మియన్మార్: రెండేళ్లుగా ఏం జరుగుతోంది?

వీడియో క్యాప్షన్, ఆర్మీ పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, తిరుగుబాటుదారులు యుద్ధం
మియన్మార్: రెండేళ్లుగా ఏం జరుగుతోంది?

రిపబ్లిక్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ మియన్మార్, ఒకప్పటి బర్మా... సౌత్ ఈస్ట్ ఏషియాలో ఓ చిన్న దేశం. దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంత విస్తీర్ణంలో ఉన్న ఈ దేశపు జనాభా 5 కోట్ల 70 లక్షలు. ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మియన్మార్... దాంతో పాటు సామాజిక, రాజకీయ, మానవీయ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజుల్లో మొదలైన ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమం.. అంతర్యుద్ధంగా మారడంతో.. మండుతున్న అగ్నిగుండాన్ని తలపిస్తోంది మియన్మార్.

రెండేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అంగసాన్ సూచీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆర్మీ అధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ఉద్యమించారు. కొంతమంది ఆయుధాలతో చేత పట్టారు. దీంతో ఇప్పుడీ దేశం యుద్ధభూమిలా మారింది. ఇప్పటి వరకూ 70 వేల మందికి పైగా ప్రజలు మియన్మార్‌ను విడిచి వెళ్లిపోయారని అంచనా. మరో పది లక్షల మంది ప్రజలు నిర్వాసితులుగా మారారు. విద్యా, వైద్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి.

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్లలో సైనిక పాలన కొత్తేమీ కాదు..

బర్మాకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2011 వరకు కూడా అక్కడ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో అధికారంలో కొనసాగింది సైన్యమే. 1948లో బ్రిటన్ వలస పాలన నుంచి బయటపడిన తర్వాత కూడా జాతుల ఘర్షణలు, తిరుగుబాట్లతో తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని చవిచూసింది. దీంతో 1958లో అక్కడ తొలిసారి కేర్ టేకర్‌గా పాలన చేపట్టింది మిలిటరీ. ఆ తరువాత 1960లో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడలేదు.

అశాంతి, తిరుగుబాట్లు, జాతీయభద్రత లాంటి కారణాలను చూపి, 1962లో పౌర ప్రభుత్వాన్ని కూల దోసింది జనరల్ నే విన్ నేతృత్వంలోని సైన్యం. మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా 1988లో ప్రజలు ఉద్యమించడంతో 1990లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది ఆంగ్ సాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ. కానీ ప్రజాతీర్పును గుర్తించని సైన్యం, ఆ ఎన్నికలు చెల్లవంటూ ఆమెను హౌస్ అరెస్ట్ చేసింది. 2010లో సైన్యం నేతృత్వంలో నిర్వహించిన ఎన్నికలను అంగ్‌సాన్ సూచీ బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో సైన్యం మద్దతున్న పార్టీ అధికారం చేపట్టింది.

ఆ తర్వాత, 2015 ఎన్నికల్లో సూచీ పార్టీ NLD పార్టీ భారీ విజయం సాధించింది. అయితే సైన్యం చేసిన రాజ్యాంగ సవరణ కారణంగా ఆమె దేశాధ్యక్షురాలు కాలేకపోయినా, అధికారాన్ని మాత్రం తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. చివరిసారి, 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆంగ్ సాన్ సూచీ విజయం సాధించారు. కానీ అవి మోసపూరిత ఎన్నికలని ఆరోపిస్తూ.. మరొకసారి ప్రభుత్వాన్ని కూలదోసింది మియన్మార్ సైన్యం. జనరల్ మిన్ ఆంగ్ లాయ్ ఇప్పుడక్కడ కొత్త పాలకుడు.

తాజా పరిస్థితి చూస్తే.. ఈ పరిణామాలతో యువత గందరగోళంలో పడిపోయింది. సైన్యం పాలనతో నెలకొన్న అస్థిరత అంతర్యుద్ధానికి దారి తీసింది. ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న యువకులు ఆయుధాలు చేత పట్టి సైన్యంతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది ఫైటర్లుగా శిక్షణ పొంది దేశంలో పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా పిలిచే మిలీషియా గ్రూపులలో చేరారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తిరుగబాటు దారులంతా ఒక్కతాటిపైకి చేరి మరింత పట్టు బిగిస్తుండగా మియన్మార్ మిలటరీ పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తుంది.

సైనిక ప్రభుత్వానికి చైనా, రష్యా వెన్ను, దన్నుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. సైన్యం పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుని పెరుగుతోంది. ఆహరోత్పత్తుల ధరలు మండిపోతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్‌లో మాదిరిగా నిత్యావసరాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దాదాపు రెండు కోట్ల మంది అంటే దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక్కడ చాలా స్కూళ్లు, యూనివర్సిటీలు సైన్యం పాలనలో నడుస్తుండటంతో చాలా మంది విద్యావిధానంపైనా నమ్మకం కోల్పోయారు. సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారో లేదా చంపేస్తారనే భయంలోనే స్థానికులు రోజులు గడుపుతున్నారు. అధికారం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా పోరాడుతుండటంతో ఈ ఏడాది ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశముందని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఎన్నికలు నిర్వహించాలని తిరుగుబాటుదారులు కోరుకుతుంటే.. అలాంటి ఆలోచనేమీ లేదంటోంది సైనిక ప్రభుత్వం. మరో ఆరు నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది మియన్మార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)