గాంధీ కెమాల్ : తుర్కియే పవర్‌ఫుల్ ప్రెసిడెంట్‌ను గద్దె దింపగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎజె గాక్సెదెఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహాత్మా గాంధీని పోలిన రూపురేఖలు, గుండ్రటి కళ్లజోడు, మీసాలు ఉన్న తుర్కియే రాజకీయ నాయకుడు 74 ఏళ్ల కెమాల్ కులిచ్దారోలు చాలా శాంతమూర్తి, మృదుస్వభావి. అందుకే ఆయన్ను 'గాంధీ కెమాల్' అని పిలుస్తారు.
తుర్కియేలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్‌ను గద్దె దించేందుకు కెమాల్ సన్నద్ధమవుతున్నారు. 20 ఏళ్ల క్రితం పదవిలోకి వచ్చిన ఎర్దోవాన్‌కు ఆ దేశంలో ఎదురులేదు. ఇప్పుడు కెమాల్ ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు.
మాజీ సివిల్ సర్వెంట్ అయిన కెమాల్ వినయ స్వభావం ఎర్దోవాన్ ఆడంబరతకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
కెమాల్ 2010లో తుర్కియేలోని రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (సీహెచ్‌పీ) నాయకత్వాన్ని చేపట్టారు. పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు ఆరు ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఎర్దోవాన్‌కు పోటీగా కెమాల్‌ను రంగంలోకి దించాయి.
కెమాల్ కులిచ్దారోలుకు అపారమైన రాజకీయానుభవం ఉంది. 2002లో ఇస్తాంబుల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే ఏడాది ఎర్దోవాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కెమాల్‌పై అనేక దాడులు జరిగాయి. తుర్కియేలో అత్యధిక దాడులు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడిగా ఆయన్ను చెప్పుకుంటారు.
నాయకుడిగా 13 ఏళ్ల కాలంలో పార్టీని విస్తరించారు. 'దేశంలో విభిన్న వర్గాలను కలుపుకోవడానికి ప్రయత్నించానని ' ఆయన చెబుతుంటారు.
ఆధునిక లౌకికవాద తుర్కియే వ్యవస్థాపకుడు కెమాల్ అతాతుర్క్ స్థాపించిన పార్టీయే సీహెచ్‌పీ. ఈ పార్టీ సైన్యానికి సన్నిహితంగా ఉండేది. తుర్కియే సైన్యం 1960 నుంచి నాలుగు సార్లు ప్రభుత్వాన్ని పడగొట్టింది.
దేశం, మతం వేరుగా ఉండాలన్నది సీహెచ్‌పీ వాదన. 1980లో సైనిక తిరుగుబాటు తరువాత, పాఠశాలలు, పబ్లిక్ సర్వీసెస్‌లో హెడ్‌స్కార్ఫ్‌ల నిషేధానికి మద్దతు ఇచ్చిందీ పార్టీ.

ఫొటో సోర్స్, NECATI SAVAS/EPA-EFE/REX/SHUTTERSTOCK
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం.. పార్టీ పగ్గాలు
కెమాల్ కులిచ్దారోలు 1948 డిసెంబర్‌లో అలెవి కుటుంబంలో జన్మించారు. అలెవి అనేది ఇస్లాంలో ఒక శాఖ. సున్నీ-మెజారిటీ తుర్కియేలో మతపరమైన మైనారిటీ వర్గం. కెమాల్‌కు ఆరుగురు తోబుట్టువులు. తండ్రి తంజెలి నగరంలో సివిల్ సర్వెంట్‌గా పనిచేశారు. తల్లి గృహిణి.
కెమాల్ చదువులో ముందుండేవారు. అంకారా యునివర్సిటీలో ఆర్థికశాస్త్రం అభ్యసించారు. తుర్కియే ఆర్థిక విభాగలలో సివిల్ సర్వెంట్‌గా అనేక సంవత్సరాలు పనిచేశారు. సోషల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్‌గా అవినీతి నిర్మూలనలో పేరు గడించారు.
ఏడేళ్లపాటు పార్లమెంట్‌లో పనిచేసిన తరువాత, తుర్కియేలోని అత్యంత ముఖ్యమైన, శక్తిమంతమైన పోస్టుల్లో ఒకటైన ఇస్తాంబుల్ మేయర్ పదవికి పోటీ చేసేందుకు ఎంపికయ్యారు.
కెమాల్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన పోరాడిన తీరు ప్రశంసలు అందుకుంది. సీహెచ్‌పీ పగ్గాలు చేపట్టేందుకు విశ్వసనీయమైన నాయకుడిగా 37 శాతం ఓట్లు అందుకున్నారు.
ఇది జరిగిన ఏడాది కాలంలోనే, అప్పటి సీహెచ్‌పీ అధ్యక్షుడి వివాహేతర సంబంధాల గురించి ఒక వీడియో లీక్ కావడంతో, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో, ఊహించని రీతిలో కెమాల్‌కు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చింది.
మొదట ఆయన అందుకు అంగీకరించలేదు. ఒక కుంభకోణం నుంచి ప్రయోజనం పొందాలనుకోలేదు. కానీ, క్రమంగా ఆయన అభిప్రాయం మారింది. పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు.
అప్పటికి ఎర్దోవాన్ కూడా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2011 ఎన్నికలలో 'జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్' లేదా 'ఏకే' పార్టీ దాదాపు సగం ఓట్లు గెలుచుకోవడంతో ఎర్దోవాన్ ప్రధానమంత్రి అయ్యారు.
ఈ ఎన్నికల్లో సీహెచ్‌పీ రెండో స్థానంలో నిలిచింది. దాని ఓట్ల శాతంలో ఐదు శాతం పెరుగుదల నమోదైంది. అప్పటి నుంచి పార్టీలోని అంతర్గత రాజకీయాలను ఎదుర్కొంటూ ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు కెమాల్ నానా తంటాలు పడుతూ వచ్చారు.

ఫొటో సోర్స్, ADEM ALTAN/AFP
పార్టీ ప్రక్షాళన
13 ఏళ్ల నాయకత్వంలో కెమాల్ పార్టీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అది కూడా చాలా ప్రశాంతంగా, ఏ హడావుడి లేకుండా చేశారు. ఇస్లామిక్ అనుకూల నాయకులతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇఫ్తార్ వంటి కార్యక్రమాలకు హాజరు అయ్యారు. పార్టీలో పాత మిలటరీ పద్ధతులను తొలగించారు.
"నేను ఆయన్ను (కెమాల్‌ను) మొదటిసారి కలిసినప్పుడు ఆయన విప్లవాలు కాకుండా మార్పులు తీసుకొచ్చే నాయకుడు అనిపించింది. ఆయన తన లక్ష్యాన్ని విడిచిపెట్టరు. నమ్మశక్యం కాని రీతిలో శాంతంగా, మృదువుగా వ్యవహరిస్తారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. తాను చేస్తున్నది సరైన పని అని భావించినప్పుడు చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు" అని పార్టీ మాజీ సభ్యురాలు మెల్డా ఓనూర్ అన్నారు.
అందుకే పార్టీ రూపురేఖలను సమూలంగా మార్చడానికి 13 ఏళ్లు పట్టిందని ఆమె అన్నారు. ఇప్పుడు సీహెచ్‌పీ దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని విధాలా సిద్ధమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
కెమాల్ మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కూడా.
"అనవసరమైన వాటిపై ఒక్క పైసా అదనంగా ఖర్చుపెట్టడానికి ఇష్టపడరు" అని కెమాల్‌కు సన్నిహితుడైన ఓకన్ కనురల్ప్ చెప్పారు.
ఇదే కాకుండా, ఇటీవల కాలంలో మత పెద్దలు, కుర్దిష్ సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలను పార్టీలో కలుపుకున్నారు. సీహెచ్‌పీ మారిందని తుర్కియే సమాజానికి తెలిపేందుకు బహుళత్వాన్ని ఆహ్వానించారు.
"సీహెచ్‌పీలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ. దాన్ని పూర్తిగా రూపుమాపలేకపోయారు. కానీ, మహిళలతో కలిసి పనిచేయడానికి మొగ్గుచూపారు" అని ఓనుర్ అన్నారు.

ఫొటో సోర్స్, ALP EREN KAYA HANDOUT/EPA-EFE/REX/SHUTTERSTOCK
'గాంధీ కెమాల్'.. అహింసావాది, శాంతమూర్తి
కెమాల్ ఎప్పుడూ గొంతు పెంచి, గట్టిగా మాట్లాడడం చూడలేదని పార్టీ సభ్యుడు ఒకరు బీబీసీకి చెప్పారు.
"ఒక్కోసారి చాలా విసుగు కలిగించే పరిస్థితులు వస్తాయి. గట్టిగా అరవడం తప్ప ఏమీ చేయలేం. అప్పుడు కూడా కెమాల్ ప్రశాంతంగానే స్పందిస్తారు" అని ఆయన చెప్పారు.
"ఎవరైనా ఆఫీసు గది లోపలికి రాగానే లేచి నిలబడి, షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరిస్తారు. కుర్చీలో కూర్చుని ఎప్పుడూ మాట్లాడరు. అవతలివారు మాట్లాడుతుంటే అడ్డుపడరు" అని ఆయన సహచరుడు చెప్పారు.
ఈ మృదుస్వభావం, అహింసా మార్గాన్ని నమ్మడం, ముఖంలో పోలికలు కూడా కలవడం వలనే కెమాల్‌ను గాంధీతో పోలుస్తారు.
అందుకే ఆయనకు 'గాంధీ కెమాల్' అన్న పేరు వచ్చింది.
2014లో పార్లమెంటులో కెమాల్ తన పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించబోతుండగా, ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి రెండుసార్లు పిడిగుద్దులు గుద్దాడు.
చెంపకి, కంటికి గాయాలయ్యాయి. అయినప్పటికీ, సభ్యులందరూ శాంతంగా ఉండాలని, "ప్రజాస్వామ్యానికి వెళ్లే దారిలో ముళ్లే ఎక్కువ ఉంటాయని" అన్నారు కెమాల్.
2016లో ఆయన కాన్వాయ్‌పై కుర్దిష్ తీవ్రవాద సంస్థ పీకేకే క్షిపణితో దాడి చేసింది. మరుసటి సంవత్సరం, ఆయనపై తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ సమూహం బాంబు దాడి చేసింది.
2019లో ఓ సైనికుడి అంత్యక్రియల సమయంలో కొందరు మూకుమ్మడిగా ఆయనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు.
పోలీసులు ఆయన్ను రక్షించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఆ సందర్భంలో, "ఇలాంటి ప్రయత్నాలు మమ్మల్ని ఆపలేవు" అని కెమాల్ అన్నారు
2016లో ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నం విఫలమైన తరువాత, కెమాల్ కులిచ్దారోలు ఖ్యాతి తుర్కియే వెలుపల కూడా వ్యాపించింది.
అధ్యక్షుడు ఎర్దోవాన్ తిరుగుబాటు ప్రయత్నంలో పాల్గొన్న వేలాది మందిని అరెస్ట్ చేయించారు. అసమ్మతిని అణచివేసే ప్రయత్నాలు చేశారు.
అప్పుడే కెమాల్ "మార్చ్ ఫర్ జస్టిస్" ర్యాలీని చేపట్టి అంకారా నుంచి ఇస్తాంబుల్ వరకు 450 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
ఈ యత్ర విజయవంతమైనప్పటికీ, మరుసటి ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి కెమాల్ మొగ్గుచూపలేదు. దాంతో, మరో అవకాశం కోసం అయిదేళ్లు వేచిచూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, ERHAN DEMIRTAS/NURPHOTO VIA GETTY IMAGES
అధ్యక్ష పదవి ఎన్నికల బరిలోకి..
సీహెచ్‌పీలో మంచి వక్తలు, ఇస్తాంబుల్, అంకారాలలో మేయర్‌గా గెలుపొందిన హై-ప్రొఫైల్ నాయకులు ఉన్నారు. అందుకే అధ్యక్ష పదవికి కెమాల్ సరైన అభ్యర్థి అని ఎవరూ భావించలేదు.
ప్రతిపక్ష పార్టీలు తన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుని, మద్దతు ఇచ్చేలా చేయడానికి కెమాల్‌కు కొన్ని నెలలు పట్టింది.
అయితే, వారందరి ప్రధాన ప్రత్యర్థి (ఎర్దోవాన్) బలహీనంగా ఉన్న సమయం ఇది. అందుకే తమ పార్టీ నాయకుడికి మంచి అవకాశం ఉందని సీహెచ్‌పీ నమ్మింది.
తుర్కియేలోని ఆరు ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కెమాల్ విజయం సాధించారు. ఈ పార్టీలను ఒకచోట చేర్చే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, కెమాల్ దీన్ని సాధించారు. వారంతా ఇప్పుడు కెమాల్‌కు మద్దతిస్తున్నారు.
"ఒక్కసారి కూడా ఆయన నోటి వెంట ద్వేషపూరితమైన పదం వినలేదు. ఆయనకు ఎవరి మీదైనా కోపం వచ్చినా శాంతంగానే ఉంటారు. వెంటనే క్షమించేస్తారు. అందుకే, గతంలో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలనే ఇప్పుడు ఏకతాటిపైకి తీసుకురాగలిగారు" అని ఓకాన్ కనరల్ప్ చెప్పారు.














