అమీనా: నెల్సన్ మండేలా మనసుపడ్డ ఈ భారత సంతతి మహిళ ఆయన ప్రేమను ఎందుకు తిరస్కరించారు?

- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మహిళలు నావైపు చూడటం, నాపై ఆసక్తి చూపించడంలో నా తప్పేమీ లేదు. నిజం చెప్పాలంటే, దీన్ని నేనెప్పుడూ వ్యతికేరించలేదు.’’ అని నెల్సన్ మండేలా ఒకసారి జోక్ చేశారు.
మూడుసార్లు వివాహం చేసుకున్న నెల్సన్ మండేలా, వృద్ధాప్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలను ఆకర్షించే వారు.
కానీ, నెల్సన్ మండేలా పెళ్లి ప్రతిపాదనను ఒప్పుకోని ఒక మహిళ కూడా ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన ఆమె పేరు అమీనా కచాలియా.
నెల్సన్ మండేలా ఆ మహిళపై ఎలా మనసుపడ్డారు, వారిద్దరి మధ్య బంధం ఎలాంటిది అనే అంశాలపై ప్రముఖ జర్నలిస్టు సయీద్ నఖ్వీ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఫొటో సోర్స్, GHALEB CACHALIA/FACEBOOK
ఎందుకు మండేలా ప్రతిపాదనను ఒప్పుకోలేదు?
దక్షిణా ఆఫ్రికాలో జరిగిన వర్ణ వివక్ష ఉద్యమంలో అమీనా కీలక పాత్ర పోషించారు. ఆమెకు 21 ఏళ్లు ఉన్నప్పుడు, పుట్టిన రోజు వేడుకకు నెల్సన్ మండేలా వచ్చారు. అమీనా కూడా ఒకసారి తనని కలిసేందుకు పోల్స్‌మూర్ జైలుకి వెళ్లారు.
అమీనా యూసఫ్ కచాలియాను వివాహమాడారు. ఆయన 1995లో మరణించారు.
ఆ సమయంలో, నెల్సన్ మండేలా తన రెండో భార్య విన్నీకి విడాకులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు.
‘‘మండేలా, మా తల్లిదండ్రులు మంచి స్నేహితులని మాకు తెలుసు. అప్పుడప్పుడు ఆయన మా ఇంటికి వస్తుండేవారు. 1990ల్లో, ఒకసారి అమ్మ నన్ను, నా సోదరిని కోకోను ఒక మూలకు తీసుకెళ్లి, మండేలా తనను పెళ్లి చేసుకుంటా అన్నారని, కానీ తాను తిరస్కరించానని నాతో చెప్పింది.’’ అని అమీనా కొడుకు ఘలేబ్ కచాలియా తనకు చెప్పినట్లు నఖ్వీ వెల్లడించారు.
ఆ సమయంలో నెల్సన్ మండేలా వయసు 80 ఏళ్లు కాగా, అమీనా వయసు 68 ఏళ్లు.
‘‘అంత ప్రముఖమైన వ్యక్తి పెళ్లి ప్రతిపాదనను ఎందుకు మీ అమ్మ తిరస్కరించిందని నేను ఘలేబ్ కచాలియాను అడిగాను.’’ అని నఖ్వీ చెపపారు.
‘‘మా అమ్మ నెల్సన్ మండేలాను బాగా ఇష్టపడేది. అయితే, నాన్న జ్ఞాపకాలను మర్చిపోయేందుకు కూడా అమ్మ సిద్ధంగా లేదు. నాన్న అమ్మ కంటే 15 ఏళ్లు పెద్ద. అయినప్పటికీ, నాన్న చనిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న మరో మనిషిని ఆమె తన జీవితంలోకి ఆహ్వానించాలని కోరుకోలేదు’’ అని ఘలేబ్ సమాధానమిచ్చినట్లు నఖ్వీ వెల్లడించారు.

ఫొటో సోర్స్, GHALEB CACHALIA/FACEBOOK
అందంగా, నడక నాజుకుగా ఉండేది
నెల్సన్ మండేలా జైలులో ఉన్నప్పుడు తొలిసారి అమీనాను కలిసే అవకాశం తనకు దక్కిందని ప్రముఖ జర్నలిస్ట్ సయీద్ నఖ్వి చెప్పారు. ఆ సమయంలో అమీనా భర్త యూసఫ్ జీవించే ఉన్నారు.
జైలు నుంచి నెల్సన్ మండేలా విడుదలైనప్పుడు, డెస్మండ్ టుటు ఇంట్లో ఆయన్ని కలిసేందుకు వెళ్లినప్పుడు, మండేలా పక్కనే అమీనా కూర్చుని ఉండటాన్ని నఖ్వి చూశారు.
‘‘అమీనాను చూస్తే, ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నట్లు నాకనిపించింది. ఆమె నడక గజగామినీ లాగా అంటే చూడటానికి చాలా నాజుకుగా ఉండేది.
హీరోయిన్ కంటే తక్కువేమీ కాదు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఆమె పనిచేశారు. మండేలాకు ఆమె స్నేహితురాలు. ఆమె నాలెడ్జ్ కూడా మండేలాకు సమాన స్థాయిలో ఉండేది’’ అని నఖ్వి చెప్పారు.

ఫొటో సోర్స్, GHALEB CACHALIA/FACEBOOK
కీత్ మిల్లర్ కూడా ఆమె ప్రేమలో పడ్డారు
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో సభ్యుడైన కీత్ మిల్లర్ కూడా 1948లో ఆఫ్రికా పర్యటనకు వచ్చిన సమయంలో అమీనాను చూసి ప్రేమలో పడ్డారు.
ఆ సమయంలో కీత్ మిల్లర్‌కి ఇంకా వివాహం కాలేదు. మిల్లర్ ప్రపంచంలో ఫేమస్ ఆల్-రౌండర్.
‘‘ఈ ఇద్దరూ ఒక పార్టీలో కలుసుకున్నారు. ఆ తర్వాత మిల్లర్ రాత్రింబవళ్లు అమీనాకు ఫోన్ చేసేవారు. ఒక సరదా విషయం ఏంటంటే, ఆమెకు కాల్ చేసే వారు కానీ, ఆమెను కలిసేందుకు వచ్చేవారు కాదు.
ఎందుకంటే, ఆయన తెల్లజాతి ప్రాంతంలో నివసించే వారు. ఆమె భారతీయులు ఉండే ప్రాంతంలో ఉండేవారు. అమీనా భర్త యూసఫ్ ఈ విషయంలో జోక్ చేసేవారు. ఈ స్టోరీ చెబుతూ వర్ణవివక్ష మాకు చాలా సాయం చేసింది. లేదంటే, ఈ కీత్ మిల్లర్ ఇక్కడికి వచ్చి, అమీనాను కలిసేవారు’’ అని అనేవారని సయూద్ నఖ్వీ చెప్పారు.

మండేలా, అమీనా మధ్యలో సాన్నిహిత్యం
సయీద్ నఖ్వీ సమక్షంలోనే ఎన్నోసార్లు అమీనా, నెల్సన్ మండేలా సమావేశమయ్యారు. కానీ, 1995లో ఆయన దక్షిణాఫ్రికా వెళ్లేటప్పటికి యూసఫ్ కన్నుమూశారు.
‘‘అమీనా నన్ను తీసుకుని మండేలా బంగ్లా వరకు వెళ్లారు. మా డ్రైవర్ కూడా మాతో ఉన్నారు. ఆయన భార్య పేరు ఆలీస్. మండేలా ఆత్మకథ ‘లాంగ్ వాక్ టూ ఫ్రీడం’పై తన భార్య కోసం ఆటోగ్రాఫ్ ఇవ్వాలని ఆ డ్రైవర్ మండేలాను అభ్యర్థించారు.
సంతకం చేసి ఇచ్చిన మండేలా అమీనాతో ఈ విధంగా అన్నారు. ‘‘నీకు గుర్తుందా కొన్నేళ్ల కిందట ఆలీస్ అనే పేరున్న ఒక అమ్మాయితో నేను డేటింగ్ చేసేవాణ్ని. కొన్నిసార్లు రెస్టారెంట్‌కి వెళ్లేవాణ్ని.’’ అంటూ వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారని నఖ్వీ చెప్పారు.
వాళ్లిద్దరు అలా మాట్లాడుకోవడం చూసి తనకు ఇబ్బందిగా అనిపించి వెనక్కి వెళ్లానని, వారి మధ్య సాన్నిహిత్య ఉందని తనకు అనిపించినట్లు నఖ్వీ చెప్పారు.
‘‘కాసేపటి తర్వాత మండేలా ఆమె చేతులు పట్టుకుని బంగ్లాలోపలికి తీసుకెళ్లారు. అప్పటి వరకు మేం ఆయన లాన్‌లోనే మాట్లాడాం. కొంత సమయం తర్వాత అమీనా బయటికి వచ్చారు. అప్పుడు నేను సాయంత్రం కలుద్దాం అని చెప్పి బయలుదేరబోయాను. కానీ, అమీనా మాత్రం సాయంత్రం మిమ్మల్ని కలవడం కుదరదని చెప్పింది. సాయంత్రం వరకు తానిక్కడే ఉంటానని అమీనా చెప్పింది. అప్పుడు నాకొకటి అర్థమైంది. వారిద్దరి మధ్యన చాలా సాన్నిహిత్యం ఉందని’’ అని సయీద్ నఖ్వి చెప్పారు.
ఆ తర్వాత ఎన్నిసార్లు అమీనాను కలిసేందుకు సయీద్ నఖ్వి వెళ్లినప్పటికీ, ఆమె మండేలా ఇంట్లో ఉన్నారని తెలిసేదన్నారు.
‘‘నాకు తెలిసిందేంటంటే, కీత్ మిల్లర్ చేయలేని పనిని నెల్సన్ మండేలా చేశారని. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసింది. అప్పుడు నెల్సన్ మండేలా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు’’ అని నఖ్వీ చెప్పారు.

ఫొటో సోర్స్, GHALEB CACHALIA
మండేలా కోసం సమోసాలు చేసి పెట్టిన అమీనా
అమీనా కచాలియా ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన గుండెలో మండేలా మధుర జ్ఞాపకాలున్నాయని అన్నారు. అధ్యక్షుడు అయిన తర్వాత ఒకసారి మండేలా తన ఇంటికి వచ్చారని తెలిపారు.
‘‘కిచెన్‌లో ఆయన నా పక్కనే స్టూల్‌పై కూర్చున్నారు. అప్పుడు నేను ఆయనకు సమోసాలు చేసి ఇచ్చాను’’ అని అమీనా ఇంటర్వ్యూలో చెప్పారు.

ఫొటో సోర్స్, AMINA CACHALIA
‘వెన్ హోప్ అండ్ హిస్టరీ రైమ్’ అనే తన ఆత్మకథలో అమీనా కచాలియా, నెల్సన్ మండేలా గురించి రాశారు.
‘‘గ్రేస్ మాషెల్‌ను మూడో వివాహం చేసుకున్న తర్వాత మండేలా ఒకసారి జోహనెస్‌బర్గ్‌లో ఉన్న నా ఫ్లాట్‌కి వచ్చారు. ఆయన నా మీద ప్రేమను వ్యక్తపరిచారు. మీకు ఇప్పుడే పెళ్లి అయిందని నేను ఆయన ప్రేమను వ్యతిరేకించాను.
నేను ఫ్రీనే కానీ, మీరు కాదు అన్నాను. దీంతో మండేలా చాలా మనస్తాపం చెందారు. ఆయన పదే పదే అదేమాట చెబుతుండేసరికి, నేను మీకోసం చేపలకూర వండి పెడతాను అన్నాను. వెంటనే ఆయన కోపంగా తలుపులు మూసి బయటికి వెళ్లిపోయారు’’ అని రాశారు.
‘‘మండేలా తన ప్రేమ తాకుతూ చూపించేవారు కాదు. ఎన్నో ఏళ్లు జైలులో ఉండటం వల్ల, ఆయన ఫీలింగ్స్‌ను కోల్పోయారు. తాకకుండానే ప్రేమను తెలియజేసేవారు. నేను ఆయన్ని ఇష్టపడ్డాను. కానీ, నా భర్తను వృద్ధాప్యంలో కూడా ప్రేమించినంతగా నేను మండేలాను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోయాను’’ అని అమీనా తన ఆత్మకథలో వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
భారతీయ సంతతి మహిళను పెళ్లి చేసుకోవడంపై వ్యతిరేకత
అమీనా ఏం రాసినప్పటికీ లేదా ఆమె కొడుకు ఏం చెప్పినప్పటికీ, మండేలా, అమీనాలు మరింత సాన్నిహిత్య బంధాన్ని కొనసాగించడాన్ని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ టాప్ లీడర్లు కోరుకోలేదని సయీద్ నఖ్వి చెప్పారు.
‘‘దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష విముక్తి కోసం పోరాడిన హీరోగా, ఆఫ్రికా స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతగా తాము కొలిచే నెల్సన్ మండేలా ఇలా చేయడం వారు తేలిగ్గా తీసుకోలేదు. ఆఫ్రికా సమాజంలో ఇది తప్పుడు మెసేజ్‌ను తీసుకెళ్తుందని భావించారు. అయితే, మండేలా మనసులో, గుండెలో ఈ ఆలోచనే లేదు’’ అని నఖ్వి చెప్పారు.
‘‘ఒక భారతీయ మహిళను పెళ్లి చేసుకోవడం కంటే మొజంబిక్ అధ్యక్షుడి వితంతు భార్య గ్రేస్ మాషెల్‌ను పెళ్లి చేసుకోవడం మంచిదని మండేలాకు కూడా అర్థమైంది. మెల్లగా ఆయన దీన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఎవరు యెస్ చెప్పినా, ఎవరు నో చెప్పినా, ఈ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. వారిని దగ్గర్నుంచి చూసిన తర్వాత, వారిద్దరి మధ్యలో ఏదో ఉందని నేను చెప్పగలను’’ అని నఖ్వి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘బ్రిటిష్ పాలన’ విడదీసిన కుటుంబాలను ఆయన ఎలా కలుపుతున్నారంటే...
- గ్రహాంతరవాసులు పంపే సంకేతాలను పసిగట్టే ప్రపంచలోని అతి పెద్ద టెలిస్కోప్
- ఆయన చనిపోయాడని పేపర్లలో వచ్చింది. కానీ, ఒక జట్టు కోచ్ ఎలా అయ్యారు?
- ది గ్రేట్ మూన్ హోక్స్: ‘చంద్రుని మీద మనుషులు, 420 కోట్ల జీవులు’.. వారికి బైబిల్ బోధించాలని 187 ఏళ్ల కిందట క్రైస్తవ మిషనరీలు నిధులు సేకరించినప్పుడు..
- అవినీతి ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన గుప్తా సోదరుల అరెస్ట్.. వెనక్కి తీసుకొచ్చి బోనులో నిలబెడతామన్న ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














