ఫాక్స్‌కాన్-వేదాంత: రూ. 1,60,750 కోట్ల సెమీ కండక్టర్ హబ్ ఒప్పందం రద్దవడంతో మోదీ 'కల' చెదిరిందా?

ఫొటో సోర్స్, PIB/Getty Images
తైవాన్‌కు చెందిన సెమీ కండక్టర్ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్, భారతదేశంలో వేదాంత గ్రూప్‌తో చేసుకున్న 19.5 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 1,60,750 కోట్లు) ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
"భారతదేశంలో వేదాంత కంపెనీతో ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్‌ను కొనసాగించరాదని ఫాక్స్‌కాన్ నిర్ణయించుకుంది.’’ అని ఆ కంపెనీ సోమవారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది.
గుజరాత్ రాష్ట్రంలో సెమీ కండక్టర్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం జరిగింది. ఈ నిర్ణయంతో భారత్‌ను సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక ప్రణాళికకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
అయితే, వేదాంతతో జాయింట్ వెంచర్ నుండి ఫాక్స్‌కాన్ వైదొలగడం వల్ల భారతదేశ సెమీకండక్టర్ లక్ష్యాలు మారవని భారత ప్రభుత్వం అంటోంది.
ఈ నిర్ణయంతో రెండు కంపెనీలు తమ వ్యూహంపై స్వతంత్రంగా పని చేసుకోగలుగుతాయని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో, గత 18 నెలల్లో సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించిందని రాజీవ్ చంద్రశేఖరన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఫాక్స్‌కాన్, వేదాంత మధ్య జరిగిన ఒప్పందం సెమీకండక్టర్ల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద ఒప్పందంగా చెబుతారు.
ప్రస్తుతం వేదాంత యాజమాన్యంలోని ఈ యూనిట్ నుంచి తమ పేరును పూర్తిగా తొలగిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ కంపెనీ తెలిపింది.
మరోవైపు వేదాంత దీనిపై స్పందిస్తూ, సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సంబంధించి తమ లక్ష్యాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, భారతదేశపు మొట్ట మొదటి సెమీకండక్టర్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఇతర పార్ట్‌నర్‌లతో చర్చలు జరుపుతున్నామని వేదాంత తన ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో నూతన శకానికి నాంది పలికేందుకు భారత ఆర్థిక వ్యూహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకండక్టర్ ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు రావడానికి భారత ప్రభుత్వం కూడా విశేష కృషి చేసింది
ఈ ప్రాజెక్టు నేపథ్యాన్నిబట్టి చూస్తే, ప్రస్తుత నిర్ణయం ప్రభుత్వ ఆశయానికి విఘాతంగా భావిస్తున్నారు.
‘‘ఈ ప్రాజెక్టు ప్రకటించిన సమయంలో ఎంత హైప్ సృష్టించారో గుర్తుందా? దీని ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని కూడా గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించారు.’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
“వైబ్రంట్ గుజరాత్ సదస్సులో జరిగిన ఒప్పందాలకు ఏడాది పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితం ఇది. దీనిలాగే యూపీలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా అదే ఫలితాన్ని ఇవ్వనుంది. కాబట్టి, గుజరాత్ మోడల్ గురించి లేదంటే న్యూ ఇండియా గురించి స్పాన్సర్స్ చేసిన హెడ్‌లైన్‌లను ఎప్పుడూ నమ్మవద్దు.’’ అని జైరాం రమేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్పందించారు. ‘‘ ఎలాక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గత మూడు దశాబ్ధాలుగా ఏమీ చేయలేదు. ఈ రంగంలో చైనా ముందుకు దూసుకుపోయింది.
దీనిపై కాంగ్రెస్ గొంతు చించుకోవడం వల్ల భారతదేశ ప్రగతి మందగించదు’’ అని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
‘‘రెండు ప్రైవేట్ కంపెనీలు ఎలా, ఎందుకు కలిసి వస్తాయో లేదా ఎలా విడిపోతాయో చూడటం ప్రభుత్వ పని కాదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వెంచర్ ఎందుకంత కీలకం ?
ఫాక్స్‌కాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలలో ఒకటి. యాపిల్ కంపెనీ ఐఫోన్‌ల తయారు చేసే సంస్థగా దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఆ సంస్థ సెమీకండక్టర్ తయారీ రంగంలో కూడా అడుగులు వేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ తైవాన్‌వంటి కొన్ని దేశాలకే పరిమితమైంది. ఇందులో ప్రవేశించేందుకు భారత్ కూడా ప్రయత్నిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ దిశగా ఈ ఒప్పందం ఒక కీలకమై దశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(పీఎల్‌ఐ) అనే స్కీమ్‌ను కూడా ప్రారంభించింది.
‘‘ఎలాక్ట్రానిక్స్ లో సెమీ కండక్టర్ చాలా కీలకమైంది. ఈ రంగాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 76 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది’’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి ఈ ప్రోత్సాహక పథకం విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 8.23 లక్షల కోట్లు)
ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టడంలో ఆలస్యం కూడా ఈ ఒప్పందం రద్దు కావడానికి కారణం కావచ్చని రాయిటర్స్ వార్త సంస్థ ఆర్ధిక నిపుణుల అభిప్రాయంగా చెప్పింది.
2026 నాటికి సెమీకండక్టర్ ఉత్పత్తిని 63 బిలియన్ డాలర్ల(రూ. 5.23 లక్షల కోట్లు )కు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం మూడు కంపెనీలు పీఎల్ఐ స్కీమ్ కింద ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్నాయి.
ఇందులో ఫాక్స్‌కాన్-వేదాం జాయింట్ వెంచర్, సింగపూర్‌కు చెందిన ఐజీఎస్‌యుఎస్ వెంచర్స్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కంగ్లామరేట్ ఐసీఎంసీ నుంచి అప్లికేషన్లు వచ్చాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
అయితే, ఐసీఎంసీ అనుబంధ సంస్థ టవర్ సెమీ కండక్టర్‌ను ఇంటెల్ సంస్థ కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఐసీఎంసీ కంపెనీకి చెందిన 3 బిలియన్ డాలర్ల (రూ. 24.7 వేల కోట్లు ) విలువైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. అదే సమయంలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలనుకోవడంతో ఐజీఎస్ఎస్ ప్రణాళిక కూడా ఆలస్యమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ముందున్న మార్గం ఏంటి?
సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీల నుంచి భారత్ మళ్లీ దరఖాస్తులు కోరింది.
చిప్‌ల తయారీలో భారతదేశానికి అనుభవం లేదు. నిపుణులు కూడా లేరు. మరో సమస్య ఏంటంటే, ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన కంపెనీలలో రెండింటికి చిప్‌ల ఉత్పత్తిలో అనుభవం లేదు.
“రెండు కంపెనీలు ఈ రంగంలో కొత్తవి. వాళ్లు ఇంతకు ముందు ఎప్పుడూ చిప్‌లను ఉత్పత్తి చేయలేదు. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపించ లేదు’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్‌తో అన్నారు.
ప్రారంభ దశలోనే ఈ ప్రాజెక్ట్ విఫలం కావడం ఒకందుకు మంచిదేనని, ఇది ఇతర ప్రయత్నాలకు మార్గాన్ని సుగమం చేస్తుందని షా అన్నారు. మైక్రోన్ వంటి అనుభవజ్ఞులైన కంపెనీలకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందని నీల్ షా అభిప్రాయపడ్డారు.
గత నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ మైక్రోన్ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
భారత్‌లో 825 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 6798.5 కోట్లు ) పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోన్ ప్రకటించింది. ఈ పెట్టుబడి చిప్ టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగంలోనే తప్ప ఉత్పత్తి కోసం కాదు. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో ఈ పెట్టుబడి మరో 2.75 బిలియన్లు(రూ. 22.66 కోట్లు) పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















