ఇజ్రాయెల్-పాలస్తీనా: జెనిన్ శరణార్థి శిబిరం ఎక్కడుంది? దీనిపై ఇజ్రాయెల్ ఎందుకు దాడికి దిగింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జెరెమీ హోవెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై ఈ నెల 3 (సోమవారం)న ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ చేపట్టింది. అక్కడున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌పై పోరాటం చేస్తున్నట్లు చెప్పింది.
ఈ ఆపరేషన్‌లో 12 మంది పాలస్తీనియన్లు, ఒక ఇజ్రాయెల్ సైనికుడు మరణించారు. రెండు రోజుల సైనిక చర్య అనంతరం ఇజ్రాయెల్ దళాలు వెనక్కు మళ్లడం ప్రారంభించాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
ఇంతకూ జెనిన్ శరణార్థి శిబిరం అంటే ఏమిటి? అందులో ఎవరున్నారు? ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నట్లు అది నిజంగా మిలిటెంట్ స్థావరమా?

ఫొటో సోర్స్, Getty Images
జెనిన్ క్యాంప్ ఎక్కడుంది?
ఈ శరణార్థుల శిబిరం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు ఉత్తరాన ఉన్న జెనిన్ నగరంలో ఉంది.
ఇది జోర్డాన్ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న భూభాగం. 1967లో ‘ఆరు రోజుల యుద్ధం’ అనంతరం జోర్డాన్ నుంచి ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ ఈ ప్రాంతం తమదేనని చెబుతున్నాయి. దశాబ్దాలు గడిచినా ఈ సమస్య పరిష్కారం కాలేదు.
1995 నుంచి జెనిన్ 'పాలస్తీనియన్ అథారిటీ' నియంత్రణలో ఉంది. ఇజ్రాయెల్ పాలనలోలేని వెస్ట్ బ్యాంక్‌లోని ప్రాంతాల నిర్వహణను ఈ అథారిటీ చూసుకుంటుంది.
అయినప్పటికీ, భద్రతా కార్యకలాపాలను నిర్వహించడానికి ఇజ్రాయెల్ దళాలు తరచుగా ఈ శిబిరంలోకి ప్రవేశిస్తుంటాయి.
శిబిరం కాంక్రీట్ భవనాలతో కూడి ఉంది. వీటిలో మొదటి భవనం 1970లలో నిర్మించారు.
ఇక్కడ దాదాపు 14,000 మంది ప్రజలు నివసిస్తున్నారని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) అంచనా. ఒక్కొక్కరు అర చదరపు కిలోమీటరు కంటే తక్కువ విస్తీర్ణంలో నివసిస్తున్నట్లు ఏజెన్సీ చెబుతోంది.
జెనిన్ శిబిరంలో పేదరికం, నిరుద్యోగిత ఉన్నాయని, ముఖ్యంగా యువతలో ఎక్కువని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ చెప్పింది. ఈ సమస్యలు వారిలో అసంతృప్తి, నిరాశకు దారితీస్తున్నట్లు తెలిపింది. ఉన్నత పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్‌కు కారణమవుతున్నాయని వివరించింది.

ఫొటో సోర్స్, EPA
జెనిన్‌లో గొడవలకు కారణమేంటి?
కొన్ని వారాలుగా జెనిన్ శిబిరం చుట్టుపక్కల హింస పెరుగుతోంది.
ఇజ్రాయెల్ జూన్ 20న జెనిన్‌లో జరిపిన హెలికాప్టర్ దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించారు.
మరుసటి రోజు జెనిన్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల దూరంలో ఎలిసెటిల్‌మెంట్‌కు సమీపంలో ఉన్న పెట్రోల్ స్టేషన్, రెస్టారెంట్‌లలో నలుగురు ఇజ్రాయెల్ పౌరులను ఇద్దరు హమాస్ మిలిటెంట్లు కాల్చి చంపారు.
దీంతో సమీపంలోని పాలస్తీనా పట్టణం తుర్ముసయాలోని ఇళ్లు, కార్లపై వందల మంది ఇజ్రాయెల్ సెటిలర్లు దాడి చేశారు. ఈ హింసాకాండలో పాలస్తీనా వ్యక్తిని కాల్చి చంపారు.
వారం తరువాత ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో జెనిన్‌లో ఉంటున్న ముగ్గురు పాలస్తీనా మిలిటెంట్లు మరణించారు.
వెస్ట్ బ్యాంక్‌లో నిర్వహిస్తున్న ప్రస్తుత ఆపరేషన్ ఇజ్రాయెల్ అతిపెద్ద సైనిక కార్యకలాపాల్లో ఒకటి.
దీన్ని ఇజ్రాయెల్ "తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నం"గా అభివర్ణించింది.
డ్రోన్ దాడులు, సాయుధ బుల్డోజర్ల మద్దతుతో వందల మంది సైనికులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఇది జెనిన్ నగరం తీవ్రవాదానికి ఆశ్రయంగా నిలవకుండా చేస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఈ శిబిరాన్ని ధ్వంసం చేయడానికి, అక్కడి ప్రజలను తరలించడానికి ఈ ఆపరేషన్ ఒక కొత్త ప్రయత్నమని పాలస్తీనా అథారిటీ ప్రధాన మంత్రి మొహమ్మద్ ష్టయ్యే ఆరోపించారు.
జెనిన్ బ్రిగేడ్స్ అంటే ఏమిటి?
ఈ శిబిరం జెనిన్ బ్రిగేడ్స్‌కు నిలయం.
ఇది హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అల్-ఖుద్స్ బ్రిగేడ్ సహా వివిధ పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూపులకు చెందిన సాయుధ ఫైటర్స్ స్థావరం.
శిబిరంలో దాదాపు 420 మంది సాయుధ ఫైటర్లు ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెబుతోంది.
వారంతా స్థానిక ప్రాంతం చుట్టూ ఉంటారని, వారు ఇజ్రాయెల్‌ను ప్రతిఘటించడానికి పనిచేస్తారని అంటోంది.
జెనిన్ కొత్త తరం పాలస్తీనా ఫైటర్ల స్థావరమని బీబీసీ దౌత్య ప్రతినిధి పాల్ ఆడమ్స్ చెప్పారు.
"ఈ యువఫైటర్లకు శాంతి ప్రక్రియ గురించి పెద్దగా తెలియదు. ఏదైనా వివాదం తలెత్తితే దానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం అవకాశాలు లేవు. ఎందుకంటే వారి రాజకీయ నాయకత్వంపై వీరికి పూర్తి విశ్వాసం లేదు. అందుకే వారు తాము అనుకున్న విధానంలోనే పోరాడుతున్నారు" అని ఆడమ్స్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జెనిన్ శిబిరం చరిత్ర ఏమిటి?
1948-49లో ఇజ్రాయెల్, అరబ్ దళాల మధ్య జరిగిన యుద్ధంలో నిరాశ్రయులైన పాలస్తీనియన్ల కోసం 1953లో ఈ శిబిరం నిర్మించారు.
ఆ సమయంలో వెస్ట్ బ్యాంక్ జోర్డాన్ అధీనంలో ఉండేది. దీనిలోకి ఆధునిక ఇజ్రాయెల్‌లోని హైఫా, నజరేత్, పరిసర ప్రాంతాల నుంచి శరణార్థులు చేరుకున్నారు.
1967లో ఆరు రోజుల యుద్ధం తరువాత, జెనిన్, వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చాయి. దీంతో చాలా మంది శరణార్థులు జెనిన్ శిబిరానికి వచ్చారు.
వెస్ట్ బ్యాంక్‌లోని 19 శరణార్థి శిబిరాల్లో ఇది ఒకటి. వీటిలో దాదాపు రెండు లక్షల మంది ఉంటారు.
2000-05 మధ్య జరిగిన రెండో పాలస్తీనియన్ ఇంటిఫాడా (తిరుగుబాటు) సమయంలో జెనిన్ శిబిరం పోరాటానికి కేంద్రంగా మారింది.
2002లో 10 రోజుల పోరాటం తర్వాత శిబిరాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆక్రమించింది, దీనిని ‘బ్యాటిల్ ఆఫ్ జెనిన్’గా పిలుస్తారు.
52 మంది పాలస్తీనా మిలిటెంట్లు, పౌరులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు ఈ పోరాటంలో మరణించారు.
400కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది నిరాశ్రయులయ్యారు.
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














