ధోనీని పొగిడితే హర్భజన్ సింగ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు... వారిద్దరికీ గతంలో ఏమైనా గొడవలున్నాయా?

ధోని, హర్భజన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హర్భజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల మధ్యలో విభేదాలున్నట్లు రిపోర్ట్‌లు

ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానంలో జరిగిన ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియా టీమ్ ముందు టీమిండియా బ్యాటర్లు కుప్పకూలారు. 209 పరుగుల తేడాతో భారత టీమ్ ఘోర పరాజయం పాలైంది.

ఈ ఓటమి భారత క్రికెట్ టీమ్‌కి అవమానకరంగా భావిస్తున్నారు. చాలా మంది కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను, కెప్టెన్ రోహిత్ శర్మను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

ఈ భావోద్వేగ సమయంలో, చాలా మంది క్రికెట్ అభిమానులు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని గుర్తుకు చేసుకుంటున్నారు.

ఆ సమయంలో భారత క్రికెట్ జట్టు ఐసీసీ టోర్నమెంట్లలో వరుస విజయాలు సాధించింది.

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యాన్ని గుర్తుకు చేసుకుంటూ ఒక అభిమాని, ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.

ఈ ఓటమి సమయంలో ఆ అభిమాని చేసిన పొగడ్త సరైంది కాదని భారత క్రికెట్ టీమ్‌లోని స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌కు అనిపించింది.

ధోని అభిమాని ట్వీట్‌కు స్పందించిన హర్భజన్ సింగ్, క్రికెట్ అనేది కలిసికట్టుగా ఆడే ఆట(టీమ్ స్పోర్ట్) అని గుర్తుకు చేశారు.

‘‘కోచ్, మెంటార్ లేకపోయినా... టీమ్‌లో అంతా కుర్రకారులే అయినా... చాలా వరకు సీనియర్ ప్లేయర్లు ఆడేందుకు నిరాకరించినా.. ఈ మ్యాచ్‌కి ముందు ఏ మ్యాచ్‌కి కెప్టెన్సీ చేసిన అనుభవం లేకపోయినా.. ఈ వ్యక్తి అత్యంత క్లిష్ట సమయంలో సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, కెప్టెన్ అయిన 48 రోజుల్లోనే టీ20 వరల్డ్ కప్‌ను భారత్ సొంతమయ్యేలా చేశారు’’ అని ధోని అభిమాని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈ ట్వీట్‌కి స్పందించిన హర్భజన్‌ సింగ్.. ‘‘అవును, ఈ మ్యాచ్‌లు ఆడినప్పుడు ఈ యంగ్ బాయ్ ఒక్కడే భారత్ కోసం ఆడారు. మిగిలిన 10 మంది ఆడలేదు. ఒంటరిగా క్రికెట్ వరల్డ్ కప్‌ ట్రోఫీలను గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా లేదా మరేదైనా దేశం వరల్డ్ కప్ లేదా ఇతర కప్‌లు గెలిచినప్పుడు.. ఆస్ట్రేలియా లేదా ఆ దేశం గెలుపొందింది అని హెడ్‌లైన్ ఇస్తారు. కానీ, భారత్ గెలిచినప్పుడు మాత్రం కెప్టెన్ గెలిచినట్టు చెబుతారు. ఇది టీమ్ స్పోర్ట్. ఇక్కడ అందరం కలిసే ఓడతాం, అందరం కలిసే గెలుపొందుతాం’’ అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.

హర్భజన్ సింగ్‌ ట్వీట్‌కి స్పందిస్తూ మరో యూజర్ ధోని కెప్టెన్సీలో, ఇతర కెప్టెన్ల నేతృత్వంలో టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలిచిందో పోస్ట్ చేశారు.

‘‘ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లలో ధోని కెప్టెన్సీలో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో మూడు గెలిచింది. ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో మొత్తంగా ఏడు ఫైనల్స్ ఆడితే, వాటిలో ఒక్కటే గెలిచింది.’’ అని చెప్పారు.

ఇతర 10 మంది ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాపై దాదా(సౌరభ్ గంగూలీ) ఎన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లను గెలుచుకున్నారు? అని మరో యూజర్ ప్రశ్నించారు.

హర్భజన్, ధోని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధోనితో మంచి స్నేహం ఉన్నట్లు చెప్పిన హర్భజన్ సింగ్

హర్భజన్, ధోనిల మధ్యలో ఏమైనా గొడవలున్నాయా?

2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు హర్భజన్ సింగ్ కూడా భారత టీమ్‌లో ఉన్నారు. ఆ సమయంలో టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.

హర్భజన్ సింగ్, ధోనికి మధ్యలో వివాదాలున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై ధోని కానీ, హర్భజన్ కానీ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు.

హర్భజన్ సింగ్ దీనిపై అంతకుముందు కూడా సంకేతాలిచ్చారు. 2021 డిసెంబర్‌లో తన 18 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ హర్భజన్ సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘400కి పైగా వికెట్లు తీసిన వ్యక్తికి జట్టులో చోటు ఇవ్వనప్పుడు లేదా ఏ కారణం లేకుండానే జట్టు నుంచి తీసేసినప్పుడు, మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. టీమ్ నుంచి నన్నెందుకు తప్పించారని చాలా మందిని అడిగాను. కానీ, వారెవరూ కూడా నాకు సమాధానమివ్వలేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పారు.

బీసీసీఐని ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు 2022 జనవరిలో హర్భజన్ సింగ్ స్పష్టతనిచ్చారు.

‘‘ధోనితో నాకెలాంటి సమస్య లేదు. చెప్పాలంటే ఇన్నేళ్లూ మేమిద్దరూ మంచి స్నేహితులం. నేను ఆ సమయంలో బీసీసీఐ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాను. నేను బీసీసీఐను ప్రభుత్వంగానే పేర్కొంటుంటాను. ఆ సమయంలోని సెలక్టర్లు నాకు న్యాయం చేయలేదు. వారు టీమంతా ఒక జట్టుగా ఉండేలా చేయలేదు’’ అని న్యూస్18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో కూడా ధోని, తాను మంచి స్నేహితులమని హర్భజన్ సింగ్ పునరుద్ఘాటించారు.

దోహాలో లెజెంట్స్ లీగ్స్ క్రికెట్ సందర్భంగా మాట్లాడిన హర్భజన్ సింగ్..

‘‘నాకెందుకు ధోనితో సమస్య ఉంటుంది. భారత్ కోసం మేము చాలా ఆడాం. మేం చాలా మంచి స్నేహితులం. ఇప్పటికీ స్నేహితులమే. ధోని ఆయన జీవితంలో బిజీగా ఉంటే, నేను నా జీవితంలో ఉన్నాను. అందుకే ఇప్పుడు మేం కలుసుకోవడం లేదు. కానీ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అని తెలిపారు.

క్రికెట్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

2007 మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్ల గురించి ధోనీపై ప్రశ్నలు

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత్ గెలిచింది.

మ్యాచ్ అయిపోయిన తర్వాత రవి శాస్త్రి చివరి రెండు ఓవర్ల గురించి ధోనీని ప్రశ్నించారు. హర్భజన్ సింగ్‌కి కాకుండా జోగిందర్ శర్మకు చివరి ఓవర్ ఎందుకు ఇచ్చావని అడిగారు.

దీనికి స్పందించిన ధోనీ, ‘‘భజ్జీ నూరు శాతం ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు నాకనిపించలేదు.

సరిగ్గా యార్కర్లు వేయలేకపోయాడు. అందుకే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో లేని వారికి బాల్ ఇచ్చేకంటే, అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణించాలని తాపత్రయపడుతున్న వారికి బౌలింగ్ ఇవ్వాలనుకున్నా. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా, నేనేమీ బాధపడను. ఎందుకంటే, జోగి వేసిన బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది’’ అని చెప్పారు.

‘అశ్విన్‌ను ఎందుకు పక్కన పెట్టారు అర్థం కావట్లే’

ఆస్ట్రేలియా విజయంపై భారత మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలుపుతూ, టీమ్ నుంచి స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన పెట్టడంపై పలు ప్రశ్నలు వేశారు.

‘‘వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో గెలిచినందుకు ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు’’ అని సచిన్ ట్వీట్ చేశారు.

స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన సచిన్, ‘‘ఈ ఇద్దరు తొలి రోజే ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపారు. భారత్ మ్యాచ్‌పై పట్టును నిలుపుకునేందుకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయాల్సి ఉండగా, అలా చేయలేకపోయింది. భారత్‌కి కూడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. కానీ, ప్రపంచంలోనే నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఎందుకు పక్కన పెట్టారో నాకు అర్థం కావడం లేదు’’ అని అన్నారు.

క్రికెట్ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లిని విమర్శించిన గాావస్కర్

ఆస్ట్రేలియా బౌలింగ్‌ను భారత్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

నాలుగో రోజు గేమ్ ముగిసే సమయానికి క్రీజులో విరాట్ కోహ్లి, అజింక్య రహానే ఉన్నారు.

ఈ ఇద్దరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ, ఐదో రోజు తొలి అర్ధగంటలోనే భారత వికెట్లు పడిపోవడం ప్రారంభమైంది.

క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన విరాట్ కోహ్లి, దూరంగా వెళ్తున్న బోలాండ్ బంతిని వెంటాడి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 49 పరుగుల వద్ద అవుటయ్యాడు.

కోహ్లి నిరాశపర్చడంతో, మాజీ క్రికెట్ కెప్టెన్ సునిల్ గావస్కర్ మరింత నిరాశ పడినట్లు కనిపిస్తోంది.

మ్యాచ్ తర్వాత కోహ్లి షాట్‌ను ఉద్దేశిస్తూ స్పందించిన గవాస్కర్, ‘‘ఇది చాలా చెత్త షాట్. సాధారణ షాట్. దీని గురించి మీరు నన్ను అడుగుతున్నారు, ఇది ఏ రకమైన షాట్‌నో కోహ్లిని అడగాల్సి ఉంది. ఇదొక షాట్‌నా? ఇది ఆఫ్‌సైడ్ స్టంప్‌కి అవతలకి వెళ్లి ఆడిన షాట్. మ్యాచ్ గెలవాలంటే సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని ఎన్నో సార్లు మేం చర్చించాం. సెంచరీ కంటే కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆఫ్ స్టంప్ అవతలకి వెళ్లి షాట్ ఆడితే, సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఎలా సాధ్యమవుతుంది?’’ అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)