లాక్మే బ్రాండ్ ఎలా పుట్టింది... లక్ష్మీదేవికీ ఈ పేరుకూ ఏమిటి సంబంధం?

కాస్మోటిక్ బ్రాండ్ లాక్మే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జైదీప్ వసంత్
    • హోదా, బీబీసీ గుజరాతి కోసం

గత కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న ఈ పారిస్ వీధులు, ఒకప్పుడు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ చిరస్మరణీయ ఘట్టాలకు నెలవు. అలాంటి ఒక చారిత్రక ఘట్టం నుంచే భారత తొలి దేశీయ కాస్మోటిక్ బ్రాండ్ ‘లాక్మే’ పుట్టింది.

లాక్మేను ప్రస్తుతం బ్రిటన్‌కు చెందిన ‘హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీ’ నడుపుతోంది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ బ్రాండ్‌గా మారింది. కానీ, దీన్ని తొలుత భారత వ్యాపారవేత్త స్థాపించారు.

అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థనతో ఈ వ్యాపారవేత్త లాక్మే బ్రాండ్‌ను నెలకొల్పారు. నాటిప్రధానమంత్రికి తన కూతురి నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ బ్రాండ్‌ పుట్టుకొచ్చిందని చెబుతారు.

ఆ సమయంలో వ్యాపారవేత్తకు, ప్రధానమంత్రికి కొన్ని విషయాల విషయంలో సిద్ధాంత పరంగా విభేదాలున్నాయి. అయినప్పటికీ, ప్రధాని అభ్యర్థన మేరకు కాస్మోటిక్స్ తయారీ రంగంలోకి అడుగుపెట్టారు ఆ వ్యాపారవేత్త.

ఆ ప్రధానమంత్రి మరెవరో కాదు జవహర్‌లాల్ నెహ్రూ. ఆ వ్యాపారవేత్త... ఇంకెవరు, జేఆర్‌డీ టాటా. ఆ తర్వాత రతన్ టాటా ఈ బ్రాండ్‌ను అమ్మేశారు.

లాక్మే బ్రాండ్ ఎలా పుట్టింది? దానికి ఈ పేరెలా వచ్చింది?

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

నెహ్రూ, ఇందిర, టాటాలతో లాక్మే అవతరణ

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కమ్యూనిస్ట్ భావజాలంతో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని అనుసరించారు.

దీంతో బీమా, బ్యాంకింగ్, మైనింగ్, సివిల్ ఏవియేషన్ రంగాల్లో పనిచేసే కంపెనీలను జాతీయీకరణ చేశారు.

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా కంపెనీలో 49 శాతం వాటాను ప్రభుత్వం 1949లో కొనుగోలు చేసింది.

జేఆర్‌డీ టాటాకు ఏవియేషన్ అంటే ఎంతో మక్కువ. తనకు తాను పైలట్ లైసెన్స్‌ తీసుకున్నారు. కానీ, దీనిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఆర్‌డీ టాటా ఎయిరిండియాను అంతర్జాతీయ విమానయాన సంస్థగా తీర్చిదిద్దాలనుకున్నారు. కానీ, ప్రభుత్వ జోక్యంతో అది సాధ్యం కాలేదు.

ఈ మార్పుతో కంపెనీకి చెందిన పెట్టుబడిదారులు, ఇతర లబ్దిదారులు నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన భావించారు.

చివరికి 1953లో ఎయిరిండియాను ప్రభుత్వ జాతీయం చేసింది. ఈ నిర్ణయం జేఆర్‌డీ టాటాను మరింత షాక్‌కు గురి చేసింది.

దీంతో, జేఆర్‌డీ టాటాకు, నెహ్రూకు మధ్యలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. గిరీష్ కుబేర్ తన పుస్తకం ‘ది టాటాస్’ చాప్టర్ 11లో ఈ మొత్తం సందర్భం గురించి టైమ్ లైన్‌తో పాటు వివరించారు.

ఆ సమయంలో భారత్ కాస్మోటిక్స్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అంతర్జాతీయ వేదికపై అమెరికా ప్రాబల్యం పెరిగింది. డాలర్ విలువ కూడా ఎగిసింది.

అయితే, విదేశీ నిల్వలను కాపాడుకునేందుకు, భారత ప్రభుత్వం కాస్మోటిక్స్ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

ఈ నిర్ణయం మహిళలపై బాగా ప్రభావం చూపింది. ఈ ఉత్పత్తులను ఎక్కువగా వాడే వారిలో మహిళలున్నారు.

ఈ విషయంపై ప్రధానమంత్రి అధికారిక నివాసం వద్ద మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి.

చైనా ప్రధానమంత్రితో ఇందిరా, నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

ఇందిరా గాంధీ ఏం చేశారు?

వారి ఆందోళనలను, బాధలను నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా దగ్గరుండి చూశారు. ఈ విషయంపై ఏదో ఒకటి చేయాలని కూతురు కూడా తండ్రి నెహ్రూపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు.

ఒక రోజు నెహ్రూ తన ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్తోన్న సమయంలో, ఒక మహిళల బృందం ఆయన నివాసానికి వెలుపల కారును ఆపేసింది.

దిగుమతి చేసుకునే కాస్మోటిక్స్ ఉత్పత్తులు లేకపోవడంతో తాము ఎలాంటి ఇబ్బందులను పడుతున్నామో నెహ్రూకు తెలియజేశారు.

నెహ్రూ తన వ్యక్తిగత సహాయకుడు ఎం.ఓ మథాయ్‌ని దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు.

కానీ, ఈ విషయాన్ని మథాయ్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే, ఇందిరా గాంధీ దీనిపై ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు ఇదెందుకు మీకంత ముఖ్యం? అని ప్రశ్నించారు.

ఎందుకంటే, ఏ భారతీయ కంపెనీ ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయడం లేదు అని ఇందిరాగాంధీ సమాధానమిచ్చారు.

దీంతో, టాటా గ్రూప్ కాస్మోటిక్స్ కంపెనీని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని దిల్లీలోని టాటా ప్రతినిధితో మథాయ్ చెప్పారు. ఇది మాత్రమే కాక, దీనికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను తాము అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విషయం విని జేఆర్‌డీ టాటా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే, ఒకవైపు నెహ్రూ ప్రభుత్వం ఎయిరిండియాను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అనడం జేఆర్‌డీ టాటాను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ తర్వాత ఎయిరిండియాను నెహ్రూ ప్రభుత్వం జాతీయం చేసి, దానికి చైర్మన్‌గా జేఆర్‌డీ టాటాను నియమించింది.

కొన్నేళ్ల తర్వాత, దేశ ప్రధానమంత్రి పదవిని ఇందిరా గాంధీ చేపట్టినప్పుడు కూడా, ఎయిరిండియా చైర్మన్‌గా జేఆర్‌డీ టాటానే ఉన్నారు.

ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మాత్రం వారికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్‌గా జేఆర్‌డీ టాటా స్థానంలో, రతన్ టాటాను నియమించారు. ఈ విషయంలో జేఆర్‌డీ టాటా ఎలాంటి మనస్తాపం చెందలేదు.

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

భారతీయులకు తగిన విధంగా...

భారతీయ వాతావరణం, చర్మానికి తగ్గట్టు కాస్మోటిక్ ఉత్పత్తులను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని టాటాలు చేపట్టారు.

ఆ సమయంలో టాటా గ్రూప్‌కు దేశంలో వివిధ ప్రాంతాల్లో పలు పారిశ్రామిక యూనిట్లున్నాయి. ముంబైలో హోటల్స్, బిహార్‌లో స్టీల్, గుజరాత్‌లో కెమికల్స్ ఉన్నాయి.

అలాంటి ఒక యూనిట్ కొచ్చిలో కూడా ఒకటుండేది. దాని పేరు టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ (టామ్‌కో).

1920 నుంచి ఈ కంపెనీని టాటా గ్రూప్ నడుపుతోంది. ఈ యూనిట్‌లో ఎండు కొబ్బరి నుంచి నూనెను తీసి, దాన్ని విదేశాలకు ఎగుమతి చేసే వారు.

ఆ తర్వాత, ఈ కంపెనీ సోపులను, డిటర్జెంట్లను, షాంపులను, వంటనూనెలను, సుగంధ నూనెలను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

501, ఓకే, మ్యాజిక్ వంటివి ఈ కంపెనీకి ఫ్లాగ్‌షిప్ బ్రాండ్లుగా ఉండేవి. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా దీనికి తయారీ యూనిట్లు ఉండేవి.

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీకి సబ్‌ యూనిట్‌గా 1952 డిసెంబర్ 5న లాక్మే బ్రాండ్‌ను ప్రారంభించారు.

రాబర్ట్ ఫిగ్గోట్, రేనార్ వంటి ఫ్రెంచ్ కంపెనీలు, కోల్మార్ వంటి అమెరికన్ కంపెనీల నుంచి దీని ఫార్ములాను కంపెనీ కొనుగోలు చేసింది.

దీని కోసం, విదేశీ కంపెనీలకు ఈ టాటా యూనిట్‌లో ఎలాంటి ఈక్విటీని ఇవ్వలేదు. కానీ, ఫార్ములా కోసం ఫీజులు చెల్లించింది టాటా గ్రూప్.

1961లో రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు.

ఫ్రాన్స్‌లో పుట్టి, స్విట్జర్లాండ్‌లో చదువుకున్న సిమోన్ టాటా, లాక్మే ఉత్పత్తులపై లోతైన అవగాహనను పెంచుకున్నారు. ఆ తర్వాత ఆమె 1982లో ఈ కంపెనీలో చైర్మన్ స్థానానికి ఎదిగారు.

అప్పటి బొంబైలోని పొద్దార్ రోడ్డులో అద్దెకు తీసుకున్న ప్రాంతం నుంచి దీని ఉత్పత్తి ప్రారంభించారు. ఈ దశాబ్ద కాలంలో కంపెనీ ఉత్పత్తుల శ్రేణి, ఉత్పత్తి రెండూ పెరిగాయి.

ఆ తర్వాత దీని తయారీ విభాగాన్ని ముంబైలోని షెవాడి ప్రాంతానికి తరలించారు. పొద్దార్ రోడ్డులో ఉన్న దాని కంటే మూడింతలు ఎక్కువ స్థలం ఈ ప్రాంతంలో ఉంది.

డిమాండ్‌ను అందుకునేందుకు ఈ అదనపు స్థలం కంపెనీకి సరిగ్గా సరిపోయింది. అలాగే ఈ విభాగంలో పనులను కూడా రెండు షిఫ్ట్‌లలో చేయడం మొదలు పెట్టారు.

ఆకర్షణీయమైన ప్యాకింగ్, నాణ్యతలో అత్యున్నత ప్రమాణాలను అనుసరించడం, విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు, కాలానుగుణంగా మార్కెట్ సర్వేలతో ఈ కంపెనీ ప్రొడక్ట్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

మిగిలిన పనంతా కంపెనీ అమ్మకపు కార్యాలయం, అమ్మకందారులు, డీలర్లు, ఏజెంట్లు చేపట్టారు. దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా జనాభా ఉన్న నగరాలు, పట్టణాలన్నింటికీ ఈ కంపెనీ ఉత్పత్తులను పంపారు.

భారతీయుల కోసం తీసుకొచ్చిన ఈ వినూత్న ఉత్పత్తులను అధునాతన ల్యాబ్‌లలో అభివృద్ధి చేసి, పరీక్షించారు.

మహిళల స్కిన్‌కేర్, మేకప్, టాయిలెట్రీస్‌లలో విజయవంతమైన తర్వాత, లాక్మే పురుషుల ఉత్పత్తులను కూడా లాంచ్ చేసింది.

1980లో లాక్మేనా బ్యూటీ సలూన్‌ కూడా లాంచ్ చేశారు.

ఇది మాత్రమే కాక, లాక్మే బ్యూటీ స్కూల్‌నూ ఏర్పాటు చేసింది. ఒక్కడ బ్యూటిషియన్లకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి, వారికి డిప్లోమా సర్టిఫికేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్మి నుంచి లాక్మే

అయితే, భారత ప్రముఖ కాస్మోటిక్స్ బ్రాండ్ లాక్మేకు ఆ పేరు పారిస్‌ వీధుల నుంచి వచ్చిందంటే ఆశ్చర్యమే. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది.

టాటా ప్రతినిధులు ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు ఈ కొత్త బ్రాండ్‌కు ఏం పేరు పెట్టాలా అని సూచనలు అడిగారు.

ఆ సమయంలో ఫ్రాన్స్‌లో ‘లాక్మే’ అనే ఒక ఒపేరా చాలా ప్రాచుర్యం పొందింది. లాక్మే అనేది లక్ష్మి పేరుకు ఫ్రెంచ్ రూపం. ఈ పేరు భారతీయతను ప్రతిబింబిస్తుంది. కానీ, ఫ్రెంచ్ ప్రభావానికి గురి కావడంతో ఈ పేరులో కాస్త మార్పు చోటు చేసుకుంది.

ఈ ఫ్రెంచ్ ఒపేరా 19వ శతాబ్దంలోనిది. నీలకంఠ అనే పూజారి, ఆయన కూతురు లక్ష్మి, పనిమనిషి మల్లిక, ఇద్దరు బ్రిటీష్ ఆర్మీ ఆఫీసర్లు ఫ్రెడరిక్, గెరాల్డ్‌ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

పువ్వులను తీసుకొచ్చేందుకు ఒకసారి లక్ష్మి, ఆమె పని మనిషి మల్లిక నదీ తీరానికి వెళ్తారు.

స్నానం చేసేందుకు లక్ష్మి నీళ్లలోకి వెళ్లారు. ఈ సమయంలో ఆమె ధరించిన ఆభరణాలన్నింటిన్ని ఒక ప్రాంతంలో పెట్టారు. అప్పుడు ఇద్దరు బ్రిటీష్ ఆర్మీ అధికారులు అక్కడికి వస్తారు.

లక్ష్మిని చూసిన ఆ బ్రిటీష్ అధికారి ఆమెను ఇష్టపడతారు. గెరాల్డ్ లక్ష్మి బొమ్మను గీయడం ప్రారంభిస్తారు.

ఒక్కసారిగా ఆ ఆర్మీ అధికారిని చూసిన లక్ష్మి గట్టిగా అరుస్తారు. లక్ష్మికి నచ్చజెప్పేందుకు గెరాల్డ్ ప్రయత్నిస్తారు.

గెరాల్ట్ మాటలకు సమ్మతించిన లక్ష్మి, ఆమె అరుపులకు అక్కడికి వచ్చిన వారిని వెనక్కి పంపుతారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడతారు.

తన కూతురు, బ్రిటీష్ అధికారితో ప్రేమలో ఉందన్న విషయాన్ని నీలకంఠ తెలుసుకుని, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు.

మార్కెట్లో లక్ష్మిని పాట పాడాలని నీలకంఠ అడుగుతారు. అది విన్న గెరాల్ట్ లక్ష్మిని చూసేందుకు అక్కడికి వస్తారు. ఆ సమయంలో బ్రిటీష్ ఆర్మీ అధికారిపై ఆయన దాడి చేస్తారు.

దాడికి గురైన ఆర్మీ అధికారిని అడవిలో దాచేసి, అతనికి చికిత్స ఇస్తారు లక్ష్మి. గెరాల్డ్ కోలుకుంటారు. వచ్చే జన్మలో కూడా తమ పవిత్ర బంధం దృఢంగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మి పవిత్ర జలం తీసుకొచ్చేందుకు వెళ్తారు.

ఆ సమయంలో మరో ఆర్మీ అధికారి ఫ్రెడరిక్ అక్కడికి వచ్చి, గెరాల్డ్‌కు తన బాధ్యత గురించి తెలియజేస్తారు.

ఆ తర్వాత గెరాల్ట్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. గెరాల్డ్‌లోని ఆ మార్పును లక్ష్మి గుర్తిస్తారు. తన ప్రేమను కోల్పోయినట్లు లక్ష్మికి అనిపిస్తుంది.

అవమానంతో జీవించడం కంటే చనిపోవడమే మేలని లక్ష్మి భావిస్తారు. ఉమ్మెత్తను తిని లక్ష్మి చనిపోతారు. అలా ఆ ఆర్మీ అధికారి, లక్ష్మిల మధ్య ప్రేమ బంధం విషాదకరంగా ముగుస్తుంది.

లక్ష్మిని ఐశ్వర్యం, శ్రేయస్సును కలిగించే దేవతగా కొలుస్తారు. అందానికి ప్రతీకగా కూడా చెబుతారు. అలా, ఫ్రెంచ్ రూపంలోని ఈ పేరును ‘లాక్మే’ బ్రాండ్‌కి పెట్టారు.

టాటాలు

ఫొటో సోర్స్, Getty Images

హిందూస్తాన్ లీవర్‌లో విలీనం

1991లో జేఆర్‌డీ నుంచి టాటా గ్రూప్ వారసత్వాన్ని రతన్ టాటాస్వీకరించారు. ఆ తర్వాత, గ్రూప్‌లో రతన్ టాటా భారీ మార్పులు చేశారు.

బోర్డులోని డైరెక్టర్లకు పదవీ విరమణ వయసును అమల్లోకి తీసుకొచ్చారు. దర్బారి సేథ్, అజిత్ కెర్కర్(టాటా హోటల్స్ ఇండస్ట్రీ), రుసి మోదీ(టాటా స్టీల్ ఇండస్ట్రీ), నాని పాల్కీవాలా(సిమెంట్) ఆయనపై తిరుగుబాటు చేశారు.

జేఆర్‌డీ టాటా కాలంలో, టాటా కంపెనీలకు సొంతంగా నడిచే స్వేచ్ఛ ఇచ్చారు. అయితే, రతన్ టాటా మాత్రం అన్ని కంపెనీలు టాటా బ్రాండ్‌తో అనుసంధానం కావాలని, వాటన్నింటికీ ఒకే గుర్తింపు ఉండాలని కోరుకున్నారు.

ఇది మాత్రమే కాక, కంపెనీల నాయకత్వంలో టాటా సన్స్ ఆధిపత్యాన్ని పెంచాలనుకున్నారు.

కంపెనీ మద్యం వ్యాపారాలను అమ్మేశారు. ఆ సమయంలో అంటే 1992 మార్చిలో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ (టామ్‌కో) రూ.13 కోట్ల నష్టాలను నమోదు చేసింది.

కాలానుగుణంగా టామ్‌కో మారలేదని రతన్ టాటా గుర్తించారు. కంప్యూటరైజేషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను ఆధునీకరించకపోవడం వల్ల 10 ఏళ్ల వెనుకాల ఉందని గుర్తించారు.

టెట్లీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్, డేవూ, కోరస్ వంటి ప్రముఖ విదేశీ కొనుగోళ్లను రతన్ టాటా చేపట్టారు.

1993లో టామ్‌కోను దాని ప్రత్యర్థి సంస్థ హిందుస్తాన్ లీవర్ (ప్రస్తుతం హిందుస్తాన్ యూనిలీవర్)లో రూ.400 కోట్లకు విలీనం చేశారు.

టామ్‌కో షేర్‌హోల్డర్లకు తమ వాటాకు ప్రతిఫలంగా హెచ్‌యూఎల్ షేర్లలో ఒక శాతం అందుకున్నారు.

1996లో లాక్మే, హిందూస్తాన్ లీవర్‌ 50:50 భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ ఏర్పాటైంది.

ఆ తర్వాత 1998లో ఈ యూనిట్‌ను హిందూస్తాన్ లీవర్‌కు అమ్మేశారు.

ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, గోద్రెజ్ ఇంతకుముందు ఇలాంటి డీల్స్ చేసుకోవడంతో, మార్కెట్ పెద్దగా ఆశ్చర్యానికి గురి కాలేదు.

10 శాతం వాటా లాక్మేదే

నేడు లాక్మే లిప్‌స్టిక్, కాజల్, ఐ షాడో, మేకప్, నెయిల్ కలర్, ఫేస్ మాస్క్, సన్‌స్క్రీన్ లోషన్ వంటి పలు ఉత్పత్తులను తయారీ చేసి, విక్రయిస్తోంది. ప్రతి సంవత్సరం ఫ్యాషన్ వీక్ స్పాన్సర్లుగా ఉంటోంది.

భారతీయ కాస్మోటిక్ మార్కెట్లో 2022 నాటికి 10 శాతం వాటాను లాక్మేను దక్కించుకుంది.

మేబెలీన్‌కి ఏడు శాతం, మైగ్లామ్, షుగర్‌ కాస్మోటిక్స్‌కి నాలుగు శాతం చొప్పున మార్కెట్ వాటా ఉంది.

వెస్ట్ సైడ్స్ నోయెల్‌ కూడా భవిష్యత్‌లో కాస్మోటిక్స్‌లోకి వస్తామని ప్రకటించారు. ఫుట్‌వేర్ నుంచి అండర్‌వేర్ వరకు ప్రతిదానిపై దృష్టిపెడతామన్నారు. ఒకవేళ తన తల్లి సిమోన్ మాదిరి నోయెల్ ఈ బ్రాండ్‌ను సరికొత్త ఎత్తును తీసుకెళ్తారో లేదో మార్కెట్ నిపుణులు చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)