కేసీఆర్, హేమంత్ సొరేన్ భేటీ: 'ఏ ఫ్రంట్ ఖరారు కాలేదు, త్వరలోనే స్పష్టత వస్తుంది'

కె.చంద్రశేఖరరావు

ఫొటో సోర్స్, ANI

దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ఒక గట్టి ప్రయత్నం అవసరమనే ఉద్దేశంతో చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు ఏ ఫ్రంట్‌ ఖరారు కాలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారని సాక్షి ఒక వార్తాకథనం ప్రచురించింది.

శుక్రవారం జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత కేసీఆర్‌ మాట్లాడారు.

75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఆశించిన ఫలాలు అందించేందుకు కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉందని, అయితే ఆ మార్గం ఏమిటి, ఎలా ఉండాలనే విషయాలు ఖరారు కాలేదని, త్వరలో స్పష్టత వస్తుందని కేసీఆర్ తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సొరేన్ తొలిసారి ప్రత్యేక అతిథిగా హాజరై తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఏర్పడే వరకు ప్రతిదశలో అండగా నిలిచిన శిబు సొరేన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నామని, తెలంగాణ అభివృద్ధి దిశలో సాగుతున్న తీరుపై శిబు సొరేన్‌ హర్షం వ్యక్తం చేశారని ఈ వార్తలో తెలిపారు.

చెన్నై, దళితులు

ఫొటో సోర్స్, ANI

చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ

తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్‌గా ఎంపికయ్యారని, మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (ఫ్రియ) మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

దీంతో మేయర్‌ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్‌ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ చైన్నై మేయర్లుగా పనిచేశారు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన చెన్నై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన యువ అభ్యర్థులలో ప్రియ ఒకరు. వారిలో డీఎంకే మిత్రపక్షమైన సీపీఎంకి చెందిన 21 ఏండ్ల ప్రియదర్శిని పిన్నవయస్కురాలు.

తీనాంపేట 98వ వార్డు నుంచి ప్రియదర్శిని గెలుపొందారు. కాగా, 74వ వార్డు అయిన తిరు వీ కా నగర్‌ నుంచి గెలుపొందిన ప్రియా.. ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్‌గా కూడా రికార్డ్ సృష్టించారు.

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్‌ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి.

పేర్ని నాని

ఫొటో సోర్స్, PERNI NANI

'ఏం తమాషాలు చేస్తున్నారా.. నా డిజిగ్నేషన్‌ ఏమిటో తెలుసా?' - పేర్ని నాని

'కారు అడ్డుగా ఉంది తియ్యండి' అన్నందుకు మంత్రి పేర్ని నాని పోలీసులపై ఫైర్‌ అయ్యారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

'ఏం తమాషాలు చేస్తున్నారా.. మర్యాదగా ఉండదు. నా కారునే తియ్యమంటారా.. నేను ఈ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిని.. డిజిగ్నేషన్‌ ఏమిటో తెలుసా? ఇవాళ్టితో పండగ అయిపోదు' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

సీఎం జగన్‌ పోలవరం పర్యటన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో పేర్ని నాని శుక్రవారం వచ్చారు. అక్కడ పార్క్‌ చేసిన మంత్రి కారు అడ్డుగా ఉంది తియ్యాలని ప్రొటోకాల్‌ సిబ్బంది కోరగా.. వారిపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

''కారు తియ్యమంది ఎవడో రండి.. మంచి, మర్యాద లేదు.. ఎవడి డిజిగ్నేషన్‌ ఏమిటో తెలీదు.. ఆ కారు ఎవడిది.. ఈ కారు ఎవడిది.. ఎవరివి ఈ కార్లన్నీ..? ఏం తమాషాలు చేస్తున్నారా..? కాన్వాయ్‌ ఎవరిదో తెలుసా..? ఎవరయ్యా కారు తియ్యమన్నది? ఎవరి కార్లు తియ్యమన్నాది..?'' అని అక్కడున్న పోలీస్‌ అధికారిని ప్రశ్నించారు.

దానికి ఆ అధికారి 'సార్‌ చెప్పింది చెప్పాం' అని వివరిస్తుండగా... 'ఒకడు చెప్పేది ఏంటయ్యా.. ఇన్‌చార్జి మంత్రిని నేను గుర్తుపెట్టుకో.. మీ ఎస్పీ కారు, డీఐజీ కారు ఇక్కడ ఎందుకుంటాయి?' అన్నారు.

'రమ్మను.... నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ వాళ్లు..? మర్యాదగా ఉండదు' అని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారని పత్రిక తెలిపింది.

ఆర్జీవీ

ఫొటో సోర్స్, INSTAGRAM

"హే.. పవన్ సర్! కాబోయే పీఎం కేఏపాల్ చెబుతున్నారు వినండి" అంటూ ఆర్జీవీ ట్వీట్

"హే.. పవన్ సర్! కాబోయే పీఎం కేఏపాల్ చెబుతున్నారు విను" అని క్యాప్షన్ పెడుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మాట్లాడిన వీడియోను ఆర్జీవీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారని ఈనాడు పత్రిక తెలిపింది.

పవన్ కల్యాణ్-రానా 'భీమ్లా నాయక్' తనకు నచ్చిందంటూ.. సినిమా అంతా ఉరుములు, మెరుపులు అంటూ పవన్‌ను ఇప్పటికే పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం మరోసారి తన ట్వీట్స్‌లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు.

ఇక ఆ వీడియోలో "పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నా, మంత్రి కావాలన్నా.. పవన్ అభిమానులందరికీ చెబుతున్నా.. మీకు ఒక్క పర్సంట్ నీతి, నిజాయితీ ఉన్నా పవన్ కల్యాణ్‌ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలని గెలిపించుకుని, మీరు 'ఎస్ ' అంటే నేనే ప్రధాన మంత్రిగా ఉంటాను. కావాలంటే పవన్ కల్యాణ్‌ని ఆంధ్రప్రదేశ్‌కు సీఎంని చేద్దాం. తప్పేముంది?" అంటూ ఆవేశంగా ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)