ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌: ఏఐ ద్వారా రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందో లేదో తెలుసుకోవచ్చు

వర్షం

ఫొటో సోర్స్, Getty Images

వచ్చే రెండు గంటల్లో వర్షం పడుతుందో లేదో కృత్తిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

గూగుల్‌కు చెందిన లండన్ ఏఐ ల్యాబ్ డీప్‌మైండ్‌తో పాటు యూనివర్సిటీ ఎక్సెటర్ శాస్త్రవేత్తలు, మెట్ ఆఫీస్‌ భాగస్వామ్యంతో ఈ కొత్త వాతావరణ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

సంప్రదాయ పద్ధతుల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి సంక్లిష్ట పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ విధానంలో ఆరు గంటల నుంచి రెండు వారాల వ్యవధిలోని వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చు.

తాజా ఏఐ వ్యవస్థ, స్వల్పకాల వ్యవధిలో ఉత్పన్నమయ్యే వాతావరణ పరిస్థితులను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయగలదు. రాబోయే భారీ తుపానులు, వరదల గురించి హెచ్చరించగలదు.

వాతావరణ మార్పుల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం శాస్త్రవేత్తలకు కష్టంగా మారుతోంది. అందుకే తరచుగా భారీ వర్షాల గుప్పిట్లో చిక్కుకుంటున్నాం. ఈ వర్షాల కారణంగా ప్రాణ నష్టంతో పాటు గణనీయంగా ఆస్తి నష్టం జరుగుతోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

''వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రాణనష్టంతో పాటు అనేక విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ తరహా పరిస్థితులు రానున్న కాలంలో మరింత సాధారణంగా మారతాయి'' అని మెట్ ఆఫీస్ పార్ట్‌నర్‌షిప్ అండ్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ హెడ్ నియాల్ రాబిన్సన్ అన్నారు.

''అందుకే, తక్కువ సమయంలో వాతావరణ పరిస్థితిని అంచనా వేయగలిగే ఇలాంటి సాంకేతికతలు ప్రజలను సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి.''

'ప్రాణాలను కాపాడుతుంది'

2016-2018 వరకు యూకే రాడార్ మ్యాప్‌లను ఉపయోగించి సాధారణ వర్షపాతం నమూనాలను ఎలా గుర్తించాలో ఈ వ్యవస్థ తెలుసుకుంది. ఆ తర్వాత 2019 నుంచి వర్షపాతాన్ని మ్యాప్‌లలో పరీక్షించగా.. 89 శాతం కేసుల్లో అత్యంత కచ్చితమైన ఫలితాలను కనుగొన్నట్లు 50 మెట్ ఆఫీస్ వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు.

''వాతావరణ శాస్త్రవేత్తలు మెరుగైన పద్ధతులను కనుగొనడానికి ముఖ్యంగా ఏఐ సాంకేతికతపై ఆధారపడినట్లు'' నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఓ పరిశోధనలో వెల్లడైంది.

''ఈ సాంకేతికత ఇప్పుడిప్పుడే మొదలైంది. ట్రయల్స్ దశలోనే ఏఐ శక్తిమంతమైన సాధనంగా రుజువైంది. దీనివల్ల శాస్త్రవేత్తలు, తక్కువ వ్యవధిలో నమోదయ్యే వాతావరణ పరిస్థితులు తెలుసుకునే అవకాశం దక్కింది. అంతకుముందు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు గంటల తరబడి సమయం గడపాల్సి వచ్చేది'' అని డీప్‌మైండ్ సీనియర్ సైంటిస్టు షకీర్ మొహమ్మద్ అన్నారు.

''వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, వాతారణ మార్పులకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఈ కృత్తిమ మేధ ఉపయోగపడుతుంది'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)