నిమిషాల్లో సరకులను డెలివరీ చేసే బ్లింకిట్‌లో సమ్మె ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంట్లో కావాల్సిన సరకులు, నిత్యావసరాలను నిమిషాల్లోనే అందించే బ్లింకిట్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
గత కొన్ని రోజులుగా సమ్మె బాట పడుతున్న బ్లింకిట్ డెలివరీ సిబ్బంది సంఖ్య పెరుగుతోంది.
ఈ సమ్మెకు ఇటీవల సంస్థ తీసుకున్న నిర్ణయమే కారణం. ఒక డెలివరీపై సిబ్బందికి సంస్థ రూ.25 పేమెంట్ ఇచ్చేది. దాన్ని రూ.15కు తగ్గించారు.
ఇదివరకు డెలివరీపై రూ.50గా ఉండే చార్జీని రూ.25కు తగ్గించారని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేశారని, దీని వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని బ్లింకిట్‌లో పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్నారు.
ప్రస్తుతం గురుగ్రామ్, నోయిడాలలోని కొన్ని స్టోర్‌లను బ్లింకిట్ మూసివేసిందని, అక్కడ పనిచేసిన కొందరు సిబ్బంది ఐడీలను కూడా బ్లాక్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సేవలపై ప్రభావం
సమ్మె వల్ల సంస్థ సేవలపై ప్రభావం పడుతోంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని చాలా ప్రాంతాల్లో నిత్యవసరాలను ప్రజలు యాప్‌పై ఆర్డర్ చేయడానికి వీలుపడటం లేదు.
ఈ వివాదంపై స్పందించాలని కోరుతూ బ్లింకిట్‌కు బీబీసీ మెయిల్ చేసింది. అయితే, ఈ వార్త రాసే సమయం వరకూ ఎలాంటి స్పందనా రాలేదు.
అయితే, దీనిపై బ్లింకిట్ మాతృ సంస్థ జొమాటో స్పందించింది. సమ్మెలతో మూతపడిన బ్లింకిట్ స్టోర్‌లలో చాలావరకు మళ్లీ తెరిచామని జొమాటో చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.
గత ఏడాది 550 మిలియన్ డాలర్లతో బ్లింకిట్‌ను జొమాటో కొనుగోలు చేసింది. దీని తర్వాత కూడా రూ.288 కోట్ల నష్టాలను చవిచూసినట్లు తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్లింకిట్ వెల్లడించింది.
తాజా సమ్మెపై బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జొమాటో సమాచారాన్ని అందించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
బ్లింకిట్ డెలివరీ సిబ్బంది చార్జీల్లో మార్పులు తర్వాత, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులపాటు కొన్ని స్టోర్‌లను మూసివేసినట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు జొమాటో తెలిపింది.
డెలివరీ పార్ట్‌నర్‌లు, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పేమెంట్ చార్జీలో మార్పులు చేశామని జొమాటో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇల్లు గడవడమే కష్టం అవుతోంది’’
కొంత మంది బ్లింకిట్ డెలివరీ సిబ్బందితో బీబీసీ మాట్లాడింది.
‘‘ఏడాది క్రితం నేను డెలివరీలు చేయడం మొదలుపెట్టాను. మొదట్లో బ్లింకిట్‌లో అంతా బాగానే ఉండేది. నెలకు దాదాపు రూ.16,000 వరకు సంపాదించుకునేవాడిని. చార్జీలతోపాటు కొన్నిసార్లు ఇన్సెంటివ్‌లు, పెట్రోలు కోసం ప్రత్యేక అలవెన్సులు కూడా కంపెనీ ఇచ్చేది. కానీ, అన్నింటినీ ఆపేశారు. ఇప్పుడు ఒక డెలివరీపై ఇచ్చే పేమెంట్‌ను కూడా రూ.15కు తగ్గించారు. మా ఇల్లు కూడా గడవడం కష్టం అవుతోంది’’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక డెలివరీ సిబ్బంది చెప్పారు.
‘‘నాలాంటి పేదలు ఉపాధి కోసం మారుమూల ప్రాంతాల నుంచి దిల్లీకి వస్తారు. నేను కూడా ఇటావా నుంచి కొన్ని సంవత్సరాల క్రితం దిల్లీకి వచ్చాను. మొదట్లో పెట్రోలు బంకులో పనిచేశాను. ఆ తర్వాత డెలివరీ వర్క్ మొదలుపెట్టాను’’అని ఆయన వివరించారు.
కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటన చేసినప్పటి నుంచి ఒత్తిడి విపరీతంగా పెరిగిందని మరో డెలివరీ సిబ్బంది చెప్పారు.
‘‘ఆ పది నిమిషాల్లో డెలివరీకి మేం చాలా ప్రయత్నిస్తాం. ఎండైనా, వర్షమైనా త్వరగా డెలివరీ చేయాలని చూస్తాం. కొన్నిసార్లు నిమిషాల ఆలస్యం అవుతుంది. కానీ, కస్టమర్లు నెగిటివ్ రివ్యూలు రాస్తారు. తక్కువ రేటింగ్ ఇస్తారు. ఇవన్నీ మా ఆదాయంపై ప్రభావం చూపిస్తాయి’’అని ఆయన తెలిపారు.
సమ్మెలో పాల్గొన్నందుకు తమ ఐడీలను బ్లింకిట్ బ్లాక్ చేసిందని చాలా మంది డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై
ఒక డెలివరీ సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ఒకసారి ఐడీ బ్లాక్ చేశారంటే, ఆ డెలివరీ బాయ్ జీవనోపాధిపై దెబ్బ కొట్టినట్లే’’అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ప్రభుత్వానిదీ తప్పే’’
ప్రస్తుత సంక్షోభంలో ప్రభుత్వానిది కూడా తప్పుందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ సలాహుద్దీన్ అన్నారు.
‘‘ఇలాంటి అగ్రిగేటర్ కంపెనీల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకురాకపోతే, తాత్కాలిక సిబ్బందిని ఇలాంటి దోపిడీ చేస్తూనే ఉంటాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం నేడు భారత్‌లో 77 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. 2029-30 నాటికి ఈ సంఖ్య రెండు కోట్లకు పెరగొచ్చు. ఈ-కామర్స్ చాలా వేగంగా విస్తరిస్తోంది. కానీ, నేడు డెలివరీ చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనాలు దక్కుతున్నాయి?’’అని ఆయన ప్రశ్నించారు.
2020లో ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ సోషల్ సెక్యూరిటీ బిల్లును ఆమోదించిందని, కానీ, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అది అమలు చేయలేదని ఆయన అన్నారు.
‘‘అలాంటప్పుడు చట్టం తీసుకొచ్చి ఏం ప్రయోజనం’’అని ఆయన ప్రశ్నించారు.
ఆ అగ్రిగేటర్ కంపెనీల వైపు నిలబడతామో లేదా పేద ప్రజల వైపు నిలబడతామో ప్రభుత్వమే తేల్చుకోవాలని ఆయన అన్నారు.
‘‘ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలి. అప్పుడే నష్టాలు చూపిస్తూ ఈ కంపెనీలు ఎంత పన్నును కట్టకుండా దాటవేస్తున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుంది’’అని ఆయన అన్నారు.
‘‘చాలా కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెడుతున్నాయి, కొత్త స్టోర్‌లు తెరుస్తున్నాయి. కానీ, నష్టాల్లో ఉన్నామని ప్రకటనలు జారీచేస్తున్నాయి. అంత భారీ నష్టాలు చూపిస్తున్న కంపెనీలు నడవడం ఎలా సాధ్యం? అధికారులు, పూర్తికాల ఉద్యోగుల వేతనాలు నిత్యం పెంచుతున్నారు. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని వల్ల కంపెనీ మేనేజ్‌మెంట్‌కు మేలు జరుగుతుంది. పేద డెలివరీ సిబ్బంది దీని వల్ల చాలా నష్టపొతున్నారు’’అని ఆయన అన్నారు.
డెలివరీ సిబ్బందిని పార్ట్‌నర్ లేదా రైడర్ అని పిలవడం తప్పని ఆయన అన్నారు. ‘‘వారేమీ పార్ట్‌నర్‌లు కాదు. వారు కూడా ఉద్యోగులే. పూర్తికాల ఉద్యోగులకు దక్కే అన్ని ప్రయోజనాలు, వెసులుబాట్లు వారికి కూడా దక్కాలి. ఈ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి. దీనిలో కనీస వేతనం ఇంత ఉండాలని స్పష్టంగా పేర్కొనాలి’’అని ఆయన చెప్పారు.
గిగ్ ఎకానమీ అంటే ఏమిటి?
జొమాటో, స్విగ్గి లేదా బ్లింకిట్ లాంటి కంపెనీల కోసం డెలివరీ వర్క్ చేసే సిబ్బందిని గిగ్ వర్కర్లు అంటారు.
గిగ్ ఎకానమీ అంటే ఒకరమైన లేబర్ మార్కెట్. ఇక్కడ సిబ్బంది పూర్తికాల ఉద్యోగులుగా కాకుండా, ఫ్రీలాన్సర్‌లుగా చేరతారు.
ఇక్కడ గిగ్ వర్కర్లు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. క్లయింట్ల డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తామని దీనిలో నిబంధనలు ఉంటాయి.
ఇక్కడ కావాల్సినప్పుడు పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, వారి ఉద్యోగాలకు భద్రత ఉండదు. పూర్తికాల ఉద్యోగుల తరహాలో ప్రయోజనాలు వారికి దక్కవు.
ఇలాంటి ఉద్యోగాలు చేసేవారికి వేతనంతో కూడిన సెలవులు, ప్రమాద బీమా, పింఛను లాంటి సదుపాయాలు కల్పించాలని గత ఏడాది నీతి ఆయోగ్ సూచించింది.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















