టప్పర్‌వేర్: ఈ ప్లాస్టిక్ కంటెయినర్ తయారీ కంపెనీ ఎందుకు దివాలా స్థితిలో ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీన్ సెడాన్, మైకేల్ రేస్
- హోదా, బీబీసీ న్యూస్
టప్పర్‌వేర్ బ్రాండ్ పేరు వినని వారు దాదాపు ఉండరు. ఆహార పదార్థాలను నిల్వ చేయాలంటే ఈ బ్రాండ్ ఉత్పత్తులే ముందుగా అందరికీ గుర్తుకు వస్తాయి. చాలామందికి ఈ బ్రాండ్ గురించి తెలుసు.
అమెరికా కంపెనీ అయిన టప్పర్‌వేర్‌కు 77 ఏళ్ల చరిత్ర ఉంది. గాలి కూడా చొరబడని (ఎయిర్ టైట్) విధంగా సీలింగ్ ఉత్పత్తులను తయారు చేసి ఈ బ్రాండ్ చాలా ప్రజాదరణ పొందింది. ఎయిర్‌టైట్ సీలింగ్ వ్యాపారంలో ఇది ఒక విప్లవాన్ని సృష్టించింది.
అయితే, ఇప్పుడు ఈ బ్రాండ్ పరిస్థితి మారిపోయింది. పెరుగుతున్న అప్పులు, అమ్మకాలు పడిపోవడంతో ఈ బ్రాండ్ పతనం అవుతుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తులను ఆధునీకరించి, వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, విక్రయాల క్షీణతను అడ్డుకోలేకపోయింది.
1950, 1960లలో వచ్చిన వినియోగదారుల విప్లవంలో ‘టప్పర్‌వేర్ పార్టీస్’ తమ గుర్తింపును చాటుకున్నాయి. మార్కెట్ విక్రయాల్లో టప్పర్‌వేర్ బ్రాండ్ ఎయిర్ టైట్, వాటర్ టైట్ కంటెయినర్స్ జోరు కొనసాగించాయి.
సేల్స్ పర్సన్స్‌ను ప్రతీ ఇంటికి పంపుతూ తమ ఉత్పత్తులను విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపార విధానం (కోర్ బిజినెస్ మోడల్). కానీ, కొంతకాలంగా ఈ వ్యాపార విధానం కనిపించడం లేదు. యూకేలో అయితే 2003 నుంచే ఈ విధానంలో విక్రయాలను టప్పర్‌వేర్ నిలిపేసింది.
కొత్తగా నిధులు అందకపోతే, సాధారణ జనాలకు కూడా చేరువైన ఈ బ్రాండ్, మార్కెట్ నుంచి అంతరిస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు అంగీకరించారు.
దశాబ్దాల క్రితం మొదటిసారి టప్పర్‌వేర్ ఉత్పత్తులను విక్రయించినప్పుడు మార్కెట్‌లో వీటిని ‘‘మిరాకల్ ఉత్పత్తులు’’గా చూసేవారని రిటైల్ అనాలిసిస్ సంస్థ సావీ మార్కెటింగ్ వ్యవస్థాపకురాలు కేథరిన్ షటల్‌వర్త్ చెప్పారు.
ఇటీవలి సంవత్సరాలలో చౌకైన ప్రత్యామ్నాయాలు అందించే కంపెనీలతో మార్కెట్ మొత్తం నిండిపోయిందని కేథరిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ బేకింగ్, కుకింగ్ చేయడంపై ఆసక్తి చూపడంతో టప్పర్‌వేర్ పరిస్థితి కాస్త మెరుగుపడింది.
టప్పర్‌వేర్ షేర్ ధరలు వేగంగా పతనం కావడం ఆగిపోయింది. కానీ, ఈ మెరుగుదల తాత్కాలికమేనని తేలింది.
ఆ తర్వాత టప్పర్‌వేర్ విక్రయాలు మళ్లీ పడిపోయాయి. గత 10 నుంచి 20 ఏళ్లుగా కొత్తదనం ఏమీ చూపించకుండా పాత ఉత్పత్తులకే కట్టుబడిపోవడంతో పాటు ఈ విషయంలో ప్రత్యర్థులు దూసుకెళ్లిపోవడంతో టప్పర్‌వేర్ విక్రయాలు పడిపోయాయని కేథరిన్ అన్నారు.
1946లో టప్పర్‌వేర్ సంస్థ ఏర్పాటైంది. ఎర్ట్ టప్పర్ అనే వ్యక్తి ఈ కంపెనీని స్థాపించారు. కానీ, ‘బ్రౌనీ వైస్’ అనే ఒక మహిళ ఈ కంపెనీ ముఖచిత్రంగా మారారు.
అప్పట్లో టప్పర్‌వేర్ ఉత్పత్తులు వాడటం చాలా గొప్ప విషయంలా ఉండేది. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఈ కంపెనీ కొత్త ప్లాస్టిక్‌లను ఉపయోగించింది.
రిఫ్రిజిరేటర్లు ఖరీదైన ఆ కాలంలో ఈ ఉత్పత్తులు వినియోగదారులకు చాలా పనికొచ్చాయి. అయితే, వైస్ రంగంలోకి దిగేంతవరకు టప్పర్‌వేర్ ఉత్పత్తులను ప్రజలు పెద్దగా ఆదరించలేదు.
ముఖ్యంగా గృహిణులను ఆకట్టుకోవాలనేది టప్పర్‌వేర్ కంపెనీ లక్ష్యం. ఈ మేరకు కంటెయినర్లను విక్రయించడానికి బ్రౌనీ వైస్ ఈవెంట్లను నిర్వహించడం మొదలుపెట్టారు.
సామాజిక కార్యక్రమాల్లో మహిళలను నేరుగా కలిసి ఉత్పత్తులపై అవగాహన కల్పించే ఈవెంట్లను బ్రౌనీ ప్రారంభించారు.
ఆమె వినూత్న శైలి, అమ్మకాల గణాంకాలు టప్పర్‌వేర్ యాజమాన్యం దృష్టిలో పడ్డాయి.
దీంతో, బోర్డు రూమ్‌లలో మహిళలకు అంతగా ప్రాధాన్యం లేని ఆ రోజుల్లోనే ఆమె ఎగ్జిక్యూటివ్ స్థాయికి పదోన్నతి పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్పు తీసుకురావడంలో విఫలం
క్షేత్ర స్థాయిలో కంపెనీ నిర్వహణ ఎల్లప్పుడూ మహిళల నేతృత్వంలోనే ఉన్నప్పటికీ, బోర్డు రూమ్‌లలో కూడా మహిళల నాయకత్వమే ఉంటుందని అనుకోకూడదని ప్రొఫెసర్ అలిసర్ క్లార్క్ అన్నారు.
వియన్నాలోని యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో డిజైన్ హిస్టరీ అండ్ థియరీ ప్రొఫెసర్‌గా క్లార్క్ పనిచేస్తున్నారు. ‘‘టప్పర్‌వేర్: ద ప్రామిస్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ 1950 అమెరికా’’ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.
టప్పర్‌వేర్ సంస్థ సమయానికి అనుగుణంగా మారడంలో ఇబ్బంది పడిందని క్లార్క్ అభిప్రాయపడ్డారు.
‘‘అది అద్భుతంగా రూపొందించిన ఉత్పత్తి. విక్రయాల పరంగా అది రికార్డులను నమోదు చేసింది. కానీ, ఈ డిజిటల్ ప్రపంచంలో ముఖాముఖి మోడల్ ఇక ఏమాత్రం పనిచేయదు’’ అని క్లార్క్ అన్నారు.
కన్సల్టెన్సీ గ్లోబల్ డేటాలో రిటైల్ మేనేజింగ్ డైరెక్టరైన నీల్ సాండర్స్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘‘ఉత్పత్తులు, పంపిణీల పరంగా టప్పర్‌వేర్ సంస్థ సమయానుకూలంగా మారడంలో విఫలమైంది. తమ పార్టీల ద్వారా నేరుగా ఉత్పత్తులను విక్రయించే పద్ధతి వినియోగదారులను ఆకట్టుకోవడం లేదు’’ అని ఆయన హైలైట్ చేశారు.
యువ వినియోగదారులు కూడా పర్యావరణ హితమైన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆహారాన్ని తాజాగా ఉంచడం కోసం బీస్వాక్స్ పేపర్లను వారు వినియోగిస్తున్నారని నీల్ చెప్పారు.

టప్పర్‌వేర్ ఉత్పత్తుల ప్రాథమిక సూత్రాలను కాపీ చేయడం ఇతర సంస్థలకు కష్టమైన విషయం కాదని మరో రిటైల్ విశ్లేషకుడు రిచర్డ్ హైమన్ అన్నారు.
తమ వ్యూహాల్లో వైవిధ్యాన్ని తీసుకురావడం కోసం టప్పర్‌వేర్ కంపెనీ కొన్ని ప్రయత్నాలు చేసిందని హైమన్ చెప్పారు.
అమెరికా రిటెయిల్ చైన్ టార్గెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర వేదికల్లో ఉత్పత్తులను అమ్మడం, వంట ఉత్పత్తులలో కొత్త రకాలను తయారు చేయడం వంటి ప్రయత్నాలు చేసిందని ఆయన వెల్లడించారు.
టప్పర్‌వేర్ పదేళ్ల క్రితమే పెద్ద మార్పులు చేసి ఉంటే, ఇప్పటికీ ఆ సంస్థ పరిస్థితి మరోలా ఉండి ఉండేదని నీల్ అన్నారు.
కానీ, ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచించేంత తీరిక సమయం టప్పర్‌వేర్ బాసులకు లేదు.
అందరికీ సుపరిచితమైన బ్రాండ్‌గా ఉన్న టప్పర్‌వేర్‌లో వేగంగా నగదు (పెట్టుబడులు) రాకపోతే, ఆ కంపెనీ పతనం కావచ్చు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














