ప్రధాని మోదీ పర్యటన: తెలంగాణకు ఏమేం ఇస్తామన్నారు? ఏం ఇచ్చారు?

ఫొటో సోర్స్, Telangana BJP
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8(శనివారం) తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఖాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ సెంటర్ సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
గత నాలుగు నెలల్లో తెలంగాణలో ఆయన పర్యటించడం ఇది రెండోసారి.
ఏప్రిల్‌లో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సహా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు.
అప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు.
మరో ఐదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ సమయంలో ప్రధాని వరుస పర్యటనలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటోంది. తాజాగా వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.
చెప్పినట్లుగానే ఎవరూ హాజరుకాలేదు.
దీనిపై ప్రధాని సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు బహిష్కరించాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ తెలంగాణకు ఏమేం చేశారో చెప్తూ... ఇవన్నీ చేసినందుకు బహిష్కరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఏమిటి? వాటిల్లో ఏ మేరకు నెరవేరాయి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
రైల్వే కోచ్ ఫ్యాక్టరీనా? మరమ్మతుల కేంద్రమా?
ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.
దీన్ని ఖాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ చెప్పింది.
దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో నిధులు కేటాయించలేదు.
2022 ఏప్రిల్ లో గుజరాత్ లోని దాహోద్ లో రైల్వే వర్క్ షాపును లోకోమోటివ్ తయారీ కర్మాగారంగా అప్ గ్రేడ్ చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు.
ఇప్పుడు ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు. దీనికితోడు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.
అయితే.. ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదన.
అది వ్యాగన్ల మరమ్మతుల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
వ్యాగన్ల తయారీ కేంద్రం అడిగితే వ్యాగన్లకు మరమ్మతులు చేసే వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం 2009 నుంచి పెండింగులో ఉంది.
తొలిసారిగా ఆ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఖాజీపేట రైల్వే కోచ్ తయారీ ప్యాక్టరీ అంశం ప్రతిపాదించారు అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతాబెనర్జీ. తర్వాత పశ్చిమబెంగాల్ లో ఏర్పాటైంది.
అలా అప్పట్నుంచి పెండింగులో ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును చట్టంలో ప్రతిపాదించింది.
తర్వాత బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
‘‘ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై తేల్చాలి. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రిపేర్ల షాపు పెడుతున్నారు. తెలంగాణకు కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారు. ప్రధాని అంటే గుజరాత్ కు కాదు, యావత్ దేశానికి కదా..?’’ అని మోదీ తెలంగాణ పర్యటనకు ముందు మంత్రి కేటీఆర్ మీడియాతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజామాబాద్‌లో పసుపు బోర్డు
2019 ఎన్నికలలో నిజామాబాద్ లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ పడ్డారు.
పసుపు రైతుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తానని, లేకపోతే రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని బాండు పేపర్ రాసిచ్చి ఎన్నికల్లో గెలిచారు ధర్మపురి అరవింద్.
దీనిపై తర్వాత రగడ మొదలైంది.
పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంతో రైతులు నిరసన తెలుపుతున్నారు.
పసుపు రంగు బోర్డులు ఏర్పాటు చేసి నిజామాబాద్‌కు వచ్చిన పసుపు బోర్డు ఇదేనంటూ.. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు వ్యంగ్యాస్త్రాలను సంధించారు.
దేశంలో పండే పసుపులో దాదాపు 70 శాతం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనే పండుతుంది.
అందుకే పొగాకు, మిర్చి బోర్డు తరహాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
కానీ, 2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీసుగా అప్ గ్రేడ్ చేశారు.
పసుపు బోర్డు హామీ అక్కడికే పరిమితమైందని రైతు నాయకులు చెబుతున్నారు.
2023 మార్చి 29న తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగులో లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ప్రకటించారు.
‘‘పసుపు బోర్డు ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద పెండింగులో లేవు. సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం -1986 ప్రకారం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డుతో పసుపు, మిరపకాయలు సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాం’’ అని లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై తలో హామీ
విభజన చట్టంలోనూ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన ఉంది.
ఈ అంశాన్ని ప్రస్తావించడంలో చిన్న మెలిక కనిపిస్తుంది.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కాకుండా పరిశీలిస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది.
2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చింది.
దీనికి సంబంధించి సెయిల్ సంస్థతో సర్వే చేయించి ఉక్కు ఖనిజంలో నాణ్యత లేదని, 20 ఏళ్లకు సరిపడా ఖనిజం లేదని చెప్పింది.
అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ముందుకు వెళ్లలేదు.
బయ్యారంతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, వరంగల్ జిల్లా గూడూరు ప్రాంతాల్లో కలుపుకొంటే 83 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం మాత్రమే అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వం తేల్చింది.
20 ఏళ్ల కాలానికి పరిశ్రమ నడపాలనుకుంటే కనీసం 200 మిలియన్ టన్నుల ఖనిజం అవసరం ఉందని, ఆ స్థాయిలో లేనందున ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదంటూ తేల్చేసింది.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమపై హామీలు ఇచ్చింది.
సింగరేణి, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సహకారంతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్రం చేతుల్లోని కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పింది. అది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది’’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాలుగు రోజుల కిందట దిల్లీలో మీడియాతో అన్నారు.
ఇదే విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘‘బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోనే ఉంది. చట్టంలోని హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. పార్లమెంటు సాక్షిగా చట్టం చేసి కేంద్రమే నెరవేర్చడం లేదు’’ అని ఆయన మీడియాతో చెప్పారు.
గిరిజన విశ్వవిద్యాలయం: డీపీఆర్‌కే పరిమితం
గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ హామీ తొమ్మిదేళ్లుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కే పరిమితమైంది.
ములుగులో యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 331 ఎకరాల భూమిని కేటాయించింది.
అలాగే భవనాలను చూపించింది. దీనిపై డీపీఆర్ సిద్ధం చేసి గత ఫిబ్రవరిలో ఆర్థిక శాఖకు కేంద్ర విద్యా శాఖ పంపించింది.
కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
2021 సెప్టెంబరులో దిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం అందించారు.
ఇదిలా ఉండగా, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర బీజేపీ తరఫున మరో హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయం కాకుండా అదనంగా ఖమ్మంలో మరో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది.
ఖమ్మంలో వర్సిటీ అటుంచితే, ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం నేటికీ ఏర్పాటు కాలేదు.
ఈ విషయంపై గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ బీబీసీతో మాట్లాడారు. ‘‘గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గత పార్లమెంటు సమావేశాల్లో దిల్లీ వెళ్లి అన్ని పార్టీల ఎంపీలను కలిసి వచ్చాం. బీఎస్పీ ఎంపీ రాంజీ లోక్ సభలో ప్రశ్న కూడా వేశారు. కేంద్రం నుంచి ఇంకా స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభించాలని మా ప్రధాన డిమాండ్. వర్సిటీలో 80శాతం గిరిజనులకు సీట్లు ఇవ్వాలి. గిరిజన సాహిత్యం, స్క్రిప్టులపై పరిశోధన జరగాలి. రెగ్యులర్ కోర్సులతోపాటు గిరిజనులకు సంబంధించి కోర్సులు ఏర్పాటు చేయాలి’’ అన్నారు.
గిరిజన విశ్వవిద్యాలయంతోపాటు 2018లో బీజేపీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో రామగుండంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు వ్యవహారం పెండింగులోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉడాన్ పథకం: మామునూరు విమానాశ్రయం
వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టును 2016లో ఉడాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇక్కడ నిజాం కాలం నుంచి ఎయిర్ పోర్టు కొనసాగింది.
1980వ దశకం నుంచి ఈ ఎయిర్ పోర్టు ప్రాధాన్యం తగ్గిపోయింది.
ఇప్పటికే ఎయిర్ పోర్టు అథారిటీకి 737 ఎకరాల భూమి ఉంది.
మరో 253 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే ఎయిర్ పోర్టు అభివృద్ధికి వీలవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
‘‘మామునూరు ఎయిర్ పోర్టు అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి అవసరమైన భూసేకరణ పూర్తి చేస్తున్నాం.’’ అని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో మీడియాతో అన్నారు.
అలాగే ప్రస్తుతం శంషాబాద్ సమీపంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది.
ఈ విమానాశ్రయం నిర్మాణం సందర్భంగా జీఎంఆర్ సంస్థతో కేంద్ర ప్రభుత్వానికి కుదిరిన ఒప్పంద ప్రకారం 2029 వరకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాత ఉడాన్ పథకం కింద మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసినా, నేటికీ అక్కడ విమాన సేవలు ప్రారంభం కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూ బదలాయింపు జరగకపోవడంతో ఎయిర్ పోర్టు సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదని వరంగల్‌కు చెందిన బీజేపీ నాయకుడొకరు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెట్రో రైలు పొడిగింపు ఏమైంది?
2018 ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రస్తావించారు.
మెట్రో రైలు మార్గాన్ని పటాన్ చెరు, సూరారం, కొంపల్లి, అల్వాల్, ఈసీఐఎల్, బీఎన్ రెడ్డినగర్, తుక్కుగూడ, రాజేంద్రనగర్ ప్రాంతాలకు విస్తరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
ఇప్పటివరకు హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది.
ఎల్బీనగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్లలో మెట్రోరైలు నడుస్తోంది.
జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రోరైల్ నిర్మాణం కావాల్సి ఉంది. భూసేకరణలో ఇబ్బందులతో ఎంజీబీఎస్ వరకే కుదించారు.
మొత్తం 72 కిలోమీటర్లకుగాను 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉంది.
రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర 6250 కోట్లతో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతోంది.
గత నెలలో దిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్‌లను కలిశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెట్రో రెండో దశకు నిధులు ఇవ్వాలని కోరారు.
రాయదుర్గం-విమానాశ్రయం రూటుతోపాటు లక్డీకాపూల్-బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోలు నుంచి ఎల్బీ నగర్ వరకు ఐదు కిలోమీటర్లు ఆమోదం తెలపాలని కోరారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రారంభ దశలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి
సికింద్రాబాద్ స్టేషన్ 1874 అక్టోబరు 9న అందుబాటులోకి వచ్చింది.
దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
నిత్యం 210 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది.
గతంలో రైల్వే శాఖ బడ్జెట్‌లోనూ స్టేషన్ ఆధునికీకరణను ప్రస్తావించారు.
ఈ ఏప్రిల్ 8న రూ.715 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
వచ్చే మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నుంచి వివిధ రూట్లలో ఎంఎంటీఎస్ సదుపాయం
హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంఎంటీఎస్ మొదటి, రెండో దశలు అందుబాటులోకి వచ్చాయి.
ఇందులో రెండో దశ సగమే అందుబాటులోకి వచ్చింది.
మొత్తం వంద కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి చేయాల్సి ఉంది.
ఇప్పటివరకు మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్ నుమా-ఉందానగర్, లింగంపల్లి-తెల్లాపూర్ కలుపుకొని 50 కిలోమీటర్ల రెండోదశ అందుబాటులోకి వచ్చింది. ఈ రైళ్లను ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
సనత్ నగర్- మౌలాలి, సికింద్రాబాద్- ఘట్కేసర్, సీతాఫల్ మండి-మౌలాలి- మల్కాజిగిరి రూట్లలో ఎంఎంటీఎస్ రైలు సదుపాయం రావాల్సి ఉంది.
2014లో రూ.816 కోట్లతో ఎంఎంటీఎస్ రెండో దశను చేపట్టారు. 2019 నాటికే పూర్తి కావాల్సి ఉంది.
అంచనా వ్యయం రూ.1169 కోట్లకు పెరిగింది.
తాజా అంచనా ప్రకారం మరో రూ.401 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సి ఉంది.
దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మీడియాతో మాట్లాడారు. ‘‘2024 జనవరి నాటికి రెండో దశ పనులు పూర్తి చేయనున్నాం’’ అని చెప్పారు.
2018 ఎన్నికల్లో నగరం నుంచి తాండూరు, కామారెడ్డి, జనగామ, నల్లగొండ, జడ్చర్ల వరకు ఎంఎంటీఎస్ సదుపాయం పొడిగిస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో రెండో దశ పనులు కొలిక్కి తెస్తే కొంతమేర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని ప్రయాణికుల సంఘాలు చెబుతున్నాయి.
ఇక 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించిన మరో హామీ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.
హైదరాబాద్ – ఆదిలాబాద్, హైదరాబాద్ -కరీంనగర్, హైదరాబాద్-నాగార్జునసాగర్, హైదరాబాద్-శ్రీశైలం రూట్లలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఇంకా రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














