రోహింజ్యాలు: ‘మమ్మల్ని చంపేసి మా శవాలను వెనక్కి పంపించేయండి’

అనురా బేగం
ఫొటో క్యాప్షన్, కాక్స్‌బజార్‌లో తన ఆరుగురు పిల్లలకు సరిపడా ఆహారాన్ని పొందడంలో అనురా బేగం ఇబ్బందులను ఎదుర్కొన్నారు
    • రచయిత, స్వామి నటరాజన్, ఐనీ గల్లాగర్, సో విన్ థాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

రోహింజ్యా శరణార్థులను తమ సొంత దేశానికి పంపించేందుకు బంగ్లాదేశ్, మియన్మార్‌ మూడో ప్రయత్నం చేస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న రోహింజ్యా శరణార్థులు, వెనక్కి వెళ్లిపోయేందుకు ప్రతి కుటుంబానికి 2,000 డాలర్ల చొప్పున (రూ. 1, 64,605) చెల్లించే వివాదాస్పదాస్పద పథకాన్ని తీసుకొచ్చారు.

2017 మిలిటరీ అణచివేత తర్వాత దాదాపు 80 వేల మంది మియన్మార్ నుంచి శరణార్థులుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఇందులో ఎక్కువగా ముస్లిం రోహింజ్యా శరణార్థులే ఉన్నారు.

జాతి హననం (జెనోసైడ్) వివాదానికి సంబంధించి మియన్మార్‌పై అంతర్జాతీయ కోర్టులో విచారణ జరుగుతోంది.

రోహింజ్యా
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో ఉన్న రోహింజ్యా శరణార్థులను తిరిగి మియన్మార్‌ను పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి

సాయుధుల పర్యవేక్షణ

అనిస్ (పేరు మార్చాం) అనే వ్యక్తిని మే నెల మొదట్లో మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నాగ్‌పురాలో ఏర్పాటు చేసిన కొత్త గృహ సముదాయాల పర్యటనకు తీసుకెళ్లారు.

‘‘ఆ శిబిరం చుట్టూ ఫెన్సింగ్ ఉంది. దాన్ని సైనికులు పర్యవేక్షిస్తున్నారు’’ అని ఆ పర్యటనకు వెళ్లిన 20 మంది రోహింజ్యాలలో ఒకరైన అనిస్ చెప్పారు.

‘‘ఆ ఇళ్లలో గదులు చాలా చిన్నగా ఉన్నాయి. బహుశా ఆ గదులు 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంటాయి. ఒకే ద్వారం ఉంది. రెండు కిటికీలు ఉండొచ్చు. తలుపులు కూడా తక్కువ ఎత్తులో ఉన్నాయి. లోపలికి వెళ్లాలంటే తలను కిందికి వంచాలి’’ అని ఆయన చెప్పారు.

అయితే, ఆయన ఆందోళనకు ఆ సముదాయంలోని ఇరుకైన గదులు, వసతులు కారణం కాదు.

‘‘ప్రతిపాదనల ప్రకారం, మేం సొంత ఆస్తిని గానీ, వ్యాపారాన్ని గానీ ఎన్నటికీ ఏర్పాటు చేసుకోలేం. ఇతరులకు ఉన్న హక్కులే మాకూ కావాలని మేం కోరుతున్నాం. అలా అయితే, మా పిల్లల్ని మేం స్కూలుకు పంపగలం. ఇతరుల అనుమతి అడగకుండానే మేం వేరే పట్టణాలు, నగరాలకు మేం వెళ్లగలం’’ అని అనిస్ వివరించారు.

శరణార్థులను స్వదేశానికి పంపించేందుకు బంగ్లాదేశ్, మియన్మార్‌ల మధ్య 2017లోనే ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ, పూర్తి హక్కులను పొందకుండా వెనక్కి వెళ్లేందుకు శరణార్థులు తిరస్కరించారు.

సాధారణంగా, శరణార్థులను స్వదేశానికి పంపే పథకాన్ని ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తుంది.

కానీ, ఈ పథకం మాత్రం మియన్మార్, బంగ్లాదేశ్‌లు స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయి.

రోహింజ్యా
ఫొటో క్యాప్షన్, మియన్మార్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గృహ సముదాయాలను మే నెలలో అధికారులు, రోహింజ్యాలకు చూపుతున్న ఫొటో

‘‘ఇది స్వచ్ఛంద ప్రక్రియ. గౌరవప్రదంగా శరణార్థులను స్వదేశానికి పంపించాలన్నదే మా లక్ష్యం’’ అని బీబీసీతో బంగ్లాదేశ్ శరణార్థుల కమిషనర్ మొహమ్మద్ మిజానుర్ రహమాన్ అన్నారు.

‘‘ఎవర్నీ బలవంతంగా పంపించే ఉద్దేశమేదీ లేదు. ఇది రహస్య ప్రక్రియ కాదు. దీని గురించి మేం బహిరంగంగానే అన్నీ చెబుతున్నాం’’ అని ఆయన అన్నారు.

అయితే, స్వదేశానికి పంపించేందుకు తీసుకొచ్చిన పథకంపై సంతకం చేయాలని తమపై బంగ్లాదేశ్ అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు అనిస్ చెప్పారు.

‘‘నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. మా సోదరుడి ఫోన్‌లో మీతో నేను మాట్లాడుతున్నా. మాలో ఎవరికీ వెనక్కి వెళ్లిపోవాలని లేదు. మమ్మల్ని చంపేసి, మా శవాలను వెనక్కి పంపిచేయండి అని వాళ్లకి చెప్పాం’’ అని అనిస్ తెలిపారు.

మియన్మార్‌కు చెందిన ఒక ప్రతినిధిని సుల్తాన్ (పేరు మార్చాం) రెండు నెలల క్రితం బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో కలిశారు.

‘‘నా పేరు జాబితాలో ఉన్నట్లు నాకు చెప్పారు. ఎంతోమంది ఉండగా, ఆ జాబితాలో నా పేరే ఎందుకు ఉంది?’’ అని సుల్తాన్ ప్రశ్నించారు.

‘‘ముందుగా మమ్మల్ని మాంగ్దా అనే పట్టణానికి తీసుకెళ్తామని చెప్పారు. అక్కడ వారు 15 క్యాంపులను నిర్మించారు. మేం అక్కడ 3 నెలలు ఉండాలని చెప్పారు’’ అని సుల్తాన్ వివరించారు.

సుల్తాన్ కుటుంబం రఖైన్‌ రాష్ట్రం మాంగ్దా పట్టణంలోని ఒక గ్రామానికి చెందినవారు.

అక్కడ ఆయన కుటుంబానికి సొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే, అక్కడి నుంచి పారిపోయి వచ్చాక వాటి పరిస్థితి ఎలా ఉందో సుల్తాన్ కుటుంబీకులకు తెలియదు.

తాను మియన్మార్‌కు చెందిన వ్యక్తిని అని నిరూపించే పత్రాలు కూడా సుల్తాన్ వద్ద లేవు.

‘‘బంగ్లాదేశ్ ప్రతినిధి మమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగారు. నాతోపాటు నా భార్య ఫొటోలు తీసుకున్నారు. వేలిముద్రలు కూడా తీసుకున్నారు.

మేం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఒకవేళ వద్దు, కాదు అని మేం చెప్పినా వారు ఒప్పుకోరు. మేమేం చేయగలం? మియన్మార్‌లో మాకు భద్రత లేదు’’ అని సుల్తాన్ చెప్పారు.

తనతో పాటు జాబితాలో పేర్లు ఉన్న వారందరిపై బంగ్లాదేశ్ అధికారుల నిఘా ఉందని సుల్తాన్ తెలిపారు. ఈ ఆరోపణను బీబీసీ ధ్రువీకరించలేకపోయింది.

రోహింజ్యా
ఫొటో క్యాప్షన్, కాక్స్ బజార్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం అనే పేరుంది

కాక్స్ బజార్‌లో కఠిన పరిస్థితులు

కాక్స్ బజార్ శిబిరాల్లో భయం నెలకొంది. అక్కడ కూడా జీవనం కష్టంగా ఉండటంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

అవసరమైన డబ్బులో కేవలం పావు వంతు నిధులే అందడంతో శరణార్థులకు అందించే ఆహార సహాయంలో యూఎన్ కోత విధించింది.

జూన్ నెల ప్రారంభంలో రోహింజ్యా శరణార్థుల బృందం, తమను స్వదేశానికి పంపించాలంటూ నిరసనలు చేపట్టింది. అయితే, ఆ బృందం తమకు పూర్తి పౌరసత్వాన్ని కల్పించాలనే షరతును విధించింది.

అనురా బేగంకు ఆరుగురు పిల్లలు. 2017 ఆగస్టులో ఆమె శరణార్థిగా వచ్చారు. ఆమె భర్తకు తరచుగా పని దొరకదు.

‘‘పిల్లలకు దుస్తులు కొనడం కోసం కొన్నిసార్లు నేను అప్పు చేస్తాను. చారిటీల మీదే ఆధారపడాల్సి వస్తుంది.

నాకు మా ఊరుకు వెళ్లిపోవాలని ఉంది. మియన్మార్ ప్రభుత్వం మాకు పౌరసత్వం, భద్రతను కల్పిస్తే మేం అక్కడికే వెళ్లిపోతాం’’ అని ఆమె చెప్పారు.

మియన్మార్

కానీ, మియన్మార్‌లోని మిలిటరీ జుంటా ప్రభుత్వం రోహింజ్యా శరణార్థులను వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం విధివిధానాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.

వారు ఇంకా ఎందుకు తిరిగి రావట్లేదని ఒక విలేఖరి అడగగా... ‘‘వారు పునరావాస పథకాన్ని ఆలస్యం చేస్తున్నారు’’ అని ఒక అధికారి బదులిచ్చారు.

రోహింజ్యా అనే పదాన్ని వాడేందుకు జుంటా తిరస్కరిస్తున్నట్లు బీబీసీ బర్మా ఎడిటర్ సో విన్ థాన్ చెప్పారు.

దాదాపు 5 లక్షల మంది రోహింజ్యాలు రఖైన్ రాష్ట్రంలోని శిబిరాల్లో ఉంటున్నట్లు అంచనా.

రోహింజ్యాలను వెనక్కి పంపే పథకంపై జర్మనీకి చెందిన రోహింజ్యా కార్యకర్త నే సాన్ ల్విన్ అనుమానం వ్యక్తం చేశారు.

‘‘స్వదేశానికి పంపే పేరుతో రోహింజ్యాలను బంగ్లాదేశ్‌లోని ఒక క్యాంప్ నుంచి మియన్మార్‌లోని మరో క్యాంప్‌కు తరలిస్తున్నారు. దీన్ని స్వదేశానికి పంపడం అని అనరు’’ అని ఆయన అన్నారు.

అధికారులు 23 మంది రోహింజ్యాలను ఒక ట్రాన్సిట్ క్యాంప్‌కు తీసుకొచ్చారు. మియన్మార్ తిరిగి వెళ్లిపోవడానికి ప్రతీ కుటుంబానికి ప్రోత్సాహకంగా 2000 డాలర్లు ఇస్తామని చెప్పి వారిని తీసుకొచ్చారు.

‘‘2000 డాలర్లు ఇస్తామనే పథకాన్ని ప్రకటించిన తర్వాతి రోజునే 300లకు పైగా కుటుంబాలు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకైతే, 200 కుటుంబాలను మాత్రమే అనుమతిస్తామని మియన్మార్ ప్రభుత్వం చెప్పినట్లు నేను విన్నాను’’ అని ల్విన్ చెప్పారు.

ఈ డబ్బును ఎవరు అందిస్తున్నారో తనకు తెలియదని, ఒక చిన్న మైనార్టీ వర్గాన్ని ఊరించేందుకే ఈ పథకాన్ని తెచ్చారని ల్విన్ అభిప్రాయపడ్డారు.

‘‘శరణార్థుల్లో ఎక్కువ భాగం వెళ్లిపోతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే, మియన్మార్ ప్రభుత్వం పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పట్లేదు. ప్రాథమిక మానవ హక్కులను కల్పిస్తామని అనట్లేదు’’ అని ల్విన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)