అజిత్ అగార్కర్: 2023 వరల్డ్ కప్ టీం ఎంపిక చేయనున్న ఈ చీఫ్ సెలక్టర్ 2003 ప్రపంచ కప్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేకపోయాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సంజయ్ కిశోర్
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్, బీబీసీ కోసం
ఇది 20 ఏళ్ల కిందటి విషయం. అప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ఆడిన తర్వాత జోహానస్‌బర్గ్ నుంచి భారత్‌కు తిరిగి వస్తోంది.
టీమిండియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఎయిరిండియా ప్రత్యేక జంబో విమానంలో నేను కూడా ఉన్నాను. వరల్డ్ కప్ టోర్నీని కవర్ చేసిన తర్వాత జట్టుతో కలిసే నేను బయల్దేరాను.
నాకు గుర్తున్నంత వరకు, అప్పుడు విమానంలో ఏడాది లోపు వయస్సున్న ఒక చిన్నారి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. తండ్రి అజిత్ అగార్కర్ ఆ పిల్లాడిని ఊరడించేందుకు భుజంపై ఎత్తుకొని విమానంలో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు ఏడాదిన్నర క్రితమే తన స్నేహితుడి సోదరి అయిన ఫాతిమా గడియాలీతో అజిత్ పెళ్లి జరిగింది.
అప్పుడు, అజిత్ అగార్కర్ జీవితంలో చాలా జరుగుతున్నాయి. మతాంతర వివాహం, పిల్లాడు, కెరియర్‌ను బ్యాలెన్స్ చేయాలన్న తపన ఆయనలో ఉండేది.
వీటితో పాటు ఒక విచారం కూడా ఉండేది. కానీ, దాన్ని ఆయన బయటపడనివ్వలేదు. ఇంతకీ ఆ విచారం ఏమిటంటే..

ఫొటో సోర్స్, Getty Images
45 ఏళ్ల అజిత్ అగార్కర్‌కు వివాద రహితుడు, సహనశీలి అనే పేరు ఉంది.
భారత చీఫ్ సెలెక్టర్‌గా చేతన్ శర్మ రాజీనామా తర్వాత, గత 5 నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది.
తాజాగా అజిత్ అగార్కర్‌ను ఆ పదవిలో నియమించారు.
చేతన్ శర్మ పదవీకాలం అంతా వివాదాలమయం. ఆయన మాట్లాడిన ఓ వీడియో బయటపడడంతో వివాదాలలో చిక్కుకున్నారు.
ఆ వీడియోలో ఒక్కోసారి ఆటగాళ్లు తమ గాయాలను దాచిపెడతారని చేతన్ శర్మ చెప్పారు. ఒకసారి జట్టుకు దూరమైతే తమ స్థానంలో వేరే ఆటగాళ్లు వస్తారని ఆటగాళ్లు భయపడుతుంటారని ఆయన అన్నారు. అందుకే చాలా మంది భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌గా ఉన్నట్లు కనిపించడం కోసం ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారని వెల్లడించారు.
చీఫ్ సెలెక్టర్‌గా చేతన్ శర్మ ఉన్న సమయంలోనే కెప్టెన్సీని విరాట్ కోహ్లీ వదులుకోవాల్సి వచ్చింది.
విరాట్ కోహ్లీ భారత అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ అని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా నమ్ముతారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాను అత్యుత్తమ జట్టుగా పరిగణిస్తారు.
సంప్రదాయ క్రికెట్‌కు ప్రేక్షకాదరణ దక్కడంలో కోహ్లి పాత్ర చాలా కీలకమని ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ చాపెల్ అన్నారు. ఆస్ట్రేలియాపై భారత జట్టు కనబరిచిన బలమైన ప్రదర్శన ఆటలో రెండు జట్ల మధ్య ఉన్న శత్రుత్వాన్ని గౌరవంగా మార్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజానికి కోహ్లి తన సారథ్యంలో భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడు.

ఫొటో సోర్స్, STU FORSTER/GETTY IMAGES
కోహ్లిపై వివాదం
టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీని కోల్పోయిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభివర్ణించారు.
టెస్ట్ క్రికెట్‌ను వీలైనంత ఆకర్షణీయంగా మార్చేందుకు కోహ్లి ప్రయత్నించాడు.
అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసిందని ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లంగర్ కూడా బహిరంగంగా వ్యాఖ్యానించారు.
విరాట్ కోహ్లీని చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతూనే ఉంది. ఇంతలోనే చేతన్ శర్మ సారథ్యంలో సెలక్షన్ కమిటీ చాలా వివాదాస్పద రీతిలో కోహ్లీ, కెప్టెన్సీని వదులుకునేలా చేసింది.
నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవడం గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరిగింది.
చేతన్ శర్మ తర్వాత, లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ తెరవెనుక పనిచేసే వ్యక్తి కోసం బీసీసీఐ వెతికింది.
దాంతో గత కొన్ని వారాలుగా, చీఫ్ సెలెక్టర్ పదవికి పోటీ పడుతున్న వారిలో అజిత్ అగార్కర్ పేరు కూడా వినిపించింది.
సోమవారం అశోక్ మల్హోత్రా నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీతో ఇంటర్వ్యూకు అజిత్ అగార్కర్ వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ కమిటీలో సులక్షణ నాయక్, జతిన్ పరంజపే కూడా ఉన్నారు.
ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు జట్టుకు బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్ వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అగార్కర్ జట్టులో ఎవరెవరు ఉంటారు?
అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ తరువాత టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
సెలక్షన్ కమిటీలో ఇప్పుడు అజిత్ అగార్కర్‌తో పాటు శివసుందర్ దాస్, సలిల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ ఉన్నారు.
భారత్ తరఫున 26 టెస్ట్‌లు, 191 వన్డేలు ఆడిన అగార్కర్ ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అత్యంత సీనియర్ సభ్యుడు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఎవరు అత్యంత సీనియర్ అయితే, వారే అధ్యక్షుడు అవుతారు.
అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాతి రోజే వెస్టిండీస్‌తో తలపడే భారత జట్టును ఎంపిక చేశారు.
అజిత్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ నిర్వర్తించిన మొదటి బాధ్యత ఇదే.
2023 వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేసే కీలక బాధ్యత కూడా అగార్కర్‌పై ఉంది.
2003 వరల్డ్ కప్ నుంచి 2023 వరల్డ్ కప్ వరకు చూస్తే అజిత్ అగార్కర్ ఒక కాలచక్రాన్ని పూర్తి చేసుకున్నారు.
దీన్ని అర్థం చేసుకోవడానికి, మనం మరోసారి 20 ఏళ్ల కిందటి కథకు తిరిగి వెళ్లాలి.
భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ విమానంలో తన బిడ్డను నిద్రపుచ్చుతున్న అజిత్ అగార్కర్ మనసులో ఎలాంటి విచారం ఉండి ఉంటుంది? అతను ఎలాంటి టెన్షన్, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిని అనుభవించి ఉంటాడు?
2003 ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోరంగా ఓడిపోయింది.
వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఈ టోర్నీలో సచిన్ తెందూల్కర్ అత్యధికంగా 673 పరుగులు చేయగా, కెప్టెన్ సౌరవ్ గంగూలీ 456 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్ 18 వికెట్లు, జవగల్ శ్రీనాథ్ 16, ఆశిష్ నెహ్రా 15 వికెట్లు తీశారు.

ఫొటో సోర్స్, Getty Images
2003 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం రాలేదు
2003 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టులో అజిత్ అగార్కర్, సంజయ్ బంగర్ కూడా ఉన్నారు. కానీ, వారికి ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు.
భారత్ ఫైనల్స్ వరకు చేరుకుంది. కానీ, అగార్కర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
నేను అప్పటినుంచి ఈ విచారకర పరిస్థితి గురించే మాట్లాడుతున్నా.
ఈ టోర్నీ తర్వాత కూడా అగార్కర్ జట్టులోకి రావడం, పోవడం జరుగుతూనే ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన దేని గురించి ఫిర్యాదు చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రమాకాంత్ అచ్రేకర్ శిక్షణలో
బ్యాట్స్‌మన్‌గా అగార్కర్ కెరీర్‌ను ప్రారంభించారనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. రమాకాంత్ అచ్రేకర్ దగ్గర ఆయన క్రికెట్‌లో శిక్షణ పొందారు.
ముంబయి జట్టు ఆల్ రౌండర్ కోసం వెదుకుతున్నట్లు తెలుసుకున్న అగార్కర్ బౌలింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు.
ఇంటర్-స్కూల్ గైల్స్ షీల్డ్ టోర్నమెంట్‌లో అజిత్ ట్రిపుల్ సెంచరీ చేశారు. ఆ తర్వాత అతన్ని తదుపరి తెందూల్కర్ అని పిలిచారు.
2003 ప్రపంచకప్‌కు 5 సంవత్సరాల ముందు అంటే 1998లో 20 ఏళ్ల వయసులో అజిత్ అగార్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.
అగార్కర్ వన్డే కెరీర్ ఘనంగా ప్రారంభమైంది. ఆయన కేవలం 23 మ్యాచ్‌ల్లోనే 50 వికెట్లు తీశాడు.
తర్వాత ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ చెరిపేశాడు. 19 మ్యాచ్‌ల్లోనే మెండిస్ ఈ రికార్డును అందుకున్నాడు.
భారత్ తరఫున అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.
1999-2000లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో అజిత్ వరుసగా అయిదుసార్లు డకౌట్ అయ్యాడు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఏ ఆటగాడికైనా ఇది మంచి పరిణామం కాదు.
అయితే, 2000లో రాజ్‌కోట్ వేదికగా జింబాబ్వేతో వన్డేలో 25 బంతుల్లో 67 పరుగులు బాది అగార్కర్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఆ మ్యాచ్‌లో 21 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. భారత తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పటికీ అతని పేరు మీదనే ఉంది.
వన్డే ఫార్మాట్‌లో అతని కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం 2004లో మెల్‌బోర్న్‌లో నమోదైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అజిత్ 42 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
కానీ, ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
191 వన్డేల్లో తీసిన 288 వికెట్లు ఆయన బౌలింగ్ సామర్థ్యాన్ని చూపుతాయి. అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ తర్వాత వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ అజిత్ అగార్కర్.
వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అతి తక్కువ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు, 200 వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ అతని పేరు మీదనే ఉంది.
133 మ్యాచ్‌ల్లో అగార్కర్ ఈ ఘనత సాధించాడు.

ఫొటో సోర్స్, Getty Images
లార్డ్స్‌లో సెంచరీ
క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో 109 పరుగులు చేసిన అగార్కర్ టెస్ట్ కెరీర్‌లో తన అత్యధిక స్కోరును నమోదు చేశారు.
బౌలింగ్‌లో అతని చిరస్మరణీయ ప్రదర్శన 2003లో వచ్చింది.
అడిలైడ్ టెస్టు చారిత్రాత్మక విజయంలో అగార్కర్ పాత్ర ముఖ్యమైనది.
ఆ మ్యాచ్‌లో 41 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో 22 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
అగార్కర్ 26 టెస్టుల్లో 58 వికెట్లు తీశాడు.
ఇండియా తొలి టీ20 వికెట్ అగార్కర్ తీసిందే..
2006లో భారత్ తొలి టి20 మ్యాచ్ ఆడింది. ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న అజిత్ అగార్కర్ తొలి బంతికే తొలి వికెట్ తీశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా ఆయన రికార్డ్‌కెక్కాడు.
2007లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా ఆయన సభ్యుడు.
అయితే, 30 ఏళ్లు నిండకముందే ఆయన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికారు.
జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్‌ల ముందు అగార్కర్ నిలవలేకపోయాడు. చివరిగా 2007లో భారత్ తరఫున ఆడాడు.
2014లో రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.
అగార్కర్‌కు ఆధునిక క్రికెట్, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి పూర్తిగా తెలుసు.
ప్రస్తుతం టీమిండియా మార్పు దశలో ఉంది. రాబోయే కాలంలో అజిత్ అగార్కర్ సెలెక్టర్‌గా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














