ఐపీఎల్: శుభ్‌మన్ గిల్ భారీ సెంచరీతో ఫైనల్‌కు గుజరాత్.. అతడి ఆటపై రోహిత్ శర్మ ఏమన్నాడు?

ఫొటో సోర్స్, Getty Images
60 బంతుల్లో 129 పరుగులు
అందులో పది సిక్సర్లు, ఏడు ఫోర్లు
స్ట్రైక్ రేట్ 215
కేవలం 49 బంతుల్లోనే సెంచరీ
32 బంతుల్లో హాఫ్ సెంచరీ, తర్వాత 17 బంతుల్లో మరో 50 పరుగులు
- ఐపీఎల్‌లో ఫైనల్ చేరడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పే నంబర్లు ఇవి!
గిల్ భారీ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది. 62 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్లో అడుగు పెట్టింది.
ఐపీఎల్ 2023లో గిల్‌కు ఇది మూడో సెంచరీ. ఈ మూడు సెంచరీలు కూడా గత నాలుగు మ్యాచుల్లో కొట్టినవే.
ఇది గిల్ అసాధారణ ఫామ్‌నే కాకుండా టోర్నీ కీలక దశలో అతడి బ్యాటింగ్‌లో నిలకడను కూడా సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
క్వాలిఫయర్ 2 శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది.
శుభ్‌మన్ గిల్ 129 పరుగులు చేయడంతో గుజరాత్ 234 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవమున్న ముంబయి జట్టు ఈసారి తడబడింది. గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ కేవలం పదే పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ తర్వాత ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ- శుభ్‌మన్ చాలా బాగా ఆడాడని ప్రశంసించాడు. అతడు తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నానని నవ్వుతూ చెప్పాడు.
“గిల్ గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్నాడు. గుజరాత్ జట్టులో మాదిరి మా జట్టులో కూడా ఒక బ్యాటర్ చివరి వరకు ఆడాలని కోరుకున్నాం. కానీ అలా జరగలేదు” అని రోహిత్ అన్నాడు.
భారీ లక్ష్యంతో ఛేజింగ్ మొదలుపెట్టిన ముంబయి ఇండియన్స్, మొహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లోనే నేహల్ వదేరా వికెట్ కోల్పోయింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన వధేరా కేవలం నాలుగే పరుగులు చేసి, ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండానే వెనుదిరిగాడు.
ఆ తర్వాత మూడో ఓవర్లోనే, ముంబయి గంపెడాశలు పెట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరాడు.
సూర్యకుమార్ యాదవ్(61), తిలక్ వర్మ(43), కామెరాన్ గ్రీన్(30) ప్రతిఘటించినప్పటికీ ముంబయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
ఇంకా బది పంతులు ఉండగానే 18.2 ఓవర్లలో 171 పరుగులకే ముంబయిని గుజరాత్ చుట్టేసింది.
డిఫెండింగ్ చాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్, ట్రోఫీ కోసం ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరుగనుంది.
క్వాలిఫయర్1 ఆడిన జట్లే ఫైనల్లోనూ తలపడుతుండటం మరో ఆసక్తికర అంశం.

ఫొటో సోర్స్, Getty Images
గిల్ ధాటికి చేతులెత్తేసిన ముంబయి బౌలర్లు
గుజరాత్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే శుభ్‌మన్ పరుగుల వరద మొదలైంది.
''ఇలాంటి ఇన్నింగ్స్‌ను అరుదుగా చూడగలం'' అని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు.
మ్యాచ్ రెండో ఓవర్‌లో తొమ్మిది పరుగులు చేసిన గిల్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
తర్వాత గిల్ ధాటికి ముంబయి బౌలర్లు చేతులెత్తేశారు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో బౌలింగ్‌తో సత్తా చాటి ముంబయిని గెలిపించిన ఆకాశ్ మధ్వాల్ గిల్ బ్యాటింగ్ ముందు తేలిపోయాడు.
ఆ తర్వాత కామెరాన్ గ్రీన్‌కు రోహిత్ శర్మ బాల్ అందించినా ఫలితం లేకపోయింది. గిల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు.
తొలి 32 బంతుల్లో అర్ధ శతకం చేసిన గిల్, ఆ తర్వాత 17 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరిన్ని సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అయితే ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లోనే గిల్ ఔట్ అయినప్పటికీ, అప్పటికే ముంబయికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
గుజరాత్ ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడి 28 పరుగులు జోడించాడు.
జోర్డాన్ బౌలింగ్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ పట్టుకోలేకపోయాడు. ఇది ఆరో ఓవర్లో జరిగింది. ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చిసిందని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
- వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్తో ముడిపెట్టారా?
- ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి














