చమోలి: విద్యుత్ షాక్‌తో 15 మంది మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే

ఫొటో సోర్స్, ANI
ఉత్తరాఖండ్‌లో విద్యుత్ షాక్ కారణంగా 15 మంది మృతి చెందారు.
నమామి గంగ ప్రాజెక్టులో భాగంగా అలకనంద నది ఒడ్డున చేపట్టిన ప్రాజెక్టులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
చమోలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఒక పోలీసు అధికారి, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.
విద్యుత్ షాక్‌తో సుమారు 15 మందికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని, కానీ బుధవారం ఉదయం తెలిసిందని చమోలీ జిల్లా ఎస్పీ ప్రమేంద్ర దోభాల్ తెలిపారు.
చమోలీ జిల్లాలోని పిపాల్కోటి గ్రామ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలి నదిపై ఉన్న వంతెనకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎన్డీటీవీ తెలిపింది.
''విద్యుత్ షాక్ తగిలి వాచ్‌మెన్ చనిపోయారని మాకు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు వెళ్లి చూసేసరికి విద్యుత్ షాక్‌కి గురై 21 మంది తీవ్రగాయాలతో పడి ఉన్నారు. వారిలో పదిహేను మంది ఆస్పత్రిలో మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది.'' అని దోభాల్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘డెడ్‌బాడీ పడిఉన్నట్లు ఫోన్ వచ్చింది’
''నమామి గంగ ప్రాజెక్టు జనరేటర్ గది వద్ద ఒకరి మృతదేహం పడి ఉందని ఉదయం 9.30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను.'' అని చమోలీ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ క్లర్క్ విమల్ సింగ్ బీబీసీ హిందీతో చెప్పారు.
సమాచారం వచ్చిన వెంటనే ఎస్సై ప్రదీప్ రావత్, మరికొందరు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు.
''అక్కడ పడి ఉన్న మృతదేహం నమామి గంగ ప్రాజెక్టులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న గణేష్‌దిగా గుర్తించారు. చమోలీ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్మని గ్రామంలో గణేష్ నివాసముంటున్నాడు.'' అని ఆయన చెప్పారు.
సంఘటన స్థలంలో గణేష్ బంధువులతో పాటు మరికొందరు ఉన్నారు. పోలీసులు పంచనామా నిర్వహిస్తుండగా జనరేటర్ గది నుంచి అనూహ్యంగా విద్యుత్ సరఫరా అయిందని విమల్ సింగ్ తెలిపారు.
‘ఒక రోజు డ్యూటీ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ ఆఫీసర్’
విద్యుత్ సరఫరా క్రమంగా పెరగడంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని, జనరేటర్ గదికి రెండువైపులా ఇనుప రెయిలింగ్‌లు ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
విద్యుత్ షాక్‌కి గురై ఎస్సై ప్రదీప్ రావత్ సహా అక్కడ ఉన్న మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
''ఎస్సై ప్రదీప్ రావత్ పిపాల్కోట్ ఔట్ పోస్ట్ ఇన్‌చార్జి. చమోలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిగా ఉన్న కుల్‌దీప్ రావత్ ఒక రోజు సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ప్రదీప్ రావత్ ఇన్‌చార్జిగా ఉన్నారు.'' అని విమల్ సింగ్ చెప్పారు.












