దిల్లీ లిక్కర్ ‘స్కాం’: ముగిసిన కవిత ఈడీ విచారణ

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విచారణ ముగిసింది.

దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో ఆమెను ఈడీ విచారిస్తోంది. 20న అంటే సోమవారం రాత్రి సుమారు 9 గంటల వరకు ఈడీ విచారించింది.

నేడు కూడా ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. పొద్దున 11 గంటల ప్రాంతంలో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లగా రాత్రి 9.30 గంటల వరకు విచారణ సాగింది.

ఈ కేసులో మార్చి 11న తొలిసారి ఈడీ విచారించింది. 2022 డిసెంబరులో సీబీఐ కూడా ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది.

నేడు పొద్దున విచారణకు వెళ్లేటప్పుడు తను వాడిన 'పాత ఫోన్లు' అంటూ కవర్లలో ఉంచిన మొబైల్ ఫోన్లను ఆమె మీడియాకు చూపించారు.

ఈడీ ఆరోపించినట్టు తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని ఆమె చెప్పారు.

దిల్లీలోని ఈడీ కార్యాలయంలో మూడవసారి విచారణకు మంగళవారం కవిత హాజరయ్యారు.

విచారణకు వెళ్లే ముందు ఈడీ కార్యాలయం బయట కారులో నిల్చొని తన పాత ఫోన్లను మీడియాకు చూపించారు.

తాను వాడిన ఆ పాత ఫోన్లను ఈడీకి అప్పగిస్తూ లేఖ రాశారు.

దిల్లీ మద్యం 'కుంభకోణం' లావాదేవీలు మాట్లాడిన ఫోన్లను కవిత ధ్వంసం చేశారంటూ ఈడీ గతంలో పలు రిమాండ్ రిపోర్టుల్లో ఆరోపణలు చేసింది.

కవిత తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

కవిత

ఫొటో సోర్స్, FaceBook/BRS Party

ఫొటో క్యాప్షన్, ఈడీ ఆరోపించినట్టు తాను ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ ఫోన్లను దిల్లీలో మీడియాకు చూపిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, FaceBook/BRS Party

‘‘నేను ఫోన్లు ధ్వంసం చేశాను అంటూ నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. మీరు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను మీకు సమర్పిస్తున్నాను.

ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా?

అసలు నన్ను విచారించకుండానే నేను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపణలు ఎలా చేసింది?

నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ, గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా.

ఈ తప్పుడు ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా బయటకు లీక్ చేయడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు.

తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేశారు.

ఈడీ వంటి దర్యాప్తు సంస్థ, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరం’’ అని కవిత తన లేఖలో ఆరోపించారు.

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, FaceBook/BRS Party

వరుసగా రెండో రోజూ విచారణకు కవిత

మంగళవారం దిల్లీలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంటి నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.

అంతకుముందు రోజు అంటే సోమవారం 10 గంటల పాటు ఆమెను ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెను ఆదేశించారు.

దీంతో 12 గంటల సమయంలో ఆమె మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మార్చి 11న తొలిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత

దిల్లీ మద్యం కేసులో మార్చి 11న కవిత తొలిసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 16న హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు వెళ్లలేదు. తనకు బదులుగా తన ప్రతినిధులను ఆమె పంపించారు.

ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే 20వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది.

దాంతో కవిత సోమవారం (మార్చి 20) రెండోసారి, దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

గతంలో ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను విచారించింది.

దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ సీఏ బుచ్చి బాబులను కూడా ఈడీ అరెస్టు చేసింది.

దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసులో సీబీఐ, ఈడీ అరెస్టు చేసింది.

దిల్లీ లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా చూసేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన అభియోగం. అందులో కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి.

కల్వకుంట్ల కవిత

ఎలా మొదలైంది?

2022 ఆగస్టులో దిల్లీకి చెందిన బీజేపీ నాయకులు కొందరు కవితపై మద్యం పాలసీలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు చేశారు.

"లిక్కర్ డీల్ గురించి దిల్లీ ఒబెరాయ్ హోటెల్‌లో సూట్ రూమ్ ఆరు నెలలు బుక్ అయింది. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కొందరు లిక్కర్ మాఫియా వ్యక్తులు, కొన్ని రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు’’ అని దిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ అన్నారు. ఆయన ఎక్కడా కవిత పేరును నేరుగా ప్రస్తావించలేదు.

‘‘వాళ్లు (కేసీఆర్ కుటుంబ సభ్యులు) ఒక ప్రైవేటు విమానంలో వచ్చేవారు. ఇక్కడ ఏ1 లైసెన్స్ హోల్డర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల ద్వారా మనీష్ సిసోడియాకు 150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది మొదటి డీల్.

అసలు కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిశారా లేదా, ఒబెరాయ్ హోటెల్లో కలిశారా లేదా అనేది సిసోడియా సమాధానం చెప్పాలి?" అని పర్వేశ్ సింగ్ అన్నారు.

అదే సందర్భంలో, దిల్లీకే చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా మాత్రం నేరుగా కవిత పేరు ప్రస్తావించారు.

"కె కవిత చాలా మందిని దక్షిణాది నుంచి తీసుకుని వచ్చారు. ఆప్ నాయకులు పంజాబ్, గోవా ఎన్నికల ఖర్చు కోసం 150 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నారు. మేం హోటెల్‌ రూమ్ నంబర్ కూడా చెప్పగలం.

డబ్బు ఎవరు, ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ పెట్టారు? అనేది కూడా చెప్పగలం. అన్ని వివరాలూ మా దగ్గర ఉన్నాయి. మేం చెప్పేది తప్పయితే, మీరు సమాధానం చెప్పండి.’’ అన్నారు మంజీందర్ సిర్సా.

వీళ్లిద్దరూ ఈ వ్యాఖ్యలు చేసింది 2022 ఆగస్టులో. ఈ ఇద్దరు నాయకులూ కవిత పేరు బయటకు తేవడంతో కేసు విషయం బయటకు వచ్చి రాజకీయ చర్చ మొదలైంది. ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి. 6 నెలలు తిరగకుండానే కవిత విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.

తనపై ఆరోపణలను కవిత ఖండిస్తూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)