గ్రీస్‌ బోటు ప్రమాదం: ‘తిండి, నీరు లేక సముద్రం నీరే తాగాం.. కాళ్లు చాపుకోవడానికి కూడా చోటు లేదు’ - 350 మంది పాకిస్తానీలలో ప్రాణాలతో బయటపడిన యువకుడు ఏం చెప్పారంటే

ముహమ్మద్ హంజా
ఫొటో క్యాప్షన్, బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ ముహమ్మద్ హంజా
    • రచయిత, ఐనే గల్లాఘర్
    • హోదా, బీబీసీ న్యూస్

ముహమ్మద్ హంజా, ఈయనకు 30 ఏళ్లుంటాయి. చూడటానికి శాంతంగా కనిపిస్తున్నారు. ఆయన మాటల్లోనూ ఎలాంటి భావోద్వేగాలు లేవు.

లిబియా తీరంలో స్మగ్లర్లు లంగరు వేసిన ఫిషింగ్ బోటులోకి ఎక్కించడానికి తీసుకెళ్తున్నప్పుడు సెకన్ల వ్యవధిలోనే ముహమ్మద్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

ఓడ పైభాగంలో ఎక్కి కూర్చుని వెనుకవైపున తన తలను దాచుకున్నారు.

750 మంది వరకు ఈ పడవలో చిక్కుకున్నారని ఐక్యరాజ్య సమితి అంచనావేసింది.

ఈ బోటులో ఎంతమంది వెళ్లారు.. అందులో ఎందరు మరణించారు? ఏ దేశస్థులు ఎంత మంది అనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేవు.

అయితే.. 350 మందికిపైగా పాకిస్తానీలు అందులో ప్రయాణించినట్లు ఆ దేశ హోం మంత్రి చెప్తున్నారు.

మరోవైపు ఈ బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 82 అని.. 104 మందిని రక్షించామని గ్రీస్ అధికారులు చెప్తున్నారు.

ఆ 104 మందిలో 12 మంది పాకిస్తానీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

‘నన్నెవరూ పట్టించుకోలేదు’

‘‘నన్నెవరూ పట్టించుకోలేదు’’ అని గ్రీక్ రాజధాని ఏథెన్స్‌లో ముహమ్మద్ చెప్పారు.

బోటు ప్రమాద బాధితులందర్ని తరలించిన కేంద్రం నుంచి విడుదలైన తర్వాత ముహమ్మద్ గ్రీస్ రాజధానికి వెళ్లారు.

ఈ బోటు ప్రమదంలో ప్రాణాలతో బయటపడ్డ 104 మందిలో 12 మంది పాకిస్తానీలలో ముహమ్మద్ ఒకరు.

జూన్ 14న అర్థరాత్రి మధ్యదరా సముద్రంలో ఈ ఫిషింగ్ బోటు బోల్తా పడింది.

ఈ నౌకలో ఈజిప్టియన్లు, సిరియన్లు తమ కుటుంబాలతో ప్రయాణిస్తున్నారు. వారిలో మధ్యలో తాను ఉన్నట్లు ముహమ్మద్ చెప్పారు.

పాకిస్తానీ మహిళలెవరూ ఈ బోటులో ఉన్నట్లు కనిపించలేదని ముహమ్మద్ చెప్పారు.

కానీ, సుమారు పదేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలను మాత్రం చూసినట్లు తెలిపారు.

మొత్తంగా ఈ బోటు పైభాగంలో 100 మంది పాకిస్తానీలుంటారని, మిగిలిన వారు కింద పట్టుకుని నిల్చున్నారని చెప్పారు.

తమతో ఉన్న పాకిస్తానీల ఏజెంట్లెవరో కూడా తెలుసన్నారు ఆయన.

గ్రీస్ బోటు ప్రమాదం

ఫొటో సోర్స్, HELLENIC COAST GUARD

‘‘కొట్టారు, బలవంతంగా కూర్చోబెట్టారు’’

సముద్రంలో గడిపిన అయిదు పగళ్లు, ఆరు రాత్రులలో ఇతర బాధితుల మాదిరిగానే తాను పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న వేధింపులను ముహమ్మద్ వివరించారు.

‘‘ఈజిప్టియన్లు, లిబియన్లు మమ్మల్ని కొట్టారు. బలవంతంగా కూర్చోబెట్టారు’’ అని చెప్పారు.

‘‘పైకి లేచేందుకు కూడా అనుమతివ్వలేదు. కనీసం కాళ్లు కూడా చాచుకోనివ్వ లేదు. ఒకరితో ఒకర్ని మాట్లాడుకోనివ్వలేదు’’ అని చెప్పారు.

సముద్ర ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు, ఆహారం, మంచినీరు దొరక్క తాము బలవంతంగా సముద్రపు నీటిని తాగాల్సి వచ్చేదన్నారు.

కనీసం మరుగుదొడ్లు కూడా లేవని, ఆ మహా సముద్రంలోనే తాము మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేదని గుర్తుకు చేసుకున్నారు.

చివరి రెండు, మూడు రోజులుగా మధ్యదరా సముద్రంలో 20-25 కి.మీ ప్రాంతంలోనే బోటు తిరుగుతూ ఉంది.

ఈ బోటు మునిగిపోవడానికి ముందు 24 గంటల్లో మూడు బోట్లు తమ వద్దకు వచ్చాయని ముహమ్మద్ చెప్పారు.

మొదటి రెండు బోట్లు శరణార్థులకు ఆహారం, మంచినీరు అందించేందుకు వచ్చిన ‘‘కార్గో షిప్’’లుగా ఆయన చెప్పారు.

ఈ ఫిషింగ్ బోటు వద్దకు జూన్ 13న రెండు నౌకలు వెళ్లాయని మారిటైమ్ మానిటరింగ్ డేటా సహాయంతో బీబీసీ గుర్తించింది.

సరఫరాలను అందించాలని గ్రీక్ కోస్ట్ గార్డు నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని రెండు బోట్లకు చెందిన యజమానులు చెప్పారు.

కోస్ట్ గార్డు బిల్డింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సముద్రంలో బోటు ప్రమాదం నుంచి రక్షించిన తర్వాత బాధితులను తీసుకొచ్చిన గ్రీస్‌లోని కోస్ట్ గార్డు భవంతి

సాయం కోసం..

చివరి రోజు గురించి మాట్లాడుతూ మాత్రమే ముహమ్మద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

‘‘సాయం కోసం ప్రజలు కేకలు పెట్టారు. దిక్కులేదని స్థితిలో కొందరు వారి టీ-షర్ట్‌లను విప్పి గాల్లో ఊపుతూనే ఉన్నారు.‘‘ అని ముహమ్మద్ అన్నారు.

వారి వద్దకు వచ్చిన చివరి ఓడ గురించి ముహమ్మద్ చెప్పలేకపోయారు.

‘‘అది రాత్రి పూట వచ్చింది. అందుకే నాకు తెలియదు. ఆ బోటులో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి. నేను వెనుక వైపు కూర్చుని ఉన్నాను’’ అని ఆయన వివరించారు.

ముహమ్మద్ ఫిషింగ్ బోటుకి కుడి వైపు కూర్చుని ఉన్నట్లు చెప్పారు. అదే వైపు ఈ బోటు బోల్తా పడిందని, ఒక్కసారిగా తాము జంప్ చేయాల్సి వచ్చిందన్నారు.

ఈ బోటు మునిగిపోవడానికి ముందు రెండు గంటలకు పైగా ఈ బోటును పెద్ద పెద్ద తాళ్లతో కట్టేందుకు కోస్ట్ గార్డ్ ప్రయత్నించింది. ఇలా కట్టి వారు బోటులోకి వచ్చి, చిక్కుకున్న వారిని రక్షించాలని చూశారు.

కానీ, పడవ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. "మాకు ఇటలీ వెళ్లడం తప్ప మరేమీ అక్కర్లేదని" వాళ్లు చెప్పినట్టు గ్రీక్ చానెల్ ఈఆర్‌టీ వెల్లడించింది.

ఈ బోటు మునిగిపోతున్నప్పుడు తాము దాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నామని, అది మునిగిపోవడానికి తామే కారణమన్న ఆరోపణలను గ్రీక్ కోస్ట్ గార్డు అధికారులు ఖండించారు.

బోటు మునిగిపోవడానికి అర్ధగంట ముందు ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందని ముహమ్మద్ తెలిపారు.

బోటు ప్రమాద బాధితులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రశ్నార్థకంగా మారిన బాధితుల జీవితాలు

దీంతో గందరగోళానికి గురైన పడవ సిబ్బంది కింద పట్టుకుని నిల్చున్న వారిని పైకి అనుమతించారు.

‘‘అప్పటికే నీళ్లలో ఉన్నాం. నాలుగు నుంచి ఐదు కార్గో నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాయి. కానీ, వాటిని కొంత దూరంలో ఉంచినట్లు తెలిపారు. తాము బోటును విడిచిపెట్టినప్పటికీ అవి దగ్గరగా రాలేదు. నా చేతిలో ఉన్న ఖాళీ క్వార్టర్ బాటిల్‌తోనే నేను ఈదుకుంటూ వాటి దగ్గరికి వెళ్లాను.’’ అని చెప్పారు.

‘‘చిన్న ట్యూబ్‌లతో ఈజిప్టియన్లు, సిరియన్లు నా ముందున్నారు. వారితో నేను కలిశాను. సుమారు 40 నిమిషాల వరకు మేం ఈదుకుంటూ వెళ్లాం. ఆ తర్వాత మోటార్‌బోటు మమ్మల్ని రక్షించింది’’ అని ముహమ్మద్ చెప్పారు.

పాకిస్తాన్‌లో ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో, మెరుగైన జీవితం కోసం ముహమ్మద్ ఆ దేశాన్ని విడిచిపెట్టారు.

కరాచి నుంచి దుబయికి రావడానికి టిక్కెట్ కోసం 8,700 డాలర్లను ఆయన ఖర్చు చేశారు. ఆ తర్వాత ఈజిప్ట్‌కి వెళ్లి, ఆఖరిగా లిబియాలోని బెంఘాజి నగరాన్ని చేరుకున్నారు.

తన జీవితాన్ని ఇక్కడ మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆశతో ఉన్నారు.

గుజ్రాన్‌వాలా అనే నగరంలో ఉన్న తన కుటుంబంతో ముహమ్మద్ మాట్లాడి, తాను క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు.

ముహమ్మద్ బతికున్నాడని తెలియగానే కుటుంబీకులు కొంత ఉపశమనం పొందారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)