తిలక్ వర్మ: ఈ హైదరాబాదీ బ్యాటర్ మిడిల్ఆర్డర్‌లో ఎందుకంత కీలకం?

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, @TilakV9

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 11న ముంబయి ఇండియన్స్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ దిల్లీ వేదికగా జరిగింది. చివరి నాలుగు ఓవర్లలో ముంబయి 40 పరుగులు చేయాలి.

సాధించాల్సిన రన్‌రేట్ 10. క్రీజులో ఉన్నది బక్కపల్చటి కుర్రాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు.

ముకేశ్ కుమార్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, ఫోర్ సాధించాడు ఆ కుర్రాడు.

మొత్తంగా ఇన్నింగ్స్‌లో 29 బంతుల్లో 41 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనే హైదరాబాద్ కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.

ఐపీఎల్‌లో సత్తా చాటిన తిలక్ వర్మ ఇప్పుడు భారత క్రికెట్ టీంకు కూడా సెలెక్ట్ అయ్యాడు.

వచ్చే నెల 3 నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో తిలక్ ఆడబోతున్నాడు.

ఎడమచేతి వాటం బ్యాటర్లు తగ్గిపోతున్న సమయంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు.

ఒక సాధారణ ఎలక్ట్రిషియన్ కుమారుడు అంతర్జాతీయ క్రికెటర్ వరకు ఎలా ఎదిగాడో ఒకసారి తెలుసుకుందాం..

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, @TilakV9

రూ.20 లక్షలకు పెడితే రూ.1.70 కోట్లు..

ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో నిలకడగా రాణించడం తిలక్ వర్మకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అదే టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు మార్గం చూపింది.

మొదటిసారి గత ఏడాది (2022)లో జరిగిన ఐపీఎల్ సీజన్ కు తిలక్ వర్మ ఎంపికయ్యాడు.

రూ.20లక్షల బేస్ ప్రైస్ (ప్రాథమిక ధర) ఉండగా రూ.1.70 కోట్లకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు పోటీ పడినా.. అధిక ధరకు తిలక్ వర్మను ముంబయి కొనుగోలు చేసింది. ముంబయి అంచనాలకు తగ్గట్టుగానే తొలి సీజన్లో తన విలక్షణ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.

14 ఇన్నింగ్స్ లలో 131.02 స్ట్రయిక్ రేటుతో 397 పరుగులు సాధించి ముంబయి తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ రాణించాడు. ముంబయి తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 164 స్ట్రయిక్ రేటుతో 343 పరుగులు చేశాడు.

గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై 33 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు.

ప్రస్తుత సీజన్లో బెంగళూరుపై 46 బంతుల్లో 84 నాటౌట్ గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి బ్యాటింగ్ ప్రతిభ కనబరిచారు.

రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయాలనే తన కలను దిల్లీలో జరిగిన మ్యాచ్ తో నెరవేర్చుకున్నాడు.

మ్యాచ్ తర్వాత బీసీసీఐ టీవీ కోసం తిలక్ వర్మను రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశారు.

ఆ సందర్భంలో రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని మరపురానిదిగా అభివర్ణించాడు తిలక్ వర్మ.

‘‘తిలక్ వర్మకు మంచి భవిష్యత్తు ఉంది. రానున్న రోజుల్లో ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు, భారత క్రికెట్ జట్టులో పెద్ద పాత్ర పోషిస్తాడు. బుమ్రా, హార్దిక్, కృణాల్ తరహాలో తిలక్ వర్మ, నేహల్ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటారు.’’ అంటూ రోహిత్ శర్మ సైతం అభినందించాడు.

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, @TilakV9

ఆంధ్ర జట్టు ప్రత్యర్థిగా తొలి మ్యాచ్

2019లో విజయనగరంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్ తో ఫస్టక్లాస్ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అందులో మొదటి ఇన్నింగ్స్ లో 5 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులు చేశాడు. అదే ఏడాదిలో హైదరాబాద్ తరఫున సౌరాష్ర్టతో లిస్ట్ ఎ మ్యాచ్, సర్వీసెస్ తో టీ20 మ్యాచ్ లను తొలిసారిగా ఆడాడు.

సురేశ్ రైనా స్ఫూర్తితో..

20 ఏళ్ల తిలక్ వర్మకు క్రికెటర్ సురేశ్ రైనా అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరి మధ్య కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి.

రైనా తరహాలోనే తిలక్ వర్మ కూడా ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేస్తాడు.

మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. కవర్ డ్రైవ్, స్ట్రయిట్ డ్రైవ్ ఆడటం ఇష్టం.

తిలక్ వర్మ తండ్రి నాగరాజు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయికి సురేశ్ రైనా అంటే ఇష్టం. అందుకే అతనిలా ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో బౌలింగ్ చేస్తుంటాడు.’’ అని చెప్పారు.

ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా దిగుతున్నాడు.

టీమిండియాలోనూ అదే స్థానంలో ఉంటే మిడిల్ ఆర్డర్ కు మంచి బలం చేకూరుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

తిలక్ వర్మ ఎంపిక విషయంపై క్రికెట్ విశ్లేషకులు సి.వెంకటేశ్ బీబీసీతో మాట్లాడారు.

‘‘సమతులంగా బ్యాటింగ్ చేస్తాడు. అతని స్ట్రయిక్ రేటు బాగుంటుంది. స్థిరత్వంతో ఆడతాడు. మూడు ఫార్మట్లలో ఆడగల నైపుణ్యం ఉందని రోహిత్ శర్మ కూడా ఇప్పటికే చెప్పాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్ గా టీమిండియాకు మంచి ఆయుధం దొరికింది. రానున్న రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆశ్చర్య పోనక్కర్లేదు’’ అని వెంకటేశ్ చెప్పారు.

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, @TilakV9

చాలా రోజుల తర్వాత తెలుగు కుర్రాడు

తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ఎంపికవుతున్న క్రికెటర్లు తక్కువగా ఉన్నారని వెంకటేశ్ అన్నారు. ప్రస్తుతం హనుమ విహారి, మహ్మద్ సిరాజ్ వంటివారే భారత జట్టుకు ఆడుతున్నారు.

ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో చాలా రోజుల తర్వాత మరో ఆటగాడు టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం అభినందనీయమని వెంకటేశ్ బీబీసీతో అన్నారు.

సాధారణ మధ్య తరగతి కుటుంబం..

తిలక్ వర్మ స్వస్థలం మేడ్చల్. సాధారణ మధ్య తరగతి కుటుంబం. అతని చిన్నప్పుడే బీహెచ్ఈఎల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. తండ్రి నాగరాజు ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తుంటారు. తిలక్ తల్లి పేరు గాయత్రి దేవి. తిలక్ వర్మ అన్న తరుణ్ వర్మ బ్యాడ్మింటన్ ప్లేయర్.

11 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించిన తిలక్ వర్మ, క్రికెట్ ఆడుతూనే చదువునూ కొనసాగించాడు. ప్రస్తుతం బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

‘‘నా ఇద్దరు కొడుకులు తరుణ్ వర్మ, తిలక్ వర్మలను మెడిసిన్ చదివించాలనుకున్నా. డాక్టర్లు చేసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయించాలని అనుకున్నా. కానీ, తరుణ్ బ్మాడ్మింటన్ వైపు వెళ్లాడు. తిలక్ క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. తను క్రికెట్ ఆడతానని చెబితే, డాక్టర్ చదివిస్తానని చెప్పా. నేను డాక్టర్‌నయితే చుట్టుపక్కల వాళ్లకే తెలుస్తుంది. అదే క్రికెట్లో రాణించి దేశానికి ఆడితే ప్రపంచానికి తెలుస్తుంది అన్నాడు. ఆ మాటతో ఏమి అనలేకపోయా’’ అని నాగరాజు బీబీసీతో చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎలక్ర్టికల్‌ వర్క్స్ అదనంగా ఒప్పుకుని డబ్బులు కూడబెట్టుకున్నట్లు నాగరాజు చెప్పారు.

‘‘దాదాపుగా ఏడాదిగా భారత్ క్రికెట్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో ఆడినప్పట్నుంచి టీమిండియాకు ఆడాలని కోరుకుంటున్నాడు. త్వరగానే అవకాశం రావడం సంతోషంగా ఉంది.’’ అని నాగరాజు చెప్పారు.

తిలక్ వర్మ

ఫొటో సోర్స్, @TilakV9

కోచ్ ప్రోత్సాహంతోనే..

11ఏళ్ల వయసులో బార్కాస్ వద్ద కోచ్ సలామ్ బయాష్ వద్ద క్రికెట్ ఆటలో శిక్షణకు వెళ్లాడు.

అప్పుడే తిలక్ వర్మలోని ప్రతిభను గుర్తించి ఆటలో బాగా నైపుణ్యాలు నేర్పించారు. ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని భావించినా కోచ్ ఆదుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు.

పాతబస్తీ నుంచి బీహెచ్ఈఎల్‌కు తీసుకెళ్లి, తీసుకురావడం వంటి బాధ్యతలను కోచ్ సలామ్ తీసుకున్నారు.

‘‘తిలక్ వర్మకు క్రికెట్ జీవితాన్ని ఇచ్చింది కోచ్ సలామ్ నే. కొన్నిసార్లు పాతబస్తీలో మా సోదరి ఇంట్లోనే తిలక్ ఉండేవాడు. సలామ్ లింగంపల్లిలోని అకాడమీకి మారినప్పుడు అతనే బైకుపై తీసుకుని తీసుకువచ్చేవారు.’’ అని నాగరాజు బీబీసీతో అన్నారు.

తిలక్ వర్మ్

ఫొటో సోర్స్, @TilakV9

సచిన్, తోటి క్రికెటర్లకు డిన్నర్ పార్టీ..

గత నెల 17న హైదరాబాద్ కు ముంబయి ఇండియన్స్ జట్టు వచ్చినప్పుడు సచిన్ తెందుల్కర్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు తిలక్ వర్మ ఇంటికి వచ్చారు. అప్పట్లో తిలక్ వర్మ ఇంట్లోనే డిన్నర్ పార్టీ ఇచ్చాడు.

సచిన్ సహా తోటి క్రికెటర్లు ఇంటికి రావడంపై ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

తిలక్ వర్మ కెరీర్లో కొన్ని గణాంకాలు..

తిలక్ వర్మ కెరీర్ గణాంకాలు పరిశీలిస్తే అతని ఆటలో నిలకడ కనిపిస్తుంది. ఐపీఎల్‌లో ముంబయి జట్టుతోపాటు అంతకు ముందు టీమిండియా అండర్-19 జట్టు, హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 40.90 యావరేజీతో 409 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 121. లిస్ట్ ఎ లో 25 మ్యాచ్ లు ఆడాడు. 56.18 సగటుతో 1236 రన్స్ చేశాడు.

అత్యధిక స్కోర్ 156 నాటౌట్. టీ20లలో 47 మ్యాచ్‌లు ఆడి, 37.31 సగటుతో 1418 రన్స్ చేశాడు. 84 అత్యధిక స్కోర్.

జట్టుకు అవసరమైనప్పుడు పార్ట్ టైమ్ బౌలర్ గానూ తిలక్ వర్మ ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 13 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)