ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్

చనిపోయాడని ఇజ్రాయెల్ భావిస్తున్నప్పటికీ, గాజా నుంచి తన వ్యూహాలను డేఫ్‌ కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, గాజా నుంచి తన వ్యూహాలను డేఫ్‌ కొనసాగిస్తున్నారు.
    • రచయిత, జాషువా నెవెట్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఇటీవల పాలస్తీన మిలిటెంట్‌ ఒకరు తన కరకు స్వరంతో ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక పంపారు. హమాస్ డిమాండ్‌లు నెరవేర్చక పోతే ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నది ఆ హెచ్చరిక సారాంశం.

ఆ మిలిటెంట్ పేరు మహ్మద్ డేఫ్‌. ప్రస్తుతం గాజాను తన ఆధీనంలో ఉంచుకున్న హమాస్‌ మిలిటరీ వింగ్‌కు ఆయన నాయకుడు.

గాజాలో ఇజ్రాయెల్‌కు మోస్ట్ వాంటెడ్ లీడర్ మహ్మద్ డేఫ్‌. గాజా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మహ్మద్ డేఫ్‌ గొంతు తొలిసారి వినిపించింది.

కాకపోతే, ఆయన హెచ్చరికలను ఆ సమయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 11 రోజుల ఘర్షణ తర్వాత గాజా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

గాజా వైపు 242మంది చనిపోగా, ఇజ్రాయెల్‌ నుంచి 13మంది మరణించారని ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. గాజాలో మరణించిన వారిలో 129 మంది సామాన్య ప్రజలు. అయితే, ఇజ్రాయెల్ మాత్రం చనిపోయిన వారిలో 200 మంది మిలిటెంట్లేనని చెబుతోంది.

ఇటు తమ మిలిటరీలో చనిపోయింది 80 మంది మాత్రమే అని హమాస్ నాయకుడు యాహ్య సిన్వార్ ప్రకటించారు. ఆ చనిపోయిన గాజా సైన్యంలో మహ్మద్ డేఫ్‌ లేరు.

''డేఫ్‌ను చంపాలన్నదే మా ఆపరేషన్ ప్రధాన లక్ష్యం'' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ ప్రతినిధి హిదాయి జిల్బర్మన్‌ అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

ఇటీవలి ఘర్షణల సందర్భంగా కనీసం రెండుసార్లు డేఫ్‌‌ను చంపేందుకు ప్రయత్నించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బీబీసీకి ధ్రువీకరించింది. దీంతో డేఫ్‌ ఇప్పటి వరకు ఏడుసార్లు ఇజ్రాయెల్ హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నట్లయింది.

ఆయనను చంపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో విసిగి పోయిన ఇజ్రాయెలీ దళాలు, ఇటీవలి ఘర్షణల సందర్భంగా హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.

''హమాస్‌లో అత్యంత ముఖ్యమైన నాయకులెవరు అన్నదానిపై వారి దగ్గర ఒక జాబితా ఉంది.'' అని మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ ఎనలిస్ట్ మాథ్యూ లెవిట్ బీబీసీతో అన్నారు. ''అందులో అగ్రభాగంలో ఉన్న పేరు మహ్మద్ డేఫ్‌'' అన్నారాయన.

ఇజ్రాయెల్ పై దాడులకు వ్యూహరచన చేయడంలో డేఫ్‌ దిట్ట. సొరంగాలలో ఉంటూనే ఆయన ఆదేశాలు ఇస్తుంటారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇటీవలి ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని అనేక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.

గాజాస్ట్రిప్ అతిథి

డేఫ్‌ గురించిన సమాచారం ఎక్కువగా ఇజ్రాయెల్, పాలస్తీన మీడియాల నుంచే వస్తుంది. వాటి ప్రకారం డేఫ్‌ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్ధి శిబిరంలో 1965లో పుట్టారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఈజిప్ట్ ఆక్రమణలో ఉంది.

మహ్మద్ దయాబ్ ఇబ్రహిం అల్-మస్రి ఆయన అసలు పేరు కాగా, ఆయన వివిధ ప్రదేశాలకు తిరుగుతున్న క్రమంలో తన పేరును డేఫ్‌గా మార్చుకున్నారు. డేఫ్‌ అంటే అతిథి అని అర్థం.

అయితే, ఆయన ఎక్కడ ఎక్కువ కాలం ఉన్నారు, ఏం చదువుకున్నారు అన్నది మాత్రం పెద్దగా తెలియదు.

హమాస్ పుట్టే నాటికి డేఫ్‌ యువకుడు. 1980లలో ఆయన హమాస్‌లో చేరారు. ఇజ్రాయెల్‌పై ద్వేషాన్ని నరనరాన నింపుకొన్న డేఫ్‌, హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగారు.

''హమాస్‌లో ఆయనొక అతివాది'' అని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ సలహాదారు లెవిట్ అన్నారు. హమాస్‌ కీలక నేతలకు ఆయన చాలా సన్నిహితుడు. ముఖ్యంగా బాంబ్ మేకర్, ఇంజినీర్ అనే పేరున్న అయ్యాష్‌‌కు డేఫ్ సన్నిహితుడు.

1990లలో ఇజ్రాయెల్ మీద బాంబులతో విరుచుకు పడిన వారిలో అయ్యాష్ కీలకమైన వ్యక్తి. 1996లో అయ్యాష్‌ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి.

అయితే, ఆ తర్వాత మరిన్ని బాంబు దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వెనక ఉన్న వ్యక్తి డేఫ్‌ అని చెబుతారు. తన స్నేహితుడిని చంపినందుకు ఆయన ప్రతీకారం తీర్చుకున్నారని అంటారు.

తన వ్యూహాత్మక ఎత్తుగడలతో హమాస్‌లో ఆయన వేగంగా అగ్రస్థాయికి చేరుకున్నారు. 2002లో హమాస్ మిలిటరీ వింగ్‌ నాయకుడిగా మారారు.

కస్సామ్ అనే రాకెట్‌‌ను తయారు చేయడంలో డేఫ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ మిసైల్‌ను హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా చెబుతారు.

ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డేఫ్‌ గాజాలోని సొరంగ మార్గాలలో నివసించేవారు. అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవారు.

హమాస్ డిమాండ్లను నెరవేర్చకపోతే ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇటీవల డేఫ్‌ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గాజా ఇజ్రాయెల్ పై అనే బాంబులను ప్రయోగించింది.

అనేక హత్యాయత్నాలు

ఇజ్రయెల్ రాడార్ నీడలో డేఫ్‌ నిత్యం మృత్యువుతో యుద్ధం చేస్తుండేవారు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేకమార్లు ఇజ్రాయెలీ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది.

''ఆయన ఇక మిలిటరీ నాయకుడిగా పని చేయడం అసాధ్యమని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన కోలుకుని తిరిగి విధుల్లో చేరారు.'' అని ఇజ్రాయెల్‌కు చెందిన మిలిటరీ మాజీ జనరల్ ఒకరు బీబీసీతో అన్నారు.

అనేకమార్లు ఆయన ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డేఫ్‌ అంటే క్రేజ్ పెరిగింది. అందరూ ఆయనను 'క్యాట్ విత్ నైన్ లైవ్స్' అని అనే వారు.

2014లో ఆయనపై 5వ సారి హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ''డేఫ్‌ జీవించే ఉన్నారు. మిలిటరీ ఆపరేషన్‌లలో పాల్గొంటున్నారు '' అని హమాస్ ప్రకటించింది.

ఆయన ఇలా పలుమార్లు తప్పించుకోవడం ఇజ్రాయెల్ గూఢచార సాంకేతిక పరిజ్ఞానం మీదనే అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

''మీరు ఫోన్ వాడకపోతే, కంప్యూటర్ ఉపయోగించకపోతే, మీరు ఎక్కడున్నారన్నది కనుక్కోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా చాలా కష్టం.'' అని లెవిట్ అన్నారు.

''హమాస్ తవ్విన టన్నెల్స్ లోతు, ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న కొంత పాత తరం టెక్నాలజీ కారణంగా డేఫ్‌ను గుర్తించి చంపడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేకసార్లు విఫలమవుతోంది'' అని ఇజ్రాయెల్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకరు అన్నారు.

1980లో హమాస్‌లో చేరిన డేఫ్‌ మిలిటరీ నేతగా ఎదిగారు. హమాస్ కీలక నాయకులు ఆయనకు సన్నిహితులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనేకమంది హమాస్ కీలక నాయకులు డేఫ్‌కు సన్నిహితులు

విలక్షణ నాయకుడు

ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు కాల్పుల విరమణతో ముగియడానికి ఒక రోజు ముందు హమాస్ సీనియర్ అధికారి ఒకరు డేఫ్‌ నాయకత్వంలోనే గాజా మిలిటరీ ఆపరేషన్స్ జరిగాయని అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు.

డేఫ్‌ను అంతమొందించడానికి తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

డేఫ్‌ మీద ఇజ్రాయెల్ తన దృష్టినంతా కేంద్రీకరించడం విశేషమేమీ కాదని, అయితే ఆయన మీద జరుగుతున్న విఫల హత్యా యత్నాలన్ని ఆయన ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయని లెవిట్ వ్యాఖ్యానించారు.

''హమాస్‌లో ఉన్న పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. ఉద్యమం ఆరంభం నుంచి ఉన్న నాయకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒక రకంగా ఆయన వారిలో కాస్త విలక్షణమైన నాయకుడు'' అన్నారు లెవిట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)