ప్రతినెలా 6 వేల కోట్లు నష్టం వస్తున్నా బిహార్‌ రాష్ట్రం 6 సంవత్సరాలుగా మద్య నిషేధాన్ని ఎందుకు అమలు చేస్తోంది?

మద్య నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జాజ్వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చి ఆరేళ్లు దాటినా, దీనిపై రగడ సద్దుమణగట్లేదు. కొన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై మాట్లాడితే, కొన్నిసార్లు జితన్ రామ్ మాంఝీ ఆ ప్రస్తావన తీసుకొస్తారు.

ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు నితీశ్ కుమార్‌పై అస్త్రాలు సంధిస్తుంటారు. జేడీయూ నేతలు మద్య నిషేధాన్ని సమర్థిస్తూ వాటిని తిప్పికొడుతుంటారు.

ఆదివారం, జేడీయూ సమావేశంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ, ఎవరు ఏం చెప్పినా బిహార్‌లో మద్య నిషేధం నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. మద్యపాన నిషేధాన్ని ప్రారంభించినప్పుడు ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదని, ఈ నిషేధం వలన నేడు అనేక కుటుంబాల పరిస్థితి మెరుగుపడిందని నితీశ్ కుమార్ అన్నారు. 

ప్రత్యర్థుల వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. 

"కొందరు మద్యం తాగి చాలా పెద్దమనుషులు అయిపోతారు. మహిళల డిమాండ్‌పై ఈ చట్టాన్ని అమలు చేశాం. ఫలితాలు ప్రయోజనకరంగా ఉన్నాయి" అన్నారు.

నితీశ్ కుమార్

ఫొటో సోర్స్, MANISH SHANDILYA

ఈ వివాదంలో నితీశ్ ఎందుకు స్పందించారు?

బిహార్ ప్రభుత్వంలోని ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం, 2016 ఏప్రిల్ 1న మద్య నిషేధం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ చట్టం కింద ఆరున్నర లక్షలకు మందికి పైగా అరెస్టు అయ్యారు.

అరెస్ట్ అయిన వారిలో చాలామంది బలహీన వర్గాలకు చెందిన వారని, వెనుకబడిన తరగతులకు చెందిన లక్షలాది మంది జైళ్లలో ఉన్నారని, కుర్హానీలో జరిగిన ఓటింగ్‌లో ఈ ఆగ్రహం కనిపించిందని సీనియర్ జర్నలిస్ట్ కన్హయ్య భేలారీ అభిప్రయపడ్డారు.

"తాగినవారిని అరెస్ట్ చేయడం సరే, ఈ నిషేధ చట్టం వలన కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయినవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం లభించదు. ఇవన్నీ ఇప్పుడు బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి. అందుకే నితీశ్ స్వయంగా ఈ చర్చల్లోకి దిగారు" అని పట్నాలో పీటీఐ జర్నలిస్ట్ నచికేత నారాయణ్ అన్నారు. 

జేడీయూ మాజీ నేత, ఒకప్పుడు నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, ఆర్‌సీపీ సింగ్ ఈ అంశంపై స్పందిస్తూ, "బిహార్‌లో ప్రజలు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. బిహార్‌లో మద్యం అమ్ముతున్నారు. నితీశ్ కుమార్ మొండిగా ఉన్నారు. బిహార్ ప్రజలు ఆయనకు పాఠం చెప్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లకు ఒక్క ఓటు కూడా దక్కదు" అని అన్నారు. 

బిహార్‌లోని కుర్హానీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్తా 3649 ఓట్లతో జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన మనోజ్ కుష్వాహపై విజయం సాధించారు. 

కుర్హానీలో నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ కలిసి ప్రచారం చేసినా కూడా జేడీయూ ఓడిపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కలిసి పోటీ చేశాయిగానీ ఆర్‌జేడీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. 

కుర్హానీలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సుమారు 60 వేల మంది ఓటర్లు ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్ల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది.

మొత్తం 4448 మంది ఓటర్లు ఏ పార్టీకీ ఓటు వేయకుండా నోటా బటన్‌ నొక్కారు. నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

బిహార్

ఫొటో సోర్స్, MANISH SHANDILYA

నితీశ్ పైనే ప్రత్యర్థుల గురి

నితీశ్ కుమార్ మద్యం నిషేధం విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్‌సీపీ సింగ్ అన్నారు.

"ఈ విధానాన్ని వెనక్కు తీసుకోక తప్పదు. గత ఏడేళ్లలో బిహార్‌కు లక్ష కోట్లకు పైగా నష్టం వచ్చింది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ డబ్బు బిహార్‌కు ప్రయోజనం చేకూర్చగలదో, అదే నష్టపోతున్నాం" అని ఆయన అన్నారు.

బిహార్‌లో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా, అక్రమ స్థలాలపై దాడులు చేయడంతోపాటు చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులపై కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా, మద్య నిషేధం చట్టాన్ని ఉల్లంఘించే కేసులు మాత్రం తగ్గడం లేదు. 

నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా బిహార్‌లో సామాన్య ప్రజల వద్ద, అసెంబ్లీ ప్రాంగణాలు, దేవాలయాల్లో కూడా మద్యం సీసాలు దొరికాయి. అంతే కాదు, వేల లీటర్లలో సీజ్ చేసిన మద్యాన్ని ఎలుకలు తాగేసినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి.

"బిహార్‌లో, వేల లీటర్ల మద్యం నమూనాలను టెస్టింగ్ పేరుతో భద్రపరుస్తారు. 50 లేదా 100 మి.లీ. మద్యం శాంపిల్‌తో పరీక్షలు నిర్వహించవచ్చు. లీటర్ల కొద్దీ ఎందుకు ఉంచాలి? కొంచం శాంపిల్‌కి ఉంచుకుంటే ఎలుకలు మద్యం తాగాయి అన్న వార్తలు రాకుండా చేయవచ్చు" అని పట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ విద్యార్థి వికాస్ అన్నారు. 

"బిహార్‌లో 30 నుంచి 40 శాతం ప్రజలు మద్యం నిషేధాన్ని అంగీకరించట్లేదు. అందుకే నిషేధం పూర్తిగా సఫలం కావట్లేదు. దీని కోసం మరింత శక్తిమంతమైన 'యాంటీ లిక్కర్ సేల్' విధానాన్ని తీసుకురావాలి. దీనికి పోలీసులను దూరంగా ఉంచాలి" అని విద్యార్థి వికాస్ అభిప్రాయపడ్డారు. 

బిహార్‌లో మద్యపాన నిషేధం మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా అమలు అవుతోందని పీటీఐ జర్నలిస్ట్ నచికేత నారాయణ్ అన్నారు. 

"డాక్టర్ ఎవరైనా ఆరోగ్యం కోసం కొంచెం మద్యం తాగమని సలహా ఇస్తే, అది తీసుకునే పరిస్థితి లేదు. బయటి నుంచి తీసుకొచ్చి, ఇంట్లో కూర్చుని మద్యం సేవించినా చట్టవిరుద్ధమే. గుజరాత్‌లో మద్య నిషేధం ఇలా లేదు" అని ఆయన అన్నారు.

మద్య నిషేధం

ఫొటో సోర్స్, MANISH SHANDILYA

ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి?

బిహార్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది దాదాపు 40 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని జప్తు చేశారు. ఇందులో సగానికి పైగా దేశీయ మద్యం కాగా, మిగతాది విదేశీ మద్యం. ఈ ఏడాది కూడా ఒక లక్ష 38 వేలకు పైగా అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. 

ఒక్క నవంబర్ నెలలోనే మూడు లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని ప్రభుత్వ సంస్థలు జప్తు చేశాయి.

బిహార్‌లో 2016లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. 2022 నవంబర్ 21 వరకు అందుబాటులో ఉన్న డాటాను బీబీసీ పరిశీలించింది.

బీహార్‌లో ఇప్పటివరకు నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 5,05,951 కేసులు నమోదయ్యాయి.

గత ఆరేళ్లలో సుమారు రెండున్నర కోట్ల లీటర్ల (2,42,26,060) అక్రమ మద్యం పట్టుబడింది. అదే సమయంలో, నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరున్నర లక్షల (6,55,770) మందికి పైగా అరెస్టు అయ్యారు. 

చట్ట ప్రకారం, స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను పగలగొట్టి ధ్వంసం చేస్తారు. డిసెంబర్ 5 వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇంకా 8 లక్షల 40 వేల లీటర్ల మద్యం ధ్వంసం కావాల్సి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అక్రమ మద్యం వ్యాపారం

బిహార్‌లో మద్య నిషేధానికి సంబంధించి ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని పోలీసుల చేత కూడా ప్రమాణం చేయించారు. కానీ, ఈ చట్టం ఉల్లంఘన ఆగినట్టు కనిపించడంలేదు.

"బిహార్‌లో మద్యం అక్రమ వ్యాపారం పోలీసుల రక్షణలోనే జరుగుతోంది. ఇప్పటి వరకు, నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏ సీనియర్ పోలీసు అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ వ్యాపారం ఆగడంలేదు" అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. 

అయితే, మద్యానికి బానిసలైన వారి అలవాటు ఒక చట్టం వల్ల అంతం కాదని, దాని డిమాండ్ అలాగే ఉంటుందని నచికేత నారాయణ్ అభిప్రాయపడ్డారు. 

"ప్రపంచంలో చాలా దేశాలు మద్య నిషేధాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాయి. 1930లలో అమెరికాలో ఈ ప్రయత్నం జరిగింది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఈ ప్రయోగం చేశాయి. కానీ విజయవంతం కాలేదు. హెల్మెట్ లేకుండా పోలీసులు పట్టుకుంటే వెంటనే రూ. 50 చలాన్ కట్టేసి తప్పించుకుంటారు. అక్రమంగా మద్యం వ్యాపారం చేసే వారు కూడా ఇదే పని చేస్తున్నారు" అని ఆయన అన్నారు. 

మరోవైపు, రాష్ట్ర పోలీసులు ప్రధానంగా అక్రమ మద్యం వేటలో పడడం వలన, ఇతర నేరాలపై వారి దృష్టి తగ్గుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి ఎంత నష్టం వాటిల్లింది?

నిషేధం కారణంగా బిహార్ ప్రభుత్వం ప్రతి నెలా సుమారు ఆరు వేల కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని చెబుతున్నారు. ఇందులో ఒక పెద్ద భాగం అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న వారికి చేరుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. 

"ఈనాడు అధికారుల ఇళ్లల నుంచి మద్యం లభిస్తోంది. పోలీసు స్టేషన్ల నుంచి మద్యం పంపిణీ చేస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారం ఎంత భారీగా జరుగుతోందంటే, షార్ట్ కట్‌లో డబ్బు సంపాదించేదుకు యువత కూడా ఇందులోకి దిగుతున్నారు" అని సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. 

మద్యం ధరలు పెంచితే, అది చాలా మందికి అందుబాటులో ఉండకుండా ఉంటుందని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని నచికేత నారాయణ్ అభిప్రాయపడ్డారు.

కానీ, ప్రస్తుతానికి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తున్నట్తు కనిపించట్లేదు.

అయితే, ప్రొఫెసర్ విద్యార్థి వికాస్.. అభివృద్ధి, ఆదాయాన్ని వేరే కోణం నుంచి చూస్తున్నారు.

"సామాజిక కోణం నుంచి మద్య నిషేధం చాలా మంచి విషయం. ఇది సమాజంలో శాంతిని నెలకొల్పుతుంది. వీధుల్లో ఈవ్ టీజింగ్ ఘటనలు తగ్గుతాయి. కొట్లాటలు, తగాదాలు తగ్గుతాయి. అందుకే నిషేధం తప్పు అని ఎవరూ అనరు. 

ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది అన్నది నిజమే కానీ, చాలా కుటుంబాలలో డబ్బు ఆదా అవుతోంది. అది వారి పిల్లల చదువులకు లేదా నిత్యావసర వస్తువులకు ఉపయోగపడుతుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: