మాన్యువల్ స్కావెంజింగ్: దేశంలో ఈ పని చేసేవారే లేరన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు ఎందుకు?

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారిశుద్ధ్య కార్మికుడు
    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది ఏప్రిల్ 23న అహ్మదాబాద్‌లో మురుగు కాల్వలు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఇద్దరు కార్మికులు చనిపోయారు.

మే 12న మహారాష్ట్రలోని పర్భణీలో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న ఐదుగురు కార్మికులు విషవాయులు పీల్చి మృతి చెందారు...

దేశంలో ఇలాంటి ఘటనలు తరచూ వినిపిస్తుంటాయి.

అయితే, దేశంలో మాన్యువల్ స్కావెంజర్స్ (చేతులతో మానవ మలమూత్రాలను ఎత్తిపోసే పారిశుద్ధ్య కార్మికులు) లేరని, అలాంటి ప్రక్రియ కూడా లేదని కేంద్ర సామాజిక న్యాయశాఖ బుధవారం నిర్వహించిన సెంట్రల్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వెల్లడించింది.

ఈ మాన్యువల్ స్కావెంజింగ్‌ ప్రక్రియ ఉనికి గురించి దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో 520 జిల్లాలు మాత్రమే సమాచారం ఇచ్చాయని కూడా ఈ సమావేశం పేర్కొంది.

కేంద్రం చేస్తున్న వాదనలు హాస్యాస్పదంగా, వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఈ రంగంలో పని చేస్తున్న వారు అంటున్నారు. అసలు కేంద్రప్రభుత్వం ఈ ప్రకటన చేయడానికి ఆధారాలేంటి, మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా అమల్లో ఉందంటున్న వారి వాదన ఏంటి ?

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, static.pib.gov.in

కేంద్రం ఏం చెప్పింది?

ఇటీవల కేంద్ర సామాజిక న్యాయశాఖ ఎనిమిదో సమావేశం దిల్లీలో జరిగింది. 2013 నాటి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయి‌మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ యాక్ట్ అమలుపై సమీక్ష సందర్భంగా ఆ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ పలు వివరాలు వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో స్వచ్ఛతా అభియాన్ అనే యాప్ గురించి చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా ఇన్‌శానిటరీ లెట్రిన్స్ ( భూమిలో గుంత లేకుండా ఉండే లెట్రిన్స్), మాన్యువల్స్ స్కావెంజర్స్ డేటాను సేకరించేందుకు ఈ యాప్‌ను ప్రభుత్వం తయారు చేసింది.

ఇన్‌శానిటరీ లెట్రిన్స్‌నే డ్రై లెట్రిన్స్ అని కూడా అంటారు. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తిపోసే అవసరం ఈ లెట్రిన్ కారణంగానే ఎక్కువగా ఏర్పడుతుంది.

స్వచ్ఛతా అభియాన్ యాప్‌ను ఉపయోగించి, ఎవరైనా చేతులతో మలమూత్రాలను ఎత్తిపోస్తున్న ఘటనలను, డ్రై లెట్రిన్‌లు ఉన్నట్లు ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి పంపవచ్చు.

ఈ యాప్‌ ద్వారా తమకు ఇంత వరకు ఎలాంటి డేటా అందలేదని, దీనినిబట్టి చేతులతో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికులు గానీ, డ్రైలెట్రిన్‌ల వినియోగంగానీ లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వివరాలు ప్రకటించిన సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రామదాస్ అథవాలే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి చైర్ పర్సన్ వెంకటేశన్ కూడా పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా కేంద్రం ఇదే తరహా ప్రకటన చేయగా, పారిశుద్ధ్య కార్మిక సంఘాలు ఈ వాదనను ఖండించాయి.

‘‘యాప్‌లో డేటా సేకరించామని చెప్పడం హాస్యాస్పదం. బిహార్ లాంటి వెనకబడిన గ్రామీణ ప్రాంతాలలో యాప్‌లను ఉపయోగించి డేటాను అప్‌లోడ్ చేయగలిగేది ఎందరు’’ అని సఫాయి కర్మచారి ఆందోళన్ నేషనల్ కన్వీనర్ బెజవాడ విల్సన్ బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం దగ్గర అసలైన డేటా ఉన్నప్పటికీ, నిజాలు దాచి పెట్టేందుకు యాప్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విల్సన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం, 246 జిల్లాలు మాన్యువల్ స్కావెంజింగ్‌, డ్రైలెట్రిన్‌లు తమ ప్రాంతంలో లేవని డిక్లరేషన్ అందించలేదు. అంటే కనీసం 34% శాతం జిల్లాల్లో ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతుందని అర్ధం.

మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 2013లో చట్టం చేసింది.

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, @BezwadaWilson

కొనసాగిన మాన్యువల్ స్కావెంజింగ్

మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2013-2018 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 58,098 మంది మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నట్లు గుర్తించింది. ఈ వృత్తి నుంచి వీరు తప్పుకునేందుకు వీలుగా వీరికి రూ.40 వేల రూపాయలను తక్షణ ఆర్ధిక సహాయాన్ని అందించింది.

వీరిలో 22,294 మందికి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం, 2,313మందికి స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలను ఇప్పించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా ఎక్కడా మరణాలు లేవని గత రెండేళ్లుగా కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, 2017-2021 మధ్య కాలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో జరిగిన ప్రమాదాల కారణంగా 330 మంది మరణించారని అంతకు ముందు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది.

కానీ, ఇవన్నీ చేతులతో మలమూత్రాలను శుభ్రం చేసే ప్రక్రియకు సంబంధించిన మరణాలు కావని, మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదాలని కేంద్రం చెబుతోంది.

అయితే, ఈ మరణాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని బెజవాడ విల్సన్ అన్నారు. ప్రభుత్వం కొన్ని మరణాలను లెక్కించలేదని, ఈ తరహా ప్రమాదాలలో మొత్తం 472 మంది మరణించారని విల్సన్ గతంలో బీబీసీతో చెప్పారు. తమ దగ్గరున్న డేటా ప్రకారం 1993 నుంచి 2023 వరకు 2,470 మరణించారని బెజవాడ విల్సన్ అన్నారు.

తాజాగా ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా బెజవాడ విల్సన్ ఖండించారు.

‘‘కేంద్ర ప్రభుత్వానికి సక్రమ మార్గంలో డేటా సేకరించే యంత్రాంగం కూడా లేదు. మేం హక్కుల గురించి మాట్లాడినప్పుడల్ల తప్పుడు డేటాలతో తప్పుదోవ పట్టిస్తోంది’’ అని విల్సన్ అన్నారు.

1993 నుంచి 2003 మధ్య కాలంలో 1081 మరణాలు మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా సంభవించాయని, ఇందులో 225 మరణాలతో తమిళనాడు టాప్‌లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ తరహా మరణాలపై సుప్రీం కోర్టు కూడా ఒక సందర్భంలో తీవ్రంగా స్పందించింది.

‘‘మీరు వారికి ఎందుకు మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం లేదు. ఈ ప్రపంచంలో ఇలా మనుషులను గ్యాస్ చాంబర్లలోకి పంపే దేశం మరేదీ లేదు. సరాసరిన నెలకు నలుగురైదుగురు కార్మికులు మరణిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు 2019లో వ్యాఖ్యానించింది.

2023 బడ్జెట్ ప్రసంగలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. అన్ని నగరాలు, పట్టణాలలో 100 శాతం మెకానికల్ డి-స్లడ్జింగ్ సెప్టిక్ ట్యాంక్‌లు, మురుగు కాలువల విధానాన్ని అమలు చేస్తామని, మాన్యువల్ స్కావెంజింగ్‌కు స్వస్తి పలుకుతామని చెప్పారు.

అయితే, మంత్రి ప్రకటనపై స్పందిస్తూ “మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల్లో మమల్ని చంపడం ఎప్పుడు ఆపుతున్నారో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా చెబుతారని అనుకున్నాం. ప్రతి మూడో రోజు ఒక మరణం నమోదవుతోంది. ఈ బడ్జెట్‌లో పారిశుద్ధ్య కార్మికుల విముక్తి, పునరావాసం గురించి ఎక్కడా ప్రకటనలు లేవు’’ అని ఫ్రంట్‌లైన్ మేగజైన్‌తో బెజవాడ విల్సన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES/SUDHARAK OLWE

యాంత్రీకరణ గురించి ఎంత చెబుతున్నా...

మురుగు కాల్వల నిర్వహణలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) పేరుతో ఒక స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇందుకోసం దేశంలోని 4800 పట్టణ స్థానిక సంస్థలకు 2026 వరకు ఈ యాంత్రీకరణ కోసం రూ.349 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు కేంద్ర సామాజిక న్యాయశాఖ వెల్లడించింది.

ఈ పథకంతో పాటు సెప్టిక్ ట్యాంకుల శుభ్రపరిచే కార్మికులకు ఆరోగ్య బీమాతోపాటు, భద్రతా యంత్రాలు, శిక్షణా ఇస్తారు.

అయితే, ప్రభుత్వ పథకాలు చూడటానికి బాగున్నా, వాటి అమలులోనే అసలు సమస్య ఉందని ఈ రంగంలో నిపుణులు అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రకటనలు వెలువడినా, ఆచరణకు నోచుకోలేదని అంటున్నారు.

‘‘పారిశుద్ధ్య పనులకు సంబంధించి పూర్తిగా మెకనైజేషన్ జరిగిన మున్సిపాలిటీ దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈ విధానం అమలు కోసం కాలేజీలు, ఐఐటీలకు బాధ్యతలు అప్పగించారు. టెక్నాలజీని రూపొందించడానికి ప్రభుత్వం దగ్గర సరైన సంస్థలు కూడా లేవు’’ అని విల్సన్ విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, AFP

కులంతో సంబంధమున్న వృత్తి

ఈ వృత్తిలో ఉన్నవారు సహజంగా కిందిస్థాయి కులాల వాళ్లే ఉంటారని, వారిని అంటరానివారుగా చూసే నైజం, చంద్రుడి మీదికి వెళుతున్న నేటి కాలంలోనూ కొనసాగుతోందని ఉందని సఫాయి కర్మచారి ఆందోళన్ విమర్శిస్తోంది.

‘‘కుల హింస నుంచి విముక్తి కల్పించడానికి, గౌరవంతో జీవించడానికి రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. కానీ, ఈ హక్కును మాకు నిరంతరం నిరాకరిస్తూనే ఉన్నారు’’ అని బెజవాడ విల్సన్ ఆరోపించారు.

ఈ వృత్తిలో ఉన్న వారు తరతరాలు ఇదే పనిలో కొనసాగుతున్నారు. హిందూ సామాజిక వ్యవస్థలో వీరంతా అట్టడుగు వర్గానికి చెందిన వారు. దళిత, నిమ్న వర్గాల వారే ఈ వృత్తిలో ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది.

మానవ హక్కులు

మాన్యువల్ స్కావెంజింగ్ పనిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉంటారు. తరచూ వారి మానవ హక్కులకు భంగం కలుగుతూనే ఉంటుంది. మాన్యువల్ స్కావెంజర్ల హక్కులను రక్షించేందుకు చట్టాలు ఉన్నప్పటికీ, ఎక్కువ పనిగంటలు చేయాల్సి రావడం, తక్కువ వేతనాల వంటి వివక్షలు ఎదురవుతూ ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ప్రపంచ స్థాయి చట్టాలు, నిబంధనలు ఉన్నా, వాటి ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

మాన్యువల్ స్కావెంజింగ్

ఫొటో సోర్స్, @BezwadaWilson

పెరుగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్

2021లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ దేశంలో ప్రస్తుతం 66 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని, వారు చేతులతో మలమూత్రాలు శుభ్రం చేస్తున్నారని చెప్పింది.

2019లో నీతీఆయోగ్ ఒక నివేదిక ప్రకారం 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అడ్డుకోడానికి చట్టం తీసుకొచ్చిన సమయంలో దేశంలో 14 వేలకు పైగా పాకీ పనివారు ఉన్నారు. వారిని మాన్యువల్ స్కావెంజర్ కేటగిరీలో ఉంచారు.

వీడియో క్యాప్షన్, ఇరాన్‌లో మద్యపానంపై నిషేధం ఉన్నప్పటికీ జోరుగా మద్యం రవాణా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)