విశాఖ: దోపిడీ కేసులో అరెస్టైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఎవరు, ఆమె డ్యాన్స్ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?

స్వర్ణలత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, స్వర్ణలత
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం...

విశాఖలో 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ఏపీ పోలీస్ ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత అరెస్టయ్యారు. ఈ వ్యవహారంలో సీఐ స్వర్ణలతకు మరో ఇద్దరు హోంగార్డులు సహకరించారు.

రెండు వేల రూపాయల నోట్లను 500 రూపాయల నోట్లుగా మార్చి ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు ఇద్దరు రిటైర్డ్ నేవీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు హోంగార్డులు, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతను అరెస్టు చేశారు.

ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగానూ ఉన్నారు. అంతేకాకుండా ఆమె సినిమాలో కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ల ద్వారా బయటపడింది.

ఏఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఈ మోసానికి ఎలా పాల్పడ్డారు? అసలేం జరిగిందనే విషయాలను విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ వివరించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు..

స్వర్ణలత

ఫొటో సోర్స్, UGC

2 వేల నోట్ల 'విత్‌‌డ్రా' ప్రకటనతో కథ మొదలు..

2 వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ తర్వాత చెలామణిలో నుంచి తీసేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే మూడో వారంలో ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులలో మార్చుకోవచ్చని తెలిపింది.

2 వేల నోట్లపై ఆర్బీఐ ప్రకటనతో నేవీలో పనిచేసి రిటైర్ అయిన అధికారులు కె. శ్రీను, శ్రీధర్ తమ వద్ద ఉన్న రూ. కోటి విలువైన 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవాలని భావించారు.

అయితే, రోజుకు గరిష్ఠంగా రూ.20 వేల వరకూ మాత్రమే మార్పిడికి అవకాశం ఉండటంతో మధ్యవర్తి ద్వారా ఈ పని పూర్తి చేసేందుకు జూన్ 4న సూరిబాబు అనే వ్యక్తిని వారు సంప్రదించారు. కోటి రూపాయల విలువైన 2 వేల నోట్లు ఇస్తే బదులుగా రూ.90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తానని సూరిబాబు వారికి చెప్పారు.

సూరిబాబుకు 10 శాతం కమిషన్, అంటే 10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సూరిబాబు తనకు తెలిసిన హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీనులను జూన్ 5న సంప్రదించారు. వారిద్దరూ ఆర్ఐ స్వర్ణలత వద్ద డ్రైవర్లుగా పని చేస్తున్నారు.

స్వర్ణలత

ఫొటో సోర్స్, UGC

‘ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఎంట్రీ’

జూన్ 6న నేవీ రిటైర్డ్ ఆఫీసర్స్ శ్రీధర్, శ్రీనులను సూరిబాబు సీతమ్మధారలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్దకు డబ్బుతో రమ్మన్నాడు. అక్కడికి డబ్బుతో వచ్చిన రిటైర్డ్ నేవీ ఉద్యోగులు సూరిబాబుకి నగదును చూపించారు. అది చూసిన తర్వాత సూరిబాబు ‘డబ్బు వచ్చింది’ అంటూ అక్కడి నుంచి మరో వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, హోంగార్డులు హేమసుందర్, శ్రీను అక్కడకు చేరుకున్నారు. డబ్బుతో ఉన్న శ్రీధర్, శ్రీనులను సీఐ, హోంగార్డులు బెదిరించారు. ఈ డబ్బుకు లెక్కలు చూపకపోతే కేసులు పెడతామంటూ బెదిరించి, చివరకు రూ.12 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు.

‘అదంతా యాక్టింగ్’

స్వర్ణలతతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం అక్కడే రూ. 12 లక్షలు ఇచ్చేశారు. అలాగే హోంగార్డులకు కూడా కొంత సొమ్ము ముట్టజెప్పారు.

అయితే, ‘డబ్బు వచ్చింది’ అని సూరిబాబు ఎవరికో ఫోన్ చేయడంపై అనుమానం వచ్చిన నేవీ రిటైర్డ్ ఉద్యోగులు ఇక్కడ జరుగుతున్నదంతా డ్రామా అని గ్రహించారు. సీఐ స్వర్ణలత, ఆమెతో పాటు వచ్చిన హోంగార్డులు, సూరిబాబు వీరంతా ముఠాగా ఏర్పడి నాటకమాడి డబ్బులు కొట్టేశారని వారు నిర్ధరణకు వచ్చారు.

మరుసటి రోజు జూన్ 7న డీసీపీ విద్యాసాగర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుని మూడు కేసులు నమోదు చేశారు.

ఏ1గా సూరిబాబు, ఏ2, ఏ3గా హోంగార్డులు శ్యామ్ సుందర్, శ్రీను, ఏ4గా స్వర్ణలతను పెట్టారు. వారిపై 386, 341, 506, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రూ. 2వేల నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకునేందుకు సెప్టెంబర్ వరకు సమయం ఉందని, మధ్యవర్తులను నమ్మిమోసపోవద్దని సీపీ త్రివిక్రమ్ వర్మ హెచ్చరించారు. అలాగే, తప్పు చేస్తే ఎవరినైనా వదలమని, ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత ఉదంతమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

స్వర్ణలత

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, స్వర్ణలత నటిస్తున్న సినిమా

వెలుగులోకి డ్యాన్సులు, సినిమా పోస్టర్లు

ఈ కేసుతో ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ సర్కిల్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలు, ఆమె నటిస్తున్న సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సినిమాల్లో నటించేందుకు ఆమె గతంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు బయటికొచ్చాయి.

ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత పోలీస్ యూనిఫాంలో ఉన్న ‘ఏపీ 31, నంబర్ మిస్సింగ్’ అనే ఓ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

తనకు చిరంజీవి అంటే ఇష్టమని, ఆయన కోసమే ఈ వీడియో అంటూ ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ‘‘చిరుగారిపై ఉన్న అభిమానంతో నేను చేస్తున్న చిరు ప్రయత్నం’’ అంటూ స్వర్ణలత పేరుతో క్యాప్షన్ కూడా ఉంది.

స్వర్ణలతకు సినిమాలు, నటన అంటే చాలా ఇష్టమని ఆమెతో పరిచయం ఉన్న రిజర్వ్ పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ వృత్తిపరంగా పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది కాబట్టి నటన కోసం రోజూ కొంత సమయం కేటాయించేవారని, అందులో భాగంగానే ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్‌ని నియమించుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారని చెప్తున్నారు.

ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలు కూడా చూపిస్తున్నారు.

‘విశాఖ టు విశాఖ’

విజయనగరం జిల్లా దత్తిరాజేరుకు చెందిన స్వర్ణలత 2008లో ఏఆర్ ఎస్ఐగా విశాఖలోనే తొలి పోస్టింగ్ పొందారు. ఆ తర్వాత 2017లో ఇక్కడే ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందారు.

ఆ తర్వాత అమరావతికి బదిలీ అయ్యారు. అక్కడ కొంతకాలం పని చేసిన తర్వాత శ్రీకాకుళం ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వచ్చారు.

అనంతరం కొంతకాలం వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆమె, ప్రస్తుతం విశాఖలోనే ఏఆర్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని విశాఖకు చెందిన ఒక రాజకీయ నేత, సినీ నిర్మాత కూడా అయిన వ్యక్తి చెప్పడంతో స్వర్ణలత డ్యాన్స్, యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమెతో పని చేసిన పోలీసులు చెప్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో స్వర్ణలత

ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న స్వర్ణలత గతంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై విలేఖరుల సమావేశం పెట్టి విరుచుకుపడ్డారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మూడేళ్ల కిందట అయ్యన్నపై ఆమె విమర్శలు చేశారు.

పోలీసులు నేరుగా రాజకీయ నాయకుల్లా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడమేంటని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.

ఎనిమిది నెలల క్రితం స్వర్ణలత నటిస్తున్న ‘ఏపీ 31’ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ షూటింగ్‌తో పాటు నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆమె భాగస్వామి అయినట్టు ఈ సినిమాలో నటిస్తున్న విశాఖకు చెందిన సినీ ఆర్టిస్టులు చెబుతున్నారు.

ఈ సినిమాలో ఆమెది పోలీసు పాత్ర. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ కూడా విడుదలైంది. ఆ పోస్టరే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి: