వలసలు : అర్ధరాత్రి అక్రమంగా పడవ ప్రయాణం, నడిసముద్రంలో పెట్రోల్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే...

- రచయిత, నికోలస్ నెగోస్
- హోదా, కఫౌంటైన్, సెనెగల్
‘‘తీరం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయంలో మేమంతా దాదాపు 140 మంది వ్యక్తులం బోటులోకి ఎక్కాం.’’... అని సెనెగల్‌కు చెందిన 30 ఏళ్ల డుడు డియోప్ వెల్లడించారు.
సెనెగల్ నుంచి 1700 కి.మీ దూరంలో ఉన్న స్పెయిన్‌లోని కానరీ ద్వీపానికి చేరుకోవడానికి ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా పడవ ఎక్కారు.
అట్లాంటిక్ సముద్రం మీదుగా ఉండే ఈ ప్రయాణ మార్గం ఇటీవల వార్తల్లో నిలిచింది.
జూన్ చివరి నుంచి ఈ మార్గాన ప్రయాణించిన మూడు పడవలు కనిపించకుండా పోయాయని ఒక ఎన్జీవో సంస్థ చెప్పినప్పటి నుంచి ఈ రూట్ వార్తల్లోకెక్కింది.
ఒక్కో పడవలో కనీసం 300 మంది ఉంటారని ఆ సంస్థ వెల్లడించింది.
దీనిపై దర్యాప్తు చేయడం కోసం నేను ఈ దారిలో ఎంట్రీ పాయింట్ అయిన కఫౌంటైన్‌కు వెళ్లాను. కఫౌంటైన్ అనేది దక్షిణ సెనెగల్‌లోని ఒక మారుమూల పట్టణం.
యూరప్‌లో మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ ఇక్కడి నుంచే ప్రతి ఏడాది వందలాది మంది ప్రయాణాన్ని మొదలుపెడతారు.
వాన కురుస్తుండగా, ఇంటి వరండాలో కూర్చున్న డుడు డియోప్‌ను నేను కలిశాను. కుటుంబంలోని మహిళలంతా ఆయన చుట్టూ కూర్చున్నారు.
‘‘మేం ఎటువంటి సమస్యలు లేకుండా మొరాకో వరకు వెళ్లగలిగాం’’ అని ఆయన చెప్పారు.
‘‘కానరీ ద్వీపానికి 500 కి. మీ దూరంలో ఉండగా అకస్మాత్తుగా మా పడవ ఇంజిన్ ఆగిపోయింది. అందులో పెట్రోల్ అయిపోవడంతో మేం నడి సముద్రంలో చిక్కుకుపోయాం. ముందుకు కదల్లేకపోయాం’’ అని ఆయన తెలిపారు.
పడవలో ఉన్న 140 మందిని మారిటేనియాలోని నౌధిబు నగర సమీపాన ఉన్న తీర ప్రాంతానికి మొరాకో అధికారులు తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.
‘‘మా పేర్లు, ఐడెంటీలను నమోదు చేసుకొని బస్సులో మమ్మల్ని సెనెగల్‌కు పంపించారు’’ అని డియోప్ చెప్పారు.
వారం రోజులు కనిపించకుండా పోయిన ఆయన, ఎట్టకేలకు తిరిగి ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆయన ప్రయాణించిన బోటు గురించిన ప్రస్తావన వార్తా ప్రకటనల్లో లేదా ప్రభుత్వ ప్రకటనల్లో ఉందో లేదో తెలియలేదు.
మరోవైపు సెనెగల్ ప్రభుత్వానికి, శరణార్థుల సంస్థ అయిన ‘వాకింగ్ బోర్డర్స్’కు మధ్య సముద్రంలో ఎంతమంది వలసదారులు తప్పిపోయి ఉంటారనే దానిపై వివాదం తలెత్తింది.

వాకింగ్ బోర్డర్స్ వ్యవస్థాపకురాలు హెలెనా మాలెనో, జూలై 9న దీనిపై అధికారులను హెచ్చరించడం ప్రారంభించారు.
సెనెగల్, మారిటేనియా, మొరాకో, స్పెయిన్‌లోని అధికారులను ఆమె సంప్రదించారు. కనిపించకుండా పోయిన పడవలను వెతికేందుకు సహకరించాలని ఆ అధికారులను హెలెనా మాలెనో కోరారు.
అదృశ్యమైన మూడు బోట్లలో ఒకదాన్ని కనుగొనేందుకు చేపట్టిన వెతుకులాట ప్రక్రియలో, కానరీ ద్వీపంలో మునిగిపోయిన పడవకు చెందిన 86 మంది శరణార్థులను స్పానిష్ అధికారులు రక్షించారు.
ఆ తర్వాత సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.
జూన్ 28 నుంచి జూలై 9 మధ్య కాలంలో మొరాకో జలాల్లో 260 మంది పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
రక్షించినట్లు సెనెగల్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలను, సెనగల్ తీర ప్రాంత నుంచి బయలుదేరిన ఇతర బోట్లకు సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేశామని వాకింగ్ బోర్డర్స్ తెలిపింది.
అయితే, ఈ బోట్లు 300 మందితో వెళ్లినవి కావని పేర్కొంది.
జూలై 13న 41 మంది శరణార్థులతో సెనగల్ నుంచి బయలుదేరిన మరో బోటు కానరీ ద్వీపానికి చేరుకుంది.

కనిపించకుండా పోయిన వారి గణాంకాలను ఒక దగ్గరకి చేర్చేందుకు నేను ప్రయత్నించినప్పుడు, కఫౌంటైన్‌లో ఒకే ఒక్క మహిళను తాను గుర్తించగలిగాను. తన బంధువు తప్పిపోయినట్లు ఆమె చెప్పారు.
తన 17 ఏళ్ల మేనల్లుడితో కాంటాక్ట్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ మూడు బోట్లలో ఒకదానిలో అతను ఉన్నట్లు అనిపిస్తోంది.
‘‘నాకు చాలా భయం వేస్తుంది. అతనికి చెందిన ఏ వార్త నాకు అందడం లేదు.’’ అని ఆమె తెలిపారు. రోజులు గడుస్తున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘కనిపించకుండా పోయిన 300 మంది వ్యక్తుల విషయంలో గందరగోళం ఉంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానిక సెక్యురిటీ ఏజెన్సీకి చెందిన ఒక వ్యక్తి నాకు చెప్పారు.
‘‘ఈ మహిళ కాకుండా, బంధువుల కోసం లేదా తోబుట్టువుల కోసం వెతికేందుకు అథారిటీలను లేదా సెక్యూరిటీ సర్వీసుల వద్దకు వచ్చామని చెప్పేవారు ఎవరూ ఈ పట్టణంలో లేరు’’ అని అధికారులు తెలిపారు.
కానీ, ఇదంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి లేదా పక్కనున్న దేశాల నుంచి వస్తారు.
వారికి ఆ గ్రామంతో ఎలాంటి సంబంధం ఉండదు.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, సెనెగల్ నుంచి కానరీ ద్వీపాలకు వెళ్లేందుకు ప్రయత్నించి గత సంవత్సరం 559 మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కేవలం ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే, కానరీ ద్వీపాలకి 7 వేల మందికి పైగా శరణార్థులు తరలి వెళ్లారు.

కలలు చెదిరిపోయాయి
క్లిష్టమైన ఆర్థిక వాతావరణమంటే, మెరుగైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ చాలా మంది యువత ఉన్నట్లు అర్థం.
డుడు డియోప్ తన జీవితమంతా సెనగల్ దక్షిణ కాసామాన్స్ ప్రాంతంలోనే నివసించారు.
తండ్రి మరణం తర్వాత, మొదటి కొడుకు కావడంతో కుటుంబాన్ని పోషించే భారం తనపై పడినట్లు భావించానన్నారు.
‘‘మెరుగైన జీవన పరిస్థితులను కోరుకునేవాడిని. డబ్బులు మంచిగా వస్తే నా భార్యను, కూతుర్ని, తల్లిని, కుటుంబంలో మిగతా వారిని బాగా చూసుకోవచ్చు’’ అని భావించానని డుడు డియోప్ తెలిపారు.
బోటులో ఒక సీటు ధర 682 డాలర్ల వరకు అంటే భారతీయ కరెన్సీలో రూ.55,963 వరకు ఉన్నట్లు చెప్పారు.
‘‘ఎవరికీ చెప్పకుండా నేను వచ్చాను. నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. యూరప్ వెళ్లాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. నాకు ఎలాంటి ఉపాధి లేదు’’ అని తెలిపారు.
కఫౌంటైన్ సెంటర్‌లో చాలా మంది యువత గుంపుగుంపులుగా కూర్చుని ఉన్నారు.
కొంత మంది వ్యక్తులు బోర్డు గేమ్‌లు ఆడుకుంటూ ఉండగా.. కొంతమంది రాజకీయాలపై వాడివేడి చర్చలలో మునిగి తేలుతున్నారు.

గ్నారా దియాబాంగ్ బా, డిప్యూటీ మేయర్లలో ఒకరు, విపక్ష పార్టీ సభ్యులు.
‘‘ఇది నిజంగా బాధాకరం. మా దేశం యూరప్‌కు వలస వెళ్లే ప్రజల దేశంగా పేరు సంపాదించడం దురదృష్టకరం.’’ అని ప్రజాప్రతినిధి గ్నారా తెలిపారు.
ఆయన పార్టీకి చెందిన మేయర్ డేవిడ్ దియాట్టా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన భద్రతా పరిస్థితులు కూడా ఒక కీలక అంశంగా ఉందని తెలిపారు.
91 శాతం మంది తమ కమ్యూనిటీ ప్రజలు దీవుల్లోనే నివసిస్తారని, ఆర్మీకి, నేవీకి ఆ ప్రాంతానికి వెళ్లేందుకు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తగిన యాక్సెస్ ఉండదని చెప్పారు.
యువతలో నిరుద్యోగం 40 శాతం వరకు ఉందని, వారిలో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నట్లు తెలిపారు.
‘‘మేం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. ఉద్యోగాలు లేవు. అధికారుల నుంచి సాయం లేదు’’ అని 28 ఏళ్ల సోషియాలజిస్ట్ ఇబ్రహిమా తెలిపారు.
కానరీ దీవులకి వెళ్లేందుకు తమ స్నేహితుల్లో చాలా మంది ఫిషింగ్ బోట్లను ఎక్కుతున్నారని, వారు అనుకున్నది సాధిస్తున్నారని తెలిపారు. వారిని సోషల్ నెట్‌వర్క్స్‌లో చూస్తున్నామని చెప్పారు.
ఏదో ఒక రోజూ తాను అక్కడికి వెళ్లాలనుకుంటున్నానని, కానీ దానికి తగినంత డబ్బులు కావాల్సి ఉందని ఇబ్రహిమా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కస్టమర్ కేర్ ఉద్యోగాల పేరుతో వ్యభిచారం, సైబర్ క్రైమ్‌లోకి
- పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్: ఫేక్ ఉద్యోగ సైట్లను ఎలా గుర్తించాలి, మోసపోకుండా ఏం చేయాలి
- హైటెక్ బెగ్గింగ్: ఆన్లైన్లో సాయం అడుక్కునేవారి నుంచి 70 శాతం కమీషన్ తీసుకుంటున్న టెక్ సంస్థ
- 'స్పామ్ కాల్స్ గోలేంట్రా బాబూ' అని మీకెప్పుడైనా అనిపించిందా... దీనికి విరుడుగు ఏంటి?
- BBC Investigation: మహిళల నగ్న చిత్రాలతో వ్యాపారం చేస్తున్న రహస్య ప్రపంచం గుట్టురట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














