బిహార్‌లోని ఈ రెడ్ లైట్ ఏరియా ఎందుకు వార్తల్లోకెక్కింది?

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
- రచయిత, సీతు తివారి
- హోదా, బీబీసీ హిందీ కోసం, ముజఫర్‌పూర్
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న చతుర్భుజ్ ప్రాంతాన్ని ఎంతో చరిత్ర కలిగిన రెడ్ లైట్ ఏరియాగా పరిగణిస్తారు.
ఒకప్పుడు చతుర్భుజ్ ప్రాంతానికి తమ పిల్లలకు కళలు, మర్యాదలు నేర్చుకునేందుకు పెద్దవారు పంపేవారు.
కానీ, రోజులు గడుస్తున్న కొద్ది, ఈ ప్రాంతం, దీనిలోని వీధులన్ని కూడా రెడ్ లైట్ అనే చీకటి ముసుగులో కూరుకుపోయింది.
ఈ చీకటి వీధుల్లో ముగ్గుతోన్న వారి జీవితాల్లో ప్రస్తుతం వెలుగు కనిపిస్తోంది.
ఇదంతా జుగ్ను వల్లనే. చతుర్భుజ్ ప్రాంతంలో నివసించే సెక్స్ వర్కర్ల పిల్లలు జుగ్ను మ్యాగజీన్ నడుపుతున్నారు.
సెక్స్ వర్కర్లు, వారి కుటుంబాలపై ఉన్న దురభిప్రాయాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మీరు ఈ పత్రిక పేపర్లను తిరగేస్తే.. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న రెడ్ లైట్ ఏరియా సమాజానికి చెందిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా అది మీకు కనిపిస్తుంది.
పదవ తరగతి చదివే నందిని, జుగ్ను మ్యాగజీన్ కోసం పనిచేస్తుంది. ‘‘జుగ్ను మా ఐ-కార్డు’’ అని నందిని తెలిపింది.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
జుగ్ను ప్రస్థానం ఎలా మొదలైంది?
600 కుటుంబాలు నివసించే ఛతుర్భుజ్ ప్రాంతం నుంచి 2004 జూలై నెలలో ఈ మ్యాగజీన్ ప్రారంభమైంది.
ఛతుర్భుజ్ ప్రాంతంలోని సెక్స్ వర్కర్ల పిల్లల కోసం ‘పర్చమ్’ అనే సంస్థను 2002 ఏడాదిలో నసీమా ఖాతూన్ అనే బాలిక ఏర్పాటు చేశారు.
ఆమె ఒక సెక్స్ వర్కర్ కూతురు.
నసీమా ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల సంఘ సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.
‘‘విద్య, వైద్యంపై పర్చమ్ పనిచేస్తోంది. కానీ, మీడియాకు మా ప్రజలు భయపడుతున్నారని మేం తెలుసుకున్నాం. మమ్మల్ని సరిగ్గా చూపించడంలో జర్నలిస్ట్‌లు విఫలమయ్యారు’’ అని నసీమా అన్నారు.
‘‘నేను ఒక వేశ్య కుమార్తెను. అందుకే, న్యూస్ రిపోర్ట్‌లు కుమార్తె అనే పదాన్ని వదిలేసి, నన్ను కూడా ఒక వేశ్యగా చూపించాయి. పవిత్రమో, అపవిత్రమో, తప్పో, ఒప్పో... ఏది రాస్తామో కానీ సొంతంగా మేం మ్యాగజీన్ తేవాలని నిర్ణయించుకున్నాం’’ అని ఆమె తెలిపారు.
నాలుగు నుంచి 36 పేజీలకు..
జుగ్ను తొలి సంచిక కేవలం నాలుగు పేజీలతోనే బయటికి వచ్చింది. ఈ నాలుగు పేజీల్లో చతుర్భుజ్ ప్రాంతంలోని పిల్లల కలను పదాల రూపంలో పొందుపరిచారు.
రూ.5 మొత్తంతో ఫోటోస్టాట్ ద్వారా ఈ మ్యాగజీన్‌కు ఒక రూపం ఇచ్చి ఈ కాపీలను ఇతరులకు పంపిణీ చేశారు.
జుగ్నుకి పనిచేసే పిల్లలందరికీ అప్పటి స్థానిక జర్నలిస్టులు ముఖ్యంగా శివశంకర్ ప్రసాద్ జర్నలిజానికి సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్పించారు.
తబలా, సారంగి, ముజరాలను ప్రతిబింబే ప్రతీకాత్మక ఫోటోలతో ఈ మ్యాగజీన్ కవర్ పేజీని ముద్రించారు.
అదే విధంగా కంటెంట్‌ను కూడా మరింత ఇచ్చేలా జుగ్నును తీర్చిదిద్దారు.
రెడ్ లైట్ ప్రాంతంలోని పిల్లల అనుభవాలు, వారి చిత్రలేఖనాలు, న్యాయ హక్కులు, వేశ్యలకు ఉండే చట్టాలు, వార్తాపత్రికల క్లిపింగ్‌లు, రెడ్ లైట్ ఏరియాలో జరిగే సంఘటనలు, పాఠకుల స్పందనలు ఇలా అన్నింటిన్ని ఈ మ్యాగజీన్‌లో ఇవ్వడం ప్రారంభించారు.
ఇలా 2007 ఏడాదిలో ఈ మ్యాగజీన్ పేజీల సంఖ్య 32కి పెరిగింది.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
2012లో మూతపడి, 2021లో తిరిగి ప్రారంభం
ఎలాంటి వ్యవస్థాపరమైన ఆర్థిక సాయం లేకుండానే జుగ్ను నడిచింది. అయితే ఆర్థికాంశాలు, ఇతర కారణాలతో 2012లో ఈ మ్యాగజీన్ మూతపడింది. కుటుంబ కారణాల చేత నసీమా రాజస్తాన్‌కు వెళ్లారు.
2021 ప్రారంభంలో ఆమె తిరిగి మంచాన పడిన తన అమ్మమ్మను చూడటానికి వచ్చారు. అప్పుడే మళ్లీ ఈ మ్యాగజీన్ ప్రాణం పోసుకుంది.
‘‘బిహార్ మాత్రమే కాక, ప్రస్తుతం రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన కల్బేలియా, మధ్యప్రదేశ్‌లోని నీమచ్, ముంబైలోని రెడ్ లైట్ ఏరియాను కూడా దీనిలో కలిపాం’’ అని ఈ మ్యాగజీన్‌ను చూస్తూ నసీమా చెప్పారు.
ఈ 36 పేజీల మ్యాగజీన్‌కు సహకార మొత్తంగా రూ.50ను నిర్ణయించారు. ఈ మ్యాగజీన్‌ను ఇప్పటికీ చేతితోనే రాస్తారు. ప్రస్తుతం ఫోటోస్టేట్ కాకుండా ప్రింట్ తీస్తున్నారు.
2008 నుంచి శైష్టా పర్వీన్ కూడా జుగ్నుకి రాస్తున్నారు. ప్రస్తుతం ఆమెకి 18 ఏళ్లు. డిగ్రీ చదువుతున్నారు.
2008లో ఈ మ్యాగజీన్‌కు చిత్రలేఖనాలు వేసేవారు శైష్ట.
కానీ ఇప్పుడు ఆమె ‘మేరా సప్నా’ అనే పేరుతో కాలమ్ రాస్తున్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
పోలీసు సర్వీసులో చేరడమే చాలా మంది కల
శైష్ట ఐదవ తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లల్ని కలిశారు. వారి కలలను రాయాలని కోరారు. ఆ తర్వాత తగిన మార్పులు చేసి, వాటిని జుగ్ను మ్యాగజీన్‌లో ప్రింట్ చేశారు.
పిల్లల కల ఏమిటని అడిగినప్పుడు... ‘‘చాలా మంది పిల్లలు పోలీసు కావాలనుకుంటున్నారు. ఎందుకంటే, పోలీసు రైడ్స్ జరిగినప్పుడు, చాలా మంది భయంతో పారిపోతారు. పోలీసులు చాలా శక్తిమంతులని ఈ పిల్లలు భావిస్తున్నారు’’ అని శైష్ట సమాధానమిచ్చారు.
కానీ, మీరు పోలీసులకు భయపడతారా? అన్న దానికి శైష్ట నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘‘నా చిన్నతనంలో, మేం భయపడేవాళ్లం. కానీ, ఇప్పుడు పోలీసులకు మేమెందుకు భయపడాలి అనిపిస్తుంది?’’ అని అన్నారు.
పోలీసుల నుంచి పారిపోవడం, స్నేహితులకు భయపడటం ఆపేశాం
శైష్ట పర్వీన్ మాదిరిగానే నందినిలో కూడా ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఆమె పదో తరగతి చదువుతుంది.
ఛతుర్భుజ్ ప్రాంతంలో నివసించే పిల్లలపై వాడే అసభ్య పదజాలంపై శైష్ట ఒక వ్యాసం రాస్తున్నారు.
నందిని శాస్త్రీయ నృత్యకారిణి కావాలనుకుంటోంది.
‘‘ఛతుర్భుజ్ ప్రాంతంలో ఉంటున్నట్లు అంతకుముందు మేం మా స్నేహితులకి చెప్పేవాళ్లం కాదు. కానీ, ఇప్పుడేం భయపడటం లేదు. వీరికి డబ్బులు ఒక రూపంలో వస్తున్నాయి. మాకు ఒక రూపంలో వస్తున్నాయి. కానీ, మేమందరం మనుషులమే. స్నేహబంధాన్ని నిలుపుకోవాలనుకుంటే, మాతో ఉండొచ్చు. మా అమ్మ ఏం చేస్తుందో, వారికేం అవసరం ఉంటుంది?’’ అని నందిని అన్నారు.
కేవలం సెక్స్ వర్కర్ల పిల్లల సమస్యలపైనే కాకుండా.. ఈ ప్రాంతంలో నివసించే ఇతర ప్రజల సమస్యలపై కూడా దృష్టిసారిస్తూ ఈ మ్యాగజీన్ విడుదలవుతుంది.
వయసు మళ్లిన సెక్స్ వర్కర్ల కోసం ఈ మ్యాగజీన్‌లో ఒక కాలమ్ ఉంది.
ఈ సెక్స్ వర్కర్ల ఆత్మకథపై ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మొహమ్మద్ అరిఫ్ పనిచేస్తున్నారు.
‘‘వయసు మళ్లిన తర్వాత, సెక్స్ వర్కర్లు ఇతర ఏ పనిని చేయలేరు. వీరిలో చాలా మంది భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలోని సెక్స్ వర్కర్ల కోసం ఏమైనా విధానాలను రూపొందిస్తే, కేవలం అమ్మాయిల కోసమే కాకుండా, వయసు మళ్లిన సెక్స్ వర్కర్లపై కూడా ఈ విధానాలు దృష్టిసారించాలి’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
కరెంట్ కల్పిస్తామని హామీ
ప్రస్తుతం జుగ్ను కోసం నాలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు.
వీరందరూ తమ ప్రాంతాలకు చెందిన వార్తలను నసీమాకు పంపుతారు. ఆ తర్వాత ఆన్‌లైన్ మీటింగ్ నిర్వహించి ఈ మ్యాగజీన్‌ను డిజైన్ చేస్తారు.
ఈ రిపోర్టర్లలో రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలకు చెందిన రామ్సర్ తహశీల్‌లోని చదర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌నాథ్ కూడా ఒకరు.
‘‘జుగ్నును తీసుకుని బర్మేర్ జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు నేను వెళ్లాను. ఆయన మ్యాగజీన్ చూశారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. మా ఇళ్లలో కరెంట్ లేదని తెలిపాను. త్వరలోనే కరెంట్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మా ప్రాంతంలో పోలీసు స్టేషన్ అధికారినే అంత తేలిగ్గా ఎవరూ కలుసుకోరు. నేను కలెక్టర్‌ను కలుసుకున్నాను’’ అని ఫోన్ సంభాషణలో బీబీసీ హిందీకి ప్రేమ్‌నాథ్ తెలిపారు.

ఫొటో సోర్స్, SEETU TIWARI/BBC
మ్యాగజీన్‌తో మొదలై వస్త్రాల వ్యాపారం దాకా...
జుగ్ను కేవలం ఈ పిల్లల జీవితాలను మాత్రమే మార్చలేదు. పూర్తి కమ్యూనిటీలో మార్పులు తీసుకొచ్చింది.
2022 ఏడాదిలో జుగ్ను కాపీని తీసుకుని ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ ప్రణవ్ కుమార్‌ను ఈ పిల్లలు కలిశారు.
‘‘ఇక్కడ నడిచే జోహ్రా సిలాయి సెంటర్, జీవికా బఛత్ గ్రూప్ గురించి కలెక్టర్‌కు తెలిపాం. ఈ టైలరింగ్ సెంటర్‌కు పరిశ్రమ హోదా ఇచ్చారు. జుగ్ను వస్త్రాలకు లైసెన్స్ కూడా దక్కింది. ఇంకా భూమి పొందడమే మిగిలి ఉంది. అది కూడా వస్తే ఇక్కడి మహిళలు ముఖ్యంగా వయసు మళ్లి వారికి ఉపాధి లభిస్తుంది’’ అని జుగ్ను కోసం పనిచేసే సబీనా తెలిపారు.
ప్రస్తుతం 300 కాపీ జుగ్ను ప్రచురితమవుతుంది. ఆర్‌ఎన్ఐ నెంబర్ తీసుకుని సొంతంగా ఈ మ్యాగజీన్‌ను నిర్వహించాలని నసీమా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం దిల్లీకి చెందిన కొందరు డాక్టర్లు ఈ మ్యాగజీన్ ప్రింట్ కావడానికి డబ్బులిస్తున్నారు.
కానీ, జుగ్ను స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నానని నసీమా చెప్పారు. అంతేకాక జుగ్ను రిపోర్టర్లకు గౌరవ వేతనంగా మంచి మొత్తం ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు.
ఇవి కూడా చూడండి:
- హిట్లర్ నరమేధం నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? 84 ఏళ్ల తర్వాత వీడిన ఫోటో మిస్టరీ
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














