గర్భధారణ సమయంలో గుండె ఆకారం మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆడమ్ టేలర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గర్భధారణ సమయంలో మహిళల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. ఆహార కోరికలు, ముఖం ఎర్రబడటం లేదా ఉదయాన్నే వాంతులు వంటి కొన్ని మార్పులు సాధారణమైనవి. ఈ మార్పులు చాలామందికి తెలుసు, కానీ కొన్ని మార్పులు చాలామందికి తెలియవు.
కొన్నిరోజుల క్రితం కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీకి ముందు, తరువాత తమ ముక్కు ఎలా అయిందో చూపిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ట్రెండ్‌ను ఇప్పుడు 'ప్రెగ్నెన్సీ నోస్' అంటారు. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం ఉబ్బడం, శరీర భాగాల ఆకృతి కూడా మారడం గమనించవచ్చు.
స్త్రీ శరీరం వివిధ హార్మోన్లను కలిగి ఉంటుంది. అందువల్ల గర్భిణి శరీరం వివిధ మార్పులకు గురవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో పూర్తి స్పష్టత లేదు.
అయితే, అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ప్రసవించిన ఆరు వారాల తర్వాత స్త్రీ శరీరం తిరిగి కోలుకుంటుంది.
గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈస్ట్రోజెన్ పెరగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి.
ఇది ముక్కులో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, తద్వారా ముక్కు పరిమాణం పెంచుతుంది, దాని ఆకారాన్ని కూడా మారుస్తుంది. దీంతో ముక్కు ఉబ్బినట్లు అనిపిస్తుంది.
ఈ హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీ ముక్కు కారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తస్రావం కూడా అవుతుంది. ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఒకసారి చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
గుండె ఆకారం..
గర్భధారణ సమయంలో స్త్రీ గుండె ఆకారం కూడా మారుతుంది. కడుపులో పిండం సరైన పెరుగుదలకు ఇది అవసరం.
పిండం పెరుగుదలకు అనుగుణంగా ఉదర అవయవాలు ఉబ్బుతాయి. దీని ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుంది.
ఇది గుండె చుట్టూ మందపాటి కండరాల గోడను సృష్టిస్తుంది. గుండె ఆకారాన్ని కూడా మారుస్తుంది.
గర్భధారణ సమయంలో, గుండె పని ఎక్కువుంటుంది. ఈ సమయంలో హృదయం ఇతర సమయాల్లో కంటే నిమిషానికి 8 రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఎందుకంటే పిండానికి రక్తం చేరాలి.
కొంతమంది స్త్రీలలో, కడుపులో ఉన్న బిడ్డకు తగినంత ఆక్సిజన్ అవసరం కాబట్టి శరీరంలో రక్త ప్రసరణ రెట్టింపు అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
చర్మం రంగు మారుతుందా?
గర్భధారణ సమయంలో స్త్రీ ముఖం మెరిసిపోతుందని తరచుగా చెబుతారు. కొంతమంది స్త్రీలు తేలికపాటి ఛాయతో ఉంటారు.
కానీ కొన్నిసార్లు గర్భిణీ ముఖం రంగు కూడా నల్లబడుతుంది. మెలాస్మా అనే చర్మ సంబంధిత వ్యాధి దీనికి కారణం.
ఇందులో స్త్రీల కళ్ల కింద నల్లదనం పెరిగి, ముక్కు, గడ్డం, నోటి దగ్గర భాగం నల్లగా మారుతుంది.
ఇది చాలా సాధారణ సమస్య. దాదాపు 75 శాతం మంది గర్భిణులు దీనితో బాధపడుతున్నారు. అయితే, బిడ్డ పుట్టిన తర్వాత లేదా కాన్పు తర్వాత చర్మం తిరిగి కోలుకుంటుంది.
మెలస్మాకు ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు దీనికి కారణం కావచ్చు.
స్త్రీ చనుమొనల చుట్టూ చర్మం కూడా నల్లగా ఉంటుంది. దీనికి కారణం తెలియనప్పటికీ, నవజాత శిశువుకు ఆహారం కోసం చనుమొన ఎక్కడ ఉందో త్వరగా తెలుసుకోవడానికి ఇది తేలికగా ఉంటుంది.
నవజాత శిశువులు రంగులను ఎక్కువగా గుర్తించలేరు, లేదా వారి ముఖం నుంచి 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంగా ఉన్న వాటిని చూడలేరు.
కాబట్టి పిల్లలు శరీరంలోని ఇతర భాగాల కంటే నల్లని భాగాన్ని త్వరగా గుర్తించగలరు. కానీ చాలామంది మహిళల చనుమొనలు గర్భధారణ తర్వాత కొద్దిగా నల్లగా ఉండిపోతాయి.
జుట్టు పెరుగుదలలో మార్పులు
గర్భధారణ సమయంలో చాలామంది మహిళల జుట్టు పెరుగుతుంది, మెరుస్తూ ఉంటుంది.
శరీరంలో ఈస్ట్రోజెన్ పరిమాణం పెరగడమే దీనికి కారణం. ఇది జుట్టు పెరుగుదలకు కారణమవుతుంది.
కానీ దీని దుష్ప్రభావం ఏంటంటే తలపై మాత్రమే కాకుండా, శరీరం అంతటా వెంట్రుకలు పెరగడం.
అనవసరమైన జుట్టు కూడా పెరుగుతుంది. వెనుక, పొట్ట, ముఖంపై చాలా చోట్ల జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. ప్రసవం తర్వాత ఈ వెంట్రుకలు రాలిపోతాయి.
అయితే తలపై వెంట్రుకలు కూడా రాలిపోతాయి. ప్రసవించిన నాలుగు నెలల తర్వాత స్త్రీ తల, శరీరంపై వెంట్రుకలు రాలడం ప్రారంభిస్తాయి.
కొన్ని రోజుల తర్వాత తలపై వెంట్రుకలు సాధారణ స్థితికి వస్తాయి.
దంతాలకు ప్రమాదమా?
గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. పెరిగిన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ నోటి ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం, దంత క్షయం కలిగించవచ్చు.
ఈ కాలంలో 70 శాతం గర్భిణీల దంతాలు ఉబ్బుతాయి.
గర్భధారణ సమయంలో స్త్రీ నిరంతరం వాంతులు చేసుకుంటే, దంతాల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
ఎందుకంటే వాంతుల ద్వారా బయటకు వచ్చే కడుపులోని యాసిడ్, దంతాల మీద ఉన్న పూతను కరిగిస్తుంది. ఇది దంతక్షయానికి దారి తీస్తుంది.
ఈ కాలంలో పళ్లు కొన్నిసార్లు కదులుతాయి, దీనికి కారణం రిలాక్సిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ శరీరంలోని అన్ని కండరాలు, కణాలను రిలాక్స్ చేసి ప్రసవం సులువుగా కావడానికి కారణమవుతుంది.
నడుము, యోని మార్గాల్లో కండరాల సడలింపు అవసరం అయినప్పటికీ, శరీరంలోని ఇతర భాగాలలో కండరాల సడలింపు అంత తేలిక కాదు.
గర్భధారణ సమయంలో మహిళలు దంతాలు కోల్పోవడం చాలా అరుదు. కానీ సాధారణంగా పదే పదే గర్భం దాల్చే స్త్రీలకు, నోటి ఆరోగ్యం బాగా లేకపోతే అలా జరిగే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఫిరాయింపుల నిరోధక చట్టం: ఏపీ, తెలంగాణ నేతలు అనర్హత వేటు నుంచి ఎలా తప్పించుకున్నారు
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














