ప్రొటీన్ సప్లిమెంట్స్ మేలు చేస్తాయా... కీడు చేస్తాయా?

ప్రొటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆదర్శ్ రాథోడ్
    • హోదా, బీబీసీ కోసం

ప్రొటీన్ షేక్ తాగడం వల్ల భారత సంతతికి చెందిన ఒక టీనేజర్ మృతి చెందాడనే వార్త కొత్త చర్చకు దారి తీసింది.

బ్రిటన్‌లో ఈ ఘటన జరిగింది.

దీంతో ఇప్పుడు ప్రొటీన్ సప్లిమెంట్ల లేబుళ్లపై హెచ్చరికను ముద్రించాలా, వద్దా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

లండన్‌లో నివసించే 16 ఏళ్ల రోహన్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. మూడు రోజుల అనంతరం ఆసుపత్రిలో అతను కన్నుమూశారు.

దాదాపు మూడున్నరేళ్ల సమగ్ర దర్యాప్తు తర్వాత, బరువు పెరిగేందుకు తండ్రి ఇచ్చిన ప్రొటీన్ షేక్ తాగడం వల్లే రోహన్ చనిపోయాడని దర్యాప్తుదారులు నిర్ధారించారు.

2020 ఆగస్టు 15వ తేదీన రోహన్ తీవ్ర అనారోగ్యానికి గురై, మూడు రోజుల అనంతరం చనిపోయారు.

రోహన్ కేసును శోధించిన పరిశోధకుల ప్రకారం, రోహన్‌కు ‘‘ఆర్నీథీన్ ట్రాన్స్‌కార్బమిలేజ్’’ (ఓటీసీ) అనే ఒక జన్యుపరమైన సమస్య ఉంది. దీనివల్ల ప్రొటీన్ షేక్ తీసుకున్న తర్వాత అతని శరీరంలో అమ్మోనియా స్థాయిలు విపరీతంగా పెరిగి ప్రాణాంతకంగా మారాయని చెప్పారు.

ప్రొటీన్ సప్లిమెంట్ల లేబుళ్లపై హెచ్చరికలను ముద్రించాలనేది తమ అభిప్రాయమని కోర్టులో దర్యాప్తుదారులు చెప్పారు.

‘‘ఓటీసీ లోపం అనేది సాధారణ సమస్య కాదు. కానీ, ఈ లోపం ఉన్నవారు అదనంగా ప్రొటీన్‌ను తీసుకోవడం ప్రమాదకరంగా మారొచ్చు’’ అని వారు తెలిపారు.

ఈ వార్త వచ్చాక, కేవలం బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రొటీన్ సప్లిమెంట్లపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

యువత, ముఖ్యంగా జిమ్‌లకు వెళ్లేవారిలో ఎక్కువ మంది వీటిని వాడుతుండటం వల్ల ప్రొటీన్ సప్లిమెంట్ల లేబుళ్లపై హెచ్చరికను ముద్రించాలని పేర్కొంటున్నారు.

ప్రొటీన్ షేక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రొటీన్ ఎందుకు ముఖ్యం?

ప్రొటీన్ అనేది చాలా ముఖ్యమైన పోషకం. కండరాల నిర్మాణంలో దీని పాత్ర చాలా కీలకం.

ఎముకల దృఢత్వాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. వీటితో పాటు గుండె, మెదడు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకారం, భారతీయులకు రోజుకు తమ శరీర బరువుకు అనుగుణంగా కిలోకు 0.8-1 గ్రామ్ చొప్పున ప్రొటీన్ సరిపోతుంది. తినే ఆహారంలో పావు వంతు ప్రొటీన్ ఉండాలి. శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్ ప్రామాణిక స్థాయి ఇది.

అయితే, వయస్సు, ఆరోగ్యం, శారీరక శ్రమ, వ్యాయామం చేసే స్థాయిని బట్టి ప్రతీ ఒక్కరికీ ప్రొటీన్ అవసరం వేర్వేరుగా ఉంటుంది. చాలామందికి తమ శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలియదు.

గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, పప్పుధాన్యాలు, మాంసం, సోయా వంటి ఉత్పత్తులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

సంపన్న దేశాలకు చెందిన యువత తమకు అవసరమైనంత ప్రొటీన్‌ను ఆహారం నుంచే పొందుతారు.

ఆహారం ద్వారా లభించని ప్రొటీన్ల లోపాన్ని తీర్చుకోవడానికి ప్రొటీన్ సప్లిమెంట్లను వాడతారు.

చాలా ప్రొటీన్ సప్లిమెంట్లు పౌడర్ల రూపంలో లభిస్తాయి. షేక్స్ రూపంలో ఈ ప్రొటీన్ పౌడర్లను తీసుకుంటారు.

అనేక మూల వస్తువుల నుంచి ప్రొటీన్ పౌడర్లను తయారు చేస్తారు. బంగాళదుంపలు, సోయాబీన్స్, బియ్యం, బఠానీలతో పాటు గుడ్లు, పాల నుంచి కూడా ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేస్తారు.

ప్రొటీన్ పౌడర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రొటీన్ పౌడర్

ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం ఎంత ప్రమాదకరం?

ప్రొటీన్ సప్లిమెంట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మెడికల్ కాలేజీలోని బయోకెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఎండీ, డాక్టర్ సమీర్ జంవాల్ బీబీసీతో మాట్లాడారు.

ఒకవేళ మీరు 50 కిలోల బరువు ఉంటే రోజుకు 50 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని ఆయన చెప్పారు.

ప్రొటీన్ జీర్ణం అయ్యాక ఉత్పత్తి అయిన అదనపు అమ్మోనియాను శరీరం యూరియాగా మార్చుతుందని, యూరిన్ రూపంలో ఇది బయటకు వెళ్లిపోతుందని ఆయన వివరించారు.

కానీ, చాలామందిలో అమ్మోనియాను యూరియాగా మార్చే ఎంజైమ్‌లు ఉండవని, అలాంటి వారిలో ‘‘యూరియా సైకిల్ డిజార్డర్’’ అనే రుగ్మత ఉంటుందని ఆయన చెప్పారు.

దీనివల్ల శరీరంలో అమ్మోనియా స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి, మెదడుకు హాని చేస్తాయని సమీర్ వివరించారు.

యూరియా డిజార్డర్ వేర్వేరు రకాలుగా ఉంటుందని, ఇలాంటి సమస్య ఉన్నవారు అధికంగా ప్రొటీన్ తీసుకుంటే ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

జిమ్

ఫొటో సోర్స్, Getty Images

యువతలో ప్రొటీన్ సప్లిమెంట్లపై క్రేజ్

ముఖ్యంగా బాడీ బిల్డింగ్, క్రీడా రంగంలో ఉన్న యువతలో ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకునే ట్రెండ్ బాగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.

ప్రొటీన్ సప్లిమెంట్లను ఉపయోగించే వారిలో నోయిడాలోని ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే ఉదయ్ కూడా ఒకరు. చిన్నప్పటి నుంచి ఆయన బక్కపల్చగా ఉండేవారు. బరువు గురించి ఆత్మన్యూనతకు గురయ్యేవారు. తర్వాత బరువు పెరగడం కోసం ప్రొటీన్ తీసుకోవడం మొదలుపెట్టారు. దీని తర్వాత, బరువు పెరగడమే కాదు సమస్యలు కూడా మొదలయ్యాయి.

దిల్లీలోని పుష్పాంజలి మెడికల్ సెంటర్‌కు చెందిన సీనియర్ డాక్టర్ మనీశ్ సింగ్ మాట్లాడుతూ, యువత మంచీచెడూ ఆలోచించకుండా ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకొని ఆ తర్వాత అనారోగ్యం పాలైన అనేక కేసులు తన దృష్టిలోకి వచ్చాయని చెప్పారు.

‘‘మేం ప్రొటీన్ షేక్స్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే, ఇది కొన్నిసార్లు శరీరం లోపలి కణాల ప్రక్రియను ప్రభావితం చేయడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.

యువకుల కాలేయంలో చీము నిండిపోయిన ఎన్నో కేసులను నేను చూశాను. మంచి శరీరాకృతిలో ఉన్నవారు కూడా నిమోనియా బారిన పడటం చూశాను. బాడీ బిల్డింగ్ కోసం ప్రొటీన్ షేక్ తీసుకుంటున్నట్లు తర్వాత వారు నాకు చెప్పారు.

ప్రొటీన్ షేక్

ఫొటో సోర్స్, Getty Images

చాలామంది తమకు అవసరం లేకపోయినా, మంచీ చెడూ తెలుసుకోకుండా ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెడతారు.

మీరు ఆరోగ్యంగా లేనప్పుడు బాడీ బిల్డింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? జిమ్‌కు వెళ్లే చాలామంది కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడటం మీరు కచ్చితంగా చూసే ఉంటారు. మంచి ఆరోగ్యానికి కొలమానం శరీర దారుఢ్యం కాదు. సమతుల ఆహారం తీసుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యం’’ అని ఆయన వివరించారు.

ప్రొటీన్ సప్లిమెంట్లతో ముడిపడిన మరో పెద్ద ప్రమాదం గురించి డాక్టర్ సమీర్ హెచ్చరించారు.

ఆ ప్రమాదం ఏంటంటే, ‘ప్రొటీన్ సప్లిమెంట్లలో ఉండే భారీ లోహాల మలినాలు.

‘‘సాధారణంగా జిమ్‌కు వెళ్లేవారు, పాలతో తయారయ్యే ‘‘వే ప్రొటీన్’’ తీసుకుంటారు. ఒకవేళ దాని తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల పదార్థం నుంచి ప్రొటీన్‌ను వేరు చేసేటప్పుడు సీసం, ఆర్సెనిక్, పాదరసం వంటి భారీ లోహాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ భారీ లోహాలను శరీరం బయటకు పంపించలేదు. ఫలితంగా ఇవి మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలను దెబ్బతీస్తాయి’’ అని ఆయన వివరించారు.

ప్రొటీన్ సప్లిమెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రొటీన్ సప్లిమెంట్ మార్కెట్

భారత్‌లో ప్రొటీన్, ఇతర సప్లిమెంట్లకు సంబంధించిన డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

ఐఎంఏఆర్‌సీ ప్రకారం, భారత్‌లో 2022 నాటికి డైటరీ సప్లిమెంట్లకు సంబంధించిన మార్కెట్ విలువ దాదాపు రూ. 43,600 కోట్లు కాగా, 2028 నాటికి ఇది రూ. 95, 800 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ఇందులో ప్రధాన భాగం ప్రొటీన్ సప్లిమెంట్ల మార్కెట్‌కు చెందినదే. ఇలాంటి పరిస్థితుల్లో లాభాల కోసం నకిలీ, కల్తీ ప్రొటీన్ సప్లిమెంట్ల వ్యాపారం కూడా మొదలైంది.

కల్తీ, నకిలీ ఉత్పత్తులను నివారించడం చాలా ముఖ్యమని పశ్చిమ దిల్లీలో సప్లిమెంట్లు, హెల్త్ కేర్ఉత్పత్తుల షోరూమ్‌ను నడుపుతున్న అమన్ చౌహాన్ అన్నారు.

‘‘కేవలం గుర్తింపు ఉన్న స్టోర్ల నుంచి మాత్రమే సప్లిమెంట్లను కొనాలి. ఉత్పత్తి కొనేటప్పుడు దానిపై హాల్‌మార్క్ స్టాంప్, ఇంపోర్టర్ ట్యాగ్‌, ఉత్పత్తి తయారైన తేదీ వంటి వివరాలను పరిశీలించడంతోపాటు జీఎస్టీ బిల్లును తీసుకోవాలి’’ అని ఆయన సూచించారు.

బాడీ బిల్డింగ్

ఫొటో సోర్స్, Getty Images

లేబుల్‌పై హెచ్చరికను ముద్రిస్తే చాలా?

ప్రొటీన్ సప్లిమెంట్ల లేబుళ్లపై హెచ్చరిక ఉంచాలా? వద్దా? అనే దానిపై ఇంకా యూకేలో ఒక నిర్ణయం తీసుకోలేదు.

కానీ, కేవలం ఒక హెచ్చరిక ముద్రిస్తే సరిపోతుందా?

దీనికి సంబంధించి మరో సవాలు కూడా ఉంది. అదేంటంటే, భారత్‌లో జెనెటిక్ మ్యాపింగ్ చేసే పద్ధతి లేదు. దీనివల్ల వ్యక్తికి ఏ రకమైన జన్యు రుగ్మతలు ఉన్నాయి? ఏ పదార్థాలు తింటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి అనే అవగాహన ఉండదు.

ఆ రుగ్మత కారణంగా తీవ్ర సమస్య వచ్చినప్పుడు మాత్రమే వైద్యుల వద్దకు రోగులు వస్తారు. చాలా కేసులు ఇలాంటివే ఉంటాయి.

లేబుల్‌పై కేవలం హెచ్చరిక ముద్రించడం అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

సప్లిమెంట్లను తీసుకోవడానికి బదులుగా ఆహారంపై శ్రద్ధ వహించాలని, సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)