మెదడుకు 6 అద్భుతమైన ఆహారాలు

కుంకుమ పువ్వు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సెసిలియా బరియా
    • హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్

జ్ఞాపకశక్తికి పదునుపెట్టే, మెదడు సమర్థంగా పనిచేసేలా సహాయపడే, మానసిక పరిస్థితిని మెరుగుపరిచే ఆహారాలు ఉన్నాయి.

ఆహారనాళం-మెదడు ఏవిధంగా అనుసంధానమై ఉంటాయో అలాగే మానసిక స్థితి-డైట్ కూడా లింక్ అయి ఉంటుందని అమెరికాలోని హర్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన న్యూట్రీషనల్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ ఉమా నాయుడు చెప్పారు.

మెదడు, పేగులు ఒకే ఎంబ్రియానిక్ కణాల నుంచి తయారయ్యాయని, మానవ శరీరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ రెండూ అనుసంధానమయ్యే ఉన్నాయనే జీవ సంబంధిత దృగ్విషయాన్ని దీనికి రుజువుగా చూపిస్తున్నారు.

మెదడు, పేగుల మధ్య సమాచారమార్పిడి రసాయన చర్యల ద్వారా జరుగుతుంది.

నిజానికి 90-95 శాతం సెరోటోనిన్ పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు శరీరంలో ఇతర అనేక పనులు సెరొటోనిన్ నియత్రణలో ఉంటాయి.

ఒకవేళ ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే, పేగుల్లో మంటగా ఉండటం లేదా ఇతర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇది ఆంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి దారి తీస్తుంది.

ఉమ నాయుడు

ఫొటో సోర్స్, UMA NAIDOO

ఆహారానికి, మానసిక స్థితికి ప్రత్యక్ష సంబంధం ఉండటం మూలానా మీరు ఆహారంపై ఎంత ఎక్కువ శ్రద్ధ చూపితే మీ మానసిక స్థితి అంత చక్కగా ఉంటుందని బీబీసీతో ఉమా నాయుడు అన్నారు.

మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలో న్యూట్రీషియన్, లైఫ్ స్టయిల్ సైకియాట్రీ డైరెక్టర్‌గా ఉన్న ఉమా నాయుడు తనకు ఆహారం అంటే ఎంతో ఇష్టమని, వంట చేయడం కూడా నచ్చుతుందని చెప్పారు.

వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె తనకు నచ్చిన అంశాలపై శాస్త్రీయ వైఖరిని ప్రదర్శిస్తారు.

పోషకాహారం విషయంలో తగినంత శిక్షణ లేదని మెడిసిన్ చదువుతున్నప్పుడే ఆమె గ్రహించారు.

సైకియాట్రిలో నిపుణురాలిగా మారిన తర్వాత, ఆహారానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందనే విషయం ఆమెకు స్పష్టమైంది.

‘‘ఇది అభివృద్ధి చెందుతున్న రంగం. దీని విస్తరణ మొదలైంది’’ అని ఆమె అన్నారు.

మెదడును యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ‘బి’ ప్రయోజనాల గురించి మరీ ముఖ్యంగా బి-12, బి-9, బి-1 విటమిన్ల గురించి గతంలో బీబీసీతో ఆమె మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మానసిక స్థితితో పాటు మెదడు శక్తిని బలోపేతం చేసే ఆహారాల గురించి ప్రస్తావించారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పసుపు

ఫొటో సోర్స్, Getty Images

1. సుగంధ ద్రవ్యాలు

సుగంధ ద్రవ్యాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపు వంటి వాటిలో ఆంగ్జైటీని తగ్గించే లక్షణాలు ఉంటాయి.

పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మెదడు కెమిస్ట్రీని మార్చడం ద్వారా ఆంగ్జైటీని తగ్గిస్తుంది.

సైకియాట్రిస్టులు ఎక్కువగా పేర్కొనే మరో సుగంధ ద్రవ్యం ఏంటంటే కుంకుమ పువ్వు. కుంగుబాటుకు సంబంధించిన ప్రధాన సమస్యలపై మెరుగ్గా పనిచేసే లక్షణాలు కుంకుమ పువ్వులో ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని ఉమ వివరించారు.

కుంగుబాటుతో బాధపడుతున్న రోగులు కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా ఆ రుగ్మత లక్షణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

పెరుగు

ఫొటో సోర్స్, Getty Images

2. పులియబెట్టిన ఆహారాలు

పులియబెట్టిన ఆహారాల్లో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. ఈస్ట్ వంటి సూక్ష్మజీవిసంబంధిత ఆహారాలను పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలతో కలిపి ఈ వెరైటీలను తయారు చేస్తారు.

పెరుగు దీనికి మంచి ఉదాహరణ. పెరుగుతో పాటు సార్‌క్రట్, కిమ్చీ, కొంబుచా వంటివి కూడా ఈ కేటగిరీకి చెందినవే.

ఈ ఆహారాలు అన్నింటిలో ఉమ్మడిగా ఉన్న వనరు ఏంటంటే బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఆంగ్జైటీని తగ్గిస్తుంది.

పులియబెట్టిన ఆహారాల వల్ల మెదడుకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

పులియబెట్టిన ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని, కాగ్నిటీవ్ క్షీణత రేటును తగ్గిస్తాయని 2016 నాటి 45 అధ్యయనాలపై చేసిన ఒక విశ్లేషణ తేల్చింది.

ప్రొబయాటిక్ పుష్కలంగా ఉండే పెరుగు కూడా చాలా శక్తిమంతమైన ఆహారమని ఉమ తెలిపారు.

నట్స్

ఫొటో సోర్స్, Getty Images

3. వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మన జ్ఞాపకశక్తి, ఆలోచనను మెరుగుపరచడంలో గొప్ప పనితీరును కనబర్చుతాయి.

మరోవైపు, నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెలు ఉంటాయి. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. వీటితో పాటు అవసరమైన విటమిన్లు, మినరళ్లు లభిస్తాయి.

సలాడ్, కూరగాయలతో పాటు రోజుకు పావు కప్పు చొప్పున నట్స్‌ను తినాలని ఉమ సిఫార్సు చేశారు.

డార్క్ చాక్లెట్

ఫొటో సోర్స్, Getty Images

4. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ అనేది ఐరన్ మూలకానికి అద్భుతమైన వనరు. ఈ మూలకం న్యూరాన్లను రక్షించే పూత ఏర్పడటంతో పాటు, మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

2019లో 13 వేల మంది వ్యక్తులపై ఒక సర్వేను నిర్వహించారు. డార్క్ చాక్లెట్‌ను తరచుగా తినే వారిలో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం 70 శాతం తక్కువగా ఉన్నట్లు ఆ సర్వేలో కనుగొన్నారు.

డార్క్ చాక్లెట్‌లో కూడా చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది అత్యధిక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అవకాడో

ఫొటో సోర్స్, Getty Images

5. అవకాడో

మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యమైన మెగ్నీషియం మూలకం అధిక మొత్తంలో ఉండే అవకాడోలు మరో ప్రధాన ఆహార వనరు.

డిప్రెషన్ అనేది మెగ్నీషియం లోపం వల్ల తలెత్తుతుందని సూచించే విశ్లేషణలు లెక్కలేనన్ని ఉన్నాయి.

డిప్రెషన్ రోగులకు 125-300మి.గ్రా మెగ్నీషియం డోసులతో చికిత్స అందించినప్పుడు వారు వేగంగా కోలుకున్నట్లు చూపే కేస్ స్టడీలు కూడా అనేకం ఉన్నాయి.

‘‘తృణధాన్యాల టోస్టు మీద రుచికరమైన స్ప్రెడ్‌గా అవకాడో, బఠానీ, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని తినడం నాకు చాలా ఇష్టం’’ అని ఉమ చెప్పారు.

ఆకు కూరలు

ఫొటో సోర్స్, Getty Images

6. ఆకు కూరలు

ఆరోగ్య పరంగా ఆకు కూరలు చాలా మంచివని ఆమె అన్నారు.

ఆకుకూరల్లో విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి చిత్త వైకల్యం, కాగ్నిటీవ్ క్షీణత నుంచి రక్షిస్తాయని ఉమ తెలిపారు.

ఆకుకూరల వల్ల లభించే మరో ప్రయోజనం ఏంటంటే, వీటిలో ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి-9కు ఫొలేట్ అనేది సహజ రూపం. ఎర్ర రక్త కణాలు ఏర్పడటంలో ఇది చాలా కీలకం.

కొన్ని నాడీ సంబంధిత ఇబ్బందులకు కూడా ఫొలేట్ లేమి కారణంగా ఉండొచ్చు. న్యూరోట్రాన్స్‌మీటర్లు ఉత్పత్తిలో ఈ విటమిన్ చాలా ముఖ్యమైనది.

‘‘పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది’’ అని ఉమ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)