పనస పండు: కష్టకాలంలో శ్రీలంక ప్రజల ఆకలి తీర్చుతున్న జాక్ ఫ్రూట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ (కొలంబో ), సునీత్ పెరీరా (లండన్)
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గత కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు పనస పండు (జాక్‌ఫ్రూట్) అండగా నిలుస్తోంది.
తనలాంటి లక్షలాది మందినఈ పండు బతికించిందని దినసరి కూలీ, ముగ్గురు పిల్లల తండ్రి కరుప్పయ్య కుమార్ చెప్పారు.
“జాక్‌ఫ్రూట్ మాలాంటి లక్షలాది మందిని సజీవంగా ఉంచింది. ఇది ఆకలి నుంచి మమ్మల్ని రక్షించింది.'' అని తెలిపారు.
ఒకప్పుడు పనికిరానిదిగా భావించిన ఈ పండు ఇప్పుడు గొప్ప ఆసరాగా నిలుస్తోంది.
ప్రస్తుతం ఒక కిలో పనస పండు మార్కెట్‌లో దాదాపు రూ.20 (శ్రీలంక రూపాయలు)కు అందుబాటులో ఉంది.
"ఈ ఆర్థిక సంక్షోభానికి ముందు, ఎవరైనా బియ్యం లేదా రొట్టెలు కొనుగోలు చేసేవారు. కానీ ఆహార పదార్థాలు ఖరీదైన తర్వాత, ఇప్పుడు చాలామంది ప్రతిరోజు జాక్‌ఫ్రూట్ తింటున్నారు'' అని 40 ఏళ్ల కరుప్పయ్య కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆదాయంలో 70 శాతం ఖర్చు ఆహారానికే
ప్రస్తుతం శ్రీలంకలో మూడింట ఒకవంతు మంది ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ఆదాయంలో 70 శాతానికి పైగా ఆహారం కోసం ఖర్చు చేయవలసి వస్తోంది.
“మేం ఇప్పుడు భోజనాన్ని మూడు నుంచి రెండు సార్లకు తగ్గించాం. గతేడాది వరకు 12 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 413 మాత్రమే ఉండేది'' అని ముగ్గురు పిల్లల తల్లి అయిన నదికా పెరీరా (42) అన్నారు.
కట్టెల పొయ్యిలో పొగ రావడంతో నదికా కంటి నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ.. సిలిండర్ ధర రెండింతలు పెరిగిందని తెలిపారు.
ఇపుడు వారికి సంప్రదాయ వంట పద్ధతి మాత్రమే ఆధారం. 2022లో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటి నుంచి శ్రీలంకలో ప్రజల ఆదాయం తగ్గింది, ధరలు పెరిగాయి.
గతేడాది జూలై 9న విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో చాలా నెలలుగా ఇబ్బంది పడిన ప్రజలు అప్పటి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసాన్ని ఆక్రమించారు.
దీంతో రాజపక్సే తన ఇంటిని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక బెయిలవుట్ ప్యాకేజీని పొందింది. అయితే, ఇప్పుడు శ్రీలంకలో పేదరికం మాత్రం రెట్టింపు అయింది.

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA
''ఏదో ఒకరోజు గ్యాస్ చౌకగా మారాలి''
రాజధాని కొలంబోలోని రెండు పడక గదుల ఇంట్లో నాడికా తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు.
ఒకప్పుడు ఆమె నేషనల్ క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్. కానీ, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నారు నదికా.
క్యారమ్ ఆసియాలో పాపులర్ గేమ్. ప్రస్తుతం క్యారమ్ రిఫరీగా ఆమెకు వచ్చే సంపాదన కూడా ఆగిపోయింది.
ఆమె భర్త డబ్బుల కోసం టాక్సీ నడుపుతున్నారు.
''ఆరుసార్లు ధరలు పెరిగినందున ఇకపై మాంసం, గుడ్లు కొనలేం.పిల్లలు కూడా తరచుగా పాఠశాలకు వెళ్లలేరు, ఎందుకంటే మేం వారిని బస్సులో పంపలేం, అది ఖరీదైనది'' అని నదికా తెలిపారు.
ఏదైనా ఒక రోజు గ్యాస్, విద్యుత్ చౌకగా మారాలని ఆమె ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలంకలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఫిబ్రవరిలో అక్కడ ద్రవ్యోల్బణం రేటు 54 శాతం ఉండగా, జూన్‌లో 12 శాతానికి తగ్గింది.
ఇక పెరిగిన ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.

ఫొటో సోర్స్, SUNETH PERERA
గ్రామాల్లో నివసించే వాళ్లు ఎలా ఉన్నారు?
కొలంబోకు దక్షిణంగా 160 కి.మీ దూరంలో పచ్చని రబ్బరు, తేయాకు తోటలతో నిండిన కొండల మధ్య రత్నపురా పట్టణం ఉంది.
కరుప్పయ్య కుమార్ జీవనోపాధి కోసం కొబ్బరి చెట్లు ఎక్కేవారు. చెట్టు ఎక్కినందుకు అతనికి 200 శ్రీలంక రూపాయలు లభిస్తాయి.
“ద్రవ్యోల్బణం పరిస్థితి బాగాలేదు. పిల్లల చదువులు చూసుకోవాలి. తిండికి చేతిలో తక్కువ డబ్బులే మిగిలాయి'' అని అన్నారు.
కరుప్పయ్య భార్య రబ్బరు ట్యాపింగ్ పని చేస్తారు. ఇందుకోసం రబ్బరు చెట్టుకు డ్రైన్‌లా కోత వేసి, రబ్బరు పాలను తీసేవారు. కానీ వర్షం కారణంగా కరుప్పయ్య పని ఆగిపోయింది.
‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఉంది. చెట్లు ఎక్కకుండా ఇంట్లోనే ఉండటం తట్టుకోలేకపోతున్నా'' అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA
పిల్లల్లో పోషకాహార లోపం
పాలెండా అనే గ్రామం రత్నపుర సమీపంలో ఉంది. ఇక్కడ దాదాపు 150 కుటుంబాలు నివసిస్తుండగా అందులో రైతులు, కూలీలు ఎక్కువగా ఉన్నారు.
అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల బరువును తూకం వేస్తున్నారు. వారి వివరాలు పరిశీలిస్తున్నారు.
'‘ఇక్కడి పిల్లల్లో ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. కాబట్టి మేం వారికి ఆహారం అందజేస్తున్నాం. గతంలో ప్రతివారం భోజనంలో రెండు గుడ్లు పెట్టేవాళ్లం. అయితే మళ్లీ ధరలు పెరగడంతో ఒక గుడ్డుకు తగ్గించాల్సి వచ్చింది'' అని అక్కడి ప్రిన్సిపాల్ వజీర్ జహీర్ అంటున్నారు.
పాఠశాలలో దాదాపు సగం మంది పిల్లలు తక్కువ బరువు లేదా పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NITIN SRIVASTAVA
రోగాల బారిన ప్రజలు
ఏడాదికి పైగా కొనసాగుతున్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైంది.
75 ఏళ్ల ప్రొఫెసర్ మోవా డి జోయ్సాపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా పడింది.
ఊపిరితిత్తుల వ్యాధి అయిన 'ఫైబ్రోసిస్' చికిత్స కోసం భారత్ నుంచి మందులు కొనడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఆయన 9 నెలల క్రితం చనిపోయారు.
"మోవా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ తన పుస్తకాన్ని రాస్తూనే ఉన్నారు. ఆయన పరిస్థితి అంత తేలికగా మెరుగు పడకపోవడంతో, ఇక చనిపోతాననే అనుకునేవారు" అని ప్రొఫెసర్ భార్య మాలినీ డి జోయ్సా గుర్తుచేసుకున్నారు.
"గతంలో కొన్ని నెలలైనా పరిస్థితులు బాగుంటే అంత ఒత్తిడి ఉండకపోయేది. ఆయన మరణానంతరం రుణాలు తీర్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది'' అని తెలిపారు.
కొలంబోలోని ఏకైక స్పెషలిస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి లోపల కూడా ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
ఆ ఆసుపత్రి లోపల రొమ్ము క్యాన్సర్ రోగి రమణి అశోక (48), ఆమె భర్త కూర్చోని వచ్చే నెలలో జరగాల్సిన రెండో రౌండ్ కీమోథెరపీ గురించి ఆందోళన చెందుతున్నారు.
‘‘ఇప్పటి వరకు ఆసుపత్రిలోనే ఉచితంగా మందులు ఇచ్చేవారు. ఇక్కడికి రావడానికే ఖర్చు ఎక్కువైంది. ఇప్పుడిక్కడ మెడిసిన్ స్టాక్ లేకపోవడంతో బయట షాపులో కొనాల్సి వస్తోంది'' అని రమణి అశోక అన్నారు.
మెడిసిన్ ఖరీదుగా మారడం, దాని కొరత గురించి తెలుసునని, అయితే ఈ సమస్యను వెంటనే తొలగించలేమని శ్రీలంక ఆరోగ్య మంత్రి కె రంబువేలా చెప్పారు.
ఇవి కూడా చదవండి
- క్లస్టర్ బాంబులు: వందకు పైగా దేశాలు నిషేధించిన ఈ బాంబులను అమెరికా ఎందుకు యుక్రెయిన్‌కు పంపిస్తోంది?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














