షమీమా బేగం: 15 ఏళ్ల వయసులో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో చేరిన యువతి.. ఇప్పుడు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, JOSH BAKER
టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరేందుకే తాను బ్రిటన్ నుంచి పారిపోయానని షమీమా బేగం తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ సభ్యులు ఇచ్చిన సూచనల మేరకు తాను సిరియాకు పారిపోయినట్లు ఆమె వెల్లడించారు.
‘రఖ్కాలోని ఇస్లామిక్ స్టేట్‌కు వెళ్లడానికి సంబంధించి మేం చాలా పరిశోధన చేశాం. ఆ గ్రూప్‌కు చెందిన వారు ఆన్‌లైన్ ద్వారా మాతో నిరంతరం టచ్‌లో ఉండేవారు. ఏం చేయాలో.. ఏం చేయకూడదో.. వారు చెప్పేవారు. సూచనలకు సంబంధించి ఒక పెద్ద లిస్టు ఇచ్చారు.
ఒకవేళ పట్టుబడితే ఎలా కవర్ చేయాలో కూడా వారే చెప్పారు.
సిరియాకు వెళ్లడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకున్నాం. ఇస్లామిక్ స్టేట్ అధీనంలోని సిరియాలోకి అడుగుపెట్టేందుకు సరిహద్దు దాటాలంటే టర్కిష్ భాష కావాలి కాబట్టి, ఆ భాషను కొంత నేర్చుకున్నాం.
సిరియాకు వెళ్తున్నామనే విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు లండన్‌లోని మా గదుల్లో ఎటువంటి ఆనవాలు లేకుండా చేయాలని ప్రయత్నించాం.
బ్రిటన్ వాసులు నన్ను దేశానికి ఒక ముప్పుగా చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. వాస్తవానికి ఆ కోపం నా మీద కాదు, ఇస్లామిక్ స్టేట్ మీద’ అని బీబీసీతో షమీమా బేగం అన్నారు.

ఫొటో సోర్స్, METROPOLITAN POLICE
షమీమా బేగం ఎవరు?
బంగ్లాదేశ్ మూలాలు ఉన్న షమీమా బేగం బ్రిటన్ పౌరురాలు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మరొక ఇద్దరు విద్యార్థులతో కలిసి లండన్ నుంచి ఆమె సిరియాకు పారిపోయి ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో చేరారు.
షమీమా బేగంతో పాటు కదీజా సుల్తానా(16), అమీరా అబేస్(15)తో కలిసి తూర్పు లండన్‌లోని బెతనల్ గ్రీన్ అకాడమీ నుంచి సిరియా పారిపోయారు.
అక్కడే డచ్‌కు చెందిన ఒక ఇస్లామిక్ స్టేట్ ఫైటర్‌ను షమీమా పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లకు పైగా అక్కడ ఉన్న ఆమె, 2019లో ఒక శరణార్థి శిబిరంలో తొమ్మిది నెలల గర్భిణిగా కనిపించారు.
ప్రసవం తరువాత, ఆమె బిడ్డ న్యుమోనియాతో మరణించింది. అంతకు ముందు కూడా ఇద్దరు పిల్లలను కోల్పోయానని షమీమా బేగం చెప్పారు.
షమీమాతో పాటూ సిరియా వెళ్లిన ఇద్దరు అమ్మాయిలలో కడిజా సుల్తానా ఒక బాంబు దాడిలో మరణించారు. మరొక యువతి అమీరా అబాస్ వివరాలు తెలీవు.

పౌరసత్వం రద్దుపై పోరాటం
ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్‌లో చేరినందుకు బ్రిటన్ ప్రభుత్వం షమీమా పౌరసత్వాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం బ్రిటన్ పౌరసత్వం కోసం ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించి, అనేక హత్యలకు పాల్పడిన ఒక గుంపులో భాగం కావడం మీకు ఎలా అనిపిస్తుందని షమీమాను గతంలో బీబీసీ కరస్పాండెంట్ జోష్ బేకర్ అడిగినప్పుడు, "ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. నా నిర్ణయానికి నన్ను నేనే ద్వేషించుకుంటాను" అని ఆమె సమాధానమిచ్చారు.
తన మనసులోని మాటలను నిర్భయంగా చెప్పగలగడం హాయిగా ఉందని ఆమె, 'బీబీసీ సౌండ్స్ అండ్ బీబీసీ 5 లైవ్'కు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
ఖిలాఫత్ స్థాపించడంలో ఐఎస్ విఫలమైనందుకే ఆ సంస్థపై మీ అభిప్రాయం మారిందా అని బీబీసీ రిపోర్టర్ షమీమాను అడిగారు.
"ఐఎస్ పట్ల నాకు ఎప్పటినుంచో ఇలాంటి అభిప్రాయమే ఉంది. కానీ, ఇప్పుడే దాన్ని నిర్భయంగా బయటపెట్టగలుగుతున్నాను" అని ఆమె చెప్పారు. తనను బ్రిటన్‌లోనికి తిరిగి అనుమతిస్తే, సిరియాకు వెళ్లేలా ప్రజలను ఒప్పించడానికి ఐఎస్ ఉపయోగించే వ్యూహాలపై సలహా ఇవ్వగలనని ఆమె అన్నారు.
అలాగే, తీవ్రవాదానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉన్న వ్యక్తులతో మాట్లాడే పద్ధతుల గురించి సలహాలు ఇవ్వగలనని చెప్పారు. అలా చేయడం తన "బాధ్యత" అని, తనలాగే మరి కొంతమంది అమ్మాయిలు ఈ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవడం తనకు ఇష్టం లేదని గతంలో షమీమా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- RRR: 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్
- నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?
- తెలంగాణ: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కామారెడ్డి: మాస్టర్ ప్లాన్‌ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














