తెలంగాణ: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ-టీమ్ అనే విమర్శలు ఇప్పుడే ఎందుకు జోరుగా వినిపిస్తున్నాయి?

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS PARTY/FACE BOOK

ఫొటో క్యాప్షన్, రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ దిట్ట
    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ఒక చిత్రమైన రాజకీయ విమర్శ ఎదుర్కొంటున్నారు. రాజకీయ వ్యూహయోధుడుగా పేరుండి, ఒక బలమయిన స్వతంత్ర రాజకీయ పార్టీకి అధినేత అయిన నాయకులకు ఎదురుకాకూడని విమర్శ అది.

బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బీ టీమ్‌గా మారిపోయిందని, కూతురు కల్వకుంట్ల కవిత దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన బీజేపీతో లాలూచీ పడ్డారనేది ఇపుడు ఆయన ప్రత్యర్థుల నుంచి బలంగా వినిపిస్తున్న విమర్శ.

దీని నుంచి బయటపడే వ్యూహంతో కేసీఆర్ ముందుకు వస్తారా లేక ఖాతరు చేయకుండా ముందుకు పోతారా?

సాధారణంగా బీజేపీతో కేసీఆర్ డీల్ చేసుకోవడమనేది పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే, ఆయన కోరుకుంటున్నది కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ. బీజేపీ కోరుకుంటున్నది కాంగ్రెస్ ముక్త్ భారత్. ఈ ధ్యేయం ఇద్దరిని దగ్గరికి చేర్చింది.

అడపాదడపా లోక్‌సభ, రాజ్యసభ వెల్‌లోకి దూకి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లొల్లి చేసినా, తొలి నుంచి కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటున్నారు.

మోదీ వ్యతిరేక నేషనల్ బంద్‌లను విజయవంతంగా నిర్వహించినా, అవసరమనుకుంటే పార్లమెంటులో మోదీకి స్నేహ హస్తం అందించినా ఆయనకే చెల్లింది. ఒక దశలో టీఆర్ఎస్ ఏకంగా ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరిపోతుందని, ఆ రోజుల్లో లోక్‌సభ ఎంపీగా ఉండిన కేసీఆర్ కూతురు కవితగాని మరొకరుగాని మంత్రి అవుతారని కూడా వార్తలొచ్చాయి.

ఇలాంటి పార్టీ బీజేపీకి దగ్గరయ్యిందంటే విశేషమేమీ ఉండరాదు. అయినా సరే బీజేపీకి బీఆర్ఎస్ ‘బి’టీమ్ అనేది విశేష వార్త అయి కూర్చుంది. కారణం?

కేసీఆర్

ఫొటో సోర్స్, TWITTER/TELANGANACMO

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

కేసీఆర్ వ్యూహాలు

వ్యూహాలు, ఎత్తుగడల్లో కేసీఆర్ దిట్ట. తన ఎదురుగా ఉన్నవాళ్లనందరి మాటలతో వశపర్చుకుని, గతం మర్చిపోయేలా చేసి, తను చెప్పేదే రికార్డయ్యేలా చేయగల సమర్థుడాయన.

కారణమేదైనా కానీయండి, టీఆర్ఎస్‌ ను బీఆర్ఎస్‌గా మార్చి, మోదీని దిల్లీ నుంచి తరిమేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. అప్పట్లో మోదీ మీద ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భాషోత్పాతం సృష్టించి ఇక మోదీ పని అయిపోయిందన్నంత మాయ చేశారు.

మోదీ హయాంలో భారత్ నాశనమయిందన్నారు. ఆ మాటకొస్తే మోదీకంటే మన్మోహన్ సింగే నయమన్నారు. ఎన్డీయే కంటే యూపీఏనే బెటరన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమేం చేయాలో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు.

ఇంత జరిగాక ఇపుడు ఆయన సరెండరై, తన పార్టీని బీజేపీకి బీ టీమ్‌గా మార్చేశారనే వ్యాఖ్యానాలు రావడానికి కారణం ఏమిటి?

అపుడు బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి అనే ఇమేజ్ ఉండింది. వరుసగా ఉప ఎన్నికల్లో గెలిచి ఆ రకమైన వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేయగలిగింది. కాంగ్రెస్‌ది మూడో స్థానమే అనే వ్యాఖ్యానం విశ్లేషకుల నుంచి బలంగా వినిపించిన కాలం అది.

రెండు పరిణామాలు రాజకీయ వాతావరణంలో మార్పులు తెచ్చాయి. ఒకటి రేపో మాపో కవితను అరెస్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్న వాతావరణంలో హఠాత్తుగా ఆ వార్తలు సద్దుమణిగాయి. ఆ దర్యాప్తు ఏమయ్యిందో తెలీనంతగా ఇపుడది వెనక్కు వెళ్లిపోయింది. అంతే హఠాత్తుగా బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్యలో పరస్పరం తిట్ల దాడి తగ్గింది.

ఈ లోపు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో రాష్టంలో కాంగ్రెస్‌లో కొంత ఉత్సాహం పెరిగింది. శ్రేణుల్లో కదలిక వచ్చింది. ఈ పరిణామాలు వరుసగా జరిగే సరికి వ్యాఖ్యానాల్లో స్వరం మారిపోయింది. ఇద్దరి మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉన్నదన్నట్టు వ్యాఖ్యానాల పరంపరం పెరిగింది.

ఇక కాంగ్రెస్ వైపునుంచి అయితే సరేసరి. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ తన ఉపన్యాసం మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అనేది ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు.

ముంబై నుంచి, బెంగుళూరు నుంచి, దిల్లీ నుంచి తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్నవాళ్లు కూడా ఇదే అనుమానిస్తున్నారు.

బండి సంజయ్

ఫొటో సోర్స్, BANDI SANJAY KUMAR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కేసీఆర్ కోసమే బండి సంజయ్‌ను తప్పించారని కొన్ని మీడియా సంస్థలు విశ్లేషించాయి.

విశ్లేషకుల మాట ఏంటి?

ముంబైకి చెందిన సీనియర్ జర్నలిస్టు అశోక్ వాంఖడే కేసీఆర్ మహారాష్ట్రంలో ఎంచుకున్న వ్యూహం బీజేపీకి సహకరించే వ్యూహమేనన్నారు. బీఆర్ఎస్‌ గురించి ఏమనుకుంటున్నారని అడిగితే, కేంద్రంలో మోదీని దించేసే ఉద్దేశమే ఉంటే మహారాష్ట్రలో బీజేపీకి సహకరించేలాఎందుకు పనిచేస్తారు అని ఆయన ప్రశ్నించారు.

“మరఠ్వాడా, విదర్భలలో కేసీఆర్ చేస్తున్నదంతా ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్)లను బలహీనపర్చడమే. ఈ మూడు పార్టీలు పవర్ కోల్పోయి చీకట్లో ఉన్నాయి. ఎన్‌సీపీ, శివసేన(ఉద్ధవ్) పార్టీలు అంతర్గత సంక్షోభంలో పడిపోయాయి. దీనిని కేసీఆర్ సొమ్ము చేసుకుని ఈ పార్టీల నేతను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఇది ఎవరికి ప్రయోజనం, అంతిమంగా బీజేపీకే కదా. అందువల్ల బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీమ్ అనే పేరురాక తప్పదు” అని వాంఖడే అన్నారు.

మొన్నామధ్య కేసీఆర్ ఆరువందల కార్లతో మహారాష్ట్ర పండరీ పూర్ తీర్థయాత్రకు వెళ్లొచ్చారు. ఇంత బలగంతో ఒక పుణ్యక్షేత్రానికి రావడం ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇదంతా ధన, అధికార ప్రదర్శన అని, ఇక్కడ కష్టాల్లో ఉన్న ఈ మూడు పార్టీల చిన్నాచితకా లీడర్లను ఆకట్టుకునే ప్రయత్నమని సోలాపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు దాసరి శ్రీనివాస్ అన్నారు.

“పండరినాథుడు పేదవాళ్ల దేవుడు. ఆయన భక్తులు సింపుల్‌గా ఉంటారు. వారు ప్రధానంగా రైతులు. పంటకాలం అయిపోయాక, వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆషాఢ ఏకాదశి నాడు పండరీపురంలో దేవుడిని దర్శించుకునేందుకు వస్తారు. అలాంటి చోటికి 600 కార్లలో, పార్టీ జెండాలతో దండయాత్ర చేయడం ఇక్కడి ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచింది. అది ధన బలప్రదర్శన కాకపోతే ఏమవుతుంది’’ అని శ్రీనివాస్ అన్నారు.

‘‘కేసీఆర్ దగ్గర దండిగా పైసలున్నాయని అందరికి తెలిసిపోయింది. దీనితో ప్రతిపక్ష పార్టీల కిందిస్థాయి నేతలు, ముఖ్యంగా ఎన్‌సీపీ నేతలు ధైర్యంగా బీఆర్ఎస్‌లో చేరతారు. ఈ పార్టీలను బలహీనపరిచే బీఆర్ఎస్ వల్ల తమకు ప్రయోజనం ఉందని బీజేపీ వాళ్లు హ్యాపీగా ఉన్నారు” అని శ్రీనివాస్ చెప్పారు.

బెంగళూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు మురళీధర్ ఖజానే కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. కారణం ఏదైనా కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్‌లు కలహించుకునే అవకాశమే లేదని ఆయన అన్నారు.

“మోదీని గద్దె దించేందుకు పెట్టిన పార్టీ బీఆర్ఎస్ అంటే నమ్మలేం. కాంగ్రెస్ బలపడే సూచనలు కనిపిస్తున్నపుడు బీజేపీ, బీఆర్ఎస్‌ సహకరించుకునే అవకాశమే ఎక్కువ’’ అని ఆయన అన్నారు.

మాజీ రాజ్యసభ టీవీ ఎడిటర్, దిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్టు ఉర్మిలేశ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“బీఆర్‌ఎస్ పటాటోపం, కేసీఆర్ గంభీరోపన్యాసాల ప్రభావం దిల్లీ దాకా రాలేదు. దిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్నపుడు తెలంగాణలో ప్రజలేమనుకున్నా ఇక్కడి రాజకీయ వర్గాల్లో కేసీఆర్‌-ప్రధాని మోదీ ప్రత్యర్థులంటే ఎవరూ నమ్మరు. కేసీఆర్ అంతిమంగా బీజేపీకే దగ్గరవుతారని ఉత్తరాది పార్టీల అభిప్రాయం. ఆయన ప్రకటించిన ప్రతివ్యూహం మోదీకి సహకరించేలా ఉంది. ఉదాహరణకు కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి (ఫెడరల్ ఫ్రంట్) అన్నారు. అది ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? ఇపుడు బీఆర్ఎస్ పెట్టాక ఆయన ప్రతిపక్ష పార్టీల కూటమిలో చేరరు. ఆయనతో చేరేందుకు ఒక్క ప్రధాన పార్టీ సిద్ధంగా లేదు. అందువల్ల బీఆర్ఎస్‌ వల్ల ఎవరికి ప్రయోజనం, బీజేపీకే. ఈ కారణంగానే బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి బీ పార్టీ అనే ముద్ర పడే అవకాశం ఉంది’’ అని ఉర్మిలేశ్ అన్నారు.

కవిత

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

ఫొటో క్యాప్షన్, కవిత అరెస్టు వ్యవహారం సద్దుమణగడంతో అనుమానాలు పెరిగాయి.

అవసరాన్నిబట్టి వ్యూహాలు

అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ విపక్షాలుగా ఉన్నపుడు ఆ రెండు పార్టీల బలాబలాలను బట్టి వ్యూహాలు నిర్మించుకునే అవకాశం ఉండదా, ప్రత్యర్థుల బలాబలాలను బట్టి బీఆర్ఎస్ వ్యూహాలు మార్చుకుంటున్నదా లేక నిజంగానే విమర్శకులు పేర్కొంటున్నట్టు బీజేపీతో మిలాఖత్ అయ్యిందా అనేది తేల్చిచెప్పగలిగిన అంశం కాదు. ఇవాల్టి రాజకీయాల్లో ప్రతి కదలికా అనేకానేక పొలిటికల్ భాష్యాలకు తావిస్తుంది.

ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ దట్టమైన అనుమానాస్పద వాతావరణం అలుముకుంది. అయితే ఇక్కడొకటి గమనించాలి. దీని మీద తెలంగాణలో అనుకుంటున్న దానికి, బయటి రాష్ట్రాల పరిశీలకుల అభిప్రాయానికి తేడా ఉంది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేశాక ఇక కవిత అరెస్టు తప్పదనుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ వాళ్లు కూడా నానా హంగామా చేసి ‘ఇక అరెస్ట్ తప్పదు’ అనే భావన కల్పించారు. అయితే, అరెస్టు లేదు, ఈడీ అలికిడీ లేదు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్‌ మధ్య డీల్ కుదిరందని, కూతురు కోసం కేసీఆర్ సరెండర్ అయ్యారనే వాదన పెరుగుతూ వస్తోంది. సడన్‌గా దర్యాప్తు సంస్థల దూకుడు ఎందుకు తగ్గింది అనేది వారి ప్రశ్న. అదే వారి రాజకీయ భాష్యానికి ఆధార భూమిక.

పైకి నిప్పులు చిమ్మినా, లోన బీఆర్ఎస్ దిక్సూచి బీజేపీ వైపే దారి చూపిస్తుందనేది బయటి రాష్ట్రాల వారి వాదన. ఇది తొలి నుంచి వున్నదే అని వాళ్ల అభిప్రాయం.

మొదట ముంబాయి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బీఆర్ఎస్ పార్టీకి ‘బీ’ టీమ్ ముద్ర వేశారు. అసంతృప్తితో ఉన్న తమ పార్టీ నేతలను కేసీఆర్ తనవైపు లాక్కోవడం శరద్ పవార్‌కు నచ్చలేదు.

శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ కూడా అదే మాట అన్నారు. తర్వాత మొన్న రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చి బీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి ఎలా బీ టీమ్ అవుతుందో ఇంకా వివరంగా చెప్పారు. బీఆర్ఎస్ అంటే ‘బీజేపీ రిష్తేదార్ సమితి’ అని కొత్త అర్ధం చెప్పారు. దీని తర్వాత పరిణామాలు మరీ వేగమయ్యాయి. ఎప్పటి నుంచో తెలుగు పత్రికలు రాస్తున్నదాన్ని నిజం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించారు. ఎవరెన్నీ చెప్పినా బండి సంజయ్ బీజేపీకి ఒక ఊపు తెచ్చారన్నదాన్ని అంతా అంగీకరిస్తారు.

కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, @kishanreddybjp

ఫొటో క్యాప్షన్, కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడయ్యారు.

బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు?

2020లో బండి సంజయ్ రంగం మీదకు వచ్చే నాటికి కేసీఆర్ వాగ్ధాటికి గాయపడని వాళ్లే లేరు తెలంగాణలో. దీనిని ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికీ లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఒక ప్రయత్నం చేశారు. తిట్టుకు తిట్టులో కొంతమేరకే సక్సెస్ అయ్యారు.

అయితే, బండి సంజయ్ టీఆర్ఎస్‌ మీద చేసిన దాడి కేసీఆర్ అంటే గిట్టని వారిని బాగా అకట్టుకుంది. తగులుకునే వారు ఒకరొచ్చారు అనే మాట ఎక్కువ వినిపించింది. ఆయన కూడా రేవంత్‌లాగే కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతి గురించి దాడి జరిపినా, సంజయ్‌కు పరుష పదజాలం మీద పట్టు, పిట్టకథలు చెప్పే ధోరణి , మొరటు హాస్యం బీజేపీ అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.

స్పష్టత లేక పోవచ్చు, ఉచ్ఛారణ లేకపోవచ్చు, కానీ సంజయ్ కూడా కేసీఆర్‌ లాగే లాంగ్వేజ్ ఎగ్రెసర్. ఇలాంటి సంజయ్‌ని పదవి నుంచి తీసేశారు. అంతా ఊహించినట్లుగానే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని అధ్యక్షుణ్ని చేశారు. కిషన్ వస్తున్న సమయానికి ఆయన కేసీఆర్‌కు దోస్త్ అనే బలమైన ముద్ర పడిపోయింది. కొన్ని మీడియా సంస్థలు ఇంకా దూరం వెళ్లి అసలు బండి సంజయ్‌ని తీసేసి కిషన్‌ను తెచ్చుకున్నది కేసీఆరే అన్నంతగా రాసేశాయి.

కిషన్ ‘బండి’ బాటలో నడవడని, ఆయన హుందాగా ప్రచారం చేస్తారని, ఆ ఆదేశంతోనే హైదరాబాద్ వస్తున్నారని కూడా చాలా పత్రికలు రాశాయి. ఏమైనా కుట్ర సిద్ధాంతాలు బలపడ్డాయి తప్పితే బలహీనపడలేదు.

ఇక నుంచి జాతీయ రాజకీయాల్లో బీజేపీ కి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్ అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ‌కు బీజేపీ ‘బీ’ టీమ్ అని అనుకునేలా మరికొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి.

నిన్న మొన్నటి ప్రధాని పర్యటనలో కేసీఆర్ కుటుంబం మీద చేసిన విమర్శలు కూడా ఈ ప్రచారాన్ని దెబ్బతీయలేకపోయాయి.

అఖిలేశ్ యాదవ్

ఫొటో సోర్స్, @yadavakhilesh

ఫొటో క్యాప్షన్, ఒంటరిని కాదని నిరూపించుకోవడానికి అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అని ఒక విశ్లేషణ

కేసీఆర్ ఒంటరి అయ్యారా?

ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ను దిల్లీ ప్రతిపక్షపార్టీలు సీరియస్‌గా పట్టించుకోవడం మానేశాయనిపిస్తుంది. మహారాష్ట్రలో చేస్తున్న ప్రయోగాలు ఆయనను ఏ దరికి చేరుస్తాయో తెలీదుగానీ, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అధినేత భారత రాజకీయాలలో ఒంటరిలాగా కనబడుతున్నారు.

ఒంటరిని కాదు అని చాటుకునే ప్రయత్నంలో ఆయన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను మొన్న హైదరాబాద్ పిలిపించుకున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం శాఖ మాజీ ఆచార్యుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అన్నారు.

“కేసీఆర్ దగ్గర బాగా డబ్బుంది. అయితే, దేశంలోని ప్రధాన పార్టీల్లో ఒక్కరు కూడా ఆయనతో లేరు. దేశాన్ని ఏలాలనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు ఏకాకి. ఆయనలో ఇదొక అభద్రతా భావం సృష్టించింది. ‘నేను ఏకాకినికాదు, నాకూ ప్రతిపక్షంలో మిత్రులున్నారు,’ అని ప్రపంచానికి చెప్పేందుకు ఆయన ఆఖిలేశ్‌ను ప్రత్యేక విమానంలో పిలిపించుకున్నారనిపిస్తుంది’ అని విశ్వేశ్వరరావు అన్నారు.

వైరం మరచిపోయి కేసీఆర్, బీజేపీకి దగ్గరవుతున్న వైనం గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యుడు డా. ఇ. వెంకటేశు కూడా స్పందించారు. ఈ రెండు పార్టీలు దగ్గర కావల్సిన అనివార్య పరిస్థితిని కర్ణాటక ఎన్నికలు సృష్టించాయని ఆయన అన్నారు.

మిగతా పరిణామాలన్నీ అంటే కవిత అరెస్టు కాకపోవడం వగైరా ఈ అవగాహన నుంచి పుట్టినవే అని ఆయన అభిప్రాయపడుతున్నారు.

“కాంగ్రెసే ఉమ్మడి శత్రువు అయినపుడు వాళ్లిద్దరు ఎపుడూ పొట్లాడుకుంటూనే ఉంటారని ఎలా అనుకుంటాం. ఇద్దరిలో కర్ణాటక ఎన్నికలు దడ పుట్టించాయనిపిస్తుంది. కాబట్టి వాళ్లు దగ్గర కాకతప్పదు. దీని కోసం రెండు పార్టీలు తమ రాజకీయ లక్ష్యాలను వాయిదా వేసుకుంటాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్‌కు బీజేపీ తప్పక సహకరిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇది జరగకుండా వాళ్లు పరస్పరం సహకరించుకుంటారు. ఈ సహకారం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం” అని ప్రొఫెసర్ వెంకటేశ్ అన్నారు.

అయితే, ఇలాంటి ప్రచారాన్ని కేసీఆర్ ఖాతరు చేయరని పార్టీ మాజీ ఎంపీ ఒకరు అన్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ మహా మేధావి. ఆయన రాజకీయ వైద్యుడు. అన్ని సమస్యలకు మందు కనిపెడతారు. పత్రికలు, విశ్లేషకులు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఓపిక పట్టండి” అని ఆయన ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పారు.

వీడియో క్యాప్షన్, యాదాద్రి: అలనాటి అనుభూతిని కలిగించే ఆధునిక నిర్మాణం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)