‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? మలబద్ధకం ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) - భారత దేశంలో ఐదు నుంచి పది శాతం మంది జనాభాకు ఈ సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వాస్తవ పరిస్థితిని చూస్తే ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

జీవన శైలిలో వస్తున్న మార్పులు దీనికి ఒక ముఖ్య కారణం కాగా, డయాగ్నోసిస్ పెరగడం అనేది మరొక కారణంగా చెప్పుకోవచ్చు.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఈ సమస్య లక్షణాలు ఏమిటి? దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఐబీఎస్ ఎందుకు వస్తుంది?

ఐబీఎస్ స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది యుక్త వయసు నుంచి నాలుగు పదుల వయసు వరకూ అధికంగా ఉంటుంది.

మానసిక ఒత్తిడి లేక ఆందోళన కూడా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు.

కొన్ని సార్లు జీర్ణ వ్యవస్థలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా దీనికి దారి తీయొచ్చు.

కొన్ని రకాల ఆహారాలు పడకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు.

కుటుంబ చరిత్ర ఉన్న వారిలోనూ ఐబీఎస్ లక్షణాలు కనిపించే అవకాశం ఎక్కువ.

కొన్ని రకాల మందులు ముఖ్యంగా కొన్ని యాంటీబయోటిక్స్, కుంగుబాటుకు వాడే మందులు, సార్బిటాల్ ఉండే దగ్గు మందులు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.

ఐబీఎస్‌ను లక్షణాలను బట్టి ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. వీటిలో మొదటిది అతిసారం కలిగించేది, రెండోది మలబద్ధకం కలిగించేది.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

లక్షణాలు ఏమిటి?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేక లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది.

  • పొత్తి కడుపులో నొప్పి (ప్రధాన లక్షణం)
  • మలబద్ధకం
  • ఎక్కువ గ్యాస్ రావడం
  • కడుపు ఉబ్బరంగా ఉండటం
  • అజీర్తి
  • నీళ్ళ విరేచనాలు వంటి లక్షణాలు సహజంగా కనిపిస్తాయి.

ఈ లక్షణాలు సాధారణంగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభావం ఎలా ఉంటుంది?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వల్ల ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కలగవచ్చు.

అలాగే నిద్ర సమస్యలు కూడా వస్తుంటాయి. తరుచూ బరువు తగ్గడం, అనేక రకాల పోషకాల లోపం లక్షణాలు కనిపిస్తాయి.

జీవితం మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల ఆరోగ్యపరంగానేకాక మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎలా మొదలవుతుంది?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (అతిసారం) లక్షణాలు కనిపించడానికి ముందు దీనికి ఏదైనా ప్రేరేపించే కారణం ఉండడం సహజం.

అధికంగా పీచు పదార్థాలు తీసుకోవడం, లేక చాక్లెట్, మద్యం, కెఫిన్, మొదలైనవి తీసుకోవడం లాంటి కారణాలు దీనిలో ఉంటాయి.

కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, వేయించిన, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, లేదా భారీగా భోజనం చేయడం లేక పాల ఉత్పత్తులు అధికంగా తినడం వంటివి చేసినా... ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలు ఒక్క సారిగా అధికం అవ్వడం తరచూ కనిపిస్తుంది.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (మలబద్ధకం) విషయానికి వస్తే.. మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం తినడం, లేక ప్రాసెస్డ్ ఆహారం, బ్రెడ్ లాంటివి అధికంగా తినడం లాంటి కారణాల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది.

కొన్ని సార్లు పాల ఉత్పత్తులు ముఖ్యంగా జున్ను వంటివి తినడం వల్ల, లేక కాఫీ, మద్యం, లేక కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా లక్షణాలు ఒక్క సారిగా అధికమయ్యే ప్రమాదం ఉంది.

కాబట్టి ఇలాంటి ప్రేరేపించే కారణాలను గుర్తించి, వాటిని నివారించగలిగితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలు తరుచూ రావడం తగ్గుతుంది.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

జీవన శైలి మార్చుకోండి

ఈ సమస్యకు కారణమయ్యే ఆహార పదార్థాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండాలి.

కొన్ని జీవన శైలి మార్పులు కూడా ఐబీఎస్‌ను నియంత్రణలో పెట్టగలవు.

నీరు, ఇతర ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గ్లూటెన్ ఉండే ఆహారాన్ని మానేయడం, క్రమం తప్పకుండా మితంగా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం లాంటి మార్పులు దీనిలో ఉంటాయి.

వీడియో క్యాప్షన్, ఆందోళనగా ఉన్నప్పుడు ఏం చేయాలి?

చికిత్స ఏమిటి?

ఐబీఎస్‌కు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ కలిగే లక్షణాలతో చాలా కాలం ఉంటుంది. అందుకే దీని లక్షణాలను బట్టి మందులు తీసుకోవాలి.

కడుపు నొప్పి ఉంటే అది తగ్గడానికి, విరేచనాలు అవుతుంటే అవి ఆపడానికి, మలబద్ధకం ఉంటే విరేచనం అవ్వడానికి, అసిడిటీ వంటి లక్షణాలు ఉంటే వాటికి తగిన చికిత్సలు తీసుకోవాలి.

విరేచనాల వల్ల కడుపులో ఉండాల్సిన ఆరోగ్యకర బ్యాక్టీరియా తగ్గడం వల్ల జీర్ణ వ్యవస్థతోపాటు అనేక అవయవాలపై చెడు ప్రభావం ఉంటుంది.

ఎందుకంటే జీర్ణ కోశ వ్యవస్థను రెండవ మెదడుగా గుర్తిస్తారు. అది ఆరోగ్యంగా ఉండడానికి మంచి బ్యాక్టీరియా ఉండడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)