AI వల్ల ఇప్పటికే పోయిన ఉద్యోగాలు ఇవే... ఇంకా మున్ముందు ఏమవుతుందో?

అలెజాండ్రో గ్రౌ

ఫొటో సోర్స్, ALEJANDRO GRAUE

ఫొటో క్యాప్షన్, అలెజాండ్రో గ్రౌ
    • రచయిత, ఇయాన్ రోజ్
    • హోదా, బీబీసీ న్యూస్ బిజినెస్ రిపోర్టర్

డీన్ మెడోక్రాఫ్ట్ ఇప్పటి వరకు ఒక చిన్న మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాపీ రైటర్‌గా పనిచేసేవారు.

పత్రికా ప్రకటనలు రాయడం, సోషల్ మీడియా పోస్ట్‌లు చేయడం, కంపెనీకి చెందిన ఇతర కంటెంట్‌కు సంబంధించిన పనులు చూడటం ఆయన బాధ్యత.

కానీ, గత ఏడాది చివరిన డీన్ మెడోక్రాఫ్ట్ పనిచేసే కంపెనీ కృత్రిమ మేధ (ఏఐ) ను ప్రవేశపెట్టింది.

‘‘ఆ సమయంలో కంటెంట్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు, పనిని మరింత క్రమబద్ధీకరించేందుకు కాపీ రైటర్లతో కలిసి పనిచేసేలా ఏఐను తీసుకొచ్చారు.’’ అని డీన్ మెడోక్రాఫ్ట్ చెప్పారు.

కానీ, ఏఐ పని ఆయనను పెద్దగా ఆకట్టుకోలేదు.

కంటెంట్‌ను కాపీ చేయలేదని నిర్ధారించేందుకు ఉద్యోగులతోనే పరీక్షించాల్సి వస్తోంది.

ఏఐ కారణంతో లేఆఫ్

కానీ, ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అంతకు మించి వేగంగా పని చేస్తోంది.

ఏదైానా కాపీని ఒక ఉద్యోగి రాసేందుకు 60 నుంచి 90 నిమిషాలు సమయం తీసుకుంటే, ఏఐ ఆ పనిని 10 నిమిషాల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తి చేస్తుంది.

ఏఐ ప్రవేశపెట్టిన సుమారు నాలుగు నెలల తర్వాత, మెడోక్రాఫ్ట్‌కి చెందిన నలుగురు సభ్యుల బృందంపై కంపెనీ వేటు వేసింది.

మెడోక్రాఫ్ట్ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ, ఏఐ తమ ఉద్యోగాలను భర్తీ చేసిందని భావిస్తున్నారు.

‘‘ఉద్యోగం పోయేంత వరకు ఇది నా ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉందని ఊహించలేదు ఏఐని నేను చాలా తేలిగ్గా తీసుకున్నాను’’ అని మెడోక్రాఫ్ట్ అన్నారు.

డీన్ మెడోక్రాఫ్ట్

ఫొటో సోర్స్, DEAN MEADOWCROFT

ఫొటో క్యాప్షన్, ఏఐ తనను భర్తీ చేస్తుందని అసలు ఊహించని డీన్ మెడోక్రాఫ్ట్

ప్రమాదంలో ఉద్యోగాలు

చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ లాంచ్ చేసినప్పుడు, గత ఏడాది చివరిలో ఏఐ ప్రకంపనాలు మళ్లీ మొదలయ్యాయి.

మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టిన చాట్‌జీపీటీ మనం అడిగే ప్రశ్నలకు దాదాపు మానవుని తరహాలోనే సమాధానాలను ఇవ్వగలదు.

క్షణాల్లోనే వ్యాసాలను, ప్రసంగాలను అందిస్తుంది.

చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చి తన ప్రాబల్యాన్ని చాటిన తర్వాత, ఇతర టెక్ దిగ్గజాలు సైతం సొంతంగా తమ కృత్రిమ మేధ వ్యవస్థలను లాంచ్ చేసే ప్రయత్నాలలో పడ్డాయి.

సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ మార్చి నెలలో తన ఏఐ సిస్టమ్ బార్డ్‌ను లాంచ్ చేసింది.

ఇది పూర్తిగా కచ్చితమైనది కానప్పటికీ, ఇంటర్నెట్‌లో ఉన్న పెద్ద మొత్తంలో డేటాను వాడుకుని ఈ సిస్టమ్స్‌కు శిక్షణ ఇచ్చారు.

చాలా మంది ఏఐ వల్ల ఏ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే విషయంపై ఆశ్చర్యంగా ఉన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసిన నివేదికలో, 30 కోట్ల ఫుల్ టైమ్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థలో అన్ని స్థాయిలలో ఈ ఉద్యోగాల కోతలు ఒకే విధంగా ఉండవని పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం, కార్యాలయ పనుల్లో 45 శాతం, న్యాయ వృత్తిలో 44 శాతం ఆటోమేట్ అయ్యే అవకాశం ఉందని, కానీ నిర్మాణ రంగంలో కేవలం 6 శాతం, నిర్వహణలో 4 శాతం మాత్రమే ఆటోమేట్ అవుతాయని తెలిపింది.

ఏఐ రాకతో ఉత్పత్తి పుంజుకుంటోందని, వృద్ధి నమోదవుతుందని, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కూడా గోల్డ్‌మ్యాన్ శాక్స్ రిపోర్టు వెల్లడించింది.

ఇప్పటికే దీనిపై కొన్ని నిర్ధారణలున్నాయి.

ఐకియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేలాది మంది కాల్ సెంటర్ వర్కర్లకు డిజైన్ కన్సల్టెంట్లుగా శిక్షణ ఇచ్చిన ఐకియా

ఐకియానే ఉదాహరణ

2021 నుంచి తన కాల్ సెంటర్లలో పనిచేసే 8,500 మందికి డిజైన్ కన్సల్టెంట్లుగా శిక్షణ ఇచ్చినట్లు ఈ నెలలో ఐకియా తెలిపింది.

ప్రస్తుతం 47 శాతం కస్టమర్ కాల్స్‌ను బిల్లీ అనే ఏఐ నిర్వహిస్తుందని ఈ ఫర్నీచర్ కంపెనీ చెప్పింది.

అయితే, ఏఐ వాడకం ఫలితంగా ఎన్ని ఉద్యోగాలు పోతాయో మాత్రం ఇంకా ఐకియా అంచనావేయలేదు.

కానీ, కంపెనీలోని ఈ పరిణామాల విషయంలో చాలా మంది ఉద్యోగులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు.

చాట్‌జీపీటీ

ఫొటో సోర్స్, Getty Images

భయాందోళనలో ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు

ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులపై సర్వే చేసింది.

వారిలో మూడో వంతు మంది ఏఐ తమ పనిని భర్తీ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మేనేజర్లతో పోలిస్తే ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఎక్కువగా ఏఐ విషయంలో భయపడుతున్నారు.

‘‘కంపెనీ లీడర్లను, మేనేజర్లను చూసినప్పుడు, 80 శాతానికి పైగా వారంలో కనీసం ఒకసారి ఏఐను వాడుతున్నారు. ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌ను చూస్తే, ఆ సంఖ్య 20 శాతంగానే ఉంది. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో, దీని వల్ల వచ్చే ఫలితంపై మరింత ఆందోళనకరంగా, ఒత్తిడిగా భావిస్తున్నారు.’’ అని బీసీజీ జెస్సికా అపోథేకర్ అన్నారు.

అలెజాండ్రో గ్రౌ గత ఏడాది మూడు నెలల పాటు ఒక ప్రముఖ యూట్యూబ్ చానల్‌లో వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్‌గా పని చేశారు.

ఇంగ్లీష్‌లో ఉన్న మొత్తం యూట్యూబ్ ఛానల్ సమాచారాన్ని స్పానిష్‌లోకి రీవాయిస్ చేసే వారు.

సెలవు తీసుకుని తిరిగి వచ్చినప్పటికీ తన పనికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే విశ్వాసంతో గ్రౌ గత సంవత్సరం సెలవులపై ఊరెళ్లారు.

ఆ ఉద్యోగం ఉంటుందని ఆయన భావించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. తప్పనిసరిగా తనకి ఎంతో కొంత ఆదాయం కావాలి.

కానీ, ఆశ్చర్యకరంగా తాను తిరిగి వచ్చిన తర్వాత, స్పానిష్‌లో కొత్త వీడియోను ఆ యూట్యూబ్ చానల్ అప్‌లోడ్ చేసింది. అది ఆయన చేసింది కాదు.

ఏఐ

ఫొటో సోర్స్, Getty Images

‘‘నేను దానిపై క్లిక్ చేసినప్పుడు, నేను విన్న స్వరం నాది కాదు. అది ఏఐ జనరేటెడ్ వాయిస్. చాలా పేలవమైన వాయిస్‌ఓవర్‌గా ఉంది. వినడానికి చాలా భయకరంగా ఉంది. నేను వెంటనే ఇదేంటిది అన్నాను? నాకు కొత్త పార్టనర్ వచ్చారా? లేదా నన్ను ఇది భర్తీ చేస్తుందా?’’ అని అన్నాను.

వెంటనే ఆయన స్టూడియోకు ఫోన్ చేసి ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నారు.

ఏఐతో ప్రయోగాలు చేయాలని క్లయింట్ అనుకుంటున్నారని, ఎందుకంటే ఇది చాలా చౌకగా, వేగవంతంగా పనిచేస్తుందని గ్రౌకి తెలిపారు.

కానీ, ఆ ప్రయోగం విఫలమైంది.

వాయిస్‌ఓవర్ క్వాలిటీ విషయంలో ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు.

దీంతో, ఏఐతో జనరేట్ చేసి వాయిస్‌ఓవర్‌లు ఇచ్చిన వీడియోలను ఆ యూట్యూబ్ ఛానల్ తొలగించింది.

కానీ, ఈ విషయం గ్రౌకు అంత ఊరటను ఇవ్వలేదు.

‘‘నేను చేసే ప్రతి ఉద్యోగాన్ని ఇది చేయడం ప్రారంభిస్తే, నేనేమీ చేయాలి? నేను వ్యవసాయ భూమి కొనుక్కోవాలా? నాకు తెలియడం లేదు. భవిష్యత్‌లో ఏఐ భర్తీ చేయని ఏ ఉద్యోగం కోసం నేను వెతుక్కోవాలి? ఇది చాలా కష్టం’’ అని ఆయన అన్నారు.

సహకారం..

ఒకవేళ ఏఐ మీ ఉద్యోగాన్ని కబళించకపోయినా, అది ఏదో ఒక మార్గంలో మీకు సాయపడగలదు.

కొన్ని నెలల పాటు ఫ్రీల్యాన్సింగ్ చేసిన తర్వాత, మాజీ కాపీ రైటర్ డీన్ మెడోక్రాఫ్ట్ సరికొత్త పయనాన్ని ఎంపిక చేసుకున్నారు.

ఉద్యోగుల అసిస్టెన్స్ ప్రొవైడర్‌గా సేవలందిస్తున్నారు. అంటే ఉద్యోగులకు క్షేమ, మానసిక ఆరోగ్యంపై సూచనలు ఇస్తున్నారు.

ఏఐతో కలిసి పనిచేయడం ఇప్పుడు ఆయన ఉద్యోగంలో భాగమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)