భోజనం కావాలంటే దుస్తులు వద్దనుకోవాలి, దుస్తులు కావాలంటే పస్తులుండాలి - ఉప్పు, పసుపు, దువ్వెన కూడా కొనలేని ప్రజలు, ఇండియాలోనే అత్యంత పేద జిల్లా కథ ఇది

అలీరాజ్‌పుర్ జిల్లాలోని ఓ కుటుంబం
ఫొటో క్యాప్షన్, ఒక్కోసారి తమకు తినడానికి ఏమీ దొరకదని, అప్పుడు కుటుంబం మొత్తం ఆకలితోనే పడుకుంటామని బజరీ చెప్పారు
    • రచయిత, సల్మాన్ రావీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బజరీ వయసు 23 ఏళ్లకు కాస్త అటూఇటుగా ఉండొచ్చు. అయితే, ఆమె వయసు కచ్చితంగా ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు.

కొంత మంది గ్రామస్థులు మాత్రం ఆమెకు 20 ఏళ్లు కూడా ఉండవని చెబుతున్నారు.

ఇంత చిన్న వయసులోనే ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ ముగ్గురు పిల్లలూ తమ మారుమూల గ్రామంలోని ఓ గుడిసెలో జన్మించారు.

‘అదృష్టవశాత్తు’ వీరు ప్రాణాలను దక్కించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పురిటిలోనే తల్లీ, బిడ్డ చనిపోయిన కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ ఆసుపత్రులు కూడా కనిపించవు.

గర్భిణులు, రోగులను మంచంపై పడుకోబెట్టి ఇక్కడి నుంచి సోండ్వా తహశీల్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని బజరీ భర్త కేరా చెప్పారు. దీని కోసం 35 కిలోమీటర్లకుపైనే ప్రయాణించాల్సి ఉంటుందన్నారు.

మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పుర్‌లోని ఒక మారుమూల గ్రామంలో వీరు జీవిస్తున్నారు. ఈ ప్రాంతాలు జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి విడదీసేసినట్లుగా ఒక మూలన ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం.

మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పుర్‌లోని ఒక మారుమూల గ్రామంలో వీరు జీవిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పుర్‌లోని ఒక మారుమూల గ్రామంలో వీరు జీవిస్తున్నారు

బిపర్‌జోయ్ తుపాను సమయంలో ఇక్కడ చాలా వేగంతో గాలులు వీచాయి. వర్షం కూడా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. దీంతో నర్మదా నదిని ‘మోటార్ బోట్’పై దాటి అవతలికి వెళ్లడం దాదాపు అసాధ్యంగా అనిపించింది.

జిల్లా కేంద్రం నుంచి కకరానా పంచాయతీ వరకు మాత్రమే కారులో వెళ్లగలం. అక్కడి నుంచి నదీ తీరం వరకూ నడుచుకుంటూ వెళ్లాలి.

పడవపై నది దాటిన తర్వాత, పెరియాతర్, ఝండానా, సుగట్, బెర్‌ఖోడీ, నదిసిర్ఖడీ, అంజాన్‌బరా, డూబ్‌ఖేడా, బడా ఆంబా, జల్ సింధీ, రోలీగావ్ లాంటి చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉత్తర, తూర్పు భారత దేశంలోని ప్రాంతాల తరహాలో ఇళ్లన్నీ పక్కపక్కన ఉండవు.

ఇక్కడి విడివిడిగా ఉండే ఇళ్లను ‘ఫలియా’అని పిలుస్తారు. ఉదాహరణకు కొండపై రెండు ఇళ్లు కనిపిస్తే, మరో రెండు మూడు ఇళ్లు మరో కొండపై కనిపిస్తాయి.

ఒకటిన్నర గంటల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు మేం పెరియాతర్ ఫలియాను చేరుకున్నాం. ఇక్కడ కొండలపై రెండేసి, మూడేసి ఇళ్లు కనిపిస్తున్నాయి. అలా ఒక కొండపైకి వెళ్తే ఒక గుడిసె కనిపించింది.

ఇక్కడే బజరీ, తన భర్త, పిల్లలు జీవిస్తున్నారు. 70 ఏళ్ల ఆమె మావయ్య మరొక గుడిసెలో ఉంటున్నారు.

ముగ్గురు పిల్లల్లో ఒకరి ఒంటినిండా మట్టి కనిపిస్తోంది. చిన్న కుమార్తె ఉయ్యాలలో ఉంది. ఉయ్యాలను గుడిసెలో పైకర్రకు కట్టారు. ఆ ఇంటిలో ఆహారం లేదా బట్టలు ఏవీ కనిపించలేదు.

ఆమెలా ఇక్కడి మట్టి గుడిసెల్లో జీవించే వారికి తల దువ్వుకోవడానికి ఇంట్లో దువ్వెన, ముఖం చూసుకోవడానికి అద్దమూ లేవు

ఫొటో సోర్స్, ARVIND SAHU/BBC

ఫొటో క్యాప్షన్, ఆమెలా ఇక్కడి మట్టి గుడిసెల్లో జీవించే వారికి తల దువ్వుకోవడానికి ఇంట్లో దువ్వెన, ముఖం చూసుకోవడానికి అద్దమూ లేవు

వీరి కోరిక ఏమిటి?

బజరీ చాలా తక్కువగా మాట్లాడతారు. అయితే, పిల్లల బట్టల గురించి ప్రశ్నించినప్పుడు ఆమె స్పందించారు.

‘‘మేం బట్టలు కొనుక్కుంటే తినడానికి డబ్బులు మిగలవు. అదే తిండి కోసం డబ్బులు ఖర్చుచేస్తే వేసుకోవడానికి బట్టలు ఉండవు. వంట విషయంలోనూ అంతే.. మీరు మసాలా దినుసులు కొంటే కారం కొనడానికి డబ్బులు ఉండవు. అదే కారం కొంటే పసుపు, ఇతర మసాలా దినుసులు కొనలేం.’’ అని ఆమె అన్నారు.

ఒక్కోసారి తమకు తినడానికి ఏమీ దొరకదని, అప్పుడు కుటుంబం మొత్తం ఆకలితోనే పడుకుంటామని బజరీ చెప్పారు.

‘‘ఏమీ దొరకనప్పుడు ఏం చేస్తాం. ఖాళీ కడుపుతో పడుకోవడమే. ఒక్కోసారి రెండేసి రోజులు అలానే ఉండాల్సి వస్తుంది.’’ అని ఆమె అన్నారు.

అందరిలానే బజరీకి చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. వాటిని విన్నప్పుడు నాతోపాటు వచ్చిన పట్వారీ యోగేశ్ ఢాక్రే కళ్లు చెమర్చాయి.

తన చిన్న చిన్న కోరికల గురించి బజరీ మాట్లాడుతూ.. ‘‘మాకు ఉప్పు, కారం, పసుపు, మసాలా దినుసులు, పప్పులు, గిన్నెలు, ప్లేట్లు, బట్టలు కావాలి. అంతే.. ఇంకేమీ వద్దు.’’ అని అన్నారు.

ఆమెలా ఇక్కడి మట్టి గుడిసెల్లో జీవించే వారికి తల దువ్వుకోవడానికి ఇంట్లో దువ్వెన, ముఖం చూసుకోవడానికి అద్దమూ లేవు.

దీని గురించి మేం ప్రశ్నించినప్పుడు.. ఒక మహిళ మాట్లాడుతూ.. ‘‘మాకు దువ్వెనలు ఉండవు. తలకు రాసుకోవడానికి నూనె కూడా ఉండదు. పౌడర్ అసలే ఉండదు. చెవులు, ముక్కులకు రింగులు ఉండవు. చేతికి గాజులు, మెడలో గొలుసులు ఏమీ ఉండవు. అసలు జడే వేసుకోం. గోళ్లకు రంగులు లాంటివేమీ మాకు ఉండవు’’ అని చెప్పారు.

2021లో నీతీఆయోగ్ విడుదల చేసిన నివేదికలో అత్యధిక పేదరికమున్న జిల్లాగా అలీరాజ్‌పుర్ పేరును ప్రస్తావించారు

ఫొటో సోర్స్, ARVIND SAHU/BBC

ఫొటో క్యాప్షన్, 2021లో నీతీఆయోగ్ విడుదల చేసిన నివేదికలో అత్యధిక పేదరికమున్న జిల్లాగా అలీరాజ్‌పుర్ పేరును ప్రస్తావించారు

రోజూ పోరాటమే

అలీరాజ్‌పుర్‌లో గిరిజనులు ఎక్కువగా జీవిస్తారు. జిల్లా జనాభాలో గిరిజనుల వాటా 90 శాతం వరకూ ఉంటుంది. ఇక్కడి పెరియాతర్ లాంటి గ్రామాల్లో ప్రజల జీవితం రోజూ పోరాటం చేస్తున్నట్లే ఉంటుంది.

ఇక్కడ జీవించే చాలా మందికి రేషన్ కార్డు కూడా ఉండదు. కాబట్టి వీరికి ప్రభుత్వం నుంచి సాయం అందడం కూడా చాలా కష్టం.

రేషన్ కార్డు కోసం చాలాసార్లు స్థానిక సర్పంచ్ దగ్గరకు వెళ్లామని, కానీ, తమకు కార్డు మంజూరు కాలేదని బజరీ చెప్పారు.

బజరీ ఇంటికి సమీపంలోనే ఒక పెళ్లి జరుగుతోంది. ఇది బజరీ, ఆమె కుటుంబానికి ప్రత్యేక సమయం. ఎందుకంటే వీరికి తినడానికి నేడు కడుపునిండా భోజనం దొరుకుతుంది. చాలా అరుదుగా ఇలా జరుగుతుంటుంది.

2021లో నీతీ ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో అత్యధిక పేదరికమున్న జిల్లాగా అలీరాజ్‌పుర్ పేరును ప్రస్తావించారు. ఈ నివేదికలో ‘మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్’ను కూడా కమిషన్ తొలిసారి విడుదల చేసింది.

2019, 2020ల మధ్య నిర్వహించిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ సమాచారం ఆధారంగా ఆ నివేదికను రూపొందించారు.

ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ (ఓపీహెచ్ఐ), యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) సూచించిన విధానాల్లో నీతీఆయోగ్ మల్టీడైమన్షియల్ పావర్టీ ఇండెక్స్‌ను సిద్ధంచేసింది. దీనిలో అత్యంత పేదరిక ప్రభావిత ప్రాంతంగా అలీరాజ్‌పుర్‌ను పేర్కొన్నారు.

అలీరాజ్‌పుర్‌లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి

ఫొటో సోర్స్, ARVIND SAHU/BBC

ఫొటో క్యాప్షన్, అలీరాజ్‌పుర్‌లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి

ఆకలి, పేదరికం, వలస

నీతీఆయోగ్ నివేదికలో ఈ జిల్లాలో పేదరికాన్ని 71.3 శాతంగా పేర్కొన్నారు. మరోవైపు అక్షరాస్యత విషయంలోనూ ఈ జిల్లానే అట్టడుగున ఉంది.

ఇక్కడ జీవించడం ఎంత కష్టంగా ఉంటుందో బజరీ భర్త మాకు వివరించారు.

‘‘నదిని దాటడానికి ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలూ లేవు. రోడ్లు లేవు. విద్యుత్ లేదు. స్కూళ్లు కూడా లేవు’’ అని ఆయన చెప్పారు.

ఆయన కూలి పనిచేసేందుకు కుటుంబంతోపాటు గుజరాత్ వెళ్తుంటారు. కొంత డబ్బులు పోగుచేసిన తర్వాత, మళ్లీ వీరు ఇంటికి వస్తారు.

‘‘గుజరాత్‌లోని పొలాల్లో కూలీలుగా పనిచేయడానికి వెళ్తుంటాం. అక్కడ నెల నుంచి నెలన్నర రోజులు పనిచేస్తాం. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాం. ఇక్కడ ఉంటే పని దొరకదు. అందుకే పిల్లలందరినీ వెంట పెట్టుకొని అక్కడకు వెళ్లిపోతాం. ఇంట్లో మా నాన్న ఒక్కరే ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

ఇక్కడి ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం కూడా సాధ్యపడటం లేదు

ఫొటో సోర్స్, ARVIND SAHU

ఫొటో క్యాప్షన్, ఇక్కడి ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం కూడా సాధ్యపడటం లేదు

ఇక్కడ ఎలాంటి పని ఉంటుంది?

అలీరాజ్‌పుర్‌లో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్తుంటారు.

‘‘ఇక్కడ ఏం ఉపాధి దొరకుతుంది? నర్మదా నదికి వెళ్లి చేపలు పట్టుకోవడమే. వీటిని తీసుకెళ్లి చుట్టుపక్కల అమ్ముకోవాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయమూ అందదు.’’ అని కేరా చెప్పారు.

కేరా తండ్రి తూర్ సింగ్‌కు వయసు పైబడింది. ఒకప్పుడు ఆయన కూడా కూలి పనికి గుజరాత్ వెళ్లేవారు. అయితే, ఇప్పుడు శరీరం ఆయనకు సహకరించడం లేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దగ్గర్లో ఎలాంటి ఆసుపత్రులూ లేవని ఆయన ఆందోళన చెందుతున్నారు.

మాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీకు ఒంట్లో బాగోలేకపోతే ఏం చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. కానీ, ఇక్కడ ఆసుపత్రులే లేవు. ఇక్కడి నుంచి మంచాలపై పడుకోబెట్టి ఆసుపత్రులకు తీసుకెళ్లాలి. మరీ తీవ్రమైన జబ్బు చేస్తే, ఇక్కడ భూతవైద్యులను పిలిపిస్తారు. మాకు వేరే మార్గం లేదు. చచ్చిపోతే ఇక్కడే పూడ్చిపెట్టడమే’’ అని ఆయన చెప్పారు.

‘‘మా ఊరుకు రావడానికి బోటే ఆధారం. కానీ, అన్నిరోజులూ బోట్లు అందుబాటులో ఉండవు. ఒకసారి బోటులో వెళ్లి రావడానికి వంద రూపాయలు అవుతాయి. అంత డబ్బులు మా దగ్గర లేవు.’’ అని ఆయన అన్నారు.

ఇక్కడి ప్రజలకు ఆధార్ కార్డులు ఇవ్వడం కూడా సాధ్యపడటం లేదు, ఎందుకంటే వీరి చేతులపై గీతలన్నీ చెరిగిపోయాయని మాతోపాటు వచ్చిన యోగేశ్ ఢాక్రే చెప్పారు.

దీని వల్లే ఈ ప్రాంతాలకు అభివృద్ధి చేరువకావడం లేదని, ఉపాధి హామీ పథకం అమలు కూడా ఇక్కడ కష్టం అవుతోందని ఆయన అన్నారు.

‘‘ఇక్కడి ప్రజలు ఉపాధి హామీ పథకం కింద పనిచేయరు. ఎందుకంటే ఆ పథకం కింద ఇచ్చే డబ్బులు ఇక్కడ చాలా తక్కువ. ఇంకొక విషయం ఏమిటంటే.. చెల్లింపులు చేసేందుకు ఒక్కోసారి రెండు మూడు నెలల సమయం పడుతుంది. అదే గుజరాత్‌కు వెళ్తే ప్రతి వారమూ చేతికి డబ్బులు అందుతాయి. కుటుంబం మొత్తం పనిచేసుకోవచ్చు’’ అని యోగేశ్ అన్నారు.

వచ్చే రెండేళ్లలో నర్మదా నీటి రాకతో అలీరాజ్‌పుర్ పరిస్థితి మారుతుందని రాఘవేంద్ర అన్నారు
ఫొటో క్యాప్షన్, వచ్చే రెండేళ్లలో నర్మదా నీటి రాకతో అలీరాజ్‌పుర్ పరిస్థితి మారుతుందని రాఘవేంద్ర అన్నారు

పరిస్థితులు మారుతాయా?

ఇక్కడి పరిస్థితులపై స్పందించాలని అలీరాజ్‌పుర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్‌ను బీబీసీ కోరింది. ‘‘ఆ గ్రామంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయనేది నిజమే. అందుకే అక్కడి ప్రజలు వలస వెళ్తుంటారు. జిల్లా మొత్తంగా దాదాపు పరిశ్రమలే లేవు. మరోవైపు ఇక్కడి నేల కూడా అంత సారవంతమైనది కాదు. అందుకే వ్యవసాయం కూడా సాధ్యం కావడం లేదు.’’ అని ఆయన అన్నారు.

అయితే, వచ్చే రెండేళ్లలో నర్మదా నీటి రాకతో అలీరాజ్‌పుర్ పరిస్థితి మారుతుందని రాఘవేంద్ర అన్నారు.

‘‘నర్మదా నీటిని ఈ గ్రామాల్లో తాగు, సాగు అవసరాల కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. 2025 నాటికి పైప్‌లైన్ ద్వారా నీటిని వీరికి అందిస్తాం.’’ అని ఆయన చెప్పారు.

ఈ పైప్‌లైన్‌ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక పథకం ప్రారంభించారని ఆయన అన్నారు.

సమస్య ఏమిటి?

నర్మదా నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు వీటిలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయని, మరోవైపు వీటిని చేరుకోవడం కూడా చాలా కష్టమని రాఘవేంద్ర చెప్పారు.

‘‘మీరు ఉత్తర భారత దేశంలో గ్రామాలను చూస్తే.. ఇళ్లన్నీ పక్కపక్కనే ఉంటాయి. కానీ, ఇక్కడ అలాకాదు. అందుకే ప్రభుత్వ పథకాలను వీరికి చేరవేయడం చాలా కష్టం అవుతోంది’’ అని ఆయన అన్నారు.

‘‘మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా జిల్లా ప్రధాన కార్యాలయానికి చుట్టుపక్కల గ్రామాల్లో రోడ్లు కూడా వచ్చాయి. అక్షరాస్యతలోనూ అలీరాజ్‌పుర్ పరిస్థితి మెరుగుపడింది. 10, 12వ తరగతి ఫలితాలను చూస్తే ఈ విషయం తెలుస్తుంది’’ అని ఆయన చెప్పారు.

ఇక్కడ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదని గిరిజన హక్కుల ఉద్యమకారులు అంటున్నారు
ఫొటో క్యాప్షన్, ఇక్కడ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదని గిరిజన హక్కుల ఉద్యమకారులు అంటున్నారు

‘రెండు అలీరాజ్‌పుర్‌లు కనిపిస్తాయి’

అలీరాజ్‌పుర్‌లో కరవు పరిస్థితికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గిరిజన హక్కుల ఉద్యమకారుడు నితీశ్ అలావా అన్నారు.

‘‘ఇక్కడ గ్రామాలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. కేవలం దీపావళి లేదా ఏదైనా కుటుంబ వేడుకల కోసం మాత్రమే ప్రజలు తిరిగి వస్తున్నారు. ఖరీఫ్ పంట కోతలు మొదలవుతాయనే సమయంలో వీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతారు.’’ అని ఆయన అన్నారు.

‘‘ఇక్కడ మీకు రెండు అలీరాజ్‌పుర్‌లు కనిపిస్తాయి. ఒకటి జిల్లా ప్రధాన కార్యాలయం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇవి మీకు బానే కనిపిస్తాయి. రెండోది మారుమూల ప్రాంతాలు.. ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కూడా కనిపించవు.’’ అని ఆయన చెప్పారు.

నీతీఆయోగ్ పేదరిక సూచీ 2021లో విడుదలైంది. మళ్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

గత ఐదేళ్లలో మొదటి 15 నెలలు ఇక్కడ కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత మళ్లీ బీజేపీ నేతృత్వంలోని శివరాజ్‌సింగ్ ప్రభుత్వం వచ్చింది.

అయితే, ఇక్కడ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదని గిరిజన హక్కుల ఉద్యమకారులు అంటున్నారు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రజలను ఓట్లు అడిగేందుకు నాయకులు కూడా ఇక్కడకు రారని వీరు చెబుతున్నారు.

మేం వెళ్లిన పెరియాతర్ గ్రామంలోని ప్రజలకు చివరిసారి ఓ ప్రజాప్రతినిధిని ఎప్పుడు చూశారో కూడా గుర్తులేదు.

వీడియో క్యాప్షన్, గుక్కెడు నీటి కోసం ప్రాణాలకు తెగిస్తున్న మహిళలు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)