Roger Binny: ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అధ్యక్షుడి గురించి మనకు ఏం తెలుసు?

రోజర్ బిన్నీ

ఫొటో సోర్స్, ThE hindu

    • రచయిత, మనోజ్ చతుర్వేది
    • హోదా, బీబీసీ కోసం

మంచి ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా మన్ననలు పొందిన రోజర్ మైకేల్ హంఫెరీ బిన్నీ ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ప్రపంచంలోనే సుసంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ వార్షిక జనరల్ సమావేశంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు సౌరవ్ గంగూలీ తర్వాత ఈ పదవిలో ఎవరు కొనసాగుతారని వారం రోజులుగా మీడియాలో చర్చ జరుగుతోంది.

2019లో బీసీసీఐ అధ్యక్ష పదవిని సౌరవ్ గంగూలీ చేపట్టారు. రెండో దఫా కూడా ఆయన ఈ పదవిలో కొనసాగొచ్చని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇదివరకు ఏ అధ్యక్షుడు రెండో దఫా పదవిలో కొనసాగిన చరిత్ర బీసీసీఐలో కనిపించదు.

ఇటీవల ఈ నిబంధనలను సుప్రీం కోర్టు సడలించింది. వరుసగా రెండుసార్లు బీసీసీఐ అఫీసు బేరర్లు తమ పదవుల్లో కొనసాగొచ్చని కోర్టు స్పష్టంచేసింది. ఈ నిబంధనల వల్ల బీసీసీఐ కార్యదర్శి జయ్ షాకు ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశముంది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు చెందిన గంగూలీని ఈ పదవి నుంచి తప్పించడంపై తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వివాదానికి కూడా తెరతీసింది. భారత జనతా పార్టీ (బీజేపీ)లో చేరకపోవడం వల్లే రెండో దఫా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఆయనకు రాలేదని తృణమూల్ ఆరోపించింది.

రోజర్ బిన్నీ

ఫొటో సోర్స్, Getty Images

1983 ప్రపంచ కప్ హీరో

1983 ప్రపంచ కప్‌లో భారత్‌కు విజయం తెచ్చిపెట్టడంలో కీలకంగా మారిన వారిలో రోజర్ బిన్నీ ఒకరు. కపిల్ దేవ్ నేతృత్వంలో అప్పటి జట్టు వరల్డ్ కప్‌కు వెళ్లింది. ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తంగా 18 వికెట్లు తీసి అప్పట్లో బిన్నీ చరిత్ర సృష్టించారు.

జూన్ 20న క్లెమ్స్‌ఫోర్డ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌గా బిన్నీ ప్రదర్శన ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుంటుంది. ఆ మ్యాచ్ గెలవడం భారత్ జట్టుకు అనివార్యం. దీనిలో మొత్తంగా జట్టు 247 రన్లు కొట్టగా.. బిన్నీ తన వంతుగా 21 రన్లు కొట్టారు.

అయితే, తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయేలా బిన్నీ కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. మొత్తంగా ఆ రోజు 129కే ఆస్ట్రేలియా కుప్పకూలింది. దీంతో 118 రన్ల భారీ తేడాతో ఆనాడు భారత్ జట్టు విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో మాత్రమే కాదు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ సిరీస్ చాంపియన్‌షిప్‌లోనూ రోజర్ బిన్నీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ సిరీస్‌లో మొతంగా ఆయన 17 వికెట్లు తీసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు.

రోజర్ బిన్నీ

ఫొటో సోర్స్, AFP

ఆల్ రౌండర్

ఆనాటి మంచి ఆల్ రౌండర్‌లలో రోజర్ బిన్నీ ఒకరు. అప్పట్లో కేవలం పేసర్లు మాత్రమే తమ బాల్‌తో మెరుపులు మెరిపించేవారు. అప్పట్లోనే మంచి స్పిన్నర్‌గా తన కంటూ బిన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తన కెరియర్‌లో ఆయన 27 టెస్టు, 72 వన్‌డే మ్యాచ్‌లు ఆడారు. అయితే, బిన్నీ లాంటి మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుండాల్సిందని చాలా వార్తలు వచ్చేవి.

బిన్నీ బౌలింగ్‌లో వేగం కాస్త తక్కువైన మాట వాస్తవమే. అయితే, స్పిన్‌తో ఆయన బ్యాటర్లకు చుక్కలు చూపించేవారు. ఆయన బౌలింగ్, బ్యాటింగ్‌ను చూస్తే, ఇంకా ఎక్కువ అవకాశం ఆయనకు ఇచ్చుండాల్సిందని ఇప్పటికీ అనిపిస్తుంది.

కీలకమైన మ్యాచ్‌లలో సయ్యద్ కిర్మానీ తడబడిన చాలాసార్లు భారత్‌ను విజయ తీరాలకు చేర్చడంలో బిన్నీ కీలకంగా మారారు.

రోజర్ బిన్నీ

ఫొటో సోర్స్, AFP

తొలి ఆంగ్లో ఇండియన్

1979 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పాకిస్తాన్‌పై మ్యాచ్‌తో టెస్టుల్లోకి బిన్నీ అరంగేట్రం చేశారు. తన సొంత రాష్ట్రమైన కర్నాటకలోనే ఆయన ఈ మ్యాచ్ ఆడటం విశేషం. మరోవైపు భారత్‌ కోసం టెస్టు మ్యాచ్‌ ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్ క్రికెటర్ కూడా ఆయనే. ఆయన పూర్వీకుల స్కాట్లండ్‌ నుంచి ఇక్కడకు వచ్చారు.

స్కూళ్లో ఉండేటప్పుడే క్రికెట్‌తోపాటు ఫుట్‌బ్యాల్, హాకీ లాంటి స్పోర్ట్స్ కూడా ఆయన ఆడేవారు. జావెలిన్ త్రోలోనూ ఆయన ప్రతిభ చూపించేవారు.

జావెలిన్‌లో పురుషుల విభాగంలో జాతీయ స్థాయిలో ఆయన ప్రతిభ కనబరిచారు. కానీ, ఆయన బౌలింగ్ కూడా అదే స్థాయిలో చేయగలరు. అందుకే ఆయన జావెలిన్ నుంచి క్రికెట్ దిశగా అడుగులు వేశారు.

వీడియో క్యాప్షన్, ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌లో తొమ్మిదవ స్థానంలో నిలిచిన అముద

సెలెక్టర్‌గా బీసీసీఐ ప్రస్థానం మొదలు

రోజర్ బిన్నీ.. సెలక్టర్‌గా బీసీసీఐలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అప్పుడే తన కొడుకు స్టువార్ట్ బిన్నీ భారత్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నాలు చేసేవారు. దీంతో ఆయన కొడుకుపై పక్షపాతం చూపించేవారని మొదట్లో వార్తలు వచ్చేవి.

స్టువార్ట్‌ను జట్టుకు ఎంపిక చేసే సమయం వచ్చేసరికి.. చర్చ మొదలు కాకముందే మీటింగ్ రూమ్‌ను వదిలి బిన్నీ బయటకు వెళ్లిపోయేవారు. అలా తను పక్షపాతం చూపించారనే వార్తలకు ఆయన సమాధానం చెప్పారు.

తన కెరియర్‌లో రోజర్ బిన్నీకి అత్యంత సన్నిహితులు ఎవరని అడిగితే, వెంటనే గుండప్ప విశ్వనాథ్ పేరు వినిపిస్తుంది. వీరి మధ్య స్నేహంపై అప్పట్లో మీడియాలో చాలా వార్తలు వచ్చేవి.

వీడియో క్యాప్షన్, ప‌రుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ‌.. ఈమె ప‌రుగు చూశారా..

సెలక్టర్‌తోపాటు బీసీసీఐలో కోచ్‌గానూ బిన్నీ సేవలు అందించారు. 2000 అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించారు. ఈ జట్టు నుంచి మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు వచ్చారు. ఆ తర్వాత కాలంలో వీరు భారత్‌ జట్టులో ఒక వెలుగు వెలిగారు.

నేరుగా మైదానంలోకి దిగి ఆడటం నుంచి పదవీ విరమణ తీసుకున్న తర్వాత కూడా క్రికెట్‌తో ఆయన తన అనుబంధాన్ని కొనసాగించారు. మొదట ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌లో ఆయన పనిచేశారు. దీనిలో భాగంగా భిన్న దేశాలను సందర్శించి అక్కడి పిల్లలకు క్రికెట్‌లో మెళకువలు నేర్పించారు.

మంచి క్రికెటర్‌ అనే పేరుతోపాటు మంచి మనిషిగానూ బిన్నీ మన్ననలు పొందారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. అవకతవకలు జరిగాయని లోథా కమిటీ ఆరోపణలు చేసిన వెంటనే, బీసీసీఐ సెలక్టర్ పదవికి అప్పట్లో ఆయన రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)