వరంగల్ జిల్లా: ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటిని రాత్రికి రాత్రే తగులబెట్టారు...

కావ్య, రంజిత్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ కుమార్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

వరంగల్ జిల్లా ఇటికాలపల్లి లో ఓ ప్రేమ పెళ్లి విషయంలో తలెత్తిన ఘర్షణల్లో నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటన వెనుక గ్రామ సర్పంచ్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

నర్సంపేట్ పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండలం రవీందర్ కూతురు కావ్య 'హసన్‌పర్తి'లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.

గత కొంత కాలంగా కావ్య అదే గ్రామానికి చెందిన చదువుల్లో తన సీనియర్ అయిన రంజిత్ అనే యువకునితో ప్రేమలో ఉంది.

రంజిత్ వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.

రంజిత్, కావ్య

ఫొటో సోర్స్, UGC

గత నెలలో వివాహం

అయితే, 2023 జూన్‌లో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావ్య, రంజిత్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కావ్యది ముదిరాజ్ సామాజిక వర్గం కాగా, రంజిత్ రజక సామాజిక వర్గానికి చెందిన వారు.

కూతురు కులాంతర వివాహంపై ఇటికాలపల్లి గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు సర్పంచ్ రవీందర్ పంచాయతీ నిర్వహించి కూతురును తిరిగి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కావ్య తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు.

‘నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. నన్ను ఎవరూ బలవంత పెట్టలేదు. నా వల్ల ఇబ్బంది పడొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. తనతో హ్యాపీగానే ఉన్నాను. నా కోసం ఎక్కడా వెతక్కండి. మీరు సంతోషంగా ఉండి, నన్నూ ఉండనివ్వండి’ అని కావ్య వీడియోలో కోరారు.

అయితే, జూన్ 30న తన కూతురు కనిపించడం లేదని రవీందర్ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది.

‘‘తండ్రి రవీందర్ పిర్యాదు మేరకు కేసు విచారణ లో భాగంగా కావ్య, రంజిత్ లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాం. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లిచేసుకున్నానని, తన భర్త రంజిత్‌తోనే కలిసి ఉంటానని చెప్పింది. ఇద్దరు మేజర్లు అవడంతో రంజిత్‌తో కావ్యను పంపించాం’ అని హసన్ పర్తి ఎస్సై సురేష్ బీబీసీకి తెలిపారు.

దగ్ధమైన ఇల్లు

ఫొటో సోర్స్, UGC

ఆగ్రహంతో ఇళ్లకు నిప్పు

తనతో వచ్చేందుకు కూతురు నిరాకరించడంతో సర్పంచ్ రవీందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ రోజు తెల్లవారు జామున రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించారన్న అనుమానంతో గ్రామంలోని నలుగురు ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు.

ఈ దాడిలో ఇళ్లలోని వస్తువులు కాలిపోయాయి.

బొడ్డుపల్లి యాదలక్ష్మి అనే బాధితురాలి పిర్యాదు మేరకు నర్సంపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇళ్లు కాలిన ఘటన‌పై నర్సంపేట పోలీసులు బీబీసీతో మాట్లాడారు.

‘ఈ రోజు తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నాం. దర్యాప్తు చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయి’ అని నర్సంపేట్ సీఐ రమేష్ తెలిపారు.

‘ఈ ఘటనలో అందరూ బీసీ కులాలకు చెందిన వారే ఉన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది’ అని నర్సంపేట్ ఏసీపీ సంపత్ రావ్ బీబీసీతో అన్నారు.

గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టడంతో తమకు ప్రాణహాని ఉందంటూ కావ్య, రంజిత్‌ల జంట వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు.

‘ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’

వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ తమకు ప్రాణభయం ఉందని కావ్య, రంజిత్ జంట అన్నారు.

రాజకీయ పలుకుబడి ఉన్న తన తండ్రితో ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు రక్షణ కల్పించలేదని అందుకే తమ ఇండ్లపై దాడులు జరిగాయని కావ్య ఆరోపించారు.

ఇటికాలపల్లిలో తన ఇంటిపై జరిగిన దాడిలో తన సర్టిఫికేట్‌లను చింపేశారని, ఇంట్లో నుంచి 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారని రంజిత్ అన్నారు.

తమకు రక్షణ కల్పించాల్సిందిగా కావ్య, రంజిత్‌లు వరంగల్ సీపీ కార్యాలయానికి వెళ్లారు.

అయితే ఈనెల 8న వరంగల్ లో ప్రధాని పర్యటన నేపథ్యంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లలో సీపీ ఉన్నందున వారిని కలువలేదని వరంగల్ పోలీస్ కమీషనర్ పీఆర్వో కార్యాలయం బీబీసీకి తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)