నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘నేషనల్ యూత్ వాలంటీర్ స్కీమ్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. కిశోర్ బాబు
- హోదా, బీబీసీ కోసం
సమాజంలో తమ వంతు సేవ చేయాలనుకునే యువతీ, యువకులకు తమ ప్రాంతంలో వాలంటీర్‌గా కొంతకాలం పనిచేయడానికి అవకాశం కల్పిస్తూ ‘నేషనల్ యూత్ వాలంటీర్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తోంది.
ఈ పథకంలో చేరి, వాలంటీర్‌గా పనిచేసేవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.5000 గౌరవ వేతనం కూడా అందిస్తోంది.
నేషనల్ యూత్ వాలంటీర్ పథకం అంటే ఏమిటి? ఆ పథకంలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలేమిటి? దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ నేషనల్ యూత్ వాలంటీర్ పథకం?
ఈ పథకం కింద చేరేవారినే ‘నేషనల్ యూత్ కాప్స్’ అని కూడా పిలుస్తారు. ఈ పథకాన్ని 2011 నుంచి కేంద్ర యువజన, క్రీడల శాఖ నేతృత్వంలోని ‘నెహ్రూ యువ కేంద్రా సంఘటన్’ పర్యవేక్షిస్తోంది.
దీని కింద చేరినవారికి గరిష్ఠంగా రెండేళ్లు వాలంటీర్‌గా పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు.
ఈ సమయంలో ప్రతి నెలా రూ.5000 గౌరవ వేతనం కల్పిస్తారు.
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 12,000 మంది వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ లెవల్ స్థాయి ప్రాంతాలకు పంపి, అక్కడ సేవ చేయిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు?
ఈ పథకంలో వాలంటీర్‌గా చేరాలనుకున్నవారి వయసు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు మొదట్లో నాలుగు వారాల శిక్షణ ఇస్తారు.
విద్యార్హతలు?
ఈ పథకంలో చేరాలనుకునే వారు 10వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు?
నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
ఆండ్రాయిడ్ ఫోన్‌తోపాటు భిన్న రకాల యాప్‌లు ఉపయోగించడంపై అనుభవం ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు.
రెగ్యులర్ విద్యార్థులు వాలంటీర్‌గా చేరొచ్చా?
చేర్చుకోరు. కళాశాలల్లో రెగ్యులర్ విద్యార్థిగా చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. వీరు తమ కళాశాలల్లో ఎన్‌సీసీ లేదా ఎన్‌ఎస్‌ఎస్ స్కీముల్లో చేరొచ్చు.
పార్ట్-టైమ్ వాలంటీర్‌గా పనిచేయొచ్చా?
అలా పనిచేయడానికి వీల్లేదు.

ఫొటో సోర్స్, Getty Images
సేవలు ఎలా వినియోగించుకుంటారు?
- నేషనల్ యూత్ వాలంటీర్‌గా లేదా నేషనల్ యూత్ కాప్‌గా ఎంపికైన వారిని నెహ్రూ యువజన కేంద్రం అధికారులు ఆయా ప్రాంతాల్లోని బ్లాక్ లెవల్ స్థాయికి తీసుకెళ్లి సామాజిక సేవలు అందించేలా చేస్తారు.
- ఒక మండలం లేదా రెండు మండలాలను కలిపి ఒక బ్లాక్‌గా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతంలోని పంచాయతీల్లో ఉన్న సామాజిక అంశాలు, సమస్యలపై అక్కడి ప్రజలను చైతన్య పరచాల్సి ఉంటుంది.
- ఆ ప్రాంతంలో సమస్యలపై అధ్యయనంచేసి నివేదిక అందజేయాలి.
- మహిళా వాలంటీర్‌లు ఆ ప్రాంతంలోని మహిళలను సంఘటితరపరిచి, సమకాలీన అంశాలపై అవగాహన కల్పించాలి.
- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఆ ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పించాలి.
- స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, ఆజాదీకా అమృత్ కాల్ లాంటి కార్యక్రమాలను కూడా ఆయా పంచాయతీల్లో నిర్వహించాలి.
- ప్లాస్టిక్ రహిత పంచాయతీలుగా తీర్చదిద్దడానికి వీలుగా వాలంటీర్లు అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ వాలంటీర్లు ‘ఆజాదీకా అమృత్‌కాల్’ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా పంచాయతీల్లో చెరువులు అభివృద్ధి చేస్తున్నారు.
- చెరువుల చుట్టూ వాలంటీర్లు 75 మొక్కలు నాటి సంరక్షించే పనులు చేస్తున్నారు. ఇక్కడి నుంచి మట్టి నీరు తీసుకెళ్లి, ఆగస్టులో దిల్లీలో జరిగే మేరీ మాటీ, మేరీ దేశ్ (నా మట్టీ నా దేశం) కార్యక్రమంలో భాగంగా అక్కడ సంగమం చేసి, ఒక విగ్రహం రూపొందించనున్నారు.
- ఆయా గ్రామాలు, పంచాయతీలు, మండలాల్లో వెలుగులోకి రాని సంఘ సేవకులు, ప్రతిభావంతులు, సామాజిక విప్లవకారులను వెలుగులోకి తెచ్చి వారికి సత్కార కార్యక్రమాలు చేపడతారు.
- స్థానిక యువతీ యువకులతో కలిసి ఆయా పంచాయతీలలో సామాజిక అంశాలపై చైతన్యం తీసుకురావడానికి యూత్ క్లబ్‌లు ఏర్పాటు చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు యూత్ వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనిపై ఆ ప్రాంతంలోని ప్రముఖ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇస్తారు. అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏ పత్రాలు ఇవ్వాలి?
- దరఖాస్తుదారు ఫోటో
- ఆధార్ కార్డు
- 10వ తరగతి మార్క్స్ లిస్ట్
- కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ)
- ఉన్నత విద్యార్హతలకు సంబంధించి ఏవైనా సర్టిఫికెట్లు ఉంటే అవి
- మీ చిరునామా ధ్రువీకరించే పత్రం ( ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్సు/రేషన్ కార్డు)

ఫొటో సోర్స్, Getty Images
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యువజన వ్యవహారాల అధికారి, మరో ఇద్దరు అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. ఇది దరఖాస్తులను పరిశీలించి వాలంటీర్లను ఎంపిక చేస్తుంది.

నాయకత్వ లక్షణాలు అలవడతాయి: విజయారావ్
నేషనల్ యూత్ వాలంటీర్‌గా పనిచేసే యువతకు నాయకత్వ లక్షణాలు అలవడతాయని, వారు ఉద్యోగాలు సాధించడానికి, వాటిలో రాణించడానికి ఇది ఎంతగానో దోహదపడుతోందని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డైరెక్టర్ ఏఆర్ విజయారావ్ బీబీసీతో చెప్పారు.
‘‘ఈ ఏడాదికి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నాం. నెహ్రూ యువ కేంద్రాల ద్వారా మేం తరచూ ఉద్యోగ మేళాలు కూడా నిర్వహిస్తుంటాము. ఇందులో చాలా మంది వాలంటీర్లు ఉద్యోగాలు పొందిన సందర్భాలున్నాయి. వీరికి సామాజిక అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకూ, వీరికీ ఉన్న ప్రధానమైన తేడా ఇదే’’ అని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















