ఇకపై దరఖాస్తులలో కులం, మతం నింపాల్సిన అవసరం లేదా? తెలంగాణ హైకోర్ట్ ఏం చెప్పింది

ఫొటో సోర్స్, Swaroopa Family
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మాది కులం, మతంతో సంబంధం లేని పెళ్లి. మేం కులాలు, మతాలు చెప్పుకోకూడదని ముందుగానే అనుకుని పెళ్లి చేసుకున్నాం. మాకు బాబు పుట్టాక కూడా కులం చెప్పకూడదని అనుకున్నాం. మేమే కులం, మతం వద్దని అనుకుంటే.. ఇక మా అబ్బాయికి ఎందుకు..?’’ అని బీబీసీతో అన్నారు హైదరాబాద్ తార్నాకకు చెందిన సందెపాగు స్వరూప.
ఆమె కుమారుడి విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద చర్చకు దారి తీసింది.
కులం, మతం చెప్పకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరా..?
పిల్లల బర్త్ సర్టిఫికెట్లు(జనన ధ్రువీకరణ పత్రాలు), పాఠశాల, పరీక్షలు, ఉద్యోగ దరఖాస్తు ఫారాలలో కులం, మతం నింపాల్సి వచ్చేది. మరి.. కులం వద్దు.. మతం వద్దు అనుకునేవారి పరిస్థితి ఏమిటి..? వారు దరఖాస్తుల్లో ఏమని రాయాలి?
గతంలో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉండేవి.
అలాంటి వారికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటే. ఇది చారిత్రకమని న్యాయవాదులు చెబుతున్నారు.
ఇకపై జనన ధ్రువీకరణపత్రాల కోసం ఆన్ లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో కులం, మతం లేదు అనే కాలమ్ కూడా జత చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, జనన, మరణ గణాంకాల రిజిస్ట్రార్, తెలంగాణ మున్సిపల్ శాఖలను ఆదేశించింది.
హైదరాబాద్ తార్నాకలో ఉండే అజ్జపాగు డేవిడ్, సందెపాగు స్వరూప దంపతుల పిటిషన్ పై విచారించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత తీర్పు చెప్పారు.

ఇంతకీ ఏమిటి ఈ కేసు..?
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన స్వరూప, అమరచింతకు చెందిన డేవిడ్ కులాంతర, మతాంతర పెళ్లి చేసుకున్నారు.
వీరికి 2019 మార్చి 23న కుమారుడు ఇవాన్ రూడే జన్మించారు.
ఆ బాబు జనన ధ్రువీకరణపత్రం కోసం అదే ఏడాది ఏప్రిల్ 7న కొత్తకోట మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ దరఖాస్తులో కుటుంబ మతం కాలమ్ తప్పనిసరిగా నింపాలని చెప్పారు. లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదన్నారు.
తమకు మతం, కులం ప్రస్తావన లేకుండా సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. దానికి మున్సిపల్ అధికారులు నిరాకరించారు.
ఈ విషయంపై అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ శ్వేతామహంతిని కలిసి వారు విన్నవించారు.
బర్త్ సర్టిఫికెట్ వరకు ఇవ్వగలమని, దరఖాస్తులో ‘నో కాస్ట్.. నో రెలిజియన్(కులం లేదు.. మతం లేదు) అనే కాలమ్ జత చేయడం నా చేతుల్లో లేదని ఆమె సమాధానమిచ్చారు.
తాము కోరిన పద్ధతిలో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో 2019 ఆగస్టు 28న స్వరూప, డేవిడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై అప్పట్లో విచారించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, జనన, మరణ గణాంక రిజిస్ర్టార్, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి, కొత్తకోట మున్సిపల్ అధికారులకు నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది.
తర్వాత కేసు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
తమ బాబుకు ఐదేళ్లు వస్తున్నందున.. ఆలోపే బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు చెబుతున్నాయని, అత్యవసరంగా విచారించి తీర్పు చెప్పాలని పిటిషనర్లు కోరారు.
కులం, మతం ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్ జారీ చేయాలని మున్సిపల్ అధికారులను న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఆదేశించారు.
అలాగే ఇకపై జనన ధ్రువీకరణపత్రాల దరఖాస్తులలో కులం, మతం లేదు అనే కాలమ్ జత చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
కులం, మతం వద్దని ఎందుకు అనుకుంటారు?
ఎవరైనా కులం, మతం ఎందుకు వద్దనుకుంటారు..?
కులం వద్దు.. మతం వద్దు.. అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది..?
పుట్టుకతో వచ్చిన మతం, కులం తమకు వద్దని ఎందుకు అనుకుంటున్నారు.. తమ పిల్లలకు ఆ విధంగానే సర్టిఫికెట్లు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు..?
సమాజంలో జరిగే కొన్ని పెళ్లిళ్లలో.. ముఖ్యంగా ప్రేమ వివాహాలలో కులం, మతం ప్రస్తావన లేకుండా జరిగేవే ఎక్కువ.
అలా పెళ్లి చేసుకున్నప్పుడు దంపతుల మధ్య అవగాహనతో ఏదో ఒక మతాన్ని తీసుకుని పాటిస్తుంటారు. లేదా రెండు మతాలు సంప్రదాయాలు పాటిస్తారు.
కులం విషయానికి వచ్చేసరికి కుటుంబ పెద్ద(సహజంగా మగవారు) ఏ కులానికి చెందితే.. ఆ కులం పిల్లలకు వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అయితే.. కొందరు దంపతులు ఒక అవగాహనకు వచ్చి కులం, మతం వద్దనుకున్నప్పుడు పిల్లలకు అవి వద్దని భావిస్తున్నారు.
ఇలా వద్దనుకునే వారిలో అత్యధికులు కులాంతర లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వారే ఉంటున్నారు.
ఎలాంటి విభేదాలు రాకూడదన్న ఉద్దేశంతో ఏ మతాన్ని, కులాన్ని వద్దనుకుంటున్నారు.
కానీ, తర్వాత పిల్లల జనన ధ్రువీకరణపత్రం మొదలుకుని విద్యాసంస్థల్లో ప్రవేశాల వరకు ప్రతిచోట కులం, మతం ప్రస్తావన చేయాలి. అలాంటప్పుడు సమస్య ఎదురవుతోంది.
ఈ విషయంపై 2009 నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న డీవీ రామకృష్ణారావు బీబీసీతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన వేసిన పిల్ (డబ్ల్యూపీ- పిఐఎల్ నం.66/2017) తెలంగాణ హైకోర్టులో పెండింగులో ఉంది.
‘‘కులం వద్దు.. మతం వద్దు అనుకున్నప్పుడు దరఖాస్తులలో ‘అదర్స్(ఇతరులు)’ అనే ఆప్షన్ పెట్టి నింపాల్సి వస్తోంది.
మా పెద్దమ్మాయి స్కూల్ అడ్మిషన్ విషయంలో మతం రాయలేదని ప్రవేశం నిరాకరించారు. అప్పుడు హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని ప్రవేశం తీసుకున్నాం.
తర్వాత మా చిన్నమ్మాయి విషయంలోనూ అదే సమస్య ఎదుర్కొన్నాం.
మా పెద్దమ్మాయి టెన్త్ పరీక్షలు రాసేప్పుడు ఇదే సమస్య ఎదురైంది.
చదువుకు ఇబ్బంది రాకూదని దరఖాస్తు నింపేప్పుడు ‘అదర్స్’ అనే ఆప్షన్ పెట్టాం.
ఇక్కడ అదర్స్ అంటే మతం లేదనుకుంటున్నవారని కాదు కదా..?
దరఖాస్తులో ఉన్న మతాలు కాకుండా వేరొక మతానికి చెందిన వారు.. అని అలా ఇచ్చారు. కానీ మేం ఏ మతానికి చెందనివారం. అందుకే దరఖాస్తుల్లో ప్రత్యేకంగా మతం లేదు..
కులం లేదు.. అనే ఆప్షన్ పెట్టాలని అడుగుతున్నాం.’’ అని డీవీ రామకృష్ణారావు బీబీసీతో అన్నారు.
కులం, మతం ప్రస్తావన లేని సర్టిఫికెట్లు కుదురుతుందా..
బర్త్ సర్టిఫికెట్ తీసుకునేప్పుడు.. పిల్లలను బడిలో చేర్పించేప్పుడు.. కాలేజీలో ప్రవేశం తీసుకునేప్పుడు.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ పౌరులు తమ కులం, మతం చెప్పాలి.
జనాభా లెక్కల్లోనూ ఆరు మతాల ప్రస్తావన ఉంటుంది లేదా మతం చెప్పడానికి ఇష్టపడని వారు అనే మరో ఆప్షన్ ను కేంద్రం తీసుకువచ్చింది.
త్వరలో మరో విడత జనాభా లెక్కలు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈలోపు మతం లేదు.. కులం లేదు.. అనే ఆప్షన్ ను దరఖాస్తులో జత చేయాలని కోరుతున్నారు.
కులం, మతం ప్రస్తావన లేకుండా దరఖాస్తులు ఇవ్వడం సాధ్యపడుతుందని చెబుతున్నారు తమిళనాడులోని తిరుపత్తూరుకు చెందిన న్యాయవాది ఎంఏ స్నేహ.
ఆమె 2010 నుంచి పోరాటం చేసి 2019లో కులం, మతం లేదు.. అనే సర్టిఫికెట్ అధికారుల నుంచి తీసుకున్నారు.
‘‘నో కాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ అనేది తమిళనాడులో తహసీల్దారు విచక్షణాధికారాలను ఉపయోగించి ఇచ్చే అవకాశం ఉంది.
నాకు సర్టిఫికెట్ తీసుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేశాను.
గ్రామ పరిపాలన అధికారుల నుంచి మొదలుకుని తహసీల్దారు, సబ్ కలెక్టర్.. ఇలా వివిధ స్థాయిల్లో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చాను.
చివరికి తహసీల్దారుకు ఉన్న విచక్షణాధికారులను ఉపయోగించి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు.’’ అని స్నేహ బీబీసీతో అన్నారు.
‘‘నేను తీసుకున్న తర్వాత తమిళనాడు వ్యాప్తంగా 35 మంది అలా సర్టిఫికెట్లు తీసుకున్నారు.
ఇలా సర్టిఫికెట్లు ఇవ్వడం వెనక అటు జ్యుడిషియల్ లేదా ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. అని స్నేహ చెప్పారు.
1972లో తమిళనాడు ప్రభుత్వం స్కూల్ అడ్మిషన్ ఫారంలో కులం, మతం ప్రస్తావన అక్కర్లేదని చెబుతూ జీవో ఇచ్చింది.
అంతేతప్ప పౌరులకు కులం లేదు.. మతం లేదు అని సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు లేవని అమె చెప్పారు.
కేవలం తమిళనాడు, తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా కులం, మతం వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మతం, కులం వద్దన్నవారు 28.6 లక్షల మంది
సాధారణంగా దేశంలో అత్యధిక శాతం జనాభా ఆరు మతాలకు చెందిన వారు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం… హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2శాతం, క్రైస్తవులు 2.3శాతం, సిక్కులు 1.7శాతం, బౌద్ధులు 0.7శాతం, 0.4శాతం జైనులు ఉన్నారు.
అప్పటి సర్వేలో తొలిసారిగా ఏ మతం నమ్మని వ్యక్తుల కాలమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
దీని ప్రకారం 28,67,303 మంది ఏ మతాన్ని నమ్మడం లేదని చెప్పారు.
ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 12,23,663 మంది ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 16,43,640 మంది ఉన్నారు.
మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్యూరీసెర్స్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 110 కోట్ల మంది మతం వద్దని అనుకునే వారు ఉన్నట్లు తేలింది.
వీరి సంఖ్య 2050 నాటికి 120కోట్లకు చేరుకుంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.
ప్రధానంగా యూరప్, నార్త్ అమెరికాలో వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై డీవీ రామక్రష్ణారావు బీబీసీతో మాట్లాడుతూ తమది ప్రజాస్వామిక ఆకాంక్ష అని చెప్పారు.
‘‘మతం చెప్పడానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు.. మతం చెప్పకపోవడానికీ స్వేచ్ఛ ఉంది కదా.. అని ఆయన అడుగుతున్న ప్రశ్న. అందుకే మతం విశ్వసించే వాళ్లు, మతం విశ్వసించని వాళ్లు.. ఇలా అందరూ మాకు మద్దతుగా నిలవాలి.’’ అని కోరారు.
పిటిషన్ పై 55వేల సంతకాలు
మతం వద్దు.. కులం వద్దు.. అనే ఆప్షన్ ఇవ్వాలని కోరుతూ 2017లో change.org లో పిటిషన్ ప్రారంభించారు.
ఈ కథనం రాసే సమయానికి 55,738 మంది ఆన్లైన్ లో సంతకాలు చేశారు.
‘‘తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమాజం ముందుకు వెళ్లడానికి ఒక ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నాం. గతంలో మేం వేసిన పిల్ సైతం కోర్టు విచారణకు వస్తుందని అనుకుంటున్నాం.’’ అని రామకృష్ణారావు చెప్పారు.
కచ్చితంగా స్వాగతించాల్సిందే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మతపరమైన స్వేచ్ఛను సూచిస్తాయి.
రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ మతాన్ని అయిన విశ్వసించే హక్కు ఉన్నప్పుడు.. ఏ మతాన్ని విశ్వసించనక్కర్లేదనే స్వేచ్ఛ కూడా ఉంటుందని తీర్పు సందర్భంగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ తీర్పుపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ బీబీసీతో మాట్లాడారు.
‘‘కులం లేదు.. మతం లేదు అనే కాలమ్ పెట్టాలనే తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నా.
ఈ మధ్య కుల గణన తీసుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కులం లేదని చెప్పినప్పుడు కచ్చితంగా ప్రభుత్వం అందుకు తగ్గ వెసులుబాటు ప్రజలకు కల్పించాలి.
కులం, మతం చెప్పమని ఒత్తిడి చేయడం సరికాదు.
రాజ్యాంగం ప్రకారం ఎవరి మత సంప్రదాయాలు వారు చెప్పమని చెప్పారు కానీ రాజ్యానికి కులం, మతం చెప్పమని ఎక్కడా లేదు.
వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.’’ అని చెప్పారు.
అలాగే పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొ.హరగోపాల్ బీబీసీతో మాట్లడుతూ.. ‘‘వ్యక్తికి మతపరమైన స్వేచ్ఛ మాత్రమే కాదు.. మతం నుంచి స్వేచ్ఛ కూడా ఉంటుంది.
కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆప్షన్ ఇవ్వాలి. హైకోర్టు ఆ దిశగా తీర్పు ఇవ్వడం మంచిది.
ప్రభుత్వాలు కూడా దీనిపై ఆలోచించి సెక్యులర్ అనే కాలమ్ పెట్టాలి.’’ అని చెప్పారు.
‘‘హైకోర్టు ఇచ్చిన తీర్పు జాతీయ కోణంలో చూడాలి.
ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం.
జనన ధ్రువీకరణ దరఖాస్తుల్లో కులం, మతం లేదు.. అనే కాలమ్ తీసుకురావాలి. ’’ అని బీబీసీతో చెప్పారు పిటిషనర్ స్వరూప.
ఇవి కూడా చదవండి:
- సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?
- అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?
- ఇరాన్ : మళ్లీ వీధుల్లోకి మొరాలిటీ పోలీసులు, హిజాబ్ ధరించకుంటే విచారణ
- నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














