బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌ను మళ్ళీ నిలబెట్టడం సాధ్యమా?

ప్రస్తుతం బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు మాత్రమే కంపెనీ బోర్డులో మిగిలారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు మాత్రమే కంపెనీ బోర్డులో మిగిలారు
    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌లో ఒకటైన, కరోనావైరస్ సంక్షోభంలో విపరీతంగా పెట్టుబడులను ఆకర్షించిన బైజూస్ నేడు దెబ్బ మీద దెబ్బల నడుమ చతికిలపడింది. భారతీయ స్టార్టప్‌లకు ‘బైజూస్ కథ’ ఒక గుణపాఠం కావాలని నిపుణులు చెబుతున్నారు.

‘‘అతి తక్కువ కాలంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందిన సంస్థ’’గా బైజూస్‌ను శ్రీరామ్ సుబ్రమణియన్ చెప్పారు. ఓ కార్పొరేట్ గవర్నెన్స్, అడ్వైజరీ సంస్థకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

2011లో మొదలైన బైజూస్ 2015లో లెర్నింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. 2018 నాటికి 1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ల కంటే విలువైన సంస్థగా)గా బైజూస్ చరిత్ర సృష్టించింది.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆన్‌లైన్ క్లాసుల వైపు పిల్లలు చూడటంతో సంస్థ మరింత విస్తరించింది. అయితే, 2021లో 327 మిలియన్ల డాలర్లు (రూ.2.70 లక్షల కోట్లు) నష్టాలను సంస్థ చూసింది. ఆ మునుపటి ఏడాది కంటే ఇది 17 రెట్లు ఎక్కువ.

అప్పటి నుంచి వరుస వైఫలయ్యాలను సంస్థ మూట కట్టుకుంటూనే ఉంది. నిరుడు 22 బిలియన్ డాలర్లు (1.82 లక్షల కోట్లుగా)గా ఉన్న కంపెనీ విలువ ప్రస్తుతం 5.1 బిలియన్ డాలర్లు (రూ. 42,124 కోట్లు)కు పరిమితమైంది. దీనికి కారణం సంస్థలో అతిపెద్ద ఇన్వెస్టర్, షేర్‌హోల్డర్ ‘ప్రోసస్ ఎన్‌వీ’ గ్రూపు తమ వాటాను భారీగా తగ్గించుకోవడమే.

ఈ విషయంపై బీబీసీ ప్రశ్నలకు బైజూస్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

బైజూస్ 2015లో లెర్నింగ్ యాప్‌ను తీసుకొచ్చింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైజూస్ 2015లో లెర్నింగ్ యాప్‌ను తీసుకొచ్చింది

‘‘కరోనావైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు ఎత్తివేయడంతో పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే తిరోగమనం మొదలైంది. కానీ, మదుపరులు మాత్రం బైజూస్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. తిరోగమనం నుంచి వస్తున్న సంకేతాలను వారు గ్రహించలేకపోయారు’’ అని సుబ్రమణియన్ చెప్పారు.

పేపర్ల మాత్రమే బైజూస్ పురోగతి కనిపించేదని, వాస్తవంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండేవని ఏంజెల్ ఇన్వెస్టర్, బైజూస్ విధానాలను జాగ్రత్తగా గమనించిన అనిరుద్ధ మాల్పనీ అన్నారు.

‘‘కంపెనీ అసలైన విలువ, మార్కెట్‌లో చూపిస్తున్న విలువ మధ్య చాలా తేడా ఉండేది.’’ అని ఆయన చెప్పారు.

కరోనావైరస్ మహమ్మారి నడుమ సంస్థ భారీ వృద్ధిని చూసింది. దీంతో 2021లో వైట్ హ్యాట్ జూనియర్, ఆకాశ్, ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ లాంటి స్టార్టప్‌లను వరుసగా సంస్థ తనలో కలిపేసుకుంది. దీని కోసం 2 బిలియన్ డాలర్లు (రూ.16,519 కోట్లు) ఖర్చు పెట్టింది.

ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ వేదిక పేటీఎంను తోసిరాజని భారత్‌లోని అత్యంత విలువైన స్టార్టప్‌గా చరిత్ర సృష్టించింది.

కోట్ల రూపాయలను మార్కెటింగ్‌పై బైజూస్ ఖర్చుపెట్టింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్, ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొంది. మరోవైపు ఇండియన్ క్రికెట్‌ టీమ్ ప్రధాన స్పాన్సర్లలో ఒకరిగా, 2022 ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ స్పాన్సర్‌గా మారింది.

కానీ, ఇటీవల కాలంలో పిల్లల తల్లిదండ్రులు వరుసగా దీనిపై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. తమ స్థోమతకు మించి కోర్సులు కొనేలా తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆశించిన స్థాయిలో సేవలు కూడా ఉండటంలేదని ఆరోపణలు వచ్చాయి. కొందరైతే కస్టమర్లను దోచుకునేందుకు సంస్థ అనైతిక విధానాలను అనుసరిస్తోందని కూడా ఆరోపణలు చేశారు.

పిల్లల తల్లిదండ్రులతోపాటు మాజీ ఉద్యోగులు చేసిన ఆరోపణలను బైజూస్ ఖండించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల తల్లిదండ్రులతోపాటు మాజీ ఉద్యోగులు చేసిన ఆరోపణలను బైజూస్ ఖండించింది

కోర్సులను విక్రయించాలని తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, అసలు చేరుకోలేని భారీ లక్ష్యాలను తమకు నిర్దేశిస్తున్నారని కొందరు మాజీ ఉద్యోగులు కూడా మీడియాతో చెప్పారు. మరోవైపు ఖర్చులను తగ్గించుకునే పేరుతో వేల మంది ఉద్యోగులను సంస్థ విధుల నుంచి తొలగించింది.

అయితే, పిల్లల తల్లిదండ్రులతోపాటు మాజీ ఉద్యోగులు చేసిన ఆరోపణలను బైజూస్ ఖండించింది. సంస్థపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ మొదలుపెట్టింది.

విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై గత ఏప్రిల్‌లో బెంగళూరులోని సంస్థ కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు. అయితే, తాము ఎలాంటి తప్పూ చేయలేదని, ఇక్కడి అన్ని చట్టాలను తాము అనుసరిస్తున్నామని బైజూస్ పేర్కొంది.

మే నెలలో కంపెనీకి రుణాలు ఇచ్చిన సంస్థలు అమెరికాలో కోర్టును ఆశ్రయించాయి. తమకు చెల్లింపులు చేయడంలేదని, లోన్ అగ్రిమెంట్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆ సంస్థలు ఆరోపణలు చేశాయి. మరోవైపు సంస్థ ఆర్థిక నివేదికలను కూడా సమయానికి విడుదల చేయడంలేదని చెప్పాయి. అంతేకాదు, సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఆల్ఫా అనే సంస్థకు భారీగా నిధులను మళ్లిస్తున్నారని కూడా ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను బైజూస్ ఖండించింది.

జూన్‌ నెలలో దాదాపు 40 మిలియన్ డాలర్లు (రూ.330 కోట్లు) వడ్డీని కూడా సంస్థ చెల్లించడం ఆలస్యమైంది. అదే సమయంలో రుణాలు ఇచ్చే సంస్థలు తమను వేధిస్తున్నాయంటూ సంస్థ కోర్టుకు వెళ్లింది.

ఆ తర్వాత మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగులను సంస్థ తొలగించింది. అయితే, సొంత ఆడిటర్ల నుంచే సంస్థకు కొత్త సమస్యలు వచ్చాయి.

ఆర్థిక నివేదికలను సమర్పించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందని చెబుతూ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ హస్కిన్స్, సెల్స్ లిప్‌ సంస్థలు తప్పుకున్నాయి. కంపెనీ రికార్డులను పరిశీలించడం తమకు కష్టం అవుతోందని ఆ రెండు సంస్థలూ చెప్పాయి.

ఈ వార్తల నడుమ బోర్డు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేశారు. దీంతో బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్‌లు మాత్రమే బోర్డులో మిగిలారు.

ప్రస్తుతం రుణాల నిబంధనల్లో మార్పుల కోసం సంస్థ చర్చలు జరుపుతోంది.

వీడియో క్యాప్షన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్ మార్కెట్‌పై పట్టు ఎలా సాధించారు

ఇటీవల జరిగిన షేర్‌హోల్డర్ల సమావేశంలో సీఈవో రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కంపెనీకి చెందిన ఇద్దరు మదుపర్లు ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు.

‘‘భారీగా వృద్ధి చెందిన సంస్థల తరహాలో ప్రమాణాలను పాటించడంలో బైజూస్ విఫలమైంది.’’ అని ఏంజెల్ ఇన్వెస్టర్, బిగ్‌బాస్కెట్ వ్యవస్థాపకుడు కే గణేశ్ అన్నారు.

‘‘కంపెనీ నివేదికలను విడుదల చేయడంలో ఆలస్యాన్ని అసలు సహంచలేం.’’ అని ఆయన అన్నారు.

‘‘కోవిడ్-19 వ్యాప్తి సమయంలో లబ్ధిపొందిన చాలా రంగాల్లో నేడు తిరోగమన పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే సాధారణ పరిస్థితులు ఆశించిన స్థాయి కంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎడ్‌టెక్ రంగంలో సంస్థల విషయంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి.’’ అని గణేశ్ చెప్పారు.

అయితే, కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ఈ రంగంలోని సంస్థల పురోగతి గురించి వాస్తవం కంటే ఎక్కువగా అంచనా వేశారని నిపుణులు అంటున్నారు.

‘‘ఒక్క టెక్నాలజీపైనే ఆధారపడితే సరిపోదు. ఇక్కడ పిల్లల భవిష్యత్‌కు భరోసానిచ్చే విధానాలు, పర్యవేక్షణ అవసరం.’’ అని మాల్పనీ అన్నారు.

‘‘నిజానికి బైజూస్ ట్యాబ్లెటర్లు లాంటి హార్డ్‌వేర్‌ అమ్ముతోంది. వీటిలో స్టడీ మెటీరియల్స్ ఫ్రీగా అందిస్తోంది.’’ అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, 88ఏళ్ల వయసులోను చలాకీగా పనిచేస్తూ స్పూర్తిగా నిలుస్తున్న బామ్మ

‘‘కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ఈ స్టార్టప్‌ల విలువను వాస్తవానికి భిన్నంగా అంచనా వేశారు. ఇప్పుడు నిజమైన పరిస్థితి కళ్లకు కనిపిస్తోంది.’’ అని గణేశ్ అన్నారు.

బైజూస్ ప్రస్తుత పరిస్థితికి ఇలాంటి వెంచర్ క్యాపిటలిస్టు-ఫండెడ్ కంపెనీల బోర్డు సభ్యుల ఎంపిక కూడా ఒక కారణమని ఆయన చెప్పారు.

‘‘బోర్డులో కేవలం మేనేజర్లు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మాత్రమే ఉంటున్నారు. వీరంతా తమతమ స్వప్రయోజనాలను చూసుకుంటున్నారు. కంపెనీ ప్రయోజనాలను చూసుకునేవారే కనిపించడం లేదు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల తరహాలో బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు, స్వతంత్ర ఆడిట్ కమిటీలు ఇక్కడ ఉండవు.’’ అని గణేశ్ వివరించారు.

భారత్‌లో నిర్దేశిత స్థాయికి చేరుకునే స్టార్టప్‌లను పబ్లిక్ లిస్టెడ్ సంస్థలకు వర్తించే నిబంధనలు వర్తింపజేసేలా చూడాలని గణేశ్ లాంటి నిపుణులు కోరుతున్నారు.

షేర్‌హోల్డర్ల మీటింగ్‌లో అడ్వైజరీ కమిటీని నియమించేందుకు అంగీకరించామని కమిటీ వెల్లడించింది. దీనిలో బోర్డు సభ్యులు ఎంపిక, పాలనా విధానాల్లో సీఈవోకు మార్గ నిర్దేశం చేసేందుకు స్వతంత్ర డైరెక్టర్లు ఉంటారు.

ఇప్పటికైనా తప్పులను తెలుసుకొని, సత్వర చర్యలు చేపడితే మళ్లీ సంస్థ గాడినపడే అవకాశం ఉంటుందని గణేశ్, శ్రీరామ్ అన్నారు. అయితే, ఆ దిశగా బైజూస్ ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని డా.మాల్పనీ చెప్పారు.

‘‘వీలైనంతవరకు వారు ఖర్చులను తగ్గించుకుంటే కాస్త సమయం వారికి లభిస్తుంది. కేవలం ఉద్యోగాలను తొలగించడంపైనే పూర్తిగా ఆధారపడకూడదు. వీలైతే, పెట్టుబడుల కోసం కొంత బిజినెస్‌ను అమ్మకానికి పెట్టాలి.’’ అని శ్రీరామ్ అన్నారు.

2022 ఆడిట్‌ను పూర్తిచేసేందుకు సెప్టెంబరు, 2023 ఆడిట్‌కు డిసెంబరులను తుది గడువుగా బైజూస్ నిర్దేశించుకుంది.

బైజూస్ పరిస్థితిని చూసిన తర్వాత భారత అంకుర సంస్థల్లో కొన్ని సానుకూల మార్పులు వచ్చే అవకాశముందని విమర్శకులు భావిస్తున్నారు.

‘‘కంపెనీ వ్యవహారాలను మరింత తీక్షణంగా గమనించడం, ఇంటర్నల్ ఆడిటింగ్, స్వతంత్ర బోర్డు సభ్యులు, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు లాంటి అంశాలను సంస్థలు మరింత పక్కాగా అనుసరించొచ్చు.’’ అని గణేశ్ అన్నారు.

‘‘భారత్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ చట్టాలు మంచివే ఉన్నాయి. ఈ విషయాల్లో కచ్చితంగా ఉండాలని బైజూస్‌ను మదుపరులు, షేక్‌హోల్డర్లు పట్టుబట్టాలి.’’ అని శ్రీరామ్ అన్నారు.

అయితే, మార్కెట్ ఒడిదొడులకు మదుపరులు అలవాటు పడిపోయారని, ప్రస్తుత తిరోగమనాన్ని కొంత కాలానికి వారు మరచిపోతారని విశ్లేషకులు అంటున్నారు.

‘‘రెండేళ్లలో ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకావచ్చు.’’ అని మాల్పనీ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)