ఒకొముటున్: 1200 ఏళ్ళ కిందటి ఈ మాయా నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం వెనుక మర్మమేంటి?

ఒకొముటున్

ఫొటో సోర్స్, Alpineguide/Alamy

ఫొటో క్యాప్షన్, ఒకొముటున్
    • రచయిత, ఎలియోట్ స్టెయిన్
    • హోదా, బీబీసీ ట్రావెల్

మెక్సికోలోని యుకటన్ పీఠభూమిలో శిథిలమైన నగరాల కోసం దాదాపు 30 ఏళ్లుగా పురావస్తు శాస్త్రవేత్త ఇవాన్ స్ప్రజాక్ అన్వేషిస్తున్నారు. ఆయన తాజా పరిశోధన ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

‘‘ఈ పని చేయాలంటే కాస్త విపరీతమైన ప్రేమ లేదా పిచ్చి ఉండాలి’’ అని చేతిలో సిగరెట్ పెట్టుకొని తన నీలం కళ్లతో నావైపు చూస్తూ డా.ఇవాన్ స్ప్రజాక్ చెప్పారు. ‘‘ఇక్కడ పాములు, కీటకాలు, జాగ్వార్‌లు కూడా ఉంటాయి. అయితే, వాటన్నింటినీ ఎదిరిస్తూనే మీరు ముదుకు వెళ్ళాలి. శతాబ్దాలపాటు మరుగునపడిన సంస్కృతిని వెలుగులోకి తీసుకురావాలంటే ఆ మాత్రం కష్టపడాలి మర’’ అని ఆయన అన్నారు.

ఆయనను అమెరికా సినిమా ఇండియానా జోన్స్‌లోని కథానాయకుడిగా తాజాగా ‘ద గార్డియన్’ అభివర్ణించింది. అడవిలో శిథిలమైన ఒకప్పటి మాయా నాగరికత నగరాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు గత 30 ఏళ్లుగా అమెక్సికోలోని యుకటన్ పీఠభూమిలో ఆయన అన్వేషిస్తున్నారు.

స్లొవేనియాకు చెందిన ఆయన, తన బృందంతో కలిసి 2013లో 8వ శతాబ్దంనాటి 40,000 మంది జీవించిన నగరం చక్టన్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ నగరం కాలక్రమేణా అడవిలో కలిసిపోయింది. ఏడాది తర్వాత మరో రెండు మాయా నగరాలు లగునిటా, టామ్‌చెన్‌లను కూడా వీరు కనిపెట్టారు. వీటిలో పిరమిడ్ దేవాలయాలు, మార్కెట్ ప్రాంగణాలు, శిలాఫలకాలు ఉన్నాయి. 1,200 ఏళ్ల క్రితం ఈ నగరాలను ఎందుకు ప్రజలు విడిచిపెట్టి వెళ్లిపోయారో ఇప్పటికీ మర్మంగానే మిగిలిపోయింది.

ఒకొముటున్

ఫొటో సోర్స్, Mauricio Marat, INAH, Mexico

అయితే, స్ప్రజాక్ తాజా పరిశోధన మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

గత నెలలో తన బృందంతో కలిసి ఆయన ఒక శిథిలమైన పురాతన మాయా నగర అవశేషాలను కనుగొన్నారు. మెక్సికోలోని బాలముకు ఎకలాజికల్ కన్జర్వేషన్ జోన్‌లో కనిపించిన ఈ నగరంలో పిరమిడ్ లాంటి నిర్మాణాలు చాలా కనిపించాయి. ఆ నగరానికి ‘ఒకొముటున్’గా పిలుస్తున్నారు. అంటే యుకటెక్ మాయా భాషలో ‘రాతి స్తంభం’ అనే అర్థముంది. ఇక్కడ స్థూపాకారంలో చాలా స్తంభాలు కనిపించాయి. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు.

ఇక్కడ లభించిన కుండలను విశ్లేషించడంతో క్రీ.శ. 600 నుంచి 800 మధ్య కాలంలో ప్రజలు ఈ ప్రాంతంలో జీవించినట్లు వెలుగులోకి వచ్చింది.

‘‘కాలక్రమేణా ఈ నగరాలు మరుగునపడ్డాయి. అసలు ఇవి ఎక్కడుండేవో ఎవరికీ కచ్చితంగా తెలియదు’’ అని ఒకొముటున్‌ను కనుగొన్న తర్వాత తొలి ఇంటర్వ్యూలో బీబీసీ ట్రావెల్‌తో ఆయన చెప్పారు. ‘‘మధ్య మాయా ప్రాంత (ఆధునిక యుకటన్ పీఠభూమిలో) పటంలో ఈ నగరం ఒక కృష్ణబిలంలా కనిపిస్తోంది. ఎందుకంటే దీనికి చుట్టుపక్కల మరేమీ కనిపించడం లేదు. 3,000 నుంచి 4,000 చ.కి.మీ. విస్తీర్ణంలోని ఈ ప్రాంతంలో నిన్నమొన్నటివరకూ అసలేమీ కనిపించేది కాదు’’ అని ఆయన అన్నారు.

ఎవరూ అన్వేషించని ఇలాంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టడంతో అసలు మాయా ప్రజలు ఎవరు? వారి సంస్కృతి ఎలా కుప్పకూలింది? లాంటి అంశాలను తెలుసుకోవచ్చు.

ఒకొముటున్

ఫొటో సోర్స్, Mauricio Marat, INAH, Mexico

మాయా నాగరితకు ఏమైంది?

పశ్చిమార్ధగోళంలోని అతిగొప్ప ప్రాచీన నాగరికతల్లో మాయా కూడా ఒకటి. క్రీ.శ. 200 నుంచి 900 మధ్య కాలంలో మధ్య అమెరికా ప్రాంతాల్లో ఇది విలసిల్లింది. అద్భుతమైన 40కిపైగా నగరాలు ఇక్కడ ఉండేవి. ఖగోళ, గణిత, కళా శాస్త్రాల్లో నిపుణులు ఇక్కడ జీవించారని ఆధారాలు చెబుతున్నాయి.

గ్రహణాలు, సూర్య, చంద్రుల గమనాలకు సంబంధించిన విశేషాలను వీరు శిలా శాసనాల్లో పొందుపరిచారు. అంతేకాదు, వాటికి అనుగుణంగా నగర నిర్మాణంలో మార్పులు చేసుకున్నారు. యూరోపియన్లు ‘సున్నా’ను ఉపయోగించడానికి 1,000 ఏళ్ల ముందే ఇక్కడ అది వాడుకలో ఉండేది.

క్రీ.పూ. 1వ శతాబ్దంలోనే వీరు తొలి క్యాలెండర్‌ను తయారుచేశారు. ఇది జూలియన్ క్యాలెండర్ కంటే కచ్చితంగా ఉండేది. దీన్ని బ్రిటన్‌తోపాటు యూరప్, ఆసియాలోనూ ఉపయోగించేవారు. ప్రాచీన కాలంలో రాసే విధానాన్ని అనుసరించిన నాగరికతల్లో ఇదీ ఒకటి. వీరు వేలకొద్దీ కాగితపు పుస్తకాలను ఉపయోగించేవారు. చాక్లెట్‌తోపాటు తొలి బాల్ గేమ్, రబ్బరులను కూడా వీరే మొదట ఉపయోగించి ఉండొచ్చు.

‘‘మాయ నాగరికత గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వీటిలో చాలా నాగరికతలు ప్రస్తుతం అడవుల్లోపల ఉన్నాయి. అసలు ఇలాంటి ఉష్ణమండల ప్రాంతంలో అంత గొప్ప నాగరికత ఎలా అభివృద్ధి చెందింది, అది ఎలా అంతమైంది? అనే ప్రశ్నలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.’’ అని స్ప్రజాక్ అన్నారు.

మాయ నాగరికత గురించి శతాబ్దం నుంచీ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఆ నగరాలకు ఏమైందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

8, 9వ శతాబ్దాల్లో మాయా ప్రజలు వీటి వదిలిపెట్టి వెళ్లిపోవడం మొదలైంది. ఆధునిక సైన్స్, ఇంజినీరింగ్ టెక్నిక్‌లతో నిర్మించిన ఈ నగరాలు అలా నిర్మానుష్యంగా మారిపోయాయి. యుద్ధాలు, కరవులు, వాతావరణ మార్పులు... ఇలా అసలు ఈ నాగరికత అంతరించిపోవడానికి కారణం ఏమిటనే విషయంలో అన్ని కోణాలనూ స్ప్రజాక్ పరిశీలిస్తున్నారు.

ఒకొముటున్

ఫొటో సోర్స్, Julien Cruciani/Alamy

ఒకొముటున్ ఎందుకు ముఖ్యమైనది?

కొత్తగా వెలుగులోకి వచ్చిన మాయా నగరాల్లో విలువైన ఆధారాలు ఉంటాయి. అక్కడ ప్రజలు ఎలా జీవించేవారు? 1,200 ఏళ్ల క్రితం ఎలా ఆ నాగరికత అంతమైంది? లాంటి అంశాలు ఇక్కడ పరిశోధనలు చేపట్టి తెలుసుకోవచ్చు. ప్రజలు తిరగని యుకటన పీఠభూమి లాంటి ప్రాంతాల్లో ఈ ఆధారాలు మరింత భద్రంగా ఉంటాయి.

భూమిపై జీవ వైవిధ్యం ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో బాలముకు ఎకలాజికల్ కన్జర్వేషన్ జోన్ కూడా. ఇక్కడ 86 జాతుల క్షీరదాలు జీవిస్తున్నాయి. ఇక్కడ స్ప్రజాక్, ఆయన బృందం లైడార్ టెక్నాలజీతో ముందుకు వెళ్తోంది. ఇది ఒక లేజర్ స్కానింగ్ టెక్నాలజీ. ఒక ప్రాంతంలో మనుషులు జీవించడంతో ఎలాంటి మార్పులు వచ్చాయో దీని సాయంతో తెలుసుకోవచ్చు. ప్రస్తుత నగరం వెలుగులోకి వచ్చిన ప్రాంతానికి వెళ్లాలంటే 60 కి.మీ. దట్టమైన అడవుల గుండా ప్రయాణించాలి.

‘‘అక్కడ చాలా ముఖ్యమైనదేదో ఉందని మాకు తెలుసు. అయితే, అక్కడ ఏం ఉందో మేం ఊహించలేకపోయాం.’’ అని స్ప్రజాక్ చెప్పారు. ‘‘మేం అక్కడకు వెళ్లిన తర్వాత మా ఊహ నిజమైంది. అది అద్భుతమైన నగరం. బహుశా రాజకీయంగానూ ఇది ముఖ్యమైన కేంద్రం అయ్యుండొచ్చు.’’ అని ఆయన అన్నారు.

బురద నేలల మధ్య ఒక ఎత్తైన ప్రాంతంలో 50 హెక్టార్లకుపైనే విస్తీర్ణంలో ఆ నగరాన్ని నిర్మించారు. పిరమిడ్లు, రాతి స్తంభాలతోపాటు మూడు మార్కెట్‌లను తలపించే ప్రాంతాల అవశేషాలు అక్కడ కనిపించాయి. ప్రాచీన బాల్ గేమ్ కోర్టు కూడా ఇక్కడ ఉంది. నగరానికి దక్షిణాన 15 మీటర్ల పొడవైన రెండు పిరమిడ్లు కూడా ఉన్నాయి.

ఒకొముటున్

ఫొటో సోర్స్, ZRC SAZU

‘‘ఇది మాలో చాలా ఉత్సాహాన్ని నింపింది.’’ అని టెక్సస్ యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్, మాయా నాగరికతపై పరిశోధన చేపడుతున్న డా. కాథ్రిన్ బ్రౌన్ చెప్పారు.

‘‘మాయా నాగరికతపై 150 ఏళ్ల నుంచీ పరిశోధన జరుగుతోంది. ఇప్పటివరకు ఇంత విలువైన ప్రాంతాలేమీ బయటపడలేదు. ప్రస్తుతం లీడార్ టెక్నాలజీతోనే ఇది సాధ్యమైంది. అక్కడి నగర లేఅవుట్, ప్లానింగ్ లాంటి విలువైన అంశాలను దీని సాయంతో తెలుసుకోవచ్చు. మొత్తంగా మాయా నగరికత ఎలా పతనమైందో తెలుసుకునేందుకు ఇవాన్ పరిశోధన ఉపయోగపడొచ్చు.’’ అని కాథ్రిన్ బ్రౌన్ అన్నారు.

మాయా ప్రజలు తీర ప్రాంతాల నుంచి పీఠభూమి మధ్య ప్రాంతాలలోకి ఎప్పుడు, ఎందుకు వచ్చారు? అసలు ఇంత పెద్ద నగరాలను వారు ఎందుకు విడిచిపెట్టారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో ఈ పరిశోధన తోడ్పడే అవకాశముంది.

క్రీ.శ. 800లలో ఈ నగరం పతనం మొదలైనప్పటికీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ చాలా మంది ప్రజలు జీవించారని స్ప్రజాక్ భావిస్తున్నారు. మొత్తంగా పదవ శతాబ్దంలో ఈ నాగరికత కుప్పకూలింది.

మాయా నాగరికతకు సంబంధించిన ప్రశ్నలకు ఒకుముటున్ సమాధానం చెబుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. కానీ, ఒకటి మాత్రం నిజం. వచ్చే మార్చిలో మళ్లీ వాతావరణం అనుకూలించినప్పుడు ఆయన యుకటన్ వచ్చి మరిన్ని ఆధారాల కోసం అన్వేషణ మొదలుపెడతారు.

‘‘ఈ అన్వేషణలో మేం చాలా కోల్పోతున్నామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేమీ లేదు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. కత్తులు చేతిలో పట్టుకొని అడవి గుండా వెళ్లేటప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద పిరమిడ్ కనిపించింది అనుకోండి.. మీ బాధలన్నీ వెంటనే మరచిపోతారు.’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఐదు వేల ఏళ్ల కింద నిర్మించిన డ్రైనేజీ కాల్వలే కాపాడాయంటున్న నిపుణులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)