మహాత్మాగాంధీని 'జాతిపిత' అనకూడదా... ఏమిటీ వివాదం?

గాంధీజీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అశోక్ కుమార్ పాండే
    • హోదా, బీబీసీ కోసం

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, మహాత్మా గాంధీ, బాపూ, జాతిపిత.. ఈ పేర్లన్నీ గాంధీజీని సంబోధించేందుకు మనం వాడుతుంటాం.

జిన్నా, సావర్కర్, డా. బీఆర్ అంబేడ్కర్‌లు మినహా ప్రధాన నాయకులెవరూ ఆయనను ‘మిస్టర్ గాంధీ’ అని పేరుతో పిలవడం దాదాపుగా మనకు కనిపించదు.

జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌లు కూడా తమ లేఖల్లో ‘డియర్ బాపూజీ’ అని రాసేవారు.

గాంధీజీ పిల్లలతోపాటు గుజరాత్‌కు చెందిన సన్నిహితులు ఆయనను బాపూజీ అని పిలిచేవారు. దీనికి ‘తండ్రి’ అనే అర్థముంది. దీంతో కాంగ్రెస్‌లోని యువ నాయకులు కూడా ఇదే పదాన్ని ఉపయోగించేవారు.

గాంధీజీ

ఫొటో సోర్స్, Getty Images

ఆఫ్రికాలో ఉండేటప్పుడే అందరూ కస్తూర్‌ను ‘బా’ అని పిలిచేవారు. గుజరాత్‌లో ఇలాంటి పదాలను పేరు చివర కలిపేస్తుంటారు. అలానే ఆమె పేరు కస్తూర్బాగా మారింది.

చంపారణ్ ఉద్యమం తర్వాత గాంధీకి కొత్త బిరుదు వచ్చింది. అదే ‘మహాత్మా’. ఈ పేరును మొదట ఎవరు పిలిచారో చెప్పడం కొంచెం కష్టం. అయితే, రవీంద్రనాథ్ ఠాగూర్ మొదట మహాత్మా అని పిలిచారని కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. సాత్విక జీవితం, ధార్మిక చింతన, సాధారణ వస్త్రధారణలతో బిహారీలతోపాటు ఆనాడు దేశం మొత్తానికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. దీంతో సాధారణ ప్రజలు ఆయనను ‘మహాత్మ’గా పిలిచేవారు.

ఆయనను వ్యతిరేకించేవారు కూడా తమ లేఖలు, ప్రసంగాల్లో ఆయనను ‘మహాత్మాజీ’గా పిలిచేవారు. ఆయనను హత్యచేసిన నాథూరాం గాడ్సే కూడా కోర్టులో ‘జీ’ అనే పదాన్ని పేరు చివరన పలికారు.

గాంధీజీ

ఫొటో సోర్స్, Getty Images

జాతిపితపై వివాదం..

అయితే, నేడు గాంధీజీని ‘జాతిపిత’ అని పిలవడంపై వివాదం రాజుకుంటోంది. ఆయనను ‘జాతిపిత’గా పిలవడం ఎంతవరకు సమంజసం? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయనకు ఈ బిరుదును ఎవరిచ్చారు? అని కూడా అడుగుతున్నారు.

ఈ విషయంలో హాథ్‌రస్‌కు చెందిన గౌరవ్ అగర్వాల్ జనవరి 2020లో కేంద్ర సాంస్కృతిక శాఖకు ఒక సమాచార హక్కు చట్టం దరఖాస్తును పెట్టారు. దీనికి స్పందిస్తూ.. భారత ప్రభుత్వం గాంధీజీకి ఆ బిరుదు ప్రదానం చేయలేదని పేర్కొంది.

ఈ విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావాలని 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లకు ఒక న్యాయ విద్యార్థి లేఖ రాశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేది.

మరోవైపు ఈ విషయంపై అప్పట్లో కేంద్ర హోం శాఖ కూడా స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 (1) ప్రకారం సైనిక బిరుదులు మినహా ఎలాంటి బిరుదులనూ ప్రభుత్వం ఇవ్వబోదని పేర్కొంది.

మరోవైపు అనిల్ దత్తా శర్మగా పిలిచే ఓ వ్యక్తి గాంధీజీని ‘జాతిపిత’గా అధికారికంగా గుర్తించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలుచేశారు. దీనిపై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ బోడ్డేతోపాటు ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మహాత్మా గాంధీని దేశం మొత్తం గౌరవిస్తుంది. ఆయనకు మనం అధికారికంగా బిరుదు ఇవ్వాల్సిన అవసరం లేదు.’’ అని వ్యాజ్యాన్ని తిరస్కరించింది.

తాజాగా వినయ్ దామోదర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ కూడా గాంధీజీని ‘జాతిపిత’ అని ఒప్పుకొనేందుకు నిరాకరించారు. వేల ఏళ్లనాటి సంస్కృతికి ఆయనను ఎలా జాతిపితగా పిలవగలం? అని ఆయన ప్రశ్నించారు.

దీంతో అసలు ‘జాతిపిత’ అనే పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? దీని నేపథ్యం ఏమిటనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరముంది.

కస్తూర్బా

ఫొటో సోర్స్, Getty Images

జైలులో కస్తూర్బా

‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో దేశం మొత్తం అట్టుడికింది. దీంతో కాంగ్రెస్‌పై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. అంతేకాదు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరినీ జైలుకు తరలించింది. అప్పట్లో భార్య కస్తూర్బా గాంధీ, వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్ దేశాయ్‌లతోపాటు గాంధీజీని పుణెలోని ఆగా ఖాన్ ప్యాలెస్‌లో అరెస్టు చేశారు.

ఆ ప్యాలెస్‌ను ప్రస్తుతం మ్యూజియంగా మార్చారు. కానీ, అప్పట్లో అది పేరుకే ప్యాలెస్. దీనిపై చరిత్రకారుడు స్టాన్లీ వోల్పార్ట్ తన పుస్తకం ‘గాంధీస్ పాషన్’లో రాసుకొచ్చారు. ‘‘అప్పట్లో ఆ ప్యాలెస్ పక్కనే మురుగునీరు ప్రవహించేది. లోపలంతా దోమలు ఉండేవి. దీంతో దానిలో జీవించేవారిని మలేరియా ముప్పు వెంటాడుతూ ఉండేది.’’ అని పేర్కొన్నారు.

ఆ కాలంలో అత్యంత దారుణమైన జైళ్లలో అది కూడా ఒకటని వోల్పార్ట్ పేర్కొన్నారు. గాంధీ అక్కడ ఉండేటప్పుడే తనకు ఆప్తుడైన తన వ్యక్తిగత కార్యదర్శి మహేదేవ్ దేశాయ్(50)ను 1942, ఆగస్టు 15న కోల్పోయారు. దీనికి ముందుగా కస్తూర్బా గాంధీ కూడా ఇక్కడ ఉండేటప్పుడే 1942 ఫిబ్రవరి 22న మరణించారు. ఆ తర్వాత గాంధీజీ ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే ఆయన అంత్యక్రియలకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకొంది.

గాంధీజీ

ఫొటో సోర్స్, Getty Images

నేతాజీ లేఖ..

ఆ సమయంలోనే నేతాజీ.. జపాన్ నుంచి జర్మనీ చేరుకున్నారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ఆయనలోనూ స్ఫూర్తిని నింపింది. భారత స్వాతంత్ర్యం కల నెరవేర్చుకునేందు ఈ ఉద్యమం ఒక మంచి అవకాశం లాంటిదని ఆయన భావించారు.

జపాన్ సాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ భారత్‌లోకి ప్రవేశించినప్పుడు, క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయిలకు వెళ్తే బ్రిటిష్ పాలకులను ఇక్కడి నుంచి వెళ్లగొట్టడం తేలిక అవుతుందని ఆయన భావించారు.

దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను నాడు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు నేతృత్వం వహించిన రాజ్‌బిహారీ బోస్ తన జీవిత చరిత్రరాసిన తాకేశీ నాకాజిమాతో చెప్పారు. ‘‘ఒక సమయంలో రాజ్‌బిహారీ బోస్.. సావర్కర్‌ను చాలా గొప్పగా చూసేవారు. కానీ, బ్రిటిష్‌ ప్రభుత్వానికి సావర్కర్ అనుకూలంగా నడుచుకోవడంతో.. భారతీయులకు ప్రాతినిధ్యం వహించేది కాంగ్రెస్ మాత్రమేనని నిర్ణయానికి రాజ్‌బిహారీ బోస్ వచ్చారు’’ అని తాకేశీ తన పుస్తకం ‘బోస్ ఆఫ్ నకామురాయాలో రాశారు.

అయితే, ఫిబ్రవరి 22న కాస్తూర్బా మరణం తర్వాత మహాత్మా గాంధీకి సంతాపం ప్రకటిస్తూ నేతాజీ ఒక లేఖ రాశారు. లేఖ మొదట్లోనే ‘‘శ్రీమతి కస్తూర్బా గాంధీ ఇక లేరు. పుణెలో బ్రిటిష్ నిర్బంధంలో ఆమె మరణించారు. దేశం లోపల, వెలుపల భారతీయులతోపాటు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఆయన రాశారు.

ఆ లేఖలో మహదేశ్ దేశాయ్, కస్తూర్బాలను నేతాజీ గుర్తుచేసుకున్నారు. కస్తూర్బాను ‘దేశ ప్రజల తల్లి’గా ఆయన సంబోధించారు. ‘టెస్టమెంట్ ఆఫ్ సుభాష్ బోస్’ పుస్తకంలోని 69-70 పేజీల్లో ఇది మనకు కనిపిస్తుంది. ‘జాతి మాత’ అనే పదానికి ఈ పదం దగ్గరగా ఉంటుంది. అయితే, దీన్ని ఎక్కువగా ఎవరూ ఉపయోగించలేదు.

నేతాజీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘జాతిపితగా...’’

రెండున్నరేళ్ల తర్వాత మహాత్మా గాంధీకి మరోసారి నేతాజీ ఒక సందేశాన్ని పంపించారు. అప్పటివరకు ఆయన గాంధీజీ మహాత్మాజీ అని మాత్రమే పిలిచేవారు. కానీ, 1944 జులై 6నాటి సందేశంలో గాంధీజీని తొలిసారి ‘జాతిపిత’గా నేతాజీ సంబోధించారు.

ఆ సందేశాన్ని జపాన్ నుంచి ఆజాద్ హింద్ రేడియోలో ప్రసారం చేశారు. సుగతా బోస్, శిశిర్ కుమార్ బోస్‌ల ‘బ్లడ్ బాత్’ పుస్తకంలోని 24-34 పేజీల్లో ఇది మనకు కనిపిస్తోంది. మరోవైపు ‘దిల్లీ చలో’ పుస్తకంలోని 212-222, ‘ఎసెన్షియల్ రైటింగ్స్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్’ పుస్తకంలో 300-309 పేజీల్లో ఇది ఉంది.

ఆ సందేశం మొదట్లో గాంధీజీని ‘మహాత్మాజీ’అని నేతాజీ సంబోధించారు. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం సాధించడానికి జపాన్ సాయం తీసుకోవడం గురించి ఆయన మాట్లాడారు. అయితే, చివరకు వచ్చేసరికి ఈ పవిత్ర యుద్ధంలో ‘జాతిపిత’ ఆశీస్సులు కావాలని కోరారు.

ఒక ప్రముఖ నాయకుడు గాంధీని జాతిపితగా సంబోధించడం ఇదే తొలిసారి. అయితే, మొదట్లో దీన్ని ఎక్కువ మంది ఉపయోగించలేదు. నెమ్మదిగా ఆ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది.

వీడియో క్యాప్షన్, అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)