‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి - బీఆర్ఎస్) ఇచ్చిన ప్రధాన హామీల్లో ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య కూడా ఒకటి.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేటలో ఇటీవల ‘కేజీ టు పీజీ’ సమీకృత భవనాల క్యాంపస్ కూడా ప్రారంభమయ్యింది. ఇది తెలంగాణలో మొదటి ‘కేజీ టు పీజీ క్యాంపస్’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్యాంపస్‌కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
ఇక్కడికి పలకతో వచ్చిన వారు పీజీ డిగ్రీతో బయటకు వెళ్లొచ్చని, విద్యార్థులు, పౌరుల పురోగతి, సాధికారతకు ‘కేజీ టు పీజీ’ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
పలు కార్పొరేట్ సంస్థలు అందించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఈ క్యాంపస్ నిర్మించారు.
‘కేజీ టు పీజీ’ అమలులో గంభీరావుపేట ఒక ముందడుగు అన్న చర్చ ఒకవైపు, అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో ‘ఒక్క’ క్యాంపస్ నిర్మాణం మాత్రమే జరగడం పేదల ఉచిత విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్న విమర్శలు మరోవైపు వస్తున్నాయి.
అయితే, ‘కేజీ టు పీజీ’ మాటల్లో అయ్యేది కాదని, ఆవైపు ప్రణాళికబద్ధంగా అడుగులు పడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.