ఆస్ట్రేలియా బీచ్‌కు కొట్టుకొచ్చిన ఈ శకలం భారత రాకెట్‌దేనా? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏమన్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
ఆస్ట్రేలియాలో గ్రీన్ హెడ్ బీచ్‌లో కనిపించిన అంతుచిక్కని వస్తువు కచ్చితంగా ఒక రాకెట్‌కు సంబంధించిన భాగమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు.
ఇది భారత రాకెట్‌కు చెందినదా, కాదా అనేది మాత్రం ప్రస్తుతం చెప్పలేమని ఆయన బీబీసీకి తెలిపారు.
‘‘దీన్ని విశ్లేషిస్తే తప్ప, ఇది మా రాకెట్‌కు సంబంధించిన శకలమే అని మేం నిర్ధరించలేం’’ అని ఆయన చెప్పారు.
‘‘ఇది పీఎస్‌ఎల్‌వీ భాగం కావొచ్చు, లేదా మరొక రాకెట్‌కు సంబంధించినది కావొచ్చు. దాన్ని చూసి, విశ్లేషిస్తే తప్ప కచ్చితంగా అది దేనికి చెందినదో నిర్ధరించలేం’’ అని ఆయన చెప్పారు.
‘‘పీఎస్‌ఎల్‌వీకి చెందిన కొన్ని భాగాలు ఆస్ట్రేలియా ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్‌ను దాటి సముద్రంలో పడిపోయినట్లు తెలిసింది. అయితే, బీచ్‌కు కొట్టుకొచ్చిన ఆ వస్తువు చాలా కాలంగా నీళ్లలో తేలుతూ ఉండి, ఇప్పుడు ఒడ్డుకు వచ్చి ఉండొచ్చు. ఆ శకలంతో ఎలాంటి ప్రమాదం ఉండదు’’ అని సోమనాథ్ వివరించారు.
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి ఉత్తరాన 250 కి.మీ దూరంలో గ్రీన్ హెడ్ బీచ్ ఉంది.
వారాంతంలోఈ భారీ వస్తువు అక్కడ కనిపించినప్పటి నుంచి విస్తృతమైన ఊహాగానాలు వచ్చాయి.
ఇది జులై 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన వస్తువు అయ్యుండొచ్చని కొంత మంది భావించగా, నిపుణులు దీన్ని తోసిపుచ్చారు.
సిలిండర్ ఆకారంలో 2.5-3 మీటర్ల ఎత్తున్న ఈ భారీ వస్తువు, గ్రీన్ హెడ్ బీచ్ నివాసితుల్లో చాలా కుతూహలాన్ని కలిగించింది.
ఇది 2014లో 239 మంది ప్రయాణికులతో ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపించకుండాపోయిన ఎంహెచ్-370 విమానానికి చెందిన శకలమై ఉండొచ్చనే ఊహాగానాలు కూడా తొలుత వచ్చాయి.
అయితే, ఆ వస్తువు ఒక వాణిజ్య విమానం నుంచి వచ్చి ఉండకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు స్పష్టం చేశారు.
బహుశా ఇది రాకెట్‌కు చెందిన ఇంధన ట్యాంక్ కావొచ్చని, అది హిందూ మహాసముద్రంలో పడిపోయి ఉండొచ్చని వారు అంచనా వేశారు.
ఇది ఒక విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహకనౌక నుంచి పడిపోయి ఉండొచ్చని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ చెప్పింది. దీంతో ఆ వస్తువు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ) ఇంధన ట్యాంక్ అనే ఊహాగానాలు వచ్చాయి.
ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన ఈ వస్తువు కొన్ని నెలలుగా నీటిలోనే ఉందని నిపుణులు చెబుతున్నప్పటికీ ఇలాంటి ఊహాగానాలు బయటకు వచ్చాయి.
ఈ వస్తువుకు అంటుకొని ఉన్న నత్తగుల్లలు నిపుణులు చెప్పిన ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.
ఆస్ట్రేలియా అధికారులు ఆ వస్తువుకు సంబంధించిన మరిన్ని వివరాలను విడుదల చేయాల్సి ఉంది. తాము ఆ వస్తువును ప్రమాదకరంగా భావిస్తున్నామని, దాన్నుంచి ప్రజలు వీలైనంత దూరంగా ఉండాలని వారు చెప్పారు.
ఈ వస్తువులో విషపూరిత పదార్థాలు ఉండొచ్చని కొంత మంది నిపుణులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ లెస్బియన్ జంట ఆవేదన
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















