉంచుకోమని, షూటింగ్ అవసరానికి తగినట్లుగా యజమానుల నుంచి వాటిని తీసుకొస్తామని వివరించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత వీటిని జాగ్రత్తగా మళ్లీ అప్పగిస్తామన్నారు.

వీడియో క్యాప్షన్, జనగణమన: అవసరమైన ప్రశ్నలను రేకెత్తించిన సినిమా - ఎడిటర్స్ కామెంట్

వీఎఫ్ఎక్స్‌ల రాకతో పరిస్థితి మారిందా?

వీఎఫ్ఎక్స్ రాకతో షూటింగ్‌లకు తీసుకెళ్లే జంతువుల సంఖ్య తగ్గిందా?

‘‘అది కొంత వరకూ నిజమే. ఇది వీఎఫ్‌ఎక్స్‌ల కాలం. కానీ, చాలా సినిమాల్లో ఇప్పటికీ జంతువులను వాడుతున్నారు. కొన్ని ఆంక్షలు అమలులో ఉండే జంతువులకు మాత్రం వీఎఫ్ఎక్స్‌తో పని పూర్తిచేస్తున్నారు’’ అని జావెద్ బదులిచ్చారు.

‘‘ఉదాహరణకు వరుణ్ ధవన్ సినిమా ‘భేడియా’ను తీసుకోండి. దానిలోని కుక్కలు నిజమైనవే. కానీ, తోడేళ్ల కోసం వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించారు. ఎందుకంటే తోడేళ్లను షూటింగ్స్ కోసం భారత్‌లో ఉపయోగించకూడదు’’ అని ఆయన తెలిపారు.

‘‘పాములు, బల్లులు, గుడ్లగూబలు, చిలుకల షూటింగ్స్‌లో ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే, కొన్నిసార్లు డైరెక్టర్లు వీఎఫ్ఎక్స్‌కు ఇష్టపడరు. అప్పుడు ఆ జంతువులకు ఇంచుమించు అలానే కనిపించే జంతువులను తీసుకెళ్తుంటారు’’ అని ఆయన చెప్పారు.

‘‘ఉదాహరణకు సినిమాలో పెద్ద బల్లిని చూపించాలి అనుకుంటే తొండలను తీసుకెళ్తారు. మిగతా జంతువుల విషయంలోనూ అంతే.. ’’అని ఆయన చెప్పారు.

గురుకుల్ జంతువులు బాగ్‌బాన్, భేడియా, వక్త్, ఎంటర్‌టైన్మెంట్, గోల్‌మాల్-3, దమ్, కోయి మిల్ గయా లాంటి సినిమాల్లో నటించాయి.

షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినిమా ఆర్చీస్‌లోనూ గురుకుల్ పిల్లి కనిపించబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)