‘వర్జిన్ కాదు, అందగత్తె, వయసు 12 ఏళ్లు'- ఇస్లామిక్ స్టేట్ యాజిదీ అమ్మాయిలను అమ్మకానికి పెట్టిందిలా...

శరణార్థుల క్యాంపులలో యాజిది బాలికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరణార్థుల క్యాంపులలో యాజిదీ బాలికలు
    • రచయిత, రాచెల్ రైట్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీసు అసైన్‌మెంట్

ఇరాక్, సిరియాలో 2014లో వేల మంది యాజిదీ మహిళలు, చిన్నారులు రాడికల్ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గ్రూప్‌ బానిసలుగా మారారు.

ఐఎస్ బారిన పడిన వారిని రక్షించేందుకు తోటి యాజిదీలు వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు. కానీ, దశాబ్దం గడిచినా వీరిని కాపాడే పని ఇంకా కొనసాగుతూనే ఉంది.

2015 నవంబరులో బహార్, ఆమె ముగ్గురు చిన్నారులు ఐదోసారి అమ్ముడుపోయారు.

ఐఎస్ బానిసలుగా మారిన ఎంతో మంది యాజిదీ మహిళలలో బహార్ కూడా ఒకరు.

ఆమెను ఐఎస్ వారు బందీగా తీసుకోవడానికి 18 నెలల ముందు ఉత్తర ఇరాక్‌లోని సింజార్ జిల్లాలో ఉన్న ఆమె గ్రామాన్ని ఐఎస్ ఫైటర్లు తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

మైనార్టీలైన యాజిదీలు ఇరాక్‌లో సుమారు ఆరు వేల సంవత్సరాలుగా ఉంటున్నారు. ఐఎస్ వర్గం యాజిదీలను మత ద్రోహులుగా(నాస్తికులుగా) పరిగణిస్తుంది.

బహార్ భర్త, ఆమె పెద్ద కొడుకును కూడా ఐఎస్ వర్గం తీసుకెళ్లిపోయింది. వారిని కాల్చి చంపి, సామూహికంగా సమాధి చేసినట్లు బహార్ భావిస్తున్నారు.

తనతో పాటు తన ముగ్గురి పిల్లల్ని ఒక గదిలో వరుసగా నిల్చోబెట్టిన తీరు చూసి బహార్ భయపడ్డారు. తమను తల నరికి చంపేస్తారని హడలిపోయారు. భోరున ఏడ్చారు. కానీ, ఐఎస్ వారిని చంపడానికి బదులు అమ్మేసింది.

అప్పటి నుంచి బహార్, తన పిల్లలు ప్రత్యక్ష నరకాన్ని చూడాల్సి వచ్చింది.

ఐఎస్ చేతిలో బానిసగా జీవితం గడిపిన బహార్
ఫొటో క్యాప్షన్, ఐఎస్ చేతిలో బానిసగా జీవితం గడిపిన బహార్. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్లు.

‘ఎప్పుడు కావాలంటే అప్పుడు భార్యగా...’

ఐఎస్ ఫైటర్లకు బహార్ సేవ చేయాల్సి వచ్చేది. ఎవరు కావాలంటే వారు తమ ఆస్తిగా భావించేవారు.

‘‘ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను వారి భార్యగా పనిచేయాలి. ఒకవేళ వారికి కోపమొస్తే బాగా కొడతారు. పదేళ్ల కంటే తక్కువ వయసున్న నా పిల్లల్ని చిన్నవారని కూడా చూడకుండా తంతారు. తుపాకీతో వారు నా కూతుళ్లలో ఒకర్ని గట్టిగా ముఖంపై కొట్టారు’’ అని బహార్ చెప్పారు.

తన నాలుగో యజమాని అబు ఖత్తాబ్‌ అనే తునీషియా వ్యక్తి అని బహార్ చెప్పారు.

‘‘మేం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన నన్ను ఇతరులకు అమ్మేశారు. మరో రెండు ఐఎస్ బేస్‌లలో క్లీనర్‌గా పనిచేసేందుకు పంపించారు. ఆయన పంపిన అన్ని ప్రాంతాలకు నేను వెళ్లాలి. పనిచేయాలి. ఇళ్లన్నీ శుభ్రపరచాలి. తర్వాత వారు నాపై అత్యాచారానికి పాల్పడేవారు’’ అని బహార్ చెప్పారు.

ఎప్పుడూ అక్కడ దాడులు జరుగుతూ ఉండేవని, ఐఎస్ ఫైటర్స్ ఎప్పుడు చూసినా పరిగెడుతూ కనిపించే వారని అన్నారు.

ఆయుధాలను తీసుకొచ్చి, ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టేవారు. పీడకలల కంటే భయకరంగా అక్కడ పరిస్థితులు ఉండేవని చెప్పారు.

ఒకరోజు బహార్, ఆమె పిల్లలు అబు ఖత్తాబ్ ఇంట్లో ఉన్నసమయంలో, ఆ ప్రాంతానికి బ్లాక్ ఫిల్మ్ వేసిన ఒక కారు వచ్చి ఆగింది.

అందులో డ్రైవర్ నల్లటి వస్త్రాలు ధరించి, పొడవాటి గడ్డంతో ఉన్నారు. చూడటానికి ఇతర ఐఎస్ ఫైటర్లతో పోలిస్తే ఆయనలో పెద్దగా ఎలాంటి మార్పు లేదు.

తన పిల్లలతో పాటు మళ్లీ తనని అమ్మేస్తారని బహార్ భావించారు.

ఈ పరిస్థితిని ఇక ఏ మాత్రం తట్టుకోలేనని భావించిన బహార్, తనను చంపేయాలని ఆ వ్యక్తిపై అరిచారు.

కానీ, తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె జీవితం మారిపోయింది.

కనిపించకుండా పోయిన తమ బంధువుల ఫోటోలు చూపిస్తోన్న బహార్, ఆమె ముగ్గుర పిల్లలు
ఫొటో క్యాప్షన్, కనిపించకుండా పోయిన తమ బంధువుల ఫోటోలు చూపిస్తోన్న బహార్, ఆమె ముగ్గురు పిల్లలు

సినీ ఫక్కీలో కాపాడిన డ్రైవర్

డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేటప్పుడు, డ్రైవర్ వారితో.. ‘‘నేను మిమ్మల్ని ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నాను’’ అని చెప్పారు.

ఏం జరుగుతోందో బహార్‌‌కు అర్థం కాలేదు. ఆ వ్యక్తిని నమ్మాలా వద్దా అని సందేహం ఏర్పడింది. ఆమె చాలా భయాందోళనకు గురయ్యారు.

ఆయన కారుని ఆపి, ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత ఫోన్‌ను బహార్‌‌కు ఇచ్చారు.

ఆమె మాట్లాడిన వ్యక్తి పేరు అబు షుజా. ఐఎస్ ఫైటర్లకు బానిసలుగా మారిన ఎంతో మంది మహిళలను, చిన్నారులను సంరక్షించిన వ్యక్తి ఈయన.

అంటే డ్రైవర్ ఆమెను, తన పిల్లలను కాపాడేందుకు తీసుకొచ్చారని బహార్‌‌కు అప్పుడు అర్థమైంది.

సిరియాలో రక్కాకు దగ్గర్లో ఉన్న ఒక నిర్మాణ ప్రాంతానికి బహార్‌ను డ్రైవర్ తీసుకొచ్చారు.

అక్కడే ఆమెను, తన పిల్లల్ని దించారు. ఒక వ్యక్తి వస్తారని, ఆయన ‘సయీద్’ అనే కోడ్ వర్డ్ చెబుతారని డ్రైవర్ చెప్పారు. ఆ కోడ్ వర్డ్ చెప్పిన వ్యక్తితో ఆమె వెళ్లాల్సి ఉంది.

ఒక వ్యక్తి బైకుపై వచ్చి, ఆ పదాన్ని ఆమెతో మెల్లగా చెప్పారు. బహార్‌ను, ఆమె ముగ్గురు పిల్లల్ని తన బైకుపై కూర్చోవాలన్నారు.

‘‘వినండి, మనం ఐఎస్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చాలా చెక్‌పాయింట్లు ఉంటాయి. ఒకవేళ వారు ఏమన్నా అడిగితే, మీరేం మాట్లాడకండి. అప్పుడే వారు మీ యాజిదీ ఉచ్చారణను గుర్తు పట్టలేరు’’ అని ఆ వ్యక్తి బహార్‌‌కు చెప్పారు.

యాజిదీల సమస్య

ఆ వ్యక్తి తమను ఆయన ఇంటికి తీసుకెళ్లారని బహార్ చెప్పారు.

‘‘వారు మమ్మల్ని చాలా మంచిగా చూసుకున్నారు. మేం అక్కడే స్నానం చేశాం. మాకు భోజనం పెట్టారు. ఒళ్లునొప్పులు తగ్గేందుకు పెయిన్ క్లిలర్స్ ఇచ్చారు. మీరు ఇప్పుడు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నారు అని చెప్పారు’’ అని ఆమె తెలిపారు.

వారు ఇప్పుడు సరైన వ్యక్తుల దగ్గరే ఉన్నారని చూపించేందుకు వారి దగ్గరున్న మరో వ్యక్తి బహార్, ఆమె పిల్లల ఫోటోలను తీసి, వాటిని అబు షుజాకు పంపారు.

తర్వాత రోజు ఉదయం 3 గంటలకు, వారు నిద్ర లేచి, తమను లేపారని బహార్ చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, తయారండి అని చెప్పారని తెలిపారు.

తాము ఉన్న ఇంటిలోని వ్యక్తి తనకు తన తల్లి ఐడీ కార్డు ఇచ్చారని బహార్ చెప్పారు.

‘‘ఎవరైనా ఆపి అడిగితే, డాక్టర్‌కు చూపించేందుకు తన కొడుకును తీసుకెళ్తున్నట్లు చెప్పమన్నారు. ఎన్నో ఐఎస్ చెక్ పాయింట్లను దాటుకుని మేం వెళ్లాం, కానీ మమ్మల్ని ఎవరూ ఆపలేదు’’ అని బహార్ తెలిపారు.

చివరికి సిరియా, ఇరాక్ సరిహద్దులో ఉన్న ఒక గ్రామానికి తాము చేరుకున్నామని, అక్కడ అబు షుజాను, ఆమె సోదరుడిని కలుసుకున్నట్లు బహార్ వివరించారు.

వారిని చూసిన తర్వాత ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయినట్లు బహార్ తెలిపారు. అది జరిగిన తర్వాత అంతకుమించి తానేమీ గుర్తుంచుకోవాలనుకోలేదన్నారు.

ఐఎస్

ఫొటో సోర్స్, Reuters

అమ్మకానికి 12 ఏళ్ల బాలిక
ఫొటో క్యాప్షన్, అమ్మకానికి 12 ఏళ్ల బాలిక

సింజార్‌ను ఐఎస్ స్వాధీనం చేసుకున్న తర్వాత 6,400 మందికి పైగా యాజిదీ మహిళలను, పిల్లలను బానిసత్వానికి అమ్మేశారు. మరో 5 వేల మంది యాజిదీలను చంపేశారు.

దీన్నిజాతి నిర్మూలన(జీనోసైడ్)గా ఐక్యరాజ్యసమితి కమిషన్ అభివర్ణించింది.

ఐఎస్ కిడ్నాప్ చేసిన మహిళలను, పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల్లో బహార్‌ను రక్షించిన అబు షుజా మాత్రమే కాదు, ఐఎస్ నియంత్రిత ప్రాంతాలకు వెలుపల నివసిస్తున్న వ్యాపారవేత్త బహ్జాద్ ఫర్హాన్ కూడా ఉన్నారు.

కిన్యాత్ అనే పేరుతో ఆయన ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ ఐఎస్ ఫైటర్ల బారిన పడిన యాజిదీ మహిళలను, పిల్లలను రక్షిస్తోంది. అంతేకాక, ఐఎస్ ఫైటర్ల నేరాలను రికార్డు చేస్తోంది.

ఐఎస్ ఫైటర్లు కిడ్నాప్ చేసిన యాజిదీ మహిళలను, చిన్నారులను ఆన్‌లైన్‌లో ముఖ్యంగా టెలిగ్రామ్‌లో విక్రయిస్తున్నారని కిన్యాత్‌ గ్రూప్‌‌కు తెలిసింది.

టెలిగ్రామ్‌లో తాను చూసిన చాట్ల స్క్రీన్‌షాట్లను ప్రింటవుట్ తీసి, ఇరాక్‌లో కుర్దిష్ ప్రాంతంలో ఉన్న కార్యాలయం గోడపై అతికించారు బహ్జాద్.

దానిలో ఒకటి ఇంగ్లిష్‌లో ఉంది. అది ఒక అమ్మాయిని అమ్మకానికి పెట్టిన ప్రకటన. ‘’12 ఏళ్ల బాలిక, వర్జిన్ కాదు. కానీ, చాలా అందమైన అమ్మాయి’’ అని ఉంది.

ఆమెకు 13 వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.10 లక్షలకు పైగా నిర్ణయించారు. సిరియాలో రక్కాలో ఉంటున్నట్లు తెలిపారు.

ఒక అమ్మాయి లెదర్ సోఫాపై కూర్చుని అబ్బాయిలను ఆహ్వానిస్తున్నట్లు ఉన్న ఫోటోను బహ్జాద్ చూపించారు.

యాజిది మహిళలను, పిల్లల్ని కాపాడుతోన్న బహ్జాద్ ఫర్హాన్
ఫొటో క్యాప్షన్, యాజిదీ మహిళలను, పిల్లల్ని కాపాడుతున్న వారిలో బహ్జాద్ ఫర్హాన్ ఒకరు

యాజిదీల భవిష్యత్తు ఏమిటి?

యాజిదీల భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది.

‘‘ఎన్నో శతాబ్దాలుగా యాజిదీలపై దాడులు జరుగుతున్నాయి. వారు మతం మారాలి లేదా చనిపోవాలి అని చాలా మంది ముస్లిం జనాభా కోరుకుంటోంది’’ అతిపెద్ద యాజిదీ మద్దతు సంస్థల్లో ఒకటైన యాజ్దా అధినేత హైదర్ ఎలియాస్ చెప్పారు.

ఐఎస్‌‌కు భయపడి మూడు లక్షల మంది యాజిదీలు సింజార్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోయారు.

వారిలో సగం మంది ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఇంకా గుడారాల్లోనే నివసిస్తున్నారు.

సింజార్ జిల్లాలో ఉన్న తమ ఇళ్లకు వారు వెళ్లాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఆ ప్రాంతం పూర్తిగా ఐఎస్ చేతిలో ధ్వంసమైంది.

ఇరాక్, సిరియాలో సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అధికారం కోసం ఐఎస్, మిలిటెంట్లు ఒకరికొకరు తలబడుతున్నారు.

ఏ సమయంలోనైనా అక్కడ మరో నరమేధంగా జరుగుతుందని యాజిదీలు భయపడుతున్నట్లు ఎలియాస్ చెప్పారు.

అందుకే చాలా మంది యాజిదీలు అక్కడి నుంచి తరలిపోతున్నారన్నారు.

‘‘వారికి భద్రత అనేది అత్యంత కీలకమైన విషయం. ఇదొక పెద్ద అంశం. అక్కడ వారు సురక్షితంగా ఉన్నట్లు భావించడం లేదు’’ అని ఎలియాస్ తెలిపారు.

బహార్
ఫొటో క్యాప్షన్, తన భర్త, పెద్ద కొడుకు ఫోటో చూపిస్తోన్న బహార్

బహార్‌ను వారి చెర నుంచి బయటికి తీసుకొచ్చేందుకు 20 వేల డాలర్ల ఖర్చయింది. ఇప్పుడు బహార్‌‌కు 40 ఏళ్ల వయసు. కానీ అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తిలాగా ఆమె కనిపిస్తున్నారు. ఆమె తన తలపై స్కార్ఫ్ కప్పుకున్నారు. ఆమె తల వెంట్రుకలు చాలా వరకు తెల్లగా మారిపోయాయి.

ఆమెను ఐఎస్ బారి నుంచి కాపాడినప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా క్యాంపులోనే నివసిస్తున్నారు.

ఆమె టెంట్‌లో నేలపై ఒక పల్చటి పరుపు వేసుకుని కూర్చున్నారు.

తప్పిపోయిన ఆమె కుటుంబ సభ్యులను ఫోటోలలో చూపిస్తున్నారు.

బహార్ శారీరకంగా, మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు.

తన భర్తకు, పెద్ద కొడుకుకు ఏమైందో తెలియదు.

ఐఎస్ ఫైటర్లు పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సంఘటనల నుంచి ఇంకా ఆమె కోలుకోలేకపోతున్నారు.

ఆమె పిల్లలు ప్రస్తుతం ఆమెతో పాటు టెంట్‌లోనే నివసిస్తున్నారు. వారు ఇంకా షాక్‌లోనే ఉన్నారని, రోజంతా వారు ఆందోళన పడుతూ ఉంటారని బహార్ చెప్పారు.

‘‘కొట్టడం వల్ల నా కూతురికి బాగా గాయాలయ్యాయి’’ అని ఆమె వాపోయారు.

‘‘నేను పోరాడుతూనే, జీవితం గడపాలి. ప్రస్తుతం మేం జీవచ్ఛవాలం’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)