అటవీశాఖ ఉద్యోగాలు - హరియాణా: మహిళా అభ్యర్థుల ఛాతీ కొలవడంపై తలెత్తిన వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సత్ సింగ్
- హోదా, బీబీసీ కోసం
హరియాణా అటవీ శాఖలో రేంజర్, డిప్యూటీ రేంజర్, ఫారెస్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒక వివాదం తలెత్తింది.
హరియాణా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో- మహిళా అభ్యర్థుల ఛాతీ కొలతకు సంబంధించి ఒక నిబంధన పెట్టారు.
‘‘శారీరక దారుఢ్య ప్రమాణ పరీక్ష’’ కేటగిరీలో ఈ నిబంధనను ఉంచారు.
రేంజర్, డిప్యూటీ రేంజర్, ఫారెస్టర్ ఉద్యోగాలకు పోటీపడే మహిళా అభ్యర్థుల ఛాతీ పరిమాణం ఊపిరి పీల్చడానికి ముందు 74 సెం.మీ. ఉండాలని, ఊపిరి పీల్చి బిగబట్టిన తర్వాత 79 సెం.మీ ఉండాలని నోటిఫికేషన్‌లో కమిషన్ చెప్పింది.
దీన్ని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వ నిరంకుశ చర్య అని విపక్షాలు అభివర్ణించాయి.
నోటిఫికేషన్‌లో పురుషులతోపాటు మహిళల ఛాతీ ప్రమాణాలను కూడా నిర్దేశించారు.
పురుషులకు ఊపిరి పీల్చడానికి ముందు 79 సెం.మీ, ఊపిరి పీల్చి బిగబట్టిన తర్వాత 84 సెం.మీ ఉండాలని చెప్పారు.
ఈ నోటిఫికేషన్‌లో ఇతర ఉద్యోగాలకు వేర్వేరు ప్రమాణాలను కేటాయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖట్టర్ ప్రభుత్వ తుగ్లక్ నిబంధన: కాంగ్రెస్
ఈ నోటిఫికేషన్ మహిళా వ్యతిరేక చర్య అని సామాజిక కార్యకర్తలు పిలుస్తుండగా, రాష్ట్రంలోని అగ్ర నాయకులు కూడా ఈ నోటిఫికేషన్‌ను వ్యతిరేకించారు.
మహిళల గౌరవంతో ఆటలాడుతున్నట్లుగా ఈ నోటిఫికేషన్ ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.
‘‘ఖట్టర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తుగ్లక్ నిబంధన ఇది. ఇప్పుడు ఫారెస్ట్ రేంజర్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ నియామకాల కోసం హరియాణా కూతుళ్ల ఛాతీని కొలుస్తారు’’ అని ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు.
‘‘హరియాణాలో మహిళా పోలీస్ కానిస్టేబుల్, మహిళా ఎస్‌ఐల నియామకంలో మహిళా అభ్యర్థుల ఛాతీని కొలవరనే సంగతి ఖట్టర్-దుష్యంత్ చౌటాలాకు తెలియదా?
సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌లో కూడా మహిళా అభ్యర్థుల ఛాతీని కొలిచే ప్రమాణం లేదనే సంగతి కూడా ఖట్టర్-దుష్యంత్ చౌతాలాకు తెలియదా? ఒకవేళ తెలిస్తే ఫారెస్ట్ రేంజర్, డిప్యూటీ రేంజర్ నియామకాల్లో హరియాణా కూతుళ్లను ఇబ్బందిపెట్టే ఈ క్రూరమైన, మూర్ఖమైన నిబంధన ఎందుకు పెట్టారు?
ఖట్టర్ తక్షణమే దీనిపై రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పి, ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలి’’ అని రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది మహిళలను అవమానించడమే: అభయ్ చౌతాలా
అటవీ శాఖలోని గ్రూప్ ‘సి’ ఉద్యోగాలను శారీరక దారుఢ్య పరీక్ష ద్వారా ఎంపిక చేయడం కోసం జులై 7న హెచ్‌ఎస్‌ఎస్‌సీ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
జులై 13-23 మధ్య ప్రమాణ పరీక్షలన్నీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఫారెస్ట్ రేంజర్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఉద్యోగాల భర్తీలో మహిళల ఛాతీ కొలిచే నిబంధన పెట్టడం అవమానకరమని, మహిళా వ్యతిరేక చర్య అని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ సెక్రటరీ జనరల్ అభయ్ చౌతాలా విమర్శించారు.
‘‘ఇది మహిళలను అవమానించడమే. బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి’’ అని అభయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఛాతీ కొలత అంటే ఇబ్బందే: శ్వేత ధుల్
హరియాణాలో విద్య, నియామకాల కోసం కొన్నేళ్లుగా తన గొంతును వినిపిస్తున్న సామాజిక కార్యకర్త శ్వేతా ధుల్ దీని గురించి మాట్లాడుతూ, ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న చాలామంది మహిళలు భయపడుతున్నారని అన్నారు.
అసలు ఈ ప్రక్రియ ఎలా పని చేస్తుందో తమకు అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారని ఆమె చెప్పారు.
‘‘ఈ పరీక్షకు దరఖాస్తుదారుల భర్తలు ఒప్పుకోవట్లేదు. అసలు దీని ఉద్దేశం ఏంటని వారు అడిగితే మీరేం చెబుతారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది మహిళలను వేధించడమే.
కేంద్ర బలగాల్లో చేరాలనుకునే మహిళలకు కూడా ఇలాంటి భౌతిక ప్రమాణాలను కొలిచే పరీక్షలేమీ లేవు. మహిళా ఐపీఎస్ అధికారులకు కూడా ఇలాంటి నియమాలు చట్టంలో లేవు.
ఒకవేళ మహిళల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటే, అందుకోసం స్పిరో మీటర్‌ను ఉపయోగించాలి. కానీ, ఊపిరి పీల్చి బిగబట్టిన తర్వాత ఛాతీ పరిమాణాన్ని కొలవాలనే నిబంధన ఏంటో నాకు అర్థం కావట్లేదు’’ అని శ్వేత వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏమంటోంది?
ఫారెస్ట్ అధికారుల పదవుల భర్తీలో మహిళా అభ్యర్థుల ఛాతీ కొలవడం అనే నిబంధన గురించి హరియాణా విద్య, అటవీశాఖ మంత్రి కన్వర్‌పాల్ గుజ్జర్ మాట్లాడారు.
‘‘ముందు నుంచి అమల్లో ఉన్న నిబంధనలే ఈ నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. మిగతా వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. చట్టపరంగా ఏది సరైతే అదే చేస్తాం’’ అని ఆయన అన్నారు.
ఈ అంశంపై హరియాణా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చైర్మన్ భోపాల్ సింగ్ ఖత్రి మాట్లాడుతూ- ‘‘మేం ఈ నోటిషికేషన్‌ను జారీ చేసినప్పుడే ఇలాంటి పరీక్షలు ఉంటాయని చెప్పాం. ఈ పరీక్షలను మహిళా వైద్యులు, శిక్షకులు మాత్రమే నిర్వహిస్తారు’’ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హోం లోన్: కిరాయి ఇంటికి కడుతున్న అద్దె డబ్బులను ఈఎంఐగా కట్టి ఇల్లు కొనుక్కోవచ్చా?
- Annuity plans: నెల జీతంలాగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే మార్గమిది, ఎవరు చేరొచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలేంటి
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









