ప్రధాని మోదీ ఏడాది కిందట కాళ్లు కడిగిన పారిశుద్ధ్య మహిళలు ఈ లాక్‌డౌన్ కాలంలో ఎలా ఉన్నారు

మహిళలు
    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత సంవత్సరం ఈ నెలలోనే మోదీ ప్రభుత్వం రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించింది. అయితే కరోనా కారణంగా ప్రభుత్వం విజయోత్సవాలను జరుపుకోవడం లేదు. కానీ ప్రధాని మోదీ, ఆయన మంత్రులు మాత్రం తమ ప్రభుత్వ విజయాలను ఈనెల 16 నుంచి ట్విటర్‌ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు.

బీజేపీ ఇటీవల తమ ప్రభుత్వ విజయాలను 9 నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో రూపంలో ట్విటర్‌ ద్వారా ప్రజలకు షేర్‌ చేసింది.

మరోవైపు ఆయుష్మాన్‌ భారత్‌ విజయంపై ప్రధాని మోదీ కూడా ట్వీట్‌ చేశారు.

అయితే బీజేపీ ఈ ఒక్కసంవత్సరం విజయాలే కాకుండా, గత ఆరేళ్లుగా సాధించిన ఘనతలను ఇందులో చెప్పుకొచ్చింది.

స్వచ్ఛ్‌భారత్‌, ఉజ్వల్‌ యోజనా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతోపాటు ఆయుష్మాన్‌ యోజనకు సంబంధించిన విజయగాథలను ఇందులో వివరించింది.

అయితే కరోనా శకంలో మోదీ ప్రభుత్వ ప్రణాళికల పోస్టర్‌ ఉమన్‌ కథలను బీబీసీ మీ ముందుకు తెచ్చింది.

సంవత్సర కాలంలో ఆ మహిళల జీవితంలో ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వ విధానాలు, కరోనా ప్రభావం వారి జీవితంపై ఎలా ఉంది?

అలాగే ప్రధానితో కాళ్లు కడిగించుకున్న పారిశుధ్య కార్మికులు ఇప్పుడు ఎలా ఉన్నారు?

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనా, ఉజ్వలా యోజనా, ఆయుష్మాన్‌ యోజన మొదటి లబ్దిదారులు ఏమంటున్నారు? ఏడాదికాలంలో వారు ఏం మార్పులు చూశారు?మోదీ ప్రభుత్వపు ఏడాది ప్రయాణాన్ని ఏడు నెలల పని ఆధారంగా కొలవలేం. మార్చి నుంచి మే వరకు జరిగిన పరిణామాలు అంతకు ముందు ఏడు నెలలకన్నాముఖ్యమైనవి.

ఈ ఏడాదికాలం పాలన ఎలా ఉంది? మోదీ పోస్టర్‌ ఉమన్‌ ఏం చెబుతున్నారు ?

చౌబీ
ఫొటో క్యాప్షన్, చౌబీ

మొదటి కథనం-బందాకు చెందిన జ్యోతి, చౌబీలది

ఫిబ్రవరి 24, 2019న కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ ఐదుగురు పారిశుధ్య కార్మికుల కాళ్లను కడిగారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారి పేర్లు చౌబీ, జ్యోతి. వారి ఫోటోలు దేశమంతా టీవీలలో, పేపర్లలో కనిపించాయి. కానీ తర్వాత వారిని అంతా మర్చిపోయారు.

మీడియా హడావుడి ముగిశాక ఉత్తరప్రదేశ్‌లోని బందాలో ఉంటున్న జ్యోతిని కలుసుకుంది బీబీసీ. ఫిబ్రవరి 24 తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులేవో తెలుసుకుంది.

గడిచిన ఏడాదికాలంలో వారిద్దరి జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. చౌబీ ఇంకా బందాలోనే ఉంటోంది.

పారిశుధ్య కార్మికురాలైన చౌబీకి, గత ఏడాది అలహాబాద్‌లో కుంభమేళాలో డ్యూటీ పడింది. ప్రస్తుతం చౌబీ బందా జిల్లాలోని మంజిలా గ్రామంలో నివసిస్తున్నారు. ప్రధాని మోదీ ఆమె పాదాలను కడిగినప్పుడు ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయారు.

ఇక తన సమస్యలన్నీ తీరిపోతాయని, మంచి రోజులు వస్తాయని భావించారు చౌబీ. కానీ ఈ సంవత్సరంలో చౌబీ జీవితంలో ఏమాత్రం మార్పు కనబడలేదు. పైగా లాక్‌డౌన్‌ కారణంగా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.

దీనివల్ల ఇంతకు ముందు సంపాదించినంత డబ్బు కూడా ఆమె సంపాదించలేకపోతున్నారు.

కుంభమేళాలో ఏడాదంతా శుభ్రపరిచే పని ఉండదు కాబట్టి ఖాళీ సమయంలో ఆమె బుట్టలు అల్లి వాటిని అమ్ముకునేది.

కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు ఆ బుట్టలను కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. ఆమెకు ఇతర ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు.

లాక్‌డౌన్‌లో ప్రభుత్వం ఆమెకు ఏదైనా ఉపశమనం కలిగిస్తే ఆమె పిల్లలను పోషించుకునేవారు. పారిశుధ్య విధులు నిర్వహించడానికి చౌబీ లాక్‌డౌన్‌కు ముందే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఈ రెండు నెలలు ఆమె జీతం కూడా పొందలేదు. చౌబీతోపాటు జ్యోతికి కూడా ప్రధాని అప్పట్లో కాళ్లు కడిగారు. ఆమె కూడా బందా జిల్లాలోనే నివసిస్తుంటారు.

జ్యోతికి ప్రయాగ్రాజ్‌లో శుభ్రపరిచే డ్యూటీ పడింది. మేము జ్యోతిని కూడా సంప్రదించాము. ప్రధాని తన పాదాలను కడగడం వల్ల తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారామె.

ఆమె కథ కూడా చౌబీ కథలాగే ఉంది.

జ్యోతి

"మా జీవితం ఇంకా అలాగే ఉంది. మేము అన్ని రకాల పనులను చేస్తున్నాం. కానీ మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. మేము డబ్బులు అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు'' అని వెల్లడించారు జ్యోతి.

''పని కావాలంటే చేయండి లేదంటే మానేయండి. మీరు మానేస్తే మీకు ఉద్యోగం పర్మినెంట్ కాదు అని అంటున్నారు.

ఇంట్లో రేషన్‌ లేదు, డబ్బుల్లేవు, మేం ఏం చేయాలి'' అని వాపోయారు జ్యోతి. ప్రయాగ్‌రాజ్‌ మేళా గ్రౌండ్‌లో 12నెలలపాటు పని ఇప్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు రోజుకు రూ.318 ఇస్తున్నారు.

ఏప్రిల్‌లో తనకు ప్రభుత్వం నుంచి నూనె, రేషన్ లభించిందని జ్యోతి చెప్పారు. కానీ రేషన్‌పై గురించి నిలదీసినప్పుడు వారే తనను ఎదురు ప్రశ్నించారని జ్యోతి చెప్పారు.

''అరకిలో నూనె ఎన్ని నెలలు వస్తుంది అక్కా '' అని ప్రశ్నించారు జ్యోతి.

మే నెలలో ఆమెకు ఎలాంటి రేషన్‌ అందలేదు. మేం మే18, 2020న ఆమెతో మాట్లాడాం.జ్యోతికి జన్‌ధన్ ఖాతా లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు.

ప్రయాగ్‌రాజ్ మేళా గ్రౌండ్‌లో ఉదయం 4 గంటలు , సాయంత్రం 4 గంటలు పని చేయాలి. సుమారు 38కోట్ల మంది జన ధన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది,

అయితే జ్యోతి, చౌబీ ఇద్దరూ తమకు ఎలాంటి బ్యాంక్‌ ఎకౌంట్‌ నంబర్‌ రాలేదని వెల్లడించారు. జ్యోతి 2019 లో తొలిసారిగా కుంభంలో పారిశుధ్య పనికోసం వెళ్లారు. ఇప్పుడు మాకు తెలిసిందేంటంటే ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. పొలంలో పని చేసుకుంటారు.

గత ఏడాది బీబీసీ ఆమెను కలిసినప్పుడు ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. ఒక సంవత్సరం తరువాత కూడా ఆమె ఆశ ఇంకా చెక్కుచెదరకుండా ఉంది.

ప్రధాని మోదీని మరోసారి కలవాలని ఆమె కోరుకుంటున్నారు. తన ఉద్యోగం గురించి మాట్లాడాలన్నది ఆమె ఆశ. స్వచ్చ్‌భారత్ తమ ప్రభుత్వ అతి పెద్ద ఘనతగా మోడి ప్రభుత్వం చెప్పుకుంటోంది. 2019 ఫిబ్రవరి 24 న ప్రధాని మోదీ 'స్వచ్ఛ కుంభ్, స్వచ్ఛ ఆభారత్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐదుగురిని సత్కరించారు. ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి చరణ వందన అని పేరు పెట్టారు.

కుంభమేళాలో ఒకసారి పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్‌ నిర్వహించి రికార్డు కూడా నెలకొల్పారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సఫాయి కర్మచారీలకు రూ.21 లక్షల నిధిని కూడా ఏర్పాటు చేశారు.

మరి ప్రధాని ప్రచారంలో కనిపించిన ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ? దీనికి సజీవ ఉదాహరణే చౌబీ, జ్యోతి. ఈ ఇద్దరికీ ఎందుకు జీతం రాలేదని మేం ప్రయాగరాజ్ కుంభమేళా మైదానంలోని అధికారులను కనుక్కోలేకపోయాం.

మీనా దేవి

ఈ కథ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్దిదారు మీనాదేవిది.మీనాదేవి ఆగ్రాలోని పోయా గ్రామంలో నివసిస్తున్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లును పొందిన మొదటి వ్యక్తి ఆమె.

మీనా తన పిల్లలను పోషించడానికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను శుభ్రపరిచే పని చేసేవారు.

శీతాకాలంలో తన పిల్లలతో కలిసి బంగాళా దుంపల పొలంలో పనిచేసేవారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆమె పాఠశాలకు వెళ్ళలేకపోయారు. పొలంలో ఈ సీజన్‌లో పనిదొరకదు.

నాలుగు నెలల పాటు స్కూల్లో చేసిన పనికి డబ్బు కూడా రాలేదు.

మీనాదేవిని బీబీసీ ఫోన్‌లో సంప్రదించింది. "లాక్‌డౌన్‌లో ఇంటిని నడపడానికి ఏ పనీ దొరకలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 10-15 రోజులుగా పని దొరుకుతోంది. కానీ ఇప్పటి వరకు నా చేతికి డబ్బు రాలేదు.'' అని చెప్పారామె.

గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం మీనాదేవి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరతారు. విద్యుత్‌ ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా ఆమెకు విద్యుత్‌ కనెక్షన్‌ వచ్చింది.

కానీ కరెంటు బిల్లు రూ.15వేలు వచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో బీబీసీ రిపోర్టింగ్‌ చూశాక ఆమెకు కరెంటు కనెక్షన్‌ శాంక్షన్‌ అయ్యింది. కానీ ఇప్పుడు బిల్లు వేలల్లో వస్తోంది. ఇప్పుడామె తన బిల్లును వాయిదాల పద్దతిలో చెల్లిస్తున్నారు.

తనకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు రావడం గురించి మీనా అధికారులను సంప్రదించారు.

"ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు, ఇప్పుడేమీ చేయలేమని చెప్పారు. వాయిదాలలో నెలకు రూ.2100 కట్టమన్నారు. తమవంతు సహాయంగా బిల్లుపై వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు'' అన్నారు మీనాదేవి.

ఇప్పటికే మీనాదేవి రెండు విడతలుగా డబ్బు చెల్లించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు చెల్లించలేకపోతున్నారు.

లాక్‌డౌన్‌ ఉంది కదా...ఇంటిని ఎలా నడపుతున్నారని ప్రశ్నించగా '' లాక్‌డౌన్‌కు ముందు కొద్దిగా గోధుమలు పండాయి. వాటి ద్వారా కొంచె డబ్బు, గోధుమలు దాచుకున్నాం'' అని ఆమె వెల్లడించారు.

మీనాకు జన్‌ధన్ ఖాతా కూడా ఉంది. ఒక్కసారి రూ.500 మాత్రమే వచ్చాయి. అయితే నెలకు రూ.500 ఐదుగురికి ఎలా సరిపోతాయి?

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండుకోట్ల ఇళ్లు నిర్మించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మీనాదేవి ఇంటికి టాయిలెట్ ఉంది. గ్యాస్‌ స్టవ్‌ మీదే ఆమె వంట చేస్తారు. ఉపాధి హామీ పథకంలో ఆమె కూలీగా పని చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ ఆమె సమస్యలను పెంచింది.

జరీనా

ఉజ్వలా పథకం లబ్ధిదారు జరీనా కథ"ఏం చెబుతాం చెప్పండి. నీళ్లు తాగి బతుకుతున్నాం. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. లాక్‌డౌన్‌లో ఎవరికీ పని దొరకడం లేదు. గ్యాస్‌ ఉంది. కానీ ఏం చేసుకుంటాం?’’ అన్నారు జరీనా. ఆమె ఉజ్వలా పథకం తొలి లబ్దిదారు. జరీనా ఉత్తరప్రదేశ్‌లోని 'మౌ'లో నివసిస్తున్నారు. ఉజ్వలా పథకాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. జరీనా అప్పుడు అక్కడే ఉన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ఆమె చేతికొచ్చింది. గడిచిన ఏడాదికాలంలో తాను ఉజ్వలా పథకంలో 6 సిలిండర్లు తీసుకున్నానని ఆమె వెల్లడించారు. జరీనా కొన్నేళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద ఇల్లు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈరోజు వరకు ఆమెకు ఆ ఇల్లు రాలేదు.

అయితే టాయిలెట్ కోసం రూ.12,000 మాత్రం వచ్చాయి. అందులో రూ. 3,000లతో జరీనా తన ఇంట్లో టాయిలెట్ నిర్మించుకున్నారు.

జరీనా భర్త పెయింటింగ్ పని చేసేవారు. పని దొరకనప్పుడు బండిపై గృహవస్తువులను అమ్మేవారు. కానీ లాక్‌డౌన్‌తో 50 రోజుల నుంచి పని దొరకలేదు. ఆమె కుటుంబానికి రేషన్‌ కార్డు ఉంది. కానీ ఆమె నంబర్‌ వచ్చేసరికి పప్పులు అయిపోయాయి. ఇప్పుటికే మే నెల ముగుస్తోంది. కానీ ఇంకా నెల రేషన్‌ ఇంటికి రాలేదు.

ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ ఆ కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. ఇంట్లో నలుగురు పిల్లలు , ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. ఇల్లు ఎలా గడుస్తుంది అని అడగ్గా...జరీనా కన్నీటి పర్యంతమయ్యారు.

''రంజన్‌ మాసం కాబట్టి ఉపవాసం కారణంగా ఎలాగో నడిచిపోతోంది'' అని ఆమె వెల్లడించారు.

జరీనాకు ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పథకం గురించి తెలియదు. జన్‌ధన్‌ ఖాతా అంటే ఏంటో కూడా తెలియదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గురించి మాత్రం తెలుసుకున్నారు. ఆ పథకం ద్వారా తనకు ఇల్లు వస్తుందని ఆమె కలలుగంటున్నారు.

ప్రధానమంత్రి మోదీ ఏడాది పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు జరీనా సమాధానం చెప్పారు. ''లాక్‌డౌన్‌ ఎప్పుడు తొలగిస్తారో తెలియడం లేదు. ఇలాగే ఉంటే పేదలు ఎలా బతుకుతారు? కష్టజీవులు చచ్చిపోతారు. ఆకలి పెరుగుతోంది. లాక్‌డౌన్ తొలగించాలి. ఇంట్లో ఉప్పు రొట్టె మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఎలాగోలా నెట్టుకొస్తున్నాం. మంచినీళ్లు తాగి ఉపవాసం ఉంటున్నాం'' అన్నారు జరీనా.

ఆమె భర్త పని దొరికిన రోజుల్లో ఇంట్లోకి అన్ని వస్తువులు తెచ్చేవారు. ఇప్పుడు పనిలేదు. తినడానికి కూడా ఏమీ లేదు. అదృష్టం ఏంటంటే గ్యాస్‌ డబ్బులు ఎప్పటికప్పుడు ఖాతాలో పడుతున్నాయి. కానీ ఆమె ఇంట్లో పని చేయగలిగినవారంతా స్కిల్ ఇండియా, ముద్రా పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయారు.

ఉజ్వలా పథకాన్ని ఇప్పటి వరకు 8 కోట్లమందికి చేర్చామని, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

గుడ్డీ దేవి

ఇలా పొగను వదిలించుకున్న వారిలో గుడీదేవి కూడా ఉన్నారు. ఆమె కూడా ఉజ్వలా పథకం లబ్దిదారు. కానీ లాక్‌డౌన్‌లో ఆమె కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

కానీ కెమెరా ముందు తన కష్టాలు చెప్పుకోడానికి గుడీదేవి ఇష్టపడలేదు.

"ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల ఉపయోగం ఏమిటి" అని ఆమె ప్రశ్నించారు.

''మీరు మళ్లీ మళ్లీ ప్రశ్నలు అడుగుతారు. కానీ మా జీవితం మారదు. లాక్‌డౌన్‌ కారణంగా ఇటుక బట్టీ పనులు కూడా ఆగిపోయాయి. ఆరు నెలలు సంపాదిస్తే, ఆరు నెలలు ఇంట్లో కూర్చోవాలి. ముగ్గురు పిల్లలు ఉన్నారు, వారికి చదువుకునే సౌకర్యం లేదు. మాకు పొలం లేదు, ఇల్లు ఎలా నడిపిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు'' అన్నారామె.

గుడీదేవి భర్త తన ఇంటి దగ్గరున్న ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. కానీ ఆయన పని కూడా లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.

అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌లోనూ బట్టీ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ యజమాని మాత్రం ఇంకా పనులు మొదలు పెట్టలేదని గుడీదేవి చెప్పారు.

ఈ పరిస్థితుల్లో గుడీదేవికి ఇల్లు నడపటం కష్టమైపోయింది. ఇంట్లో ఖర్చులు, పిల్లల చదువులు భారంగా మారాయి. బీబీసీ బట్టీ యజమానిని సంప్రదించలేక పోయింది.

కరిష్మా తల్లి మౌసమవీ

ఆయుష్మాన్‌ భారత్‌ తొలి లబ్దిదారు కరిష్మా కథ

దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఆయుష్మాన్ పథకంలాంటిది మరొకటి లేదని మోదీ ప్రభుత్వం ఢంకా బజాయించి చెబుతోంది.

దీనికి ఇప్పుడు కోటిమంది లబ్దిదారులున్నారని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యపథకమని ప్రభుత్వం చెబుతోంది.

ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు అయింది. ఈ పథకం కింద, పేద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఆయుష్మాన్ భారత్‌ కార్డు ఇస్తారు.

ఈ కార్డు ఉన్నవారికి ఆసుపత్రులోల రూ.5లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలు ఉచితం.

హరియాణాలోని కర్నాల్ జిల్లాలో నివసించే కరిష్మాకు ఇప్పుడు ఏడాది మీద 10 నెలలు నిండాయి. ఆమె ఇప్పుడు నడవగలుగుతోంది. నోటితో అమ్మా, నాన్న అని అనగలుగుతుంది.

కర్నాల్‌లో కరిష్మా అంటే తెలియని వారుండరు.

'ఆయుష్మాన్ భారత్' పథకం తొలి లబ్దిదారులకు జన్మించిన మొదటి సంతానమే కరిష్మా.

2018 ఆగస్టు 15న హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న కల్పనాచావ్లా ఆసుపత్రిలో ఆమె జన్మించారు.

అప్పుడే 'ఆయుష్మాన్ భారత్ యోజన' పథకాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టబోతున్నారు. కరిష్మా తల్లిదండ్రులు ప్రసవ ఖర్చులను తగ్గించుకోడానికి కల్పన చావ్లా ఆసుపత్రిని ఎంచుకున్నారు.

ఎందుకంటే వారి మొదటి సంతానం పెద్ద ఆపరేషన్‌ ద్వారా జన్మించారు. దీంతో కుటుంబం అప్పుల్లో పడింది.

కరిష్మా పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం కలగలేదు.

తల్లిదండ్రులకు ప్రభుత్వం నుండి ఆ మాత్రం సాయం లభిస్తే వారి కుటుంబానికి చాలా సమస్యలు తీరతాయి.

ఆ కుటుంబానికి ఉపశమనం కలిగింది, కానీ ఏడాది కాలంలో ఆయుష్మాన్‌ భారత్‌ తప్ప మరే ప్రయోజనం వారికి లభించలేదు.

ప్రసవ సమయంలో ఏ విధమైన డబ్బూ ఖర్చు చేయలేదు. కానీ కుటుంబం పరిస్థితి నేడు దయనీయంగా ఉంది.

రైస్‌మిల్లులో పని చేసే కరిష్మా తండ్రికి ఇప్పుడు పనిలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కరువైంది.

ఆమె తండ్రి ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తోంది. కరిష్మా పెరిగి పెద్దదవుతోంది. చదువులు, పోషణ ఖర్చులు ఎదురు చూస్తున్నాయి.

ఇవే ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. ఇప్పుడు వారు అప్పుల మీదనే కుటుంబాన్ని నడిపిస్తున్నారు.

లాక్‌డౌన్‌ పెరిగే కొద్దీ కుటుంబం ఆకలిలో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కరిష్మా తల్లిదండ్రులు చెబుతున్నారు.

మోదీ ప్రభుత్వ పథకాల పోస్టర్ మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించాలని, వారికి ఇతర పథకాలతో కూడా లబ్ది కలిగించాలని ప్రధానమంత్రికి చాలామంది అభ్యర్ధనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)