‘ఎంతోమంది పెళ్లి కొడుకులు నన్ను తిరస్కరించారు.. కట్నం ఇవ్వబోమని చెప్పడమే దానికి కారణం’

ఫొటో సోర్స్, GUNJAN TIWARI
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
భారత్‌లో వరకట్నం ఇవ్వడం నేరం. కానీ, పెళ్లి కొడుకు కుటుంబం డబ్బులు, బట్టలు, బంగారు ఆభరణాలు లాంటి బహుమతులను పెళ్లికూతురు కుటుంబం నుంచి ఆశిస్తుంటుంది.
సమాజాన్ని పీడిస్తున్న ఈ సమస్యకు కళ్లెం వేసేందుకు పెళ్లిళ్లు జరిగే చోట అధికారులను మోహరించాలని, తనిఖీలు చేపట్టాలని పోలీసులను భోపాల్‌కు చెందిన 27 ఏళ్ల టీచర్ అభ్యర్థించారు.
కట్నం ఇవ్వకపోవడంతో డజన్ల సార్లు ఆమెను చాలా మంది పెళ్లికొడుకులు తిరస్కరించారు.
ఆ అనుభవాల నుంచి ఈ అభ్యర్థన ఆలోచన వచ్చిందని గుంజన్ తివారీ (పేరు మార్చాం) బీబీసీతో చెప్పారు.
గత ఫిబ్రవరిలోనూ ఆమెకు ఇలాంటి అనుభవం ఎదురైంది. పెళ్లి చూపుల కోసం ఓ కుటుంబాన్ని ఆమె తండ్రి ఆ రోజు ఆహ్వానించారు.
ఆ కుటుంబంతో గుంజన్ తల్లి దండ్రులు మాట్లాడారు. ఆ తర్వాత వారి ఎదుటకు వేడివేడి టీ, బిస్కెట్లు పట్టుకొని గుంజన్ నడుచుకుంటూ వచ్చారు.
‘‘ఆ పెళ్లి చూపుల్లో అందరూ మీ వైపే చూస్తారు. ఏవేవో అభిప్రాయాలు చెబుతారు’’ అని ఫోన్‌లో ఆమె బీబీసీతో చెప్పారు.
ఆ వచ్చేవారి ఎదుటకు ఎలా, ఎప్పుడు రావాలో ముందుగానే గుంజన్‌కు చెప్పారు. ఆమె కోసం ఒక పచ్చ రంగు చీరను ఆమె తల్లి ఎంపిక చేశారు. ఎందుకంటే పచ్చరంగు చీరలో గుంజన్ బాగా కనిపిస్తారని ఆమె తల్లి భావించారు.
పెళ్లికొడుకు కుటుంబం ముందు నవ్వొద్దని, ఒకవేళ నవ్వితే వరుసలోలేని పళ్లు వారికి కనిపిస్తాయని గుంజన్‌కు సూచించారు.
ఇవన్నీ గుంజన్‌కు అలవాటు అయిపోయాయి. పెళ్లి చూపుల్లో చదువు, ఉద్యోగం, వంటవార్పుల గురించి అడిగే ప్రశ్నలు కూడా ఆమెకు బాగా తెలుసు.
గదిలోకి అడుగుపెట్టకముందే, "మీరు ఎంత కట్నం ఆశిస్తున్నారు" అని పెళ్లి కొడుకు తండ్రిని తన తల్లిదండ్రులు అడుగుతున్న సంగతి గుంజన్‌కు వినిపించింది. ‘‘వారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు అడిగారు. ఆ తర్వాత మా నాన్న మాట్లాడుతుంటే.. "మీ అమ్మాయి బావుంటే డిస్కౌంట్ ఇస్తాం" అని వారు జోక్ చేశారు’’ అని ఆమె చెప్పారు.
‘‘అయితే, మాటలు కాస్త కలిసిన తర్వాత డిస్కౌంట్ ఇవ్వబోరని తెలిసింది. ఎందుకంటే నా పలువరస సరిగా లేదని, పైగా నుదుటిపై మచ్చ కూడా ఉందని అన్నారు’’ అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
టీ తర్వాత, ఆ పెళ్లి కొడుకుతో ప్రైవేటుగా మాట్లాడాలని గుంజన్‌కు చెప్పారు. అప్పుడే, కట్నం అడిగితే తాను పెళ్లి చేసుకోనని ఆమె ఆయనకు చెప్పేశారు.
‘‘ఇదొక సామాజిక భూతం అని ఆయన కూడా అంగీకరించారు. దీంతో మిగతా వారికంటే ఆయన చాలా భిన్నమైనవారని అనిపించింది.’ అని ఆమె అన్నారు.
అయితే, కొద్దిసేపటికే గుంజన్‌ను వారు తిరస్కరించారని తివారీ కుటుంబానికి తెలిసింది.
‘‘కట్నం ఇవ్వరని చెప్పినందుకే అలా జరిగిందని మా అమ్మ నన్ను తిట్టింది. రెండు వారాలకుపైగా ఆమె నాతో మాట్లాడలేదు’’ అని గుంజన్ చెప్పారు.
గత ఆరేళ్లలో తన తండ్రి 100 నుంచి 150 కుటుంబాలను పెళ్లి కోసం సంప్రదించారని, వారిలో రెండు డజన్ల మందితో తాము నేరుగా మాట్లాడామని ఆమె చెప్పారు. అయితే వారంతా కట్నం విషయంలో తనను తిరస్కరించారని ఆమె వివరించారు.
‘‘పదేపదే అలా తిరస్కరించడంతో నాలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది’’ అని ఆమె చెప్పారు.
గణితశాస్త్రంలో మాస్టర్స్ చేసిన ఆమె ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటారు.
‘‘నాలో ఏ లోపమూ లేదని నాకు తెలుసు. కట్నం అడిగే వారిలోనే సమస్య అంతా ఉంది. కానీ, దాని వల్ల నేను మా కుటుంబానికి భారం అయిపోయినట్లుగా అనిపిస్తోంది’’ అని ఆమె చెప్పారు.
60 ఏళ్ల నుంచి వరకట్నం ఇవ్వడంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, భారత్‌లోని 90 శాతం పెళ్లిళ్లు ఇది లేకుండా ముందుకు వెళ్లడంలేదని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, GUNJAN TIWARI
ఆడ పిల్లల తల్లిదండ్రులు పెళ్లి కోసం భారీ రుణాలు తీసుకుంటుంటారు. ఒక్కోసారి వరకట్నం కోసం భూములు, ఇళ్లు కూడా అమ్ముకుంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పెళ్లి కూతురికి ప్రశాంతమైన జీవితం అనేదే దొరకదు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, 2017 నుంచి 2022 మధ్య వరకట్నం కోసం 35,493 మంది కొత్త పెళ్లికూతుర్లను చంపేశారు. అంటే రోజుకు సగటున 20 మంది హత్యకు గురయ్యారు.
భారత్‌లో స్త్రీ, పురుషుల నిష్పత్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో వరకట్నం ఒకటని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. లింగ నిర్ధరణ పరీక్షల అనంతరం, ఏటా నాలుగు లక్షల మంది ఆడ శిశువులను కడుపులోనే హత్య చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
భోపాల్ పోలీస్ చీఫ్ చారి మిశ్రాకు సమర్పించిన తన అభ్యర్థనలో- ‘‘పెళ్లిళ్లు జరిగేచోట తనిఖీలు చేపట్టడం, వరకట్నం ఇచ్చేవారిని, తీసుకొనేవారిని అరెస్టు చేయడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది" అని గుంజన్ చెప్పారు.
‘‘శిక్ష పడుతుందనే భయమే ఈ సామాజిక భూతాన్ని అంతం చేయగలదు’’ అని ఆమె అన్నారు. ఈ విషయంలో సాయం చేయాలని గత వారం ఆయనను కలిసి ఆమె అభ్యర్థన సమర్పించారు.
‘‘వరకట్నం అనేది సామాజిక భూతం లాంటిది. దాన్ని అంతం చేయడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ విషయంలో తమ దగ్గరకు వచ్చే మహిళలకు తగిన సాయం చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లకూ నేను సూచించాను’’ అని మిశ్రా బీబీసీతో చెప్పారు.
‘‘కానీ, పోలీసులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అన్నీచోట్లకూ మేం వెళ్లలేం. అందుకే ప్రజలకు అవగాహన కల్పించాలి. వారిలో మార్పుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని ఆయన అన్నారు.
పోలీసుల సాయంతో మార్పు కచ్చితంగా వస్తుందని, అయితే, ఈ సమస్య కాస్త జటిలమైనదని మహిళా హక్కుల ఉద్యమకర్త కవిత శ్రీవాస్తవ చెప్పారు.
‘‘భారత్ పోలీస్ స్టేట్ కాదు. అయితే, ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని పటిష్ఠంగా అమలుచేస్తే చాలు’’ అని ఆమె అన్నారు.
‘‘చాలాసార్లు వరకట్నం అనేది ఒకసారి ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. ఆ పెళ్లికొడుకు కుటుంబం అలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. దీని ద్వారా పెళ్లి కూతురు కుటుంబం నుంచి డబ్బులు గుంజాలని భావిస్తారు’’ అని కవిత చెప్పారు.
‘‘కొంత మంది మహిళలు ఇలా జీవితాంతం గృహ హింసను భరిస్తుంటారు. కొందరినైతే ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంటారు కూడా’’ అని ఆమె అన్నారు.
కట్నం ఇవ్వము, తీసుకోమని యువత తీర్మానించుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘జీవితం సుదీర్ఘమైనది, పైగా ఒంటరిగా గడపడం నాకు ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను’’ అని గుంజన్ చెప్పారు. కానీ, కట్నం మాత్రం ఇవ్వబోనని ఆమె అన్నారు.
ఏళ్లు గడుస్తుండటంతో వరుడి కోసం ఆమె కుటుంబం మరింత తీవ్రంగా గాలిస్తోంది.
‘‘ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో మా సొంత ఊరు ఉంది. అక్కడ అమ్మాయికి 25 ఏళ్లు వచ్చాయంటే.. వయసు చాలా ఎక్కువైందని భావిస్తారు’’ అని ఆమె చెప్పారు.
అందుకే ఆమె తండ్రి రోజూ పత్రికల్లోని పెళ్లి ప్రకటనలు చూస్తున్నారు. బంధువులను, తెలిసిన వారిని సంబంధాల కోసం అడుగుతున్నారు.
పెళ్లి సంబంధాల కోసం 2,000 మంది తమ కులానికి చెందిన సభ్యులున్న ఒక వాట్సాప్ గ్రూపులోనూ ఆయన చేరారు.
‘‘చాలా మంది ఘనంగా పెళ్లి చేయాలని అడుతున్నారు. దీని కోసం 50 లక్షల రూపాయలకుపైనే ఖర్చవుతుంది. అంత డబ్బును మా నాన్న భరించలేరు’’ అని ఆమె చెప్పారు.
కట్నం ఇస్తే తాను పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు గుంజన్ స్పష్టంగా చెప్పారు.
అయితే, ‘‘ఇప్పటికే పెళ్లి కొడుకును వెతుకుతూ ఆరేళ్లు గడిచిపోయాయి. కట్నం ఇవ్వకపోతే 60 ఏళ్లయినా సంబంధాలు దొరకవు’’ అని తన తండ్రి అన్నారని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















