జెనిన్-వెస్ట్ బ్యాంక్: పాలస్తీనా శరణార్థుల శిబిరంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్

జెనిన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, యోలండే నెల్, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ న్యూస్

వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరంలో ఇజ్రాయెల్ బలగాలకు, సాయుధ పాలస్తీనా మిలిటెంట్లకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరుగుతోన్న అతి పెద్ద సైనిక చర్యగా కనబడుతోన్న ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ మొదలుపెట్టింది.

ఇజ్రాయెల్ సోమవారం ఉదయం నుంచే డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది.

ఇప్పటివరకు ఈ దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు,100కు పైగా గాయాల పాలైనట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

జెనిన్ నగరం తీవ్రవాదానికి శరణార్థి శిబిరంగా మారడాన్ని ఆపుతున్నట్లుగా తమ సైనిక చర్యను ఇజ్రాయెల్ సమర్థించుకుంది.

దీన్ని యుద్ధ నేరంగా పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, జెరూసలెం చేరుకున్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్.

శరణార్థి శిబిరం నుంచి ఇప్పటివరకు వృద్ధులు, రోగులతో సహా 3,000 మందిని తరలించినట్లు పాలస్తీనా రెడ్ క్రెసెంట్స్ చెప్పింది.

ఇజ్రాయెల్ బలగాలు సోమవారం ఉదయం నుంచి ఆహారం, నీళ్లు ఇవ్వకుండా డజన్ల కొద్దీ ప్రజలను తమ ఇళ్లలోనే నిర్బంధించినట్లు తెలిపింది.

ఈ ఆపరేషన్ ముగింపునకు నిర్దిష్టంగా ఎటువంటి సమయం లేదని, ఇది ముగియడానికి గంటలు లేదా రోజులు పట్టొచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్ ఆక్రమణ పరిమితులతో పాటు పాలస్తీనా నాయకత్వంపై విసుగుతో ఉన్న కొత్త తరం పాలస్తీనా మిలిటెంట్లకు జెనిన్ నగరం పటిష్ట స్థావరంగా మారింది.

2002లో పాలస్తీనా రెండో తిరుగుబాటు సమయంలో ఇజ్రాయెల్ బలగాలు, జెనిన్ నగరంలో పూర్తిగా చొరబడ్డాయి.

ఆ సమయంలో 52 మందికి పైగా పాలస్తీనా మిలిటెంట్లు, పౌరులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. 10 రోజుల పాటు భీకరంగా ఈ ఆపరేషన్ జరిగింది.

జెనిన్ బ్రిగేడ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చివరి బుల్లెట్, చివరి శ్వాస వరకు తమ మిలిటెంట్లు పోరాడతారని జెనిన్ బ్రిగేడ్ గ్రూప్ చెప్పింది

తాజా ఆపరేషన్ మొదలై 20 గంటలు దాటినప్పటికీ, జెనిన్ నగరంలో ఇంకా వందలాది మంది ఇజ్రాయెల్ సైనికులు పనిచేస్తున్నారు.

శరణార్థి శిబిరంలో ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి డ్రోన్ల ధ్వనులు, తుపాకీల కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వస్తూనే ఉన్నాయి.

ఈ శిబిరంలో 18 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ శిబిరాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ జోన్‌గా పరిగణిస్తున్నారు.

నిరసనల సమయంలో టైర్లను కాల్చడం వల్ల ఎగిసిన పొగలు ఇప్పటికీ సిటీ సెంటర్‌లో అలుముకొని ఉన్నాయి.

శరణార్థుల శిబిరంలో టెలీ కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో సరిగ్గా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టతరం అవుతోంది.

క్షతగాత్రులను చేరుకోవడంలో పాలస్తీనా వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శరణార్థి శిబిరం ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆసుపత్రిలో పరిస్థితి భయంకరంగా ఉంది.

క్యాంప్‌లో ఊచకోత జరిగిందని బీబీసీతో ఒక వ్యక్తి అన్నారు.

‘‘అక్కడి జనాల్లో పిల్లలు కూడా ఉన్నారు. వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. కరెంట్ తీసేశారు. రోడ్లను తవ్వేశారు. శరణార్థి శిబిరాన్ని ద్వంసం చేస్తారు’’ అని ఆయన చెప్పారు.

తుపాకీ కాల్పులు, పేలుడు పదార్థాల వల్ల గాయపడిన 90కి పైగా రోగుల్ని చూసినట్లు బీబీసీతో మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే చారిటీకి చెందిన జొవానా తెలిపారు.

సోమవారం రాత్రి దాదాపు 500 పాలస్తీనా కుటుంబాలు క్యాంపు నుంచి వెళ్లిపోయేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతించింది.

మిలిటెంట్లు

రాత్రి జరిగిన మొదటి డ్రోన్ దాడి ఒక అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.

ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసిన పాలస్తీనియన్లకు రహస్య స్థావరంగా, వివిధ పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులతో ఏర్పడిన జెనిన్ బ్రిగేడ్స్‌కు జాయింట్ ఆపరేషనల్ కమాండ్ సెంటర్‌గా ఆ ఆపార్ట్‌మెంట్ ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది.

గత ఏడాదిన్నర కాలంలో ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన దాదాపు 50 దాడుల వెనకున్న పాలస్తానీయులు ఈ జెనిన్ నుంచే వచ్చారని మిలిటరీ పేర్కొంది.

తాజా ఆపరేషన్‌లో 50 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నామని, ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

సోమవారం సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ సైనికులను ప్రశంసించారు. తీవ్రవాదులకు గూడులా మారిన ప్రాంతంలోకి ప్రవేశించిన సైనికులు, పౌరులకు తక్కువ నష్టం జరిగేలా తమ ఆపరేషన్‌ను నడిపిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ఆపరేషన్‌పై పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ స్టాయి తీవ్రంగా స్పందించారు.

‘‘శరణార్థి శిబిరాన్ని పూర్తిగా తుడిచిపెట్టి, అక్కడి నివాసితులను తరలించే ప్రయత్నం జరుగుతోందని’’ ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ దాడులు

వెస్ట్ బ్యాంక్‌లో ఇటీవలి నెలల్లో హింస పెరిగిపోయింది.

జూన్ 20న జెనిన్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఏడుగురు పాలస్తీనా ప్రజలు చనిపోయారు.

మరుసటి రోజు, ఇద్దరు హమాస్ గన్‌మెన్లు ఎలీ సమీపంలో నలుగురు ఇజ్రాయెల్ పౌరులను కాల్చి చంపారు.

ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి 140 మందికి పైగా పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో చనిపోయారు. ఇందులో పౌరులతో పాటు మిలిటెంట్లు ఉన్నారు.

గాజా స్ట్రిప్‌లో కూడా మరో 36 మంది చనిపోయారు.

ఇలాంటివే ఇంకా చాలా ఘటనలు అక్కడ జరిగాయి.

వీడియో క్యాప్షన్, మరి దీంతో ప్రజలకు మరింత భద్రత లభిస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)